: హృతిక్ రోషన్ కు సినీ ప్రముఖుల పరామర్శ
బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేయించుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా షూటింగులో రెండు నెలల క్రితం గాయపడిన హృతిక్ రోషన్ కు తలపై గాయం కారణంగా రక్తం గడ్డకట్టింది. దీని కారణంగా తలనొప్పి బాధించడంతో క్లాట్ తొలగించుకునేందుకు ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నాడు. మరో రెండు రోజుల్లో హృతిక్ రోషన్ పూర్తిగా కోలుకుంటాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించగా, సర్జరీ ముగించుకుని హృతిక్ రోషన్ మరింత గుండె నిబ్బరంగా ఉన్నాడని అతని భార్య సుశాన్నేఖాన్ ట్వీట్ చేసింది.
అతడ్ని పరామర్శించేందుకు హిందూజా ఆసుపత్రికి సినీ ప్రముఖులు కరణ్ జొహార్, ఉదయ్ చోప్రా, షర్మాన్ జోషీ, షారుఖ్ భార్య గౌరీఖాన్, మాధుర్ బండార్కర్, సంజయ్ కపూర్, మహీప్, కరణ్ మల్హోత్రా తోపాటు మరింత మంది నటీనటులు తరలి వచ్చారు. మరో రెండు రోజుల్లో హృతిక్ రోషన్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.