: మహిళలు ఇది గుర్తించాలి!
మహిళల్లో రుతుక్రమం ఆగిపోయే లక్షణాలు కనిపించినప్పుడు దీర్ఘకాల ఆరోగ్య రక్షణ కొరకు మహిళలు అంతర్గత స్రావ పున:స్థాపన చికిత్స (హెచ్‌ఆర్‌టీ) చేయించుకుంటుంటారు. అయితే పదేళ్ల పాటు ఈ చికిత్స తీసుకునే వారిలో మెదడులో కణతులు పెరిగే ప్రమాదం మిగిలిన వారితో పోల్చుకుంటే 30 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి వారికే రొమ్ముక్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
డానిష్ క్యాన్సర్ పరిశోధనా కేంద్రానికి చెందిన పరిశోధకులు మహిళల్లో చాలా సాధారణంగా, తరచుగా గుర్తించే మెనింజియోమా (మెదడులో కణతి) ఎందుకు వస్తుందనే విషయం గురించి పరిశోధనలు చేశారు. గతంలో కంటే ఇటీవల కాలంలో మహిళల్లో ఇలాంటి కణితులు ఎందుకు పెరుగుతున్నాయనే విషయంపై శాస్త్రవేత్తలు తమ పరిశోధన సాగించారు. ఈ పరిశోదనల్లో హెచ్‌ఆర్‌టీ చేయించుకునే మహిళలకు మెదడులో కణితులు పెరిగే ప్రమాదం మిగిలిన వారితో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుందని తేలింది. దీర్ఘకాలంపాటు హెచ్‌ఆర్‌టీ వినియోగించడం, ప్రత్యేకించి ఆస్ట్రోజన్, ప్రొజెస్టోజెన్‌లు కలిపి వాడడం వంటి వాటివల్ల మెనింజియోమా ముప్పు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, మెనింజియోమా ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుందని, 85 శాతం మెనింజియోమాలు ప్రమాదకరం కావని, అయితే కణతుల వల్ల తలనొప్పి, హఠాత్తుగా స్తంభించినట్టు కావడం, మెదడు నియంత్రణ కోల్పోవడం, వినికిడి లోపం వంటి సమస్యలు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు 'ద సన్' అనే పత్రికకు వివరించారు. హెచ్‌ఆర్‌టీ వల్ల ముప్పు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మహిళలు కాస్త తక్కువ మోతాదులో మందును వినియోగించాల్సిందిగా క్యాన్సర్ రీసెర్చ్ యూకేకు చెందిన సారా హాజెల్ హెచ్చరిస్తున్నారు.