: షుగర్ వ్యాధికి ఇదిగో చిట్కా!
మీది ఆఫీసులో ఎక్కువసేపు కూర్చుని ఉండే ఉద్యోగమా...? అయితే మీరు అరగంటకోసారి అటూ ఇటూ అడుగులు వేయండి. లేదంటే మీకు మధుమేహం వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఆఫీసుల్లో ఎక్కువగా కుర్చీకి అంటుకుని పోయే ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాధులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఇలా కుర్చీలోనే ఎక్కువసేపు కూర్చుని ఉండేవారికి మధుమేహం వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. న్యూజిలాండ్‌లోని ఒటాగో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో కూర్చుని ఉండేవారికన్నా లేచి అప్పుడప్పుడూ నడిచేవారిలో మధుమేహం ముప్పు తక్కువగా ఉన్నట్టు తేలింది. ఇలాంటి ఉద్యోగుల రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ మోతాదులు తక్కువగా ఉన్నట్టు వీరి పరిశోధనలో తేలింది. అందుకే ఎక్కువసేపు అలా కూర్చుని ఉండేవారు అరగంటకోసారి లేచి రెండు నిముషాల పాటు అటూ ఇటూ నడిస్తే మధుమేహం ముప్పును దూరంగా ఉంచవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.