ap7am logo

అవాంఛిత రోమాలను వదిలించుకుందాం ఇలా...!

Tue, May 09, 2017, 03:17 PM
Related Image

అన్ వాంటెడ్ హెయిర్...  అవాంఛిత రోమాలు... స్త్రీలను ఎక్కువగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి. కొంత మంది మగవారు సైతం ఈ సమస్యతో సతమతం అవుతుంటారు. ముఖం, చేతులు, పాదాల భాగంలో పెరిగే వెంట్రుకలు అందానికి అడ్డుగా అనిపిస్తాయి. వీటిని వదిలించుకునేందుకు రకరకాల ట్రీట్ మెంట్లు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకునేది తక్కువ మందే. అసలు  అవాంఛిత రోమాలను శాశ్వతంగా వదిలించుకునే మార్గాలున్నాయా? అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు, వాటి మంచి చెడుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

క్రీములు

representational imageమార్కెట్లో హెయిర్ రిమూవర్ క్రీములు ఎన్నో పేర్లతో లభిస్తున్నాయి. వీటితో  అవాంఛిత రోమాలను తీసివేయవచ్చు. ఈ విధానంలో వెంట్రుకలు మళ్లీ తిరిగి వస్తాయి. దీంతో తరచుగా చేయాల్సి రావడం ఇబ్బంది పెట్టే అంశం. పైగా ఈ క్రీముల్లోని కెమికల్స్ వల్ల చర్మంపై అలర్జీలు వచ్చే అవకాశంతోపాటు చర్మం నల్లబడే ప్రమాదం కూడా ఉంది. పాదాలు, చేతులపై అనవసర వెంట్రుకలను తొలగించుకునేందుకే ఈ క్రీములను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖంపై వీటిని అసలు ఉపయోగించకూడదు. పాదాలపై గానీ, చేతులపై గానీ అప్లయ్ చేసుకున్న తర్వాత సూచించిన సమయం కంటే ఎక్కువ సేపు ఉంచకూడదు. అందుకే వీటిని వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. సొంతంగా వాడేద్దామనుకుంటే కనీసం ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ లేబుల్ ను అయినా చదవాలి. ముందుగా ఓ కంది గింజంత భాగంలో అప్లయ్ చేసి రియాక్షన్ లేకుంటేనే ఉపయోగించడం నయం. మన దేశంలో వీట్, నేచుర్స్, ఆక్సీ హెర్బల్, ఒలీవా, టీబీసీ, జోలెన్, అన్నే ఫ్రెంచ్ మొదలైనవి ప్రముఖ బ్రాండ్లు.  

లేజర్ చికిత్సలు

లేజర్ చికిత్సలతో వెంట్రుకల ఎదుగుదలను ఎక్కువకాలం పాటు నిలిపి ఉంచవచ్చు. కాకపోతే, ఖర్చు ఎక్కువ. హర్మోన్ల అసమతుల్యత ఉన్న వారిలో ఈ విధానం ఏమంతగా ప్రభావం చూపదు. చికిత్స కోసం ఎంపిక చేసుకునే డాక్టర్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 

లేజర్ విధానంలో అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించుకోవచ్చనే ప్రకటనలు సాధారణంగా కనిపిస్తుంటాయి. కానీ, ఇది ఎంత మాత్రం నిజం కాదని కాయ స్కిన్ క్లినిక్ మెడికల్ విభాగాధిపతి స్నేహల్ శ్రీరామ్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఈ విధానంలో వెంట్రుక ఎదగడానికి తోడ్పడే మెలనిన్ ను ఫొటో థెర్మోలైసిస్ కిరణాలతో డ్యామేజ్ చేస్తారు. కిరణాలను వెంట్రుక కుదుళ్ల వద్దకు పంపించి అక్కడే ఉండే నల్లటి మెలనిన్ ను నిర్వీర్యం చేస్తారు. వెంట్రుక పెరుగుదలకు కాణమైన కణాలు చనిపోవడంతో ఇక అక్కడ పెరుగుదల ఉండదు. శరీరంపై ఏ భాగంలో ఎంత ఏరియా మేర వెంట్రుకలను తొలగించాలి, ఎన్ని సెషన్లు పట్టాయన్న అంశాల ఆధారంగా చికిత్సా వ్యయం ఉంటుంది. 

representational image

వేరే చికిత్సా విధానాలు సరిపడని వారు లేజర్ విధానాన్ని పరిశీలించవచ్చని నిపుణుల సూచన. అమెరికాలో ఈ లేజర్ చికిత్స ఎక్కువగా వినియోగంలో ఉంది. సాధారణంగా మూడు నుంచి ఏడు సిట్టింగ్స్ లోపల వెంట్రుకలు రాలిపోతాయి. ఏరియాను బట్టి నిమిషాల్లోనే ప్రక్రియ ముగుస్తుంది. ఈ చికిత్స కోసం యాగ్ లేజర్, రూబీ లేజర్, ఐపీఎల్ లేజర్లు ఇలా పలు రకాల మెషిన్లు ఉన్నాయి. స్కిన్ టైప్, వెంట్రుకల తీరును బట్టి మెషిన్లను వినియోగిస్తారు. ముందుగా తొలగించాల్సిన ప్రదేశంలో వెంట్రుకలను ట్రిమ్ చేస్తారు. కేవలం కొన్నిమిల్లీమీటర్ల మేర మాత్రమే ఉంచుతారు. ఆ తర్వాత లేజర్ ట్రీట్ మెంట్ ఇస్తారు.  

లేజర్ చికిత్స చేసిన చోట చర్మం కమిలిపోతుంది. ఈ చికిత్స హైపర్ పిగ్మెంటేషన్, హైపో పిగ్మెంటేషన్ కు దారి తీయవచ్చు. హైపర్ పిగ్మెంటేషన్ వల్ల చర్మం నల్లబడుతుంది. సాధారణంగా లేజర్ కిరణాలు మెలనిన్ ఉత్పత్తిని దెబ్బతీస్తాయి. అలాంటప్పుడు పిగ్మెంట్ ను కోల్పోవడం వల్ల హైపో పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో మెలినిన్ నిర్వీర్యం కాకుండా, ప్రేరేపితం అవుతుంది. దాంతో హైపర్ పిగ్మెంటేషన్ కు దారితీస్తుంది. చికిత్స చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత దురద ఉండవచ్చు. చికిత్స తర్వాత కొన్ని రోజుల పాటు చర్మం ఎర్రగా ఉంటుంది. 

లేజర్ చికిత్సకు ముంబయ్, హైదరాబాదు వంటి నగరాల్లో క్లినిక్ స్థాయిని బట్టి, ఒక్కో సిట్టింగ్ కు గాను (ఒకసారి ట్రీట్ మెంట్) క్లినిక్ లు 3 వేల నుంచి 10వేల వరకు చార్జ్ చేస్తున్నాయి. అలా కాకుండా అన్ని సిట్టింగ్ లకు కలిపి ఒకే ప్యాకేజీగా తక్కువకు కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు ఇండియాలోని పలు నగరాల్లో విస్తరించి వున్న కాయ స్కిన్ క్లినిక్స్ చేతి మడతల కింద ఉన్న వెంట్రుకల తొలగించేందుకు లేజర్ సిట్టింగ్ కు సుమారు 3100 రూపాయలు చార్జ్ చేస్తోంది. ఆరు సిట్టింగ్ లకు కలపి 8వేల రూపాయలకు కూడా అందిస్తోంది. ఈ ధరలు ఎప్పటికప్పుడు మారతాయని గుర్తుంచుకోగలరు. 

ఎలక్ట్రోలైసిస్

చర్మంలో వెంట్రుక మొదలు వరకు సూదిని పంపి దాని ద్వారా తక్కువ స్థాయి కరెంట్ ను పంపి చేసే చికిత్స ఇది. ఈ కరెంట్ తో హెయిర్ ఫాలిక్యూల్ ను నిర్వీర్యం చేస్తారు. ఇందులోనూ రెండు విధానాలు ఉన్నాయి. గాల్వనిక్ మరియు థెర్మోలైటిక్. గాల్వనిక్ విధానంలో వెంట్రుక మొదలును రసాయనాలతో నిర్వీర్యం చేస్తారు. థెర్మోలైటిక్ విధానంలో వెంట్రుక మొదలును వేడితో బలహీనపరుస్తారు. అయితే, ఎంతో నైపుణ్యం వారు చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. లేజర్ విధానంలో కంటే ఈ విధానమే సమర్థవంతమైనది. ఈ విధానంలో మాత్రమే తిరిగి వెంట్రుకలు పెరగకుండా చేయవచ్చని స్వయంగా అమెరికా ఆహార, ఔషధ మండలి (ఎఫ్ డీఏ) ప్రకటించింది. 

చికిత్సా వ్యయానికి వస్తే గంటకు ఇంత అని చార్జ్ చేస్తారు. ఇది వెయ్యి రూపాయల నుంచి మొదలుకొని ఉంటుంది. ప్రతీ వెంట్రుకను విడివిడిగా ధ్వంసం చేస్తూ వెళ్లాలి కనుక ఎక్కువ సమయం పడుతుంది. ఎంత వేగంగా చేసినా నిమిషానికి 15 ఫాలికల్స్ మించి పూర్తి కావు. ముఖంపై మాత్రమే వెంట్రుకలు తొలగించడానికి మూడు గంటలు పట్టవచ్చు. ఇది సురక్షితమైన చికిత్సా విధానమేనని నిరూపణ అయింది కనుక భయపడాల్సిన పనేమీ లేదు. అన్ని రకాల చర్మతత్వాలకు సరిపోతోంది. చర్మంలోకి సూదిని దింపి చేసేది కనుక కొంత నొప్పి ఉంటుంది. అయితే, అది తెలియకుండా ఉండాలంటే అనస్థీషియా ఇస్తారు. చికిత్స తర్వాత తిరిగి వెంట్రుకలు మొలిచే అవకాశాలు చాలా చాలా తక్కువ. 

ఔషధాలు

పైన చెప్పుకున్న వాటిలో ఏవీ ఉపయోగం అనిపించకుంటే వైద్యులను సంప్రదించి మందులు సూచించమని కోరవచ్చు. స్పైరోనోలాక్టోన్ అనే ఔషధం అన్ వాంటెడ్ హెయిర్ ఎదుగుదలను తగ్గిస్తుంది. తలపై వెంట్రుకల ఎదుగుదలను మాత్రం అడ్డుకోదు. అమెరికాలో వానికా అనే ఎఫ్ డీఏ ఆమోదిత క్రీము ఒకటి మార్కెట్లో ఉంది. దాన్ని ముఖంపై అన్ వాంటెడ్ హెయిర్ వద్దనుకున్న చోట రోజు రెండు సార్లు అప్లయ్ చేయడం వల్ల వెంట్రుకల ఎదుగుదల చాలా నిదానం అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలను http://www.vaniqa.com/ ఈ లింక్ నుంచి తెలుసుకోవచ్చు. 

వ్యాక్సింగ్

తక్కువ ఖర్చుతో అయిపోతుంది. వెంట్రుకలను కుదుళ్ల నుంచి తొలగిస్తుంది. శరీరంలోని చాలా ప్రాంతాల్లో అన్ వాంటెడ్ హెయిర్ ను ఈ విధానంలో తొలగించుకోవచ్చు. అయితే, పడని వారికి అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. సున్నిత చర్మం ఉన్నవారికి కూడా పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ కు అవకాశం ఉంది. వ్యాక్సింగ్ ప్యాక్ తొలగించే సమయంలో నొప్పి ఉంటుంది. సాధారణంగా షేవింగ్ చేసినా, క్రీమ్ అప్లయ్ చేసినా పైకి కనిపించే వెంట్రుకల వరకే తొలగిపోతాయి. కానీ వ్యాక్సింగ్ లో వెంట్రుక మొదలు నుంచి ఊడిపోతుంది. దీంతో తిరిగి అక్కడ వెంట్రుక పెరగడానికి చాలా సమయం పడుతుంది. ఇంట్లో తయారు చేసుకునే వ్యాక్స్ ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని సౌందర్య నిపుణుల మాట. 

త్రెడింగ్

representational imageకనుబొమ్మల దగ్గర పెరిగే వెంట్రుకలను అందంగా కనిపించేందుకు స్త్రీలు సాధారణంగా ఈ విధానాన్ని ఆశ్రయిస్తుంటారు. దారాలతో వెంట్రుకలను తొలగించే ఈ విధానంలో చేసే సమయంలో నొప్పి ఉంటుంది. తప్పితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కేవలం కనుబొమ్మల దగ్గరే అని కాదు. స్త్రీల చెంపలపై, గడ్డం భాగంలో పెరిగే వెంట్రుకలను సైతం త్రెడింగ్ తో తొలగించుకోవచ్చు.

రేజర్లు

అన్ వాంటెడ్ హెయిర్ ను రేజర్ తో తీసేయడం చాలా సులువైన ప్రక్రియ. చవకైనది. కానీ, రేజర్ తో షేవ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ వేగవంతం అవుతుందంటారు నిపుణులు. పైగా తరచుగా చేయాల్సి రావడం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. 

ఇంట్లోనే పరిష్కారాలు

అన్ వాంటెడ్ హెయిర్ ను వదిలించుకునేందుకు ఇంట్లోనే చేసుకోదగిన చికిత్సలు చాలా ఉన్నాయి. పలువురు నిపుణులు సూచించే చికిత్సలు ఇవే. 

1. షుగర్, నిమ్మరసం

రెండు చెంచాల పంచదార, 10 చెంచాల నీరు, 2 చెంచాల నిమ్మరసం, ఒక ఖాళీ కప్పు తీసుకోవాలి. పంచదారను, నీటిని కప్పులో కలుపుకోవాలి. ఆ రెండు కలసి పోయిన తర్వాత నిమ్మరసం కలపాలి. దీన్ని ముఖంపై వెంట్రుకలు ఏ డైరెక్షన్ లో అయితే పెరుగుతున్నాయో ఆ డైరెక్షన్ లో అప్లయ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత చేత్తో రుద్ది కడిగేసుకోవాలి. వారానికి కనీసం రెండు సార్లు చేసుకుంటే వెంట్రుకల ఎదుగుదల నిదానిస్తుంది. 

2. ఆలుగడ్డ కందులు 

 representational imageఆలుగడ్డల్లో సహజ బ్లీచ్ గుణాలు ఉంటాయి. దాన్ని కందులతో కలిపి రాసుకుంటే హెయిర్ పై ప్రభావం చూపుతుంది. ఒక ఆలుగడ్డ, ఒక కప్పు పసుపుపచ్చ కందులు, ఒక చెంచా తేనె, నాలుగు చెంచాల నిమ్మ రసం తీసుకోవాలి. కందులను ఓ రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఆలుగడ్డ పొట్టు తీసి దాన్ని క్రష్ చేయాలి. నానబెట్టిన కందులను రుబ్బాలి. నలిపిన ఆలుగడ్డ నుంచి వచ్చిన రసాన్ని కంది పిండికి కలుపుకోవాలి. అన్ వాంటెడ్ హెయిర్ పై అప్లయ్ చేసుకోవాలి. 20 నిమిషాలు లేదా ఆరే వరకూ అలా ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్యాక్ ను తీసేయాలి. ఆ పీల్ తో వెంట్రుకలూ ఊడి వచ్చేస్తాయి. వారంలో రెండు మూడు సార్లు చేసుకోవచ్చు. 

3. ఆలమ్ రోజ్ వాటర్

పటిక, పన్నీరు తో చేసే చికిత్స కూడా ఉంది. అర చెంచాడు పటిక పొడి, రెండు నుంచి మూడు చెంచాల రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ కొన్ని చుక్కలు, దూది అవసరం. ఒక కప్పులో పటికపొడి, దానిలో పన్నీరు పోసి దూదితో కలపాలి. ఆ మిశ్రమాన్ని అన్ వాంటెడ్ హెయిర్ పై అప్లయ్ చేయాలి. పూర్తిగా ఆరిన తర్వాత మరోసారి ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుని మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలు. వారానికి మూడు సార్లన్నా ఈ పద్ధతి అనుసరించాలి.  అలా కొన్ని వారాలు చేస్తే వద్దనుకున్న వెంట్రుకలు తొలగిపోతాయి. 

4. కోడిగుడ్డు... 

కోడిగుడ్డులో తెల్లసొనకు సైతం మంచి శక్తి ఉంది. దీన్ని ముఖంపై అవసరంలేని వెంట్రుకలు ఉన్న చోట ప్యాక్ లా వేసుకోవచ్చు. ఒక గుడ్డు, అర చెంచాడు మొక్కజొన్న పిండి, చెంచాడు పంచదార సిద్ధం చేసుకోవాలి. కోడిగుడ్డులో తెల్ల సొనను వేరు చేసి దాన్ని కప్పులోకి తీసుకుని దానికి మొక్కజొన్న పిండి, పంచదార కలపాలి. ఈ మిశ్రమాన్ని కావాలనుకున్న చోట అప్లయ్ చేసుకుని 20 నిమిషాలు లేదా ఆరిన తర్వాత ప్యాక్ ను తొలగించాలి. తోలులా ఊడివస్తుంది కనుక నిదానంగా తీయాలి. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఇలా వేసుకోవచ్చు. 

5. బొప్పాయి

representational imageఅన్ని రకాల చర్మ తత్వాలు ఉన్నవారికి బొప్పాయి అనువైనది. దీనిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ అన్ వాంటెడ్ హెయిర్ ను తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. వెంట్రుక ఎదుగుదలకు మూలమైన మొదలును బ్రేక్ చేయడం ద్వారా అడ్డుకుంటుంది. బొప్పాయి కాయతో రెండు రకాల చికిత్సలను చేసుకోవచ్చు. 

బొప్పాయి పసుపు: బొప్పాయి కాయ పొట్టు తీసి ముక్కలుగా చేసి ఉంచుకోవాలి. ఆ ముక్కలను గ్రైండర్ లో వేసి రుబ్బుకోవాలి. రెండు చెంచాల పిండిని తీసుకుని దానికి అర చెంచాడు పసుపు కలుపుకోవాలి. అన్ వాంటెడ్ హెయిర్ పై దీన్ని అప్లయ్ చేసుకోవాలి. కొంత సమయం మర్ధన చేసుకుని 20 నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ విధానాన్ని పాటించవచ్చు. 

బొప్పాయి అలోవెరా: రెండు చెంచాల బొప్పాయి పిండి, మూడు చెంచాల అలోవెరా జెల్, ఒక చెంచాడు ఆవనూనె, పావు చెంచా శనగపిండి, పావు చెంచాడు పసుపు, రెండు చుక్కల వంట నూనె సిద్ధం చేసుకోవాలి. వీటిని ఒక కప్పులో వేసి కలుపుకోవాలి. దాన్ని అన్ వాంటెడ్ హెయిర్ పై రాసుకుని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత పొడి వస్త్రాన్ని తీసుకుని ప్యాక్ ను తొలగించుకోవాలి. తర్వాత కడిగేసుకుని, ఆలీవ్ ఆయిల్ లేదా బేబీ ఆయిల్ రెండు చుక్కలు చేతిలోకి తీసుకుని ప్యాక్ తీసేసిన ప్రదేశంలో రాసుకోవాలి. వారానికి రెండు నుంచి మూడు సార్లు మూడు నెలల పాటు ఇలా చేస్తే అన్ వాంటెడ్ హెయిర్ పూర్తిగా వదిలిపోతుందని నిపుణులు అంటున్నారు. 

6. పసుపు

అన్ని గాయలనూ మాన్పించే శక్తి పసుపుకు ఉందంటారు. అందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కొన్ని రోగాలను నివారించగలవని కూడా నిరూపణ అయింది. అంతేకాదు అక్కర్లేని వెంట్రుకలను తొలగించుకోవడంలోనూ పసుపు సాయపడగలదు. మందపాటి, గుబురు వెంట్రుకలను పసుపు ప్యాక్ తో వదిలించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. 

ఒక చెంచాడు పసుపును తీసుకుని దాన్ని రోజ్ వాటర్ లేదా పాలలో వేసి నాననివ్వాలి. కొద్ది సేపటి తర్వాత దాన్ని పేస్ట్ లా చేసుకుని అప్లయ్ చేసుకోవాలి. 20 నిమిషాలు లేదా పూర్తిగా ఆరే వరకు ఉంచి ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. ఈ ప్రక్రియ మందపాటి వెంట్రుకలు వదిలించుకునేందుకు అనువుగా ఉంటుంది. అదే గుబురుగా ఉన్న వెంట్రుకలను వదిలించుకోవాలంటే పై మిశ్రమానికి శనగపిండి లేదా బియ్యం పిండి కలుపుకుని రాసుకోవాలి. 

7. ఉల్లిగడ్డ తులసి

representational imageచర్మాన్ని అందంగా మార్చే గుణాలు ఉల్లిగడ్డలో ఉన్నాయి. అలాగే, అన్ వాంటెడ్ హెయిర్ ను కూడా వదిలించుకోవడానికి సాయపడుతుంది. కాకపోతే తులసి ఆకులు కూడా జత చేయాలి. రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని తీసుకుని ముక్కలు చేసి పది తులసి ఆకులు జత చేసి (ఆకులు చిన్నవి అయితే మరికొన్ని చేర్చాలి) పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను అప్లయ్ చేసుకుని 25 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. వారానికి మూడు సార్లు చేసుకోవడం వల్ల రెండు నెలల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. పునాదుల నుంచి వెంట్రుకలు ఊడిపోయే వరకూ ఈ చికిత్సను కొనసాగించవచ్చని నిపుణుల సలహా. 

8. తనకా పౌడర్ తో

ఆయుర్వేద షాపుల్లో తనకా పౌడర్ అని లభ్యమవుతుంది. తనకా అనే చెట్టు బెరడు నుంచి దీన్ని తయారు చేస్తారు. అలాగే కుసుమ నూనెను కూడా తీసుకోవాలి. ముందుగా అన్ వాంటెడ్ హెయిర్ ను క్రీము లేదా షేవర్ తో తీసేయాలి. తర్వాత తనకా పొడిని కుసుమ నూనెలో వేసి కలుపుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్ట్ ను అన్ వాంటెడ్ హెయిర్ ను తొలగించిన చోట అప్లయ్ చేసుకోవాలి. నాలుగు గంటల పాటు అలానే ఉంచేయాలి. ఆ తర్వాత కడిగేసుకోవచ్చు. ఇలా వంద రోజుల పాటు చేయాలి. మధ్యలో ఒక్కరోజు కూడా మిస్ కావద్దు. దాంతో అన్ వాంటెడ్ హెయిర్ తిరిగి అక్కడ ఇక రాదని సౌందర్య నిపుణులు అంటున్నారు. తనకా పౌడర్ చర్మం చాయను మెరుగుపరిచి అందంగా చేస్తుంది. 

9. నిమ్మరసం తేనె

representational imageఈ రెండు మిశ్రమాలను కలిపి చర్మంపై రాసుకుంటే అక్కడ ఉన్న అన్ వాంటెడ్ హెయిర్ తొలగిపోగలదు. చెంచాడు నిమ్మరసానికి నాలుగు చెంచాల తేనెను కలిపి ఆ పేస్ట్ ను అన్ వాంటెడ్ హెయిర్ ఉన్న చోట రాసుకోవాలి. 20 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత తడి వస్త్రంతో తొలగించుకోవాలి. ఈ ప్రక్రియను వారానికి రెండు నుంచి మూడు సార్లు చేసుకోవాలి. 

10. అరటి పండు ఓట్ మీల్

ఈ రెండింటి మిశ్రమంతో అవసరంలేని వెంట్రుకలను వదిలించుకోవచ్చంటున్నారు నిపుణులు. అరటి పండును తీసుకుని దాన్ని గుజ్జులా చేసుకోవాలి. దానికి ఒకటి లేదా రెండు చెంచాల ఓట్ మీల్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్ వాంటెడ్ హెయిర్ పై రాసుకుని 20 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. ఆ తర్వాత నీటితో కడిగేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయాలి. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy