ap7am logo

జాగ్రత్తలు పాటిస్తే మధుమేహాన్ని జయించవచ్చు!

Sun, May 14, 2017, 12:38 PM
Related Image

మధుమేహం.. చక్కెర (షుగర్) వ్యాధిగా పిలిచే దీనిపేరులో చక్కెర ఉన్నా.. దీని బారినపడివారి నిత్య జీవితం చేదుగా మారుతుంది. వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ గా పిలిచే ఈ వ్యాధి బారిన పడినవారు ఆహారం నుంచి పరిశుభ్రత దాకా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం ఉండిపోతుంది. అయితే మధుమేహం ప్రాణాంతకమైన వ్యాధేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితాన్ని ఎంతో ఆనందంగా గడపవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. మిగతావారిలాగే అన్ని రకాల ఆహార పదార్థాలనూ తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

గ్లూకోజ్ పెరిగిపోవడమే..

రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పరిమితికి మించి పెరిగిపోవడాన్నే మధుమేహంగా చెప్పవచ్చు. దీని వల్ల శరీర పనితీరు దెబ్బతింటుంది. ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా గ్లూకోజ్ స్థాయులు పెరిగిపోవడానికి కారణం క్లోమ గ్రంథి ఇన్సూలిన్ ను తగిన స్థాయిలో విడుదల చేయకపోవడమే. రక్తంలో చక్కెర శాతాలను పరీక్షించడం ద్వారా ప్రాథమికంగా డయాబెటిస్ ను గుర్తించవచ్చు. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతుండగా అందులో 25 శాతానికిపైగా అంటే 4.5 కోట్ల మంది ఒక్క భారతదేశంలోనే ఉన్నట్లు అంచనా. దేశంలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఈ వ్యాధి మరింత అధికంగా ఉంది.

జీవనశైలిలో మార్పే కారణం

మారుతున్న జీవన శైలి.. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం.. పెద్దగా శ్రమించవలసిన అవసరం లేకుండా పోవడం.. భోజనం, నిద్ర సమయాల్లో క్రమబద్ధత లోపించడం వంటివి మధుమేహానికి కారణాలు. వీటితోపాటు వంశపారంపర్యంగా అంటే తల్లిదండ్రులకు, వారికన్నా ముందు తరాల వారికి మధుమేహం ఉంటే అది తర్వాతి తరాల వారికి వచ్చే అవకాశం ఎక్కువ. ఒక్కోసారి కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా వచ్చే అవకాశముంది. మధుమేహంలో మూడు రకాలు ఉన్నాయి. టైప్-1, టైప్-2, గెస్టేషనల్ (మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటిస్).

లక్షణాలివే..

తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, దాహం ఎక్కువగా వేయడం, కారణం లేకుండానే బరువు తగ్గడం, విపరీతమైన నీరసం, చూపు మందగించడం, పంటి చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు, శరీరంపై తగిలిన గాయాలు ఎప్పటికీ తగ్గకపోవడం, తరచూ ఆకలి వేయడం, కాళ్లలో స్పర్శ తగ్గిపోవడం వంటివి మధుమేహం లక్షణాలు. మూత్రపిండాలకు కూడా హాని కలుగుతుంది. టైప్-1, టైప్-2, గెస్టేషనల్ డయాబెటిస్ అన్నింటిలోనూ లక్షణాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కానీ టైప్-1 డయాబెటిస్ మిగతావాటికన్నా ప్రమాదకరం. దీని బారిన పడినవారు దాదాపుగా జీవితాంతం ఇన్సూలిన్ ను తీసుకోవాల్సి రావడంతోపాటు పూర్తి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

representational image

గ్లూకోజ్ ఎంత మోతాదులో ఉండాలి?

- సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి భోజనం చేసిన ఎనిమిది గంటల తర్వాత (ఫాస్టింగ్ బ్లడ్ షుగర్) 100 మిల్లీగ్రాముల లోపు ఉంటుంది. ఒక వేళ ఇది 126 మిల్లీగ్రాములకన్నా ఎక్కువగా ఉంటే వారు మధుమేహం బారిన పడినట్లే. అదే 100 నుంచి 126 మిల్లీగ్రాముల మధ్య ఉంటే వారు త్వరలోనే డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉన్నట్లే. అదే 100 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉంటే మధుమేహం వచ్చే అవకాశాలు లేనట్లే.

- ఇక భోజనం చేసిన తర్వాత చేసే సాధారణ రక్త పరీక్ష (ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్)లో గ్లూకోజ్ స్థాయి 140 మిల్లీగ్రాముల నుంచి 200 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇది 200 మిల్లీగ్రాములు దాటితే మధుమేహం దరి చేరినట్లే. అదే 140కన్నా తక్కువగా ఉంటే మధుమేహం గురించి భయపడాల్సిన పనిలేదు. ఇక 200 మిల్లీగ్రాముల కన్నా కొద్దిగా తక్కువగా ఉంటే మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని గుర్తించవచ్చు.

- రక్తంలో చక్కెర శాతాన్ని ఎప్పటికప్పడు పరీక్షించుకోవడానికి బ్లడ్ గ్లూకోజ్ మానిటర్లు అందుబాటులో ఉన్నాయి. వేలిపై సూదితో గుచ్చి, ఓ ప్రత్యేకమైన స్ట్రిప్ పై రక్తపుబొట్టును వేసి పరికరంలో ఉంచడం ద్వారా నిమిషాల్లోనే గ్లూకోజ్ స్థాయిని తెలుసుకోవచ్చు.

- ఇక మూత్రంలో గ్లూకోజ్ శాతాన్ని పరీక్షించడం ద్వారా కూడా మధుమేహాన్ని నిర్ధారించవచ్చు. కానీ శరీరంలో ఇతర రుగ్మతల కారణంగా కూడా మూత్రంలో గ్లూకోజ్ వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఓజీటీటీ పరీక్ష చేయించుకోవడం అత్యుత్తమం.

ఓజీటీటీతో కచ్చితంగా గుర్తించొచ్చు

మధుమేహాన్ని కచ్చితంగా గుర్తించే పరీక్ష ‘ఓరల్ గ్లూకోజ్ టోలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ)’. ఇది చాలా సులువైనది. ముందుగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తారు. తర్వాత 75 గ్రాముల గ్లూకోజ్ ను తాగిస్తారు. తర్వాత గంట, రెండు గంటలు, మూడు గంటల వ్యవధిలో మూడుసార్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పరీక్షిస్తారు. మొదటిదానిలో గ్లూకోజ్ స్థాయి 200 మిల్లీగ్రాములలోపు, రెండో దానిలో 140 మిల్లీగ్రాములలోపు ఉంటే డయాబెటిస్ లేనట్లే. అంతకన్నా ఎక్కువగా ఉంటే మధుమేహం వచ్చినట్లు. ఫాస్టింగ్ టెస్ట్ లో 126 మిల్లీగ్రాములలోపు గ్లూకోజ్ స్థాయి ఉన్నా.. ఓజీటీటీలోని రెండో పరీక్షలో 140 నుంచి 199 మధ్య ఉంటే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

