ap7am logo

భారత సైన్యంలో మహిళల ప్రస్థానానికి నాంది పలికిన... ప్రియా ఝింగన్!

Sun, May 01, 2016, 09:53 AM
Related Image

1992...  అప్పటికి పలు రంగాల్లో మహిళలు చెప్పుకోదగ్గ గుర్తింపు పొందారు. అప్పటిదాకా మహిళలకు ప్రవేశం లేని విభాగం ఏదైనా ఉందంటే, అది ఒక్క భారత సైన్యమే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పుడప్పుడే డిగ్రీ పూర్తి చేసిన ప్రియా ఝింగన్... నాటి సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగెజ్ కు ఓ లేఖ రాశారు. ఏమని రాశారు? సైన్యంలో మహిళల ప్రవేశానికి తలుపులు ఎప్పుడు తెరుస్తారని. ఈ లేఖకు జనరల్ సునీత్ కూడా స్పందించారు. ఓ ఏడాదో, రెండేళ్లలోనే ఆ దిశగా నిర్ణయం తీసుకుంటామని ప్రత్యుత్తరమిచ్చారు.

ఇండియన్ ఆర్మీ చీఫ్ సంతకంతో వచ్చిన ఆ లేఖను అపురూపంగా దాచుకున్న ప్రియా, అప్పటిదాకా తాను వేసుకున్న ప్రణాళికలన్నింటినీ అటకెక్కించారు. ఎందుకంటే, జనరల్ సునీత్ చెప్పినట్లుగా సైనిక ప్రవేశాల ప్రకటన వస్తుందిగా. ఇక వేరే ప్రణాళికలు అనవసరం కాబట్టి. అంతే, అనుకున్నట్లుగానే సైన్యంలోకి మహిళలను ఆహ్వానిస్తూ, దినపత్రికల్లో ఓ ఫుల్ పేజీ ప్రకటన వచ్చేసింది. ప్రియా కల నేరవేరింది.

పోలీస్ అధికారి కావాలనుకున్నారట!

1990 దశకంలో కాస్త ధైర్యసాహసాలంటే ఇష్టపడే విద్యార్థినీలు... సాధారణంగా కిరణ్ బేడీని ఆదర్శంగా తీసుకునేవారు. న్యాయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రియా ఝింగన్ కూడా అలాగే ఆలోచించారు. కొద్ది రోజులుంటే ఎంచక్కా సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు చేయడంతో పాటు పరీక్ష కోసం సిద్ధపడే క్రమంలో ఏ కోచింగ్ సెంటర్ లోనే చేరిపోయేవారు. అయితే ఉన్నట్లుండి, ప్రియా దృష్టి సైన్యంలో మహిళలకు ఎందుకు ప్రవేశం కల్పించడం లేదనే అంశంవైపు మళ్లింది. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్న మహిళలు... ఒక్క సైనిక రంగంలో రాణించలేరని ఎందుకనుకుంటున్నారు? అన్న దిశగా సాగిన ఆలోచనలు, ఏకంగా సైనిక దళాల ప్రధానాధికారికే ఉత్తరం రాసే దిశగా ఆమెను పయనింపజేశాయి. అవే ఆలోచనలు పోలీసు అధికారి కావాలన్న తనను ఇండియన్ మిలిటరీలో చేరేలా చేశాయని ప్రియా చెబుతారు.

నెంబర్: 001

అదేంటీ, అప్పటిదాకా సైన్యంలో ఎవరూ లేరా? ప్రియా ఝింగన్ కు 001 నెంబరు కేటాయించడానికి? ఉన్నారు... అయితే అంతా పురుషులే. ఒక్క మహిళ కూడా లేరు. భారత సైన్యంలోకి తొలి మహిళా అడుగు ప్రియా ఝింగన్ దే. అందుకే ఆమెకు సైన్యం 001 నెంబరును కేటాయించింది. 1992లో వెలువడిన సైనిక ప్రవేశాల ప్రకటనలో భాగంగా న్యాయ శాస్త్రంలో పట్టా సాధించిన విద్యార్థినీలకు రెండు సీట్లు కేటాయించారు. ఒకటి సరే ... ఆ రెండో సీటుకు ఎవరు ఎంపికవుతారబ్బా? అంటూ ప్రియా ఝింగన్ ఆలోచనలో పడిపోయారట. ఎందుకంటే, ఆ రెండింటిలో ఓ సీటును ఆమె తన ఖాతాలో వేసేసుకున్నారు మరి. అనుకున్నట్లుగానే అందులో సీటును కైవసం చేసుకున్నారు. చెన్నైలోని సైనిక శిక్షణ కళాశాలలో చేరిపోయారు. ఇంకేముంది, కోరుకున్న ఉద్యోగం, కష్టమైన శిక్షణను ఇష్టంగా ముగించేసి భారత సైన్యంలో అంతర్భాగమైన  జడ్జీ అడ్వకేట్ జనరల్ (జేఏజీ) విభాగంలో విధుల్లో చేరిపోయారు. భారత సైన్యంలో తొలి సైనికాధికారిగా చరిత్ర పుటలకెక్కారు.

నిజంగా అప్పటికి సైన్యంలో మహిళలు లేరా?

ఎందుకు లేరు. చాలా మందే ఉన్నారు. మరి ప్రియా ఝింగన్... సైన్యంలో కాలుమోపిన తొలి మహిళగా ఎలా చరిత్రకెక్కుతారంటారా? అప్పటిదాకా సైన్యానికి వైద్య సేవలందించేందుకు మిలిటరీ మెడికల్ సర్వీస్ లోనే మహిళలుండేవారు. కేవలం వైద్యులు, నర్సుల విభాగంలోనే ఉండేవారు. నర్సుల విభాగాన్ని పక్కనబెడితే... వైద్యుల విభాగంలో పనిచేసే మహిళలను వేళ్లమీద లెక్కపెట్టేయొచ్చు. అయితే సైన్యంలో నేరుగా అధికారిగానే కాక సైనికురాలుగా కాలుమోపిన మహిళ అప్పటికి ఎవ్వరూ లేరు. లేరనేదానికంటే... సైన్యం వారికి ప్రవేశం కల్పించలేదని చెప్పాలి. 24 మంది మహిళలతో కలిసి ప్రియా ఝింగన్ సైనిక శిక్షణను ముగించడంతో ఆ కొరత కూడా తీరిపోయింది. క్రమంగా సైన్యంలో మహిళలకూ మెరుగైన ప్రాతినిధ్యమే లభించింది. అంతేకాక సైనిక ప్రవేశాలకు యువతుల నుంచి అంతగా స్పందన వస్తుందా? అన్న సైనికాధికారుల నోళ్లకు తాళాలూ పడక తప్పలేదు. ఆ తరహా వ్యాఖ్యలు చేసిన ఓ సైనికాధికారి విమర్శల జడివానను ఎదుర్కోవాల్సి వచ్చింది.

విధుల్లోకి సమస్యల స్వాగతం

కఠోర శిక్షణను అలవోకగా పూర్తి చేసుకున్న ప్రియా ఝింగన్... తొలి పోస్టింగ్ లో భాగంగా సైన్యం ఆదేశాల మేరకు అహ్మదాబాద్ లో విధుల్లో చేరిపోయారు. అయితే అప్పటిదాకా అక్కడ మహిళల ఉనికి లేకపోవడంతో అక్కడి ఏర్పాట్లు, వసతులు పూర్తిగా పురుషులకే అన్నట్లుగా ఉన్నాయి. టాయిలెట్ ను కూడా తనతో పనిచేసే పురుష అధికారులతో పంచుకోవాల్సి వచ్చేది. మరి తాను టాయిలెట్ కెలా వెళ్లేది? మరొకరైతే భయపడేవారేమో కాని, ప్రియా మాత్రం ఆ సమస్యకు చక్కటి పరిష్కారం కనుగొన్నారు. టాయిలెట్ కు వెళ్లే ముందు తలుపును కొట్టడం, ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతే లోపలికి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. అయితే ఆమె కోరకుండానే కొద్దిరోజుల్లోనే సైన్యం, అక్కడ మహిళా అధికారులకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లోనూ మహిళలకు సంబంధించిన వసతులను సమకూర్చడంలో సైన్యం శ్రద్ధ వహించింది.

మేడమ్ కాదు... ‘సర్’ లమే!

సైన్యంలో అధికారులను ఏమని పిలుస్తారు? మనలాగే ‘సర్’ అనే పిలుస్తారు. మరి మహిళా అధికారులను మనం మేడమ్ అంటూ సంబోధిస్తాం. మరి మిలటరీలో కూడా అంతేనా అంటే, కానే కాదట. సైన్యంలో విధుల్లో చేరగానే తమ పై అధికారి, మమ్మల్ని కూడా ‘సర్’ అనే పిలవాలంటూ ఇతర సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారని ప్రియా చెబుతారు. మిగిలిన ప్రభుత్వ శాఖలకు సైన్యం ఎప్పటికీ భిన్నమైనదే. దేశ రక్షణ బాధ్యతలు భుజానేసుకున్న సైన్యంలో లింగభేదం ఉండకూడదనేది సదరు సైనికాధికారి భావనట. ఆ అధికారి ఆదేశాల తర్వాత 2003 మార్చి 5న రిటైరయ్యేదాకా ప్రియా బృందాన్ని అంతా ‘సర్’ అనే సంబోధించారు. అంతేకాదు, విధి నిర్వహణలోనూ తమ పదేళ్ల సర్వీసులో ఎన్నడూ వివక్షను ఎదుర్కున్న సందర్భాలు లేవంటారు ప్రియా బృందం.

మరి వేధింపుల మాటేమిటో?

తన పదేళ్ల విధి నిర్వహణలో ఎలాంటి లైంగిక వేధింపులకు గురి కాలేదని ప్రియా ఝింగన్ చెప్పారు. కొద్దికాలం క్రితం భారత సైన్యంలో లెఫ్ట్ నెంట్ ర్యాంకుకు ఎదిగిన సుష్మిత చక్రవర్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ సైనికాధికారి వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలపై స్పందించిన ప్రియా... తనకు గాని, తనతో పాటు సైన్యంలో అడుగిడిన తొలి బ్యాచ్ మహిళలకు గాని ఎప్పుడూ ఈ తరహా వేధింపులు ఎదురు కాలేదని చెప్పారు.

సైన్యం నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా తన బ్యాచ్ మేట్లతో ఇప్పటికీ సమాచార సంబంధాలు నెరపుతున్నానని, ఎన్నడూ తమ మధ్య ఈ తరహా విషయాల ప్రస్తావనే రాలేదని చెప్పారు. అయితే ఓ సందర్భంలో తన గదిలోకి చొచ్చుకొచ్చేందుకు యత్నించిన ఓ సైనికుడిని సమర్ధంగానే ఎదుర్కొన్నానని, ఆ తర్వాత, అతడు చేసిన తప్పుకు సైన్యం అతడిని వెలేసిందని చెప్పారు. ఈ తరహా వేధింపులకు పాల్పడే వారిపై సైన్యం వేగంగా చర్యలు తీసుకుంటుందని కూడా ప్రియా చెప్పారు.

సైనిక జ్ఞాపకాల్లోనే...!

ప్రస్తుతం గాంగ్ టక్ నుంచి వెలువడుతున్న ఓ వార పత్రికకు ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియా ఝింగన్... ఇంకా సైన్యంలోనే ఉన్నట్లుగానే భావిస్తారు. ఇప్పటికీ శారీరక దారుఢ్యాన్ని కాపాడుకునే నిమిత్తం రోజూ 9 కిలోమీటర్ల మేర నడక సాగిస్తూనే ఉన్నారు. సైన్యంలోని మెకనైజ్డ్ ఇన్ ఫ్రాంటీలో పనిచేసే సైనికాధికారిని వివాహం చేసుకున్న ప్రియాకు ఓ తొమ్మిదేళ్ల కొడుకూ ఉన్నాడు. అతడు కూడా తండ్రిలాగే మెకనైజ్డ్ ఇన్ ఫ్రాంటీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని ప్రియా ముచ్చటగా చెబుతుంటారు.

 సైన్యం నుంచి రిటైరవ్వడానికి కొన్ని నెలల ముందు, ‘సైన్యంలోకి మహిళలకు ప్రవేశమైతే కల్పించారు కాని మరి ఇన్ ఫ్రాంటీ, అంటే పదాతిదళంలోకి అనుమతి ఎప్పుడిస్తారు?’ అంటూ ఓ సైనిక ఉన్నతాధికారిని ప్రియా ప్రశ్నించారట. మీ ముని మనవరాళ్లకు ఆ అవకాశం వస్తుందేమోనన్న ఆయన వ్యాఖ్యలకు ముసిముసిగానే నవ్వుతూ ‘ఆ రోజు కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటాను’ అంటూ సమాధానమిచ్చారట. మరి ఆ సందర్భాన్ని ప్రియా ఝింగన్ చూడాలనే కోరుకుందాం.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Advertisements