ap7am logo

భారత్ లో ఫేస్ బుక్ కు ఊపిరిపోసిన సాహస వనిత ... కార్తీక రెడ్డి!

Thu, Apr 28, 2016, 09:26 AM
Related Image

2012 డిసెంబర్ 16...  రాత్రి. దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఆరురుగు మృగాళ్లు, ఓ యువతి (నిర్భయ) పై అత్యాచారం చేశారు. అత్యంత పాశవికంగా దాడి చేశారు. మరునాడు ఈ దారుణంపై భారతావని దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఆ మరునాడు ఈ దారుణంపై రణభేరీ మోగింది. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీ వీధులు యువత అడుగుల చప్పుడుతో మారుమోగిపోయాయి. అప్పటిదాకా ఆందోళన సడి చూడని రైసినా హిల్స్ పోలీసుల లాఠీ చార్జీతో నివ్వెరపోయింది.

యువతను ఇంత పెద్ద ఎత్తున ఉద్యమంలోకి లాగింది... అప్పటికే అశేష జనాదరణ పొందిన ఏ మాస్ మీడియానో కాదు. అప్పుడప్పుడే ప్రకాశిస్తున్న సామాజిక సంబంధాల వేదిక. అదే ఫేస్ బుక్! ఉప్పెనలా వెల్లువెత్తిన యువత ఉద్యమ స్ఫూర్తికి ఊపిరులూదింది. ఆ ఫేస్ బుక్ కు భారత్ లో జవజీవావాలను నింపింది మాత్రం మన తెలుగు మహిళ కార్తీక రెడ్డి. ఫేస్ బుక్ భారత అధినేత్రి!

అప్పటికి ఫేస్ బుక్ పరిచయం కొంతే!

2004లో జీవం పోసుకున్న ఫేస్ బుక్ కు భారత్ లో 2010 నాటికి కేవలం 80 లక్షల మంది వినియోగదారుు మాత్రమే ఉన్నారు. అంటే సంపన్న వర్గాలకే పరిమితమైనట్లు లెక్క. అప్పటికింకా భారత్ లో ఆ సంస్థకు కార్యాలయం కూడా లేదు. 2010 జూలై లో ఫేస్ బుక్, భారత్ లో తన తొలి ఉద్యోగిని నియమించుకుంది. ఆ ఉద్యోగే భారత్ లో తొలి ఫేస్ బుక్ కార్యాలయాన్ని తెరిచారు. ఆ ఉద్యోగి ఓ మహిళ. ఆమే హైదరాబాదీ వనిత కార్తీక రెడ్డి. ఫేస్ బుక్ ఆన్ లైన్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా నియమితులైన కార్తీక రెడ్డి, ఆ తర్వాత ఫేస్ బుక్ లో భారత విభాగానికి అధినేత్రిగా ఎదిగారు. ఇదంతా కేవలం మూడేళ్ల వ్యవధిలోనే జరిగిపోయింది. అయితే ఏ గాలి వాటంగానో ఆమెకు ఈ పదోన్నతి లభించలేదు. గడచిన నాలుగేళ్లలో భారత్ లో ఫేస్ బుక్ వినియోగదారుల సంఖ్యను 10 కోట్లకు చేర్చారామె. అంటే... అప్పటిదాకా సంపన్న వర్గాలకే పరిమితమైన ఫేస్ బుక్ ను మధ్య తరగతి ప్రజల దరి చేర్చారు. యువత మధ్య సమాచార సంబంధాలను మెరుగుపరిచారు. ఆ క్రమంలోనే నిర్భయ ఘటన నాడు రైసినా హిల్స్ బారికేడ్లు విరిగాయి.

‘పరిధి’ దాటడం కార్తీక రెడ్డికి అలవాటే

నిజమే. కార్తీక రెడ్డి ఎక్కడ పనిచేసినా తన పరిధి దాటకుండా ఉండలేరు. ఎందుకంటే తాను పనిచేస్తున్న సంస్థకు ఏం కావాలన్నదే ఆమెకు ముఖ్యం మరి. ఈ నైజంతోనే కార్తీక రెడ్డి, శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో మనకు తెలిసింది కిరణ్ మజుందార్, ఇంద్రా నూయీ, చందా కొచ్చార్ తదితరులే. అయితే కార్తీక రెడ్డి అతి చిన్న వయస్సులోనే ఈ కీర్తిని సాధించారన్న విషయం చాలా మందికి తెలియదు.

అమెరికాలో సిలికాన్  గ్రాఫిక్స్ లో పనిచేస్తున్న సందర్భంగా అతి చిన్న వయసులోనే డైరెక్టర్ గా ఎదిగిన వ్యక్తిగా ఆమె వినుతికెక్కారు. ఈ కంపెనీలో ఉండగా, తనకు కేటాయించిన పనులను ఇట్టే చక్కబెట్టేసే కార్తీక రెడ్డి, కంపెనీకి లాభదాయకమైన పనులు చేసిపెట్టి, యాజమాన్యాన్ని అబ్బురపరిచారు. అంతకుముందు ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా లోనూ ఆమె విధులు నిర్వర్తించారు.

మధ్య తరగతి కుటుంబ నేపథ్యం

ఓ సాధారణ మధ్య తరగతికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఇంట జన్మించిన కార్తీక రెడ్డి, ఇంజినీరింగ్ వరకూ భారత్ లోనే చదివారు. అయితే తండ్రి ఉద్యోగ రీత్యా నాలుగేళ్లకోసారి నివాసం మార్చాల్సి వచ్చేది. ఇలా నిత్యం పట్టణాలు, నగరాలు మారుతూ సాగిన నేపథ్యమే తనలో నైపుణ్యాన్ని పెంచే దిశగా పయనింపజేసిందని కార్తీక రెడ్డి చెబుతారు. ఈ క్రమంలో ముంబై, చెన్నై తరహా మహా నగరాల్లోనే కాక దండేలీ, నాందేడ్ తరహా చిన్న పట్టణాల జీవితాన్ని చవిచూశారు. డిగ్రీ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కార్తీక రెడ్డి... ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో ఎంబీఏ చేశారు. ఆ తర్వాత సైరాకస్ వర్సిటీలో చేరి కంప్యూటర్ ఇంజినీరింగ్ లో ఎంఎస్ పట్టా సాధించారు. తద్వారా తన కుటుంబంలోనే అమెరికాలో ఇంజినీరింగ్ పట్టాతో పాటు బిజినెస్ పట్టాను సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు.

విదేశీ కంపెనీ ఉద్యోగిగా స్వదేశంలోకి...!

విద్యాభ్యాసం అనంతరం అమెరికాలోనే ఉద్యోగ జీవితం ప్రారంభించిన కార్తీక రెడ్డి... మోటోరోలాలో డైరెక్టర్ ఆఫ్ ప్రోడక్ట్ మేనేజ్ మెంట్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం కొంత కాలానికే సిలికాన్ గ్రాఫిక్స్ కు మారిన కార్తీక రెడ్డి... అందులో తన మెరుగైన పనితీరుతో యాజమాన్యాన్నే అబ్బురపరచి, అంచెలంచెలుగా ఎదిగారు. అమెరికాలో ఉద్యోగ విధుల్లో ఉన్న కార్తీక రెడ్డికి, భారత్ లోని తన కుటుంబంతో టచ్ లో ఉండే క్రమంలో ఫేస్ బుక్ పరిచయమైంది. అప్పటి నుంచే ఫేస్ బుక్ పై ఆమెకు మమకారం ఏర్పడింది. 2010 జూలై లో తాను మమకారం పెంచుకున్న ఫేస్ బుక్ లో కీలక బాధ్యతలు స్వీకరించి భారత్ లో విధుల్లో చేరిపోయారు. ఇలా ఉన్నత విద్య కోసమంటూ విదేశాలకు వెళ్లిన కార్తీక రెడ్డి, విదేశాలకు చెందిన అత్యున్నత సంస్థలో ఉన్నత పదవితో స్వదేశం చేరారు.

ఫేస్ బుక్ కు భారత్ కీలక వేదికే!

ప్రస్తుతం వినియోగదారుల సంఖ్య ఆధారంగా చూసుకుంటే... ఫేస్ బుక్ కు భారత్ అత్యంత కీలకమైనది. ఆ సంస్థకు అమెరికా తర్వాత ఎక్కువ మంది వినియోగదారులున్నది భారత్ లోనే మరి. అంతేకాదు, నెలకు 20 లక్షల మంది భారతీయులు కొత్తగా ఫేస్ బుక్ యూజర్లుగా నమోదవుతున్నారు. అంటే, ఫేస్ బుక్ కు శరవేగంగా వినియోగదారులు జతవుతున్న దేశాల్లో భారత్ ది అగ్రస్థానమే. దీనికంతటికీ కార్తీక రెడ్డి చేపట్టిన తెలివైన చర్యలు బాటలు పరిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ తరహా వేగమే నమోదైతే స్వల్ప కాలంలోనే భారత్,... ఫేస్ బుక్ కు విశ్వ కేంద్రమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఫేస్ బుక్... ఓ మాస్ మీడియానే!

ఫేస్ బుక్ లో యువత వేగానికి అనుగుణంగా పరుగులు తీసే కార్తీక రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. వారికి సరిపడే సమయం కేటాయించలేకపోతున్నానని ఆమె నిత్యం బాధపడుతూనే ఉంటారు. రెండో కూతురు పుట్టిన ఆరు వారాలకే తిరిగి విధుల్లోకి చేరాల్సి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ... ఫేస్ బుక్ పై ఉన్న మమకారంతో నాడు తానేమీ ఇబ్బంది పడలేదనీ చెబుతారు. నిత్యం వినూత్న పోకడలతో ఉరకలెత్తుతున్న ఫేస్ బుక్  ను కేవలం ఆన్ లైన్ మీడియాగా పేర్కొంటే, కార్తీక రెడ్డి ఎంతమాత్రం ఒప్పుకోరు. ఫేస్ బుక్... మాస్ మీడియాగా ఎప్పుడో రూపాంతరం చెందిందని గట్టిగానే వాదిస్తారు. ఫేస్ బుక్ మాస్ మీడియా కాకపోతే, నాటి నిర్భయ ఘటనలో అంతమంది యువత ఎలా ఉత్తేజితులవుతారన్నది ఆమె వాదన. ఇతర దేశాల సంగతి పక్కనబెడితే, భారత్ లో మాత్రం ఫేస్ బుక్ ను మాస్ మీడియాగానే పరిగణించాలన్నది ఆమె భావన. నెలకు 20 లక్షల మంది జతవుతున్న ఈ సామాజిక వెబ్ సైట్ ను, భారత యుతవ ఎప్పుడో మాస్ మీడియాగా పరిగణించేశారు. అందుకే నాడు రైసినా హిల్స్ ను రణరంగంగా మార్చారు.

‘ఫ్రీ బేసిక్స్’ దెబ్బకు... అమెరికాకు తిరుగు పయనం

భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులపై గుత్తాధిపత్యాన్ని సాధిద్దామన్న ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ దుస్సాహసానికి కార్తీక రెడ్డి దాదాపుగా బలయ్యారనే చెప్పాలి. తన ప్రణాళికలను గుట్టుచప్పుడు కాకుండా అమలు చేద్దామన్న జుకెర్ బర్గ్... వినూత్న ప్రచారానికి తెర తీశారు. అయితే దీనిపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫేస్ బుక్ కు ట్రాయ్ మొట్టికాయలేసింది.

తన పాచిక పారుతుందనుకున్న సమయంలో ఫ్రీ బేసిక్స్ కు రెడ్ సిగ్నల్ వేసిన ట్రాయ్... జుకెర్ బర్గ్ కు పెద్ద షాకే ఇచ్చింది. ఈ క్రమంలో ఫేస్ బుక్ భారత చీఫ్ గా ఉన్న కార్తీక రెడ్డిని ఆ పదవికి రాజీనామా చేయించి, తిరిగి తన ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లేందుకు జుకెర్ బర్గ్ నిర్ణయించారు. కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆమె ఫేస్ బుక్ హెడ్డాఫీసులో తిరిగి ఉద్యోగంలో చేరనున్నట్లు సమాచారం.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy