ap7am logo

షేర్ మార్కెట్లో పెట్టుబడులంటే... ‘బఫె’ట్టే!

Tue, Apr 19, 2016, 07:02 PM
Related Image

అవును. వారెన్ బఫెట్ కు పెట్టుబడులంటే బఫెతో సమానమే. అంతేకాదు, బఫె డిన్నర్ లో మనకిష్టం వచ్చిన వంటకాలను ఇష్టమైన మేరకు ఎలా తినేస్తామో... వారెన్ బఫెట్ కూడా పెట్టుబడులను అలాగే పెట్టేస్తారట. సింగిల్ కంపెనీ పెట్టలేదు. సింగిల్ వస్తువును తయారు చేసింది లేదు... విక్రయించిందీ లేదు. అయితే వందలాది కంపెనీలను పెట్టిన పారిశ్రామికవేత్తల కంటే అధికంగా ఆదాయాన్ని కళ్లజూశాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడిగానూ ఎదిగాడు. ఎలా సాధ్యమైంది? కేవలం షేర్ మార్కెట్ మహాత్మ్యమే అదంతా. అదేంటీ, షేర్ మార్కెట్ లో మనవాళ్లు నిండా మునిగితే... బఫెట్ ఎలా తేలాడూ అంటారా..? షేర్లు కొనేముందు, సదరు షేర్ల విలువ, ఏ తరహా మార్పులకు లోనైంది, భవిష్యత్తులో ఎలాంటి మార్పులొచ్చే అవకాశాలున్నాయి... అన్న విషయాలపై పట్టు సాధించాడు కాబట్టే, బఫెట్ చేసిన ‘బఫె’ ఆయనను ముంచేయలేకపోయింది.

కేవలం 100 డాలర్లతో మొదలు... !

వారెన్ బఫెట్ తన పెట్టుబడుల వ్యాపారాన్ని కేవలం వంద డాలర్లతో మొదలుపెట్టారట. 1954లో కేవం 100 డాలర్లతో మొదలుపెట్టిన పెట్టుబడుల బఫెట్ ఇన్వెస్ట్ మెంట్ సామ్రాజ్యం ప్రస్తుతం 66.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 1986లో 16 బిలియన్ డాలర్ల దాకా పెరిగిన పెట్టుబడులు ఆయనను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిపాయి. అయినా, బఫెట్ గురించి ప్రపంచం దృష్టి సారించింది మాత్రం 1990లలోనే. ఎందుకంటే?... 1988లో కోకా-కోలా కంపెనీకి చెందిన షేర్లను భారీగా కొనేసిన బఫెట్, భారీ స్థాయిలో లాభాలు మూటగట్టి ప్రపంచాన్నే నివ్వెరపరిచారు. తన మాటపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా షేర్ మార్కెట్ రుచి ఎలా ఉంటుందో చూపించారు. దీంతో ఒక్కసారిగా పెట్టుబడుల రంగంలో బఫెట్... ఓ హీరోగా అవతరించారు. ఈ నేపథ్యంలో కేవలం పెట్టుబడులు పెట్టేందుకే కార్యాలయాలు తెరిచేలా పెద్ద సంఖ్యలో వ్యక్తులు, సంస్థలకు మార్గదర్శిగా నిలిచారు.

పెట్టుబడి పెట్టే ముందు యజమానిగా పరిశీలన

ఏదేనీ కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో ముందుగా సదరు కంపెనీ యాజమాన్య హక్కులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎంతమేర వాటా ప్రమోటర్ల చేతిలో ఉంది? గడచిన కొన్నేళ్లలో సంస్థ పనితీరు ఎలా ఉంది? అన్న విషయాలపై కూలంకషంగా పరిశీలన చేయాల్సిందేనని చెబుతారు బఫెట్. అలా చేయని పక్షంలో మన పెట్టుబడులపై మనకే ఆసక్తి లేనట్లేనని ఆయన తేల్చేస్తారు. పుట్టుపూర్వోత్తరాలు తెలియకుండా ఏదేనీ కంపెనీలో ఎలా పెట్టుబడులు పెడతారంటూ ఆయన ప్రశ్నించే తీరులో ఆయన నిశిత పరిశీలన ఇట్టే అర్థమైపోతుంది. మనం పెట్టుబడి పెట్టనున్న కంపెనీకి మనమే యజమానులమన్న రీతిలో యోచిస్తే తప్పించి, మన పెట్టుబడులు లాభాలు తెచ్చిపెట్టవు. ఈ విషయంలో ఏమాత్రం అలక్ష్యం ప్రదర్శించినా... లాభాల మాట అటుంచి, ఉన్నదంతా కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవక తప్పదు మరి.