హిమోగ్లోబిన్ ఏ1సీ (హెచ్ బీ ఏ1సీ) పరీక్ష

మధుమేహంతో ఉన్నవారికి సాధారణంగా చేసే రక్త పరీక్షలు ఆ సమయంలో పరిస్థితిని మాత్రమే తెలియజేస్తే.. హిమోగ్లోబిన్ ఏ1సీ పరీక్ష దాదాపు మూడు నెలల నుంచి రక్తంలో గ్లూకోజ్ నిల్వలు ఏ స్థాయిలో కొనసాగాయనే అంశాన్ని తేల్చుతుంది. అంటే దీనివల్ల ఏ1సీ పరీక్షకు ముందు మూడు నెలల పాటు మధుమేహ బాధితులు తీసుకున్న ఆహారం, చేసిన వ్యాయామంతోపాటు ఇతర జాగ్రత్తలను వైద్యులు సమీక్షించవచ్చు. రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ కు అంటుకున్న గ్లూకోజ్ స్థాయిని లెక్కించడం ద్వారా ఈ పరీక్ష చేస్తారు. అధిక స్థాయిలో ఉండే గ్లూకోజ్ శరీరంలోని పలు రకాల కణాలపై చేరుతూ ఉంటుంది. అదే తరహాలో ఎర్రరక్త కణాలకూ అంటుకుంటుంది. ఈ కణాల జీవితకాలం మూడు నెలలు. అందువల్ల గత మూడు నెలల గ్లూకోజ్ పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఈ హిమోగ్లోబిన్ ఏ1సీ పరీక్షలో సాధారణ వ్యక్తులకు వచ్చే ఫలితం 4% నుంచి 5.6% వరకు ఉంటుంది. అదే 6.5శాతానికి మించితే మధుమేహం ఎక్కువగా ఉన్నట్లే లెక్క. అదే 7 శాతానికి మించితే మధుమేహం వల్ల వచ్చే దుష్పరిణామాలు చాలా తీవ్రమవుతాయి. ఇక 5.7% నుంచి 6.4% వరకు ఉంటే వారికి త్వరలోనే మధుమేహం వచ్చే అవకాశం ఉన్నట్లే

మధుమేహం వచ్చే ముందు లక్షణాలు

representational imageరక్తంలో చక్కెరల స్థాయులు నిర్ధారిత మోతాదుకు మించి పెరుగుతుండడాన్ని బట్టి మధుమేహం వచ్చే అవకాశాలను గమనించవచ్చు. అయితే ఇవి మధుమేహం వచ్చినప్పటి గ్లూకోజ్ స్థాయులకంటే తక్కువగా ఉంటాయి. అంటే శరీరంలోని కణాల్లో ఇన్సూలిన్ కు నిరోధకత పెరుగుతున్నట్లు. దానితోపాటు మూత్రంలో గ్లూకోజ్ ఉంటే త్వరలోనే మధుమేహం బారినపడే అవకాశమున్నట్లే. ఇక తగినంతగా ఆహారం తీసుకుంటున్నా కూడా సన్నబడుతూ.. అదే సమయంలో పొట్ట మాత్రం పెరుగుతూ ఉంటుంది. కొందరిలో తరచూ ఆయాసం, వాంతులు, విరేచనాలు, చర్మం, మర్మాయవయాల వద్ద ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు. అయితే కొంత మందిలో ఇలాంటి ఏ లక్షణాలూ కనిపించకుండానే మధుమేహం వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

టైప్-1తో ప్రమాదం ఎక్కువ

మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ క్లోమగ్రంథిలోని బీటా కణాలను స్వయంగా నాశనం చేయడం వల్ల టైప్-1 మధుమేహం కలుగుతుంది. దీన్ని ఇన్సూలిన్ డిపెండెంట్ డయాబెటిక్ లేదా జువెనైల్ డయాబెటిక్ అని కూడా పేర్కొంటారు. ఇది పెద్దలలో గానీ పిల్లలలోగాని ఎవరిలోనైనా రావచ్చు. మొత్తం మధుమేహ బాధితుల్లో టైప్-1 వారు పది శాతం వరకూ ఉంటారు. దీని బారినపడిన వారిలో క్లోమగ్రంథి ఇన్సూలిన్ ను కొంత మొత్తంలోగానీ లేదా మొత్తంగా విడుదల చేయలేకపోవడం గానీ జరుగుతుంది. అందువల్ల వారు జీవితాంతం బయటి నుంచి ఇన్సూలిన్ ను ఇంజెక్షన్ల రూపంలో తీసుకోవాల్సిందే. టైప్-1 మధుమేహం ఏ దశలో ఉన్నా కూడా రక్తంలోని గ్లుకోజ్ నిల్వల స్థాయులను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. వీరు ప్రత్యేకమైన ఆహార నియంత్రణను పాటించాల్సి ఉంటుంది.

