: రైతన్న దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు: బాబు ఆవేదన
ఎరువులు, విత్తనాల ధరలు కొండెక్కి కూచోవడంతో రైతు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిలో నేడు జరిగిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో ఆయన రాయలసీమ జిల్లాల నేతలు, కార్యకర్తలనుద్ధేశించి ప్రసంగించారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వారికి దిశానిర్ధేశం చేశారు. అంతేగాకుండా రైతు సమస్యలపై పార్టీ వైఖరిని వివరించారు. వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ అందిస్తామని తెలిపారు. రైతుల కడగండ్లకు కేంద్రరాష్ట్ర విధానాలే కారణమని బాబు దుయ్యబట్టారు. రాష్ట్రం నుంచి 32 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అయినా, ఇక్కడివారికి వారు చేసిందేమీలేదని విమర్శించారు.