బఫెట్ చేతులూ కాలాయట!

ప్రపంచంలోనే పేరెన్నికగన్న స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుగా ఖ్యాతిగాంచిన వారెన్ బఫెట్ కూడా అనుకోని రీతిలో నష్టాలు చవిచూశారట. అయితే ఆ అనుభవం పెట్టుబడిదారుగా మారిన తర్వాత కాదులెండి. అసలు పెట్టుబడిదారుడిగా మారకముందు బఫెట్, 1954లో బెంజమిన్ గ్రాహం అనే స్టాక్ మార్కెట్ బ్రోకర్ వద్ద శిక్షణ పొందిన తర్వాత ఇన్వెస్ట్ మెంట్ రంగంలోని ఓ కంపెనీలో భాగస్వామ్యం తీసుకోవడంతో పాటు దానికి మేనేజర్ గానూ వ్యవహరించారు.

 1965 వరకు అందులోనే కొనసాగిన బఫెట్... అక్కడ ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బయటకొచ్చేశారు. ఆ తర్వాత నష్టాల్లో మునిగిపోయిన బెర్క్ షైర్ హ్యాత్ వేస్ అనే టెక్స్ టైల్ కంపెనీని కొనుగోలు చేశారు. బెర్క్ షైర్ ను నడుపుతూనే 1973-74 మధ్య నెలకొన్న ఆర్థిక మాంద్యంతో గిలగిల్లాడుతున్న పలు కంపెనీలను అతి తక్కువ ధరలకే చేజిక్కించుకున్నారు. ఈ చతురత బఫెట్ కు బాగా కలిసి వచ్చింది. ప్రపంచంలోని అన్ని మార్కెట్లు ఆటుపోట్లకు లోనైన సందర్భంలోనూ బఫెట్ ఇబ్బందులు పడకపోవడానికి కూడా ఈ అడుగు ఆయనను బాగా కాపాడింది.

36 ఏళ్లుగా 22.3 శాతం చొప్పున రాబడులు

ప్రధానంగా దీర్ఘకాలిక పెట్టుబడులపై కన్నేసిన బఫెట్... తెలివిగా అడుగులేశారు. జాగ్రత్తతో పెట్టిన ఈ పెట్టుబడులు ఆయనకు 22.3 శాతం మేర రాబడులను తీసుకొచ్చాయి. ఈ స్థాయిలో రాబడులు రావడం కూడా గొప్పేనా అనుకోకండి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 36 ఏళ్ల పాటు ఈ స్థాయిలోనే ఆయన లాభాలను స్వీకరించారు. వరుసగా 36 ఏళ్ల పాటు ఒకేరీతిన లాభాలు రావడమనే విషయం దాదాపుగా అసాధ్యమే. అయితే దూరదృష్ఠితో బఫెట్ పెట్టిన పెట్టుబడులు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. క్రమానుగతంగా వచ్చి చేరుతున్న లాభాలతో బర్క్ షైర్ హ్యాత్ వేస్ కేవలం పెట్టుబడులపైనే దృష్టి కేంద్రీకరించింది. ఇతర వ్యాపకాలను పక్కనపెట్టేసిన బఫెట్, కేవలం వివిధ సంస్థల పనితీరు తెలుసుకోవడం, వాటిలో తనకు అవకాశాలు ఎలా ఉన్నాయన్న విషయంపై అధ్యయనం చేయడమే పనిగా పెట్టుకుని ముందుకుపోతున్నారు.

900 శాతం మేర లాభాలు సాధ్యమేనా?