టైప్-2కు కొన్ని జాగ్రత్తలు చాలు

మారుతున్న జీవన శైలి కారణంగా వచ్చే డయాబెటిస్ టైప్-2. ఇందులో శరీరంలోని కణాలు ఇన్సూలిన్ కు నిరోధకత పెంచుకుంటాయి. దాంతో మరింత ఎక్కువ ఇన్సూలిన్ అవసరమవుతుంది. జంక్ ఫుడ్, వేపుళ్లు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం.. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం.. వాతావరణ కాలుష్యం, శారీరక శ్రమ లోపించడం, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, స్థూలకాయం, పొట్టచుట్టూ విపరీతంగా కొవ్వు పేరుకుపోవడం వంటివి ఈ తరహా మధుమేహానికి కారణం అవుతాయి. మొత్తంగా మధుమేహ బాధితుల్లో 90 శాతం వరకూ టైప్-2కు చెందినవారే ఉంటారు. 

దక్షిణాసియా వాసులకు ఈ తరహా మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. శారీరక శ్రమ అంటే వ్యాయామం, నడక, ఇతరత్రా పనులు చేసుకోవడం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లకు దూరంగా ఉండడం, కూర్చుని పనిచేయాల్సి వచ్చినప్పుడు మధ్యలో లేచి కాసేపు స్వల్పస్థాయి వ్యాయామాలు చేయడం వంటివాటితో ఈ రకం మధుమేహాన్ని చాలా వరకూ అదుపులో పెట్టుకోవచ్చు. కొంతమంది మాత్రం నిత్యం మందులు వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో ఇన్సూలిన్ తీసుకోవాల్సి వస్తుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో చాలా మంది తొలి దశలో తమకు మధుమేహం ఉన్నట్లు గుర్తించలేరు. తర్వాతి దశకు చేరేసరికి గుర్తించినా.. అప్పటికే మూత్రపిండాల సమస్యలు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

representational image

గర్భిణులూ జాగ్రత్త

మహిళలకు గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. దీనిని గెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. దాదాపు 2 నుంచి 5 శాతం మందిలో గర్భంతో ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతుంటాయి. ఇది కూడా గర్భధారణ సమయంలో హార్మోన్లు, శారీరక మార్పుల కారణంగా ఇన్సూలిన్ నిరోధకత ఏర్పడడం వల్ల వస్తుంది. అంతేగాకుండా రక్తంలోని గ్లూకోజ్ మొత్తాన్నీ రవాణా చేయగలిగేంతగా వారిలో ఇన్సూలిన్ ఉత్పత్తి కాదు. గర్భిణులు రక్త పరీక్షల ద్వారా దీనిని గుర్తించడం అత్యంత ఆవశ్యకం. లేకపోతే తల్లీ బిడ్డలకు ప్రమాదం సంభవించే అవకాశముంది. పిల్లలు ఉండవలసిన దానికంటే అధిక బరువుతో జన్మిస్తారు. దాంతో సాధారణ ప్రసవం కష్టమై.. సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీయాల్సి ఉంటుంది. అయితే ఈ తరహా మధుమేహం ప్రసవం తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. కానీ ఇలా గెస్టేషనల్ డయాబెటిస్ వచ్చి తగ్గిపోయిన మహిళల్లో దాదాపు సగం మందికి తర్వాత పది ఇరవై ఏళ్లలో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇక కొంత మంది మహిళల్లో ప్రసవం తర్వాత అదే మధుమేహం కొనసాగే అవకాశముంది.

పరిమితికి మించి తినొద్దు

మధుమేహంతో ఉన్నవారు ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా మొత్తంగా శరీరానికి ఆ సమయంలో అందే మొత్తం శక్తి (కేలరీలు) నిర్ధారిత మొత్తానికి మించకూడదు. మామూలుగా మధ్య స్థాయిలో శారీరక శ్రమ ఉన్న పనిచేసే వ్యక్తులకు రోజుకు 1,800 నుంచి 2,200 వరకూ కేలరీల శక్తి సరిపోతుంది. కష్టమైన పనులు చేసేవారికి 2,500 కేలరీల వరకూ అవసరం. ఇంతకు మించి శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే.. అది శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. ఇది మధుమేహంతో బాధపడేవారికి మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది.

representational image

తీపి పదార్థాలూ తినొచ్చు

సాధారణంగా మధుమేహులు తీపి పదార్థాలు తినకూడదని భావిస్తుంటారు. కానీ మధుమేహంతో ఉన్నవారు ఏ ఆహార పదార్థాలనైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అయితే కొంత వరకూ పరిమితులు పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు తీపి పదార్థాలు త్వరగా జీర్ణమై వెంటనే రక్తంలోకి గ్లూకోజ్ విడుదలవుతుంది. దీంతో ఒక్కసారిగా గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి. అదే చపాతీలు, అన్నం కాస్త ఆలస్యంగా జీర్ణమవుతూ గ్లూకోజ్ రక్తంలోకి మెల్లమెల్లగా చేరుతుంది. ఈ కారణం వల్లే తీపి పదార్థాలు తీసుకోవద్దని చెబుతూ ఉంటారు. కానీ తీపి పదార్థాలను కూడా స్వల్ప స్థాయిలో నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అంటే తక్కువ మొత్తాల్లో నాలుగైదు గంటల విరామంతో తీసుకోవాలి. ఉదాహరణకు ఒక లడ్డూను సాధారణ వ్యక్తులు ఒకేసారి తినేస్తే... మధుమేహ బాధితులు ఆ లడ్డూను ముడు నాలుగు భాగాలు చేసి, నాలుగైదు గంటల విరామంతో ఒక్కో భాగాన్ని తినాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే అంత మేరకు మిగతా ఆహారాన్ని తగ్గించడం మర్చిపోవద్దు.

ఎందుకీ ఇన్సూలిన్?

మన శరీరానికి ఆహారం నుంచి శక్తి లభిస్తుంది. ఆహారం జీర్ణమైనప్పుడు గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తుంది. శరీరంలోని ప్రతి కణం జీవించి ఉండేందుకు, శక్తిని పొందేందుకు ఇది అత్యవసరం. అయితే మనం తరచూ శరీరానికి సరిపడేకన్నా ఎక్కువగానో, తక్కువగానో ఆహారాన్ని తీసుకుంటాం. ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పడు అధిక స్థాయిలో గ్లూకోజ్ తయారవుతుంది. అది శరీరంలో కొవ్వు రూపంలోకి మార్చబడి నిల్వచేయబడుతుంది. ఇలా గ్లూకోజ్ ను కొవ్వుగా మార్చేందుకు ఇన్సూలిన్ అత్యంత ఆవశ్యకం. దీనిని క్లోమగ్రంథిలోని లాంగర్ హాన్స్ పుటికల్లో ఉండే బీటా కణాలు ఉత్పత్తి చేస్తాయి. ఇన్సూలిన్ లేకపోతే గ్లూకోజ్ అంతా రక్తంలోనే ఉండిపోతుంది.

నియంత్రణ మన చేతుల్లోనే..

ఒకసారి మధుమేహం వచ్చాక దాదాపుగా జీవితాంతం తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇన్సూలిన్ ఉత్పత్తి సరిపడినంతగా లేకపోవడంతో రక్తంలో గ్లూకోజు స్థాయిని శరీరం దానంతట అది అదుపు చేసుకోలేదు. కాబట్టి మనమే బయట నుంచి దానిని అదుపులో ఉంచుకోవాలి. ఇందుకోసం మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. దానినే ప్రత్యేకంగా ‘డయాబెటిక్ జీవన విధానం’ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో మందుల వాడకం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయులను అదుపులో ఉంచుకోవడం కేవలం 25 శాతమే. మిగతా 75 శాతం మన ఆహార అలవాట్లలో మార్పులు, సరైన స్థాయిలో నిద్ర, రోజూ వ్యాయామం చేయడం వంటి అంశాల చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా అదనపు కేలరీలను శరీరంలోకి పోకుండా ఆహారం మీద అదుపు, తిన్న ఆహారం నిలువలుగా పేరుకు పోకుండా ‘శ్రమ’ ద్వారా ఖర్చు చేయుట అవసరం. అప్పటికీ మధుమేహం అదుపులో ఉండకపోతే మందులు వాడాల్సి వస్తుంది. మందుల వల్ల కూడా ప్రయోజనం లేని పరిస్థితుల్లో బయటి నుంచి ఇన్సూలిన్ ను అందించడమే చివరి మార్గం.

వైద్యుల సూచనలు పాటించాలి

representational imageడయాబెటీస్‌ కలిగిన రోగులు వైద్యులు సూచించిన ఆహార ప్రణాళికలను తప్పనిసరిగా పాటించాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. అది కూడా వైద్యులు సూచించిన తేలికపాటి వ్యాయామాలు మాత్రమే చేయాలి. మందులు వాడాల్సిన అవసరమున్నవారు నిర్ధారిత వేళల్లో తప్పనిసరిగా తీసుకోవాలి. క్రమబద్ధంగా రక్తపు గ్లూకోజ్‌ స్థాయిని పరీక్షించుకుంటూ.. వివరాలను ఎప్పటికప్పడు ఒక నోట్ పుస్తకంలో నమోదుచేసి పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు వైద్యులకు చూపించి సరైన వైద్యం చేయించుకోవాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శరీరంలో చక్కెర శాతం హఠాత్తుగా పెరిగిపోవచ్చు. అప్పుడు మాత్రలు ఆ స్థితిని అదుపు చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్‌ సూచనల మేరకు ఇన్సూలిన్‌ తీసుకోవాలి. తర్వాత చక్కెర అదుపులోకి వచ్చాక మళ్లీ మాత్రలకే పరిమితం కావచ్చు. ఒకసారి ఇన్సూలిన్‌ తీసుకుంటే జీవితాంతం ఇన్సులిన్‌ తీసుకోవలసి వస్తుందన్నది సరికాదు.

హైపోగ్లైసేమియా రాకుండా చూసుకోండి

హైపోగ్లైసేమియా అంటే రక్తంలో సాధారణంగా ఉండాల్సిన దానికంటే తక్కువగా చక్కెర స్థాయులు ఉండడం. ఇది చాలా ప్రమాదకరం. దీంతో రోగులు కోమాలోకి వెళ్లిపోయే అవకాశముంది. మధుమేహం ఉన్నవారు మాత్రలు వేసుకుని, ఇన్సూలిన్ తీసుకుని ఎక్కువ శారీరక శ్రమ చేసినా, వ్యాయామం చేసినా హైపోగ్లైసేమియా సమస్య తలెత్తుతుంది. అంతేగాకుండా ఇన్సూలిన్ మోతాదుకు మించి తీసుకోవడం, ఎక్కువ సమయం పాటు తినకుండా ఉండడం వల్ల కూడా వస్తుంది. ఇలాంటపుడు రక్తంలో చక్కెర స్థాయులను వేగంగా పెంచుకునేలా వైద్యుల సూచనల మేరకు చర్యలు చేపట్టాలి.

ఎదుర్కోవాల్సిన సమస్యలు ఎన్నో..

