ap7am logo

సమాచార హక్కు... ఈ చట్టం కింద సమాచారాన్ని ఎలా పొందచ్చు?

Sun, May 14, 2017, 12:11 PM
Related Image

భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ తొలిసారిగా అమెరికాలో జరిపిన పర్యటనకు ఖర్చు ఎంత అయిుందో తెలుసా…? అఫ్ఘానిస్థాన్ నుంచి మోదీ ఆకస్మికంగా పాకిస్థాన్  లో దిగిపోయి ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ముచ్చటించి వచ్చినందుకు అదనంగా అయిన ఖర్చు గురించి తెలుసా…? పోనీ… ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రముఖుల భద్రతా ఏర్పాట్ల ఖర్చు గురించి అయినా తెలుసా…? తెలియకుంటే తెలుసుకోండి సమాచార హక్కు సాయంతో…  

ఆర్టీసీ పండగల సమయాల్లో ప్రత్యేక బస్సులంటూ సాధారణ చార్జీలపై 50 శాతం అదనంగా బాదుతోంది. అదేమని ప్రశ్నిస్తే...  ‘డిమాండ్ ఎక్కువగా ఉంటే వస్తువుల ధర పెరిగిపోయిన తీరు’లో రద్దీ ఎక్కువగా ఉన్నందున అదనంగా బస్సులను సమకూర్చాల్సి వస్తోంది కనుక చార్జీలు పెంచాల్సి వస్తోందని ఆర్టీసీ చెబుతుంటుంది. మరి అదే విధానంలో డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు చార్జీలు తగ్గించట్లేదు కదా...? అసలు స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ సేవలు వినియోగించుకునే ప్రయాణికులకు ఉండే హక్కుల గురించి తెలుసా? 

హైదరాబాద్ నుంచి కాశీకి ప్రయాణం. రైలు రాత్రి 9 గంటలకు బయల్దేరాలి. కానీ, అర్ధరాత్రి 2 గంటలు అయింది. అప్పటి వరకూ పడిన అవస్థలకు నిర్లక్ష్యం ఎవరిది? బాధ్యత ఎవరిది? ఇలా ఆలస్యమైతే రైల్వే చట్టాలు ఏం చెబుతున్నాయి తెలుసా...?

సమాచారం ప్రతి పౌరుడి హక్కు

పై విషయాల గురించి తెలిసిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇవే కాదు ఇలాంటి విషయాలు మరెన్నో ఉన్నాయి. అడగనిదే అమ్మయినా పెట్టదంటారు. అలానే సమాచారం కావాలంటే అడగాలి. అందుకే ప్రశ్నించండి. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రభుత్వ సంస్థలు, యంత్రాంగం, పాలన, నిర్ణయాలు, జీవోలు, ప్రజా ధనం ఖర్చు, ఏదైనా కానీ పౌరుడిగా సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోండి. భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టం 2005ను పార్లమెంటులో ఆమోదించి ప్రతి పౌరుడికి సమాచారం తెలుసుకునే హక్కును ప్రసాదించింది. అప్పటికే అమల్లో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 స్థానంలో దీన్ని తీసుకువచ్చింది. అన్ని ప్రభుత్వ విభాగాలు, వాటి పాలనా తీరు, నిధుల వినియోగంతోపాటు ప్రభుత్వం నుంచి 95 శాతం మేర నిధులు పొందుతున్న ప్రైవేటు సంస్థలు, స్వచ్చంద సంస్థలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. వీటి నుంచి పౌరులు, దేశ ప్రయోజనాల రీత్యా తగిన సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చు. ప్రతి పౌరుడూ విధిగా తెలుసుకోవాల్సిన చట్టం ఇది. 

ఏ తరహా సమాచారం అడగొచ్చు?

సమాచారం అంటే ఏ రూపంలో ఉన్నది అయినా సమాచారమే. రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఆదేశాలు, నోట్స్, అధికారిక సమావేశాల వివరాలు, లాగ్ పుస్తకాలు, కాంట్రాక్టులు, నివేదికలు, నిధుల కేటాయింపు, వ్యయం తదితర విషయాలకు సంబంధించిన ఫిజికల్, ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని కోరవచ్చు. ప్రింటెడ్ కాపీలు లేదా సీడీలు, ఫ్లాపీలు, డిస్క్ ల రూపంలో సమాచారం పొందవచ్చు. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతీ ప్రభుత్వ విభాగం సాధారణ సమాచారాన్ని ప్రజలకు స్వచ్చందంగా అందించాలి. ఈ సమాచారాన్ని బోర్డుల రూపంలో, వెబ్ సైట్లలో ప్రదర్శించాలి.  ఉద్యోగులకు సంబంధించిన విధులు, బాధ్యతలు, అధికారుల వివరాలు, నియమావళి, ముఖ్యమైన గణాంకాలు తదితర సమాచారం. అలాగే చట్టంలోని సెక్షన్ 8, 9ల లో ఎలాంటి సమాచారాన్ని కోరకూడదన్న విషయాన్ని స్పష్టం చేశారు. అయితే, అదే సమయంలో అవినీతి ఆరోపణలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆరోపణలు ఉంటే తగిన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

ఏది అడగకూడదు?

ఈ చట్టం నిబంధనలకు లోబడి పౌరులు అడిగిన సమాచారాన్ని ప్రభుత్వ అధికారులు అందించాలి. అయితే, ఇందులో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అడుగుతున్నసమాచారం వల్ల ప్రభుత్వ వనరులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉన్నా, రికార్డుల భద్రతకు ముప్పు ఉన్నా అలాంటి సమాచారం ఇవ్వడానికి నిరాకరించవచ్చు. దేశ భద్రతకు, ఆర్థిక ప్రయోజనాలకు, పొరుగు దేశాలతో సంబంధాలకు విఘాతం కలిగించే సమాచారాన్ని ఈ చట్టం కింద తెలుసుకోవడానికి అవకాశం లేదు. పైగా పౌరులకు మాత్రమే ఈ సమాచార హక్కు కల్పించారు. కార్పొరేట్లు, అసోసియేషన్లు, కంపెనీలు సమాచారాన్ని అడగలేవు. 

సమాచారం ఎవరు ఇస్తారు? 

ప్రతీ ప్రభుత్వ విభాగంలోనూ ప్రజా సమాచార అధికారి (పీఐవో), సహాయ ప్రజా సమాచార అధికారి ఉంటారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ శాఖకు సంబంధించి తహశీల్దారులే ప్రజా సమాచార అధికారి (పీఐఓ) గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప తహశీల్దార్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇలానే ప్రతీ ప్రభుత్వ శాఖ, విభాగంలోనూ ఓ అధికారి తన రెగ్యులర్ విధులతోపాటు పౌరులు కోరిన సమాచారం ఇచ్చే బాధ్యతలను చూస్తుంటారు. 

అలాగే పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి, ఎంపీడీవో కార్యాలయంలో ఎక్స్ టెన్షన్ ఆఫీసర్, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి, అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్ మ్యాన్, మండల విద్యా శాఖ అధికారి కార్యాలయంలో మండల విద్యాధికారి, విద్యుత్ శాఖలో డీఈ (ఆపరేషన్స్), వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, మార్కెట్ కమిటీలో సీనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్, మునిసిపాలిటీలో మేనేజర్, కలెక్టరేట్ లో డీఆర్వో, ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ సమాచార అధికారిగా వ్యవహరిస్తారు. ఏదేనీ ఫలానా శాఖకు సంబంధించిన సమాచారం అవసరమైతే సమీపంలోని ఆయా విభాగానికి వెళ్లి సమాచార అధికారి ఎవరు? అని అడిగితే తెలియజేస్తారు. 

దరఖాస్తు విధానం

ఏ శాఖ నుంచి సమాచారం కోరుతున్నామో ఆ శాఖ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐఓ) ను ఉద్దేశిస్తూ ఇంగ్లిష్ లేదా హిందీ లేదా ప్రాంతీయ భాషల్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పోస్ట్ ద్వారా లేదా స్వయంగా వెళ్లి అందజేయవచ్చు. ఇందుకు నిర్ణీత దరఖాస్తు ఫామ్ అంటూ లేదు. సాధారణ తెల్లకాగితంపైనే రాసి సమర్పించవచ్చు. దరఖాస్తుకు రశీదు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పది రూపాయల రుసుమును ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదా నగదు రూపంలో చెల్లించాలి. అలాగే, కోరిన సమాచారాన్ని ఇచ్చేందుకు అయ్యే ఖర్చును కూడా భరించాల్సి ఉంటుంది. ప్రతి ఏ4 లేదా ఏ3 సైజు పేపర్ కు రెండు రూపాయలు, లేదా వాస్తవిక ఖర్చును భరించాలి. ఫ్లాపీ రూపంలో ఇవ్వాలంటే 50 రూపాయల చార్జీ, సీడీ 100 రూపాయలు, డీవీడీ 200 రూపాయల వ్యయం అవుతుంది. అయితే, దారిద్ర్య రేఖ కంటే దిగువన ఉన్నవారికి ఈ రుసుముల నుంచి మినహాయింపు ఉంది. ఏ భాషలో కోరితే అదే భాషలో సమాచారాన్ని ఇవ్వాలి. 

30 రోజుల్లోపు ఇవ్వకుంటే...

దరఖాస్తు అందిన 30 రోజుల్లోగా దరఖాస్తుదారుడికి కోరిన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. వ్యక్తుల ప్రాణాలు, స్వేచ్ఛకు సంబంధించిన అంశాలైతే రెండు రోజుల్లోనే సమాచారాన్ని ఇవ్వాలి. ఒకవేళ కోరిన సమాచారం చట్టంలోని నిబంధనలకు లోబడి ఇవ్వకూడనిది అయితే దరఖాస్తును తిరస్కరిస్తారు. తిరస్కరణకు గల కారణాన్ని తెలియజేస్తూ అప్పీలేట్ అథారిటీ వివరాలు కూడా ఇస్తారు. సహేతుకంగా లేదనిపిస్తే అప్పిలేట్ అథారిటీకి వెళ్లాల్సి ఉంటుంది. 

నిర్ణీత కాల వ్యవధిలోపు స్పందన లేకున్నా దాన్ని తిరస్కరణగానే భావించి అప్పీల్ కు వెళ్లవచ్చు. అలాగే, ఇచ్చిన సమాచారం పట్ల సంతృప్తిగా లేకున్నా కూడా ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ వద్దకు వెళ్లాలి. సీనియర్ ర్యాంకులో ఉన్న సీపీఐవో వద్ద 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. దీన్ని సంబంధిత అధికారి 30 నుంచి 45 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోపు పరిష్కరించకపోయినా, ఇచ్చిన ఆదేశాల పట్ల సంతృప్తిగా అనిపించకపోయినా 90 రోజుల్లోపు రాష్ట్ర, కేంద్ర సమాచార కమిషన్ వద్దకు రెండో అప్పీల్ కు వెళ్లవచ్చు. అలాగే, దరఖాస్తు స్వీకరించకపోయినా, లేదా సంబంధిత ప్రభుత్వ విభాగంలో సమాచార అధికారిని నియమించకపోయినా అప్పీల్ కు వెళ్లవచ్చు. మరిన్ని వివరాలకు http://www.rti.gov.in  వెబ్ సైట్ ను చూడగలరు. 

ఇవ్వకపోతే జరిమానాలు

కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో విఫలమైతే సంబంధిత అధికారి నిబంధనల మేరకు పరిహారం ఇవ్వాల్సి రావచ్చు. సరైన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే కమిషన్ ఈ దిశగా ఆదేశాలిస్తుంది. అంతేకాదు దరఖాస్తు తీసుకోకపోవడం, ఉద్దేశపూర్వకంగా సమాచారం అందించడంలో జాప్యం, అసంపూర్తి, తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం. ఇలా చేస్తే పీఐవోలకు రూ.25వేల వరకు జరిమానా విధించవచ్చు. క్రమశిక్షణ చర్యలకు కూడా కమిషన్ ఆదేశించవచ్చు. ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే రాష్ట్ర సమాచార కమిషన్ కు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడా న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్నిఆశ్రయించవచ్చు. తెలుగు రాష్ట్రాల రాష్ట్ర సమాచార కమిషన్ల వెబ్ సైట్ లింకులు… 

http://www.telangana.gov.in/rti

http://www.ap.gov.in/rti-acts/ap-information-commision/

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy