ap7am logo

కంప్యూటర్ రంగానికి జవసత్వం...హ్యూలెట్ ప్యాకార్డ్!

Thu, Apr 28, 2016, 09:47 AM
Related Image

1930లలో కంప్యూటర్ యుగం అప్పుడప్పుడే బుడిబుడి అడుగులతో నడక నేర్చుకుంటోంది. హ్యూలెట్ ప్యాకార్డ్ ప్రవేశంతో ఒక్కసారిగా సరికొత్త జవసత్వంతో పరుగులు తీసింది. ఓ చిన్న కార్ల గ్యారేజీలో ఇద్దరు యువకులతో ప్రారంభమైన హెచ్ పీ నేడు కంప్యూటర్ రంగానికి ప్రాణపదంగా నిలుస్తున్న హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లలో తనదైన ముద్ర వేయడమే కాక, ఆ రంగానికి చోదక శక్తిగా నిలిచింది. ఇద్దరితో ప్రారంభమైన హెచ్ పీలో నేడు 3.5 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. వ్యవస్థాపకులిద్దరూ గతించినా, హెచ్ పీ తన ప్రస్థానాన్ని మాత్రం అప్రతిహతంగా కొనసాగిస్తోంది. అంతేకాదు, కంప్యూటర్ రంగంలో పలు కీలక ఆవిష్కరణలకూ నాంది పలికింది. లెక్కలేనన్ని కంపెనీలను చేజిక్కించుకుని ప్రపంచంలోనే పర్సనల్ కంప్యూటర్ల విక్రయంలో రెండో అతిపెద్ద సంస్థగా అవతరించింది. కేవలం 538 అమెరికన్ డాలర్ల పెట్టుబడితో మొదలైన హెచ్ పీ విలువను తాజాగా న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజీ, 62 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది.

కారు గ్యారేజే కార్యరంగంగా...!

1939 జనవరి 1. యువత మొత్తం నూతన సంవత్సర వేడుకల్లో నిండా మునిగిపోయింది. అప్పటికి ఏడాది క్రితమే ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుని స్టాన్ ఫోర్డ్ వర్సిటీ నుంచి బయటపడ్డ విలియం బిల్ రెడింగ్టన్ హ్యూలెట్, డేవ్ ప్యాకార్డ్ లు మాత్రం తమ కొత్త కంపెనీ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఎందుకంటే, నాడు ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. ఇద్దరు మిత్రులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అయితే సుదీర్ఘంగా సాగిన సంయుక్త మేధోమథనంలో ఓ నిర్ణయానికి వచ్చారు.

‘‘డబ్బు కోసం అర్రులు చాచడమెందుకు..? ఉద్యోగం దొరక్కపోతే, మన కోసం మనమే ఓ ఉద్యోగాన్ని సృష్టించుకుందాం’’ అన్న స్థిర నిర్ణయం వారి మదిలో గూడుకట్టుకుంది. అంతే, అందుబాటులో ఉన్న కారు గ్యారేజీనే వారు తమ కార్యరంగంగా మలచున్నారు. విద్యుత్ వినియోగంలో డీసీ కరెంట్ ను ఏసీ కరెంట్ గా మార్చే ఆసిలేటర్ ను రూపొందించారు. అంతేకాక దాని సామర్థ్యాన్ని భారీ స్థాయికి పెంచారు. దీంతో వారి ఆసిలేటర్ లు అనతి కాలంలోనే విశ్వవ్యాప్తమయ్యాయి. కంపెనీని కారు గ్యారేజీ నుంచి భారీ ప్రాంగణంలోకి మారేలా దోహదం చేశాయి.

బొమ్మా, బొరుసుతో కంపెనీ పేరు నిర్ణయం

సాధారణంగా కంపెనీకి పేరు నిర్ణయించే విషయంలో పెద్ద కసరత్తు చేస్తుంటారు.  అయితే, బిల్, డేవ్ లు మాత్రం బొమ్మా బొరుసును ఆశ్రయించారు. అది కూడా కంపెనీ పేరులో ఎవరి పేరు ముందుండాలని నిర్ణయించేందుకేనట. అంటే కంపెనీ పేరు అప్పటికే నిర్ణయమైపోందన్న మాట. పోటీలో బిల్ గెలిచాడు. అంతే అతడి పేరు ముందుగా వచ్చేటట్లు హ్యూలెట్ ప్యాకార్డ్ అవతరించింది. అది క్రమంగా హెచ్ పీ గా వాడుకలోకి వచ్చింది. హెచ్ పీ...అందరికీ చిరపరిచతమైన పేరే. అయితే హెచ్ పీ అంటే ఏమిటని అడిగితే ఠక్కున చెప్పేందుకు సగం మందికి పైగా కష్టపడటం ఖాయం. ఇక డెస్క్ టాప్ కంప్యూటర్లను పక్కనబెడితే, ల్యాప్ టాప్ ల విషయానికొస్తే, ల్యాప్ టాప్ అంటేనే హెచ్ పీ...  హెచ్ పీ అంటేనే ల్యాప్ టాప్. మనలను అంత ప్రభావానికి లోను చేసిన హ్యెలెట్ ప్యాకార్డ్... రంగంలోకి కొత్తగా ఎన్ని సంస్థలు ప్రవేశిస్తున్నా, తన స్థానం మాత్రం చెక్కుచెదరకుండా గట్టి పునాదినే వేసుకుంది.

వాల్ట్ డిస్నీ ఆర్డర్...ఉభయతారకం

అప్పుడప్పుడే కార్యరంగంలోకి దిగిన హ్యూలెట్ ప్యాకార్డ్ రూపొందిస్తున్న ఆసిలేటర్ విద్యుత్ వినియోగంలో కీలకంగా మారుతూ వస్తోంది. సరిగ్గా అప్పుడే వినోద రంగంలో కాలుమోపిన వాల్ట్ డిస్నీ, తన కొత్త చిత్రం ఫాంటేసియాకు భారీ సామర్థ్యంతో కూడిన ఆసిలేటర్ అవసరమని భావించింది. తన కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ద్వారా హెచ్ పీ ఆసిలేటర్ గురించి తెలుసుకున్న వాల్ట్ డిస్నీ, ఆలస్యం చేయకుండా ఆర్డరిచ్చారు. రెండు సంస్థల మధ్య 200 ఆంప్స్ సామర్థ్యమున్న ఆసిలేటర్ కు 71.50 డాలర్ల రేటు కుదిరింది.

ఆ వెంటనే డిస్నీ కోరినట్టుగా భారీ సామర్ధ్యంతో కూడిన ఆసిలేటర్ ను హెచ్ పీ సకాలంలోనే రూపొందించి ఇచ్చింది. అంతే, వాల్ట్ డిస్నీ వినోద రంగంలో అద్భుతాలు నమోదు చేసింది. అదే సమయంలో హెచ్ పీ ఆసిలేటర్ కు కూడా భారీ ప్రచారం లభించింది. అంటే డిస్నీ ఆర్డర్, తనతో పాటు హెచ్ పీకి సరికొత్త శక్తిని నింపింది. రెండు సంస్థలూ ఒక్క ఆర్డర్ తో తమ రంగాల్లో అగ్రగాములుగా ఎదిగాయి.

అసలెవరీ కుర్రాళ్లు...!

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన పాలో ఆల్టో నగరానికి చెందిన విలియం బిల్ రెడింగ్టన్ హ్యూలెట్, డేవ్ ప్యాకార్డ్ లు 1938లో స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేస్తున్న సందర్భంగా స్నేహితులుగా మారారు. 1913, మే 20న మిచిగాన్ లోని ఆన్ ఆర్బర్ లో జన్మించిన హ్యూలెట్ ఇంజినీరింగ్ విద్య కోసం స్టాన్ ఫోర్డ్ వచ్చారు. కొలరాడోలోని పాబ్లో లో 1912 సెప్టెంబర్ 7న జన్మించిన డేవ్ ప్యాకార్డ్ కూడా తన ఇంజినీరింగ్ విద్య కోసం స్టాన్ ఫోర్డ్ వర్సిటీకి చేరుకున్నారు. విద్య పూర్తి కాగానే హెచ్ పీని ప్రారంభించిన వీరిద్దరూ మరణం దాకా హెచ్ పీలోనే కొనసాగారు.

కొంతకాలం పాటు అమెరికా రక్షణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్యాకార్డ్, ఆ తర్వాత మంత్రి పదవిని వదులుకుని మళ్లీ, సొంత గూటికే చేరారు. హ్యూలెట్ 87 ఏళ్ల వయసులో 2001 జనవరి 12న మరణించారు. అంతకు కొంత కాలం ముందుగా 83 ఏళ్ల వయసులో ప్యాకార్డ్ 1996 మార్చి 26న మరణించారు. దాదాపుగా 60 ఏళ్ల పాటు ఇద్దరు మిత్రులు ఒకే మాట, ఒకే బాట పైనే ప్రయాణం సాగించారు. వీరు స్థాపించిన హ్యూలెట్ ప్యాకార్డ్ ఇటీవలే రెండుగా విడిపోయింది. అప్పటిదాకా మెగ్ వైట్ మన్ అంతా తానై వ్యవహరించారు. కంపెనీకి చైర్మన్ గానే కాక, ప్రెసిడెంట్, సీఈఓగానూ పనిచేశారు.

సిబ్బంది సంక్షేమానికి హెచ్ పీ పెద్ద పీట

వినూత్న రీతిలో దూసుకెళుతున్న హెచ్ పీ... తన సిబ్బంది సంక్షేమానికి పెద్ద పీట వేసింది. అప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని రీతిలో సిబ్బంది సంక్షేమంపై హెచ్ పీ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. సదరు నిర్ణయాలు నేడు ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ పథకాల రూపక్పలనకు నాంది పలికాయి. ఎనిమిదేళ్ల కార్యకలాపాల తర్వాత 1947లో పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన హెచ్ పీ షేరు ధర 16 డాలర్లుగా పలికింది. అప్పుడే ఇంత భారీ రేటు పలికిన కంపెనీ షేర్లను మిత్ర ద్వయం, తమ సిబ్బందికీ పంచిపెట్టారు. తద్వారా కంపెనీలో స్నేహపూరిత వాతావరణానికి శ్రీకారం చుట్టారు.

1940లో తమ కంపెనీలో పనిచేస్తున్న ఓ కార్మికుడు ట్యూబర్ క్యులోసిస్ (క్షయ వ్యాధి) బారిన పడ్డారు. దీంతో అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించింది. అయితే దీనిని చూసిన బిల్, డేవ్ లు ప్రేక్షక పాత్రకే పరిమితం కాదలుచుకోలేదు. కార్మికుడి కుబుంబానికి పూర్తి బాసటగా నిలబడ్డారు. అంతేకాక భవిష్యత్తులో ఏ ఒక్క కార్మికుడికి ఇబ్బందులు కలగరాదన్న నిర్ణయంతో మెడికల్ ఇన్సూరెన్స్ కు తెర తీశారు. ఈ తరహా కార్యక్రమంలో హెచ్ పీ అడుగు ప్రపంచంలోనే మొట్టమొదటిదిగా వినుతికెక్కింది. ఆ తర్వాత ప్రతి కంపెనీలోనూ అమలు కావడానికి నాంది పలికింది.

20 ఏళ్ల తర్వాత టేకోవర్ల జోరు

1939లో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్ పీ... రెండు దశాబ్దాల తర్వాత తనకు అవసరమని భావించిన కంపెనీలను టేకోవర్ చేయడం ప్రారంభించింది. 1958 లో ప్రారంభమైన హెచ్ పీ టేకోవర్ల పర్వం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.

2014 మే 1 నాటికి హెచ్ పీ టేకోవర్ చేసుకున్న కంపెనీల సంఖ్య 96కు చేరింది. మిలియన్ డాలర్ల రేటు కట్టి కంపెనీలను చేజిక్కించుకున్న హెచ్ పీ... నేడు ఇందుకోసం బిలియన్ డాలర్లను కూడా వెచ్చించేందుకూ వెనుకాడటం లేదు. 2011 అక్టోబర్ 3న బ్రిటన్ కు చెందిన అటానమీ కార్పోరేషన్ కొనుగోలుకు 11 బిలియన్ డాలర్లను వెచ్చించింది. హెచ్ పీ తన టేకోవర్ల పర్వంలో అత్యధిక రేటు చెల్లించి కొనుగోలు చేసిన కంపెనీ అటానమీ కార్పోరేషనే. అయితే హెచ్ పీ టేకోవర్ చేసిన 96 కంపెనీల్లో 25 మాత్రమే విదేశీ కంపెనీలు. మిగిలినవన్నీ అమెరికాకు చెందినవే.

అమెరికా రక్షణ రంగానికి మిత్ర ద్వయం సేవలు

ఇదిలా ఉంటే, హెచ్ పీ వ్యవస్థాపకులు బిల్, డేవ్ ఇద్దరూ అమెరికా రక్షణ రంగానికి సేవలందించారు. 1941 నుంచి 1947 దాకా బిల్ హ్యూలెట్ అమెరికా సైన్యంలో సైనికాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక డేవ్ ప్యాకార్డ్ ఏకంగా ఆ దేశ రక్షణ శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు. అమెరికా అధ్యక్షుడు నిక్సన్ హయాంలో 1969 నుంచి 1971 దాకా మంత్రిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేసి తిరిగి హెచ్ పీ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అసలు వీరు అమెరికా రక్షణ రంగంలో సేవలందించేందుకు ఎందుకు ఆసక్తి కనబరిచారు, అసలు ఆ అవకాశం వీరికెలా చిక్కిందన్న అంశమూ ఆసక్తిగొలిపేదే.

 హెచ్ పీ ప్రారంభమైన తొలినాళ్లలో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సమయంలో వీరు రూపొందించిన ఆడియో ఆసిలేటర్లకు సైన్యంలో డిమాండ్ పెరిగింది. మిలిటరీ వినియోగించే రాడార్, కౌంటర్ రాడార్ వ్యవస్థల్లో హెచ్ పీ ఆసిలేటర్ల వినియోగం క్రమంగా పెరిగింది. ఈ క్రమంలోనే బిల్, డేవ్ లతో వ్యాపారాన్నే కాక, సైన్యంలో వారి సేవలను అమెరికా కోరింది. దీంతో ఒకరు సైనికాధికారిగా పనిచేయగా, మరొకరు రక్షణ శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించే అరుదైన ఘనతను అందిపుచ్చుకున్నారు.

రెండుగా విడివడి... ముందుకు సాగుతున్న టెక్ దిగ్గజం

హ్యూలెట్, పాకార్డ్ లు బతికి ఉన్నంత కాలం హెచ్ పీ ప్రయాణం అప్రతిహతంగానే సాగింది. విద్యాభ్యాసం తర్వాత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా జీవితం ప్రారంభించిన తర్వాత వారిద్దరూ కలిసే అడుగు ముందుకేశారు. చనిపోయే దాకా వారిద్దరిదీ... ఒకే మాట. ఒకటే బాట. వారు గతించిన తర్వాత కూడా చాలాకాలం పాటు హెచ్ పీ ప్రయాణం సాఫీగానే సాగింది. అయితే గతేడాది హెచ్ పీ రెండుగా విడిపోయింది. వెరసి 77 ఏళ్ల ఆ సంస్థ మహా ప్రస్థానానికి కాస్తంత బ్రేక్ పడింది. గతేడాది అక్టోబర్ 30దాకా ఒకటిగానే కొనసాగిన హెచ్ పీ.. వ్యాపార కార్యకలాపాల ఆధారంగా నవంబర్ 1 నుంచి రెండుగా అవతరించింది. సాఫ్ట్ వేర్, బిజనెల్ వ్యవహారాల కోసం ‘హెచ్ పీ ఎంటర్ ప్రైజెస్’ ఏర్పాటు కాగా.. కంప్యూటర్, ప్రింటర్ తదితర ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ‘హెచ్ పీ ఐఎన్సీ’ పేరిట మరో కొత్త సంస్థ ఏర్పాటైంది. రెండుగా విడివడిన హెచ్ పీ... కొత్తగా ఏర్పాటైన రెండు సంస్థలకు తన లోగో కొనసాగుతుందని ప్రకటించింది.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy