: చైనాతో చెలిమి, తేనె కన్నా తియ్యన: పాక్ ప్రధాని
'ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి..' అన్న సుమతీ శతకం పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు అతికినట్టు సరిపోతుంది. భారత్ తో స్నేహానికి ప్రథమప్రాధాన్యం ఇస్తానని ఎన్నికల్లో గెలిచిన వెంటనే ప్రకటించిన షరీఫ్.. ఆ తరువాత ఆ ఊసే మరిచారు. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న షరీఫ్.. కమ్యూనిస్టు నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. 'మీతో చెలిమి తేనె కన్నా తియ్యన' అంటూ చైనా ప్రధాని లీ కెకియాంగ్ ను కాకా పడుతున్నారు.
ఇటీవల కాలంలో అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతింటోన్న తరుణంలో పొరుగున్న ఉన్న సూపర్ పవర్ ప్రాపకం సంపాదిస్తే మేలని పాక్ అధినాయకత్వం భావిస్తున్నట్టుంది. మేలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత షరీఫ్ తొలిసారిగా విదేశీ పర్యటనకు చైనా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతమే లభించింది. చైనా ప్రీమియర్ (ప్రధాని) లీ కెకియాంగ్ తో మాట్లాడుతూ.. షరీఫ్ ఏమన్నారో వినండి.
'మన స్నేహం హిమాలయాలకంటే ఉన్నతమైనది, మహాసముద్ర అఖాతాలకంటే లోతైనది, తేనె కన్నా తియ్యనైనది' అని వ్యాఖ్యానించి చైనా పాలకుల మనసు దోచే ప్రయత్నం చేశారు. షరీఫ్ మాటలమాయాజాలానికి కెకియాంగ్ సంతుష్టుడైనట్టే కనిపించింది. 'మా పట్ల మీరు కురిపిస్తున్న ఆప్యాయతానురాగాలకు సంతోషం' అని ప్రతిస్పందించారు.
ఈ కాకాయణం వెనుక ఉన్న కథేంటంటే.. పాక్ చేపట్టిన కారకోరమ్ హైవే ప్రాజెక్టుకు చైనా చేయూతనిస్తోంది. ఈ రహదారి పునర్నిర్మాణం పూర్తయితే పాకిస్తాన్-చైనా వాణిజ్యం మరింత ఊపందుకుంటుంది. సరకుల రవాణాకు మార్గం సుగమమవుతుంది. చైనా తాను చేస్తున్న సాయానికి ప్రతిగా పాక్ లోని గ్వాదర్ ఓడరేవును ఉపయోగించుకోవాలని తలపోస్తోంది. అదే వాస్తవ రూపం దాల్చితే.. చైనాకు హార్ముజ్ జలసంధి దగ్గరవడమే కాకుండా, అరేబియా సముద్రం ద్వారా చమురు రవాణాకు వీలవుతుంది. ప్రపంచంలో చమురు రవాణా జరిగే సముద్ర మార్గాల్లో హార్ముజ్ మూడోస్థానంలో నిలుస్తుంది. ఇదండీ చైనా-పాక్ ల స్నేహం వెనుకున్న మతలబు!