: ఫిక్సింగ్ ఉదంతంలో లేట్ వికెట్
ఎప్పుడో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో బీసీసీఐ మరో క్రికెటర్ పై వేటు వేసింది. రాజస్థాన్ రాయల్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్మీత్ సింగ్ ను సస్పెండ్ చేస్తున్నట్టు నేడు ప్రకటించింది. అతనిపై విచారణను పెండింగ్ లో ఉంచుతున్నట్టు తెలిపింది. హర్మీత్ ను ఇటీవలే బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధికారి రవి సవాని ప్రశ్నించిన నేపథ్యంలో ఈ వేటు నిర్ణయం వెలువడింది.
గురువారం జరిగిన పోలీసు విచారణలో హర్మీత్.. చండీలా మరో బుకీతో కలిసి షేన్ వాట్సన్ ను ఫిక్సింగ్ ముగ్గులోకి దింపాలని ప్రయత్నాలు చేశారని వెల్లడించాడు. ఈ విచారణ అనంతరం బీసీసీఐ హర్మీత్ కు షోకాజ్ నోటీసు పంపింది. ఫిక్సింగ్ విషయాలు తెలిసీ బోర్డుకు సమాచారం అందించని కారణంగా.. సస్పెన్షన్ వేటు ఎందుకు వేయగూడదు? అని నోటీసులో హర్మీత్ ను ప్రశ్నించింది. కాగా, హర్మీత్ ను కూడా ఫిక్సింగ్ చేయమని చండీలా కోరినా ఈ యువ క్రికెటర్ తిరస్కరించినట్టు తెలుస్తోంది.