ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తక్కువ వ్యయానికే చక్కటి పరిష్కారం… వినియోగదారుల ఫోరం

Sun, May 14, 2017, 12:12 PM
Related Image

ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా ఎలాంటి పనైనా...  ఏదో ఒక వస్తువు సాయం ఉంటేనే గానీ పని పూర్తి కాని రోజులివి. అంతలా వస్తువులపై ఆధారపడిపోతున్నాం మరి. అయితే, వేలు, లక్షల రూపాయలు పోసి కొన్న వస్తువు బాగా పనిచేస్తే ఫుల్ ఖుషీ. అలా కాకుండా కొన్ని రోజులకే దాని పని అయిపోతే..? లేదా ఏదైనా కంపెనీ సేవ పేలవంగా ఉంటే..? ఆ కంపెనీ ఆట కట్టించడానికి వినియోగదారులకు అందుబాటులో ఉన్నదే వినియోగదారుల ఫోరం. 

ఎంతో ముచ్చటపడి కొని ఇంటికి తీసుకువచ్చిన ఫ్రిజ్ రెండో రోజే పడకేస్తే ఆ బాధ చెప్పలేనిది.  అలాంటి సందర్భమే ఎదురైతే ముందుగా వినియోగదారుడు సంబంధిత కంపెనీ సర్వీస్ సెంటర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అదీ వారంటీ ఉన్న ఉత్పత్తికి మాత్రమే. అనంతరం కంపెనీ సర్వీస్ ఇంజనీర్లు వచ్చి ఫ్రిజ్ లో తలెత్తిన లోపాన్ని గుర్తించి సరి చేస్తారు. సరిచేయలేనిది అయితే దాని స్థానంలో మరొకదాన్ని సమకూరుస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియ సాఫీగా సాగిపోతుంది. అలా కాకుండా కంపెనీ తనకు సంబంధం లేదన్న రీతిలో వ్యవహరిస్తే న్యాయం కోసం ఫోరాన్ని ఆశ్రయించక తప్పదు. అయితే, ఫోరాన్ని ఆశ్రయించే ముందు కంపెనీకి నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.  

కంపెనీకి నోటీసు

representational imageఫిర్యాదుకు ముందు ఆపోజిట్ పార్టీకి నోటీస్ ఇవ్వాలి. ఉత్పత్తిలో నాణ్యతలేమి, సేవాలోపాలను స్పష్టం చేయాలి. ఎలాంటి పరిష్కారం, ఎన్నిరోజుల్లోపు కోరుకుంటున్నారు? అనే విషయాలను పేర్కొనాలి. భాష హుందాగానే ఉండాలి. అగౌరవమైన పదాలు ఉపయోగించకూడదు. కంపెనీ నుంచి స్పందన రావడానికి గరిష్ఠంగా 30 రోజుల వరకు వేచి ఉంటే సరిపోతుంది. నోటీసులో పేర్కొన్న గడువులోపు సమస్యను పరిష్కరించకుంటే ఫోరాన్ని ఆశ్రయించి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేయండి. రిజిస్టర్ పోస్ట్ లో విత్ అక్నాలెడ్జ్ మెంట్ వచ్చే విధంగా నోటీసును పంపించాలి.

నోటీసు అందిన తర్వాత కంపెనీ ప్రతినిధి నుంచి ఫోన్ కాల్ రావచ్చు. లేదా మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని ఆఫర్ చేయవచ్చు. లేదా ఉచితంగా ఉత్పత్తిని అందిస్తామని, లేదా ఉచిత సర్వీసు అందిస్తామని, ఇంకా వేరే ఆఫర్లు తెలియజేయవచ్చు. కాళ్ల బేరానికి వచ్చారు కదా అని గొంతెమ్మ కోర్కెలు కోరకూడదు. కంపెనీ ఇస్తున్న ఆఫర్ జరిగిన నష్టాన్ని భర్తీ చేసే స్థాయిలో ఉంటే అంగీకారం తెలిపి ఆ సమస్యకు అక్కడితో ముగింపు పలకడమే మంచింది. ఎందుకంటే వినియోగదారుల ఫోరాలు సైతం ఉత్పత్తి వెలకు తగిన విధంగానే నష్టాన్ని ఇప్పిస్తుంటాయి. కంపెనీ ఆఫర్ నచ్చకుంటే న్యాయపోరాటం ఆరంభించాల్సిందే. 

ఫిర్యాదు సులభమే... 

representational imageఓ తెల్ల కాగితంపై విడి విడి అక్షరాలతో స్పష్టంగా అర్థమయ్యే భాషలో ఫిర్యాదు రాయవచ్చు. టైప్ చేయిస్తే మంచిది. దరఖాస్తులో సమస్య గురించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. ఉత్పత్తి లేదా సేవకు చెల్లించిన నగదు మొత్తం, ఆ ఉత్పత్తి వివరాలు, ఎక్కడ, ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎదురైన సమస్య, రెండు సంవత్సరాల తర్వాత ఫిర్యాదు చేస్తున్నట్టయితే ఆలస్యానికి గల కారణం తదితర వివరాలను అందించాలి. ఫిర్యాదుకు తోడుగా కొనుగోలుకు సంబంధించి అన్ని ఆధారాలతోపాటు ఫిర్యాదులో ఉన్న సమాచారం అంతా సరైనదేనని పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ అఫిడవిట్ ను నోటరీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. 

ఫిర్యాదుకు ఆధారంగా కావాల్సిన అన్ని రకాల పత్రాలను సిద్ధం చేసుకోవాలి. కొనుగోలుకు సంబంధించిన బిల్లు, ఇతరత్రా ఏమైనా పత్రం, వారంటీ లేదా గ్యారంటీ కార్డు, నగదు చెల్లించామని చెప్పేందుకు ఆధారం, కంపెనీ సేవా లోపాన్ని రుజువు చేసే ఆధారాలు, కంపెనీ చిరునామా (ఉత్పత్తి ప్యాక్ పై ఉంటుంది లేదా వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు)లను పేర్కొనాలి. దరఖాస్తుకు ఈ ఆధారాలన్నీ జత చేయాలి. అన్ని పత్రాలను జిరాక్స్ కాపీల రూపంలోనే సమర్పించాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. 

ఫిర్యాదులో ఫిర్యాదు దారుడి పూర్తి పేరు, చిరునామా, ఫిర్యాదు వివరాలు, అలాగే వ్యతిరేక పార్టీ పేరు, చిరునామా ఇవ్వాలి. ఫిర్యాదులో పరిహారం కోరవచ్చు. అలాగే జరిగిన నష్టం, న్యాయపరమైన ఖర్చులు, వడ్డీ కూడా చెల్లించాలని కోరవచ్చు. ఫిర్యాదును ఐదు కాపీలుగా సమర్పించాలి. మూడు కోర్టు కోసం, ఒకటి ప్రత్యర్థి పార్టీకి, ఒకటి ఫిర్యాదు దారుడికి ఉద్దేశించినది. ఇంకా అదనంగా కావాలంటే అడిగినప్పుడు ఇచ్చేందుకు ముందే సిద్ధంగా ఉంచుకోవాలి. 

ఫోరంలో ఫిర్యాదు దాఖలు చేయడానికి కావాలంటే అక్కడే ఉండే హెల్ప్ డెస్క్ సహకారం కూడా తీసుకోవచ్చు. స్వయంగానూ లేదా ప్రతినిధి లేదా వకీలు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారానూ ఫిర్యాదు పంపవచ్చు. తమకు తీరిక లేకుండా తమ తరఫున ఓ వ్యక్తిని ప్రతినిధిగా పంపాలనుకుంటే అథరైజేషన్ లెటర్ ఇవ్వాలి. 

కోర్టుకు వెళ్లి క్లర్క్ కు ఇచ్చినట్టయితే ఫిర్యాదును దాఖలు చేసుకుంటారు. మొదటి విచారణ తేదీని కూడా క్లర్క్ చెబుతారు. తర్వాత ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత కంపెనీకి ఫోరం నుంచి నోటీసులు వెళతాయి. ఫోరంలో ఫిర్యాదు దాఖలు అయిన తర్వాత సాధారణంగా నాలుగైదు సార్లు విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. విచారణ సమయంలో వాస్తవాలను విస్పష్టంగా చెబితే సరిపోతుంది. వరుసగా రెండు వాయిదాలకు హాజరు కాకపోతే కోర్టు కేసును నిలిపివేయవచ్చు. 

రుసుము వివరాలు

సాధారణంగా 20 లక్షల రూపాయల విలువ వరకు ఉన్న వస్తువులు, సేవల విషయమైతే జిల్లా వినియోగదారుల ఫోరం పరిధిలోకి వస్తుంది. 20 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు రాష్ట్ర వినియోగదారుల ఫోరం, అంతకుమించితే జాతీయ వినియోగదారుల ఫోరం పరిధిలోకి వస్తుంది. రూ.లక్ష వరకు విలువ ఉన్న కేసులకు ఫీజు కింద 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రూ.లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య అయితే 200 రూపాయలు ఫీజు, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య అయితే 400 రూపాయలు చెల్లించాలి. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు 500 రూపాయలు...  అదే విధంగా రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య విలువ ఉంటే 2,000 రూపాయలు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు 4000 రూపాయలను దరఖాస్తు రుసుం కింద చెల్లించాలి. అలాగే కోటి రూపాయలకు మించిన విలువ అయితే ఫీజు 5 వేల రూపాయలుగా ఉంది. ఈ ఫీజును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఎవరి పేరు మీద డీడీ తీయాలనే విషయాన్ని ఫోరం నుంచి తెలుసుకోవచ్చు. 

స్టేట్ కమిషన్

జిల్లా ఫోరాలు ఇచ్చిన తీర్పులపై సంతృప్తి చెందకుంటే రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లో అప్పీల్ కు వెళ్లవచ్చు. అక్కడ కూడా న్యాయం జరగలేదని భావిస్తే జాతీయ కమిషన్ ను ఆశ్రయించవచ్చు. 

సామరస్య పూర్వక పరిష్కారం దిశగా...

representational imageకంపెనీల తరఫున వాదించేందుకు లాయర్లు బాగానే వసూలు చేస్తారు. కంపెనీలు 20వేల రూపాయల ఖర్చుతో పోయే ఉత్పత్తికి కేసు విచారణల రూపంలో ఎక్కువ మొత్తం వదిలించుకోవు కదా. అందుకే అవి కాళ్ల బేరానికి వస్తాయి. అదే సమయంలో ఫోరం ద్వారా సమస్య పరిష్కారానికి సమయం పడుతుంది. విలువైన కాలాన్ని అలా హరింపజేసుకునే బదులు ముందే కంపెనీతో సంప్రదింపులు జరిపి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటే నయం కదా. 

హెల్ప్ లైన్

కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కన్జ్యూమర్ హెల్స్ లైన్ నంబర్ ను కూడా ఆశ్రయించవచ్చు. 1800-11-4000 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే తగిన వివరాలు తెలుసుకున్న అనంతరం అక్కడే ఉండే సిబ్బంది సమస్య పరిష్కారానికి తగిన మార్గదర్శనం చేస్తారు. 

X

Feedback Form

Your IP address: 67.225.212.107
Articles (Education)