మధుమేహం వచ్చినవారిలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా హైపోగ్లైసీమియా, కీటో అసిడోసిస్ వంటివి చాలా ప్రమాదకరం. డయాబెటిక్ కీటో అసిడోసిస్ వల్ల కణాల స్థాయిలో జరిగే ప్రక్రియల్లో నియంత్రణ లోపిస్తుంది. దానివల్ల కణాల్లోంచి రక్తంలోకి కార్బన్ డయాక్సైడ్ తోపాటు అసిటోన్ కూడా చేరుతుంది. ఇది ఊపిరితిత్తుల్లోంచి శ్వాసక్రియలో భాగంగా బయటకు విడుదలవుతుంది. దీనివల్ల వేగంగా శ్వాస తీసుకోవడం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితి తీవ్రమైతే కోమాలోకి వెళ్లిపోతారు. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. ఇది టైప్-1 మధుమేహ బాధితుల్లోనే కనిపిస్తుంది. ఇక తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం కారణంగా శరీరంలో నీటిశాతం తగ్గిపోయి నాన్ కీటోటిక్ హైపర్ ఆస్మొలార్ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కూడా కోమాలోకి వెళ్లిపోయే అవకాశముంది. ఇది టైప్-2 మధుమేహ బాధితుల్లో అదికూడా చాలా అరుదుగా సంభవిస్తుంది. ఇక ఎక్కువ కాలం రక్తంలో అధిక గ్లూకోస్ నిలువలు ఉండడం వల్ల కంటి లెన్స్‌లో గ్లూకోస్ పేరుకుపోతుంది. దానితో గ్లకోమా సమస్య ఏర్పడి దృష్టి లోపాలు తలెత్తతుతాయి. చాలా అరుదుగా అయినా కంటిలోని రెటీనా దెబ్బతిని అంధత్వం వచ్చే అవకాశముంది. నాడీ కణాలు, సూక్ష్మ నాళికలు దెబ్బతినడం మూలంగా పురుషత్వ లోపం ఏర్పడుతుంది. కాళ్ళలో గాంగ్రీన్ తో ఒక్కోసారి అవిటితనం కూడా రావచ్చు.

ముఖ్యమైన జాగ్రత్తలివీ..

- మధుమేహం బారినపడిన వారు దీనిపై పూర్తిగా అవగాహన పెంచుకోవడం అవసరం.

- రోజూ వ్యాయామం చేయడం, ఆహారం, నిద్రలకు సరైన సమయాలను పాటించాలి.

- రక్తపోటు, కొలెస్టరాల్, గ్లూకోజ్ స్థాయుల పరీక్షలను నియమిత సమయాల్లో తప్పనిసరిగా చేయించుకోవాలి.

- మధుమేహం ఉన్నవారు తమ కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకు గుర్తించలేరు. అందువల్ల అప్పుడప్పుడు తమ పాదాల్లో స్పర్శ ఎలా ఉందో పరిశీలించుకోవాలి.

- పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నాయేమో గమనించి.. వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి.

- పాదాలకు ఎలాంటి గాయాలూ తగలకుండా జాగ్రత్త వహించాలి. అవసరమైతే ప్రత్యేకమైన బూట్లు ధరించాలి.

- మధుమేహం ఉన్న వారికి మూత్ర పిండాలు దెబ్బతిని, మూత్రంలో ఆల్బుమిన్‌ అనే ప్రొటీన్‌ వెళ్లిపోతుంటుంది. దానివల్ల కిడ్నీ ఫెయిలయ్యే అవకాశముంది. అందువల్ల మూడునాలుగు నెలలకోసారి మూత్ర పరీక్ష చేయించుకోవాలి.

- మధుమేహం ఉన్న వారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల ఎలాంటి సమస్యలూ లేకపోయినా ఏటా ఈసీజీ, ట్రెడ్‌మిల్‌, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాలి.

(ఆయా నిపుణుల అభిప్రాయాలు క్రోడీకరించి రాసిన ఈ ఆర్టికల్ ఉద్దేశం కేవలం ఆయా వ్యాధుల పట్ల పాఠకులలో అవగాహన కల్పించడం కోసం మాత్రమే)

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Advertisements