: బ్యాంకాక్ పోలీసులకు 'పొట్ట' తిప్పలు
పోలీసులు.. శాంతిభద్రతలకోసం తమ జీవితాలను అంకితం చేసే సాహసజీవులు. అలాంటి పోలీసులు ఫిట్ నెస్ తో ఉండడం ఎంతో అవసరం. అసాంఘిక శక్తులతో కొన్నిసార్లు పోరాడాల్సి రావడమే అందుకు కారణం. పోలీస్ విధులకు సంబంధించి, ఏ దేశంలోనైనా ఇది సర్వసాధారణం. కానీ, ఉద్యోగంలో చేరిన తొలినాళ్ళలో ఉండే శారీరక దారుఢ్యం ఆ తర్వాత క్రమేపీ తిరోగమిస్తుంది. పొట్టలు పెంచేసుకుని మందగమనం సాగిస్తుంటారు. గతకొన్నేళ్ళుగా థాయ్ లాండ్ పోలీసులూ ఇలానే తయారయ్యారట. దీంతో, అక్కడి ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది.
దేశవ్యాప్తంగా పొట్టలు పెంచిన 60 మంది పోలీసులను వెతికిపట్టుకుని వారికి రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. ఏరోబిక్స్, యోగా.. వెయిట్ మేనేజ్ మెంట్ విధానాలతో వారి కొవ్వు కరిగించేందుకు ఏకంగా ఒక శిబిరాన్నే నడుపుతోంది. దాంట్లో ఆ పోలీసులకు నిపుణులతో ఆరోగ్య సలహాలు ఇప్పిస్తున్నారట. ఇక, త్వరగా బరువు తగ్గిన పోలీసులకు ప్రత్యేక నజరానా కూడా ఉందండోయ్. మరి, మన పోలీసులకూ ప్రభుత్వాలు ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తే బాగుంటుందేమో..!