: ఉత్తరాఖండ్ కు 3 వేల కోట్ల ఇన్సూరెన్స్ నష్టం
ఉత్తరాఖండ్ వరదలకు 3 వేల కోట్ల రూపాయల నష్టం సంభవించిందని ఇన్సూరెన్స్ కంపెనీలు అంచానా వేశాయి. ఉత్తరాఖండ్ వరదల్లో 37 జల విద్యుత్ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయని అక్కడి ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులు తెలిపారు. ఇందులో సింహభాగం యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీదేనని ఆ సంస్థ 500 కోట్ల రూపాయల్ని చెల్లించాల్సి ఉంటుందని ఓ అధికారి వెల్లడించాడు. గత నెలలో సంభవించిన ప్రకృతి విలయంలో విద్యుత్ ప్రాజెక్టులు, యంత్రసామగ్రి, భవనాలు, వాహనాల రూపంలో ఈ భారీ నష్టం సంభవించిందని ఇన్సూరెన్స్ కంపెనీలు తెలిపాయి.
వీటి వివరాలను మదింపు చేసేందుకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, న్యూఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ మరియూ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలు డెహ్రాడూన్ లో సమావేశం కానున్నాయి. అయితే ఇవన్నీ కేవలం విద్యుత్ కంపెనీలకు సంబంధించిన వివరాలు. అయితే దేశంలోని గుళ్లన్నింటికీ ఇన్సూరెన్స్ కవర్ చేసే యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ కేదారినాథ్ దేవాలయానికీ వర్తింపజేస్తుందా? లేదా? అన్న విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.