ఎక్కడైనా 100 శాతం, 200 శాతం లాభాలు అనడం చూశాం కాని, ఏకంగా 900 శాతం లాభాలు కళ్లజూశామా..? విన్నామా..? కాని బఫెట్ ఈ తరహా లాభాలను చవిచూశారు. ఏ ఒక్క ఏడాదో కాదు, వరుసగా 11 ఏళ్ల పాటు. ఇంటర్ పబ్లిక్ అనే వ్యాపార ప్రకటన సంస్థలో ఈ స్థాయి లాభాలను ఆయన కళ్లజూశారు. అంతేకాదు, తన పెట్టుబడుల దిశదశలనే మార్చేసిన కోకా-కోలా కంపెనీలో పెట్టిన పెట్టుబడులు వరుసగా 12 ఏళ్ల పాటు 800 శాతం మేర రాబడులను అందించాయి. ఈ రెండు సంస్థల్లో పెట్టిన పెట్టుబడులే బఫెట్ ను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేశాయి. ఈ రాబడులతో తన కంపెనీ ద్వారా పెట్టుబడి పెట్టిన వారిని కూడా బఫెట్, ధనవంతులుగా మార్చేశారు. 

బఫెట్ మాట...బంగారు మాటే!

తెలివైన పెట్టుబడులతో విలువైన రాబడులు రాబట్టే బఫెట్ చెప్పే బంగారం లాంటి మాటేంతో తెలుసా..? ‘‘డబ్బును కోల్పోవద్దు.. ఆ విషయాన్ని మరువొద్దు!’’ ఇవి రెండు మాటలుగా వినిపిస్తున్నా, ఈ రెండింటి లక్ష్యం ఒక్కటే కదా. దీనినే నిత్యం ఆయన వల్లె వేస్తుంటారు. తనవద్ద పనిచేస్తున్న సిబ్బందికైనా, తన వద్దకు సలహాల కోసం వచ్చేవారికైనా ఈ సూత్రాన్నే ఆయన భోధిస్తుంటారు. తొలుత ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలా అంటూ తిరిగిన బఫెట్, ఆ తర్వాతి దశలో మా కంపెనీల్లో పెట్టండంటూ యాజమాన్యాలతో చెప్పించుకునే స్థాయికి ఎదిగారు. అయితే పెట్టుబడుల కోసం తన వద్దకు వచ్చే యాజమాన్యాలను ఆయన ఓ విషయంపై సునిశితంగా పరిశీలిస్తారు. వాటాదారుల పెట్టుబడులను కూడా తమ పెట్టుబడులను చూసుకున్నట్లే, సదరు యాజమాన్యాలు పరిగణిస్తాయా, లేదా? అన్నదే ఆ విషయం. అంతమాత్రం జాగ్రత్త లేకుంటే తాను వల్లించే బంగారు మాటను ఇతరులకు చెప్పలేరుగా మరి.

డీసీఎఫ్ మంత్రానికి బఫెట్ ప్రచారం

డిస్కౌంట్ క్యాష్ ఫ్లో...క్లుప్తంగా డీసీఎఫ్ గా పిలిచే మంత్రాన్ని అప్పుడెప్పుడో రాబర్ట్ హ్యాగ్ స్ట్రామ్ ప్రతిపాదించారు. అది తెలిసిన వారు చాలా తక్కువ మందే. అయితే బఫెట్ పెట్టుబడుల రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఏకంగా గిన్నిస్ బుక్ కూడా దీనిని గుర్తించాల్సి వచ్చింది. అంటే, బఫెట్ దీనికి ఇంతగా ప్రచారం చేసిపెట్టారన్నమాట. ప్రచారం చేయడమనేకంటే, దాని ఆధారంగానే తాను భారీ రాబడులు సాధించానని బఫెట్ ప్రపంచానికి వెల్లడించడం, రాబర్ట్ సిద్దాంతానికి భారీ ప్రచారాన్ని చేసి పెట్టింది. ఈ సూత్రం ప్రకారం లెక్కలేసుకునే బఫెట్ తన పెట్టుబడికి ఎంతమేర లాభం వస్తుందన్న విషయాన్ని పెట్టుబడి పెట్టే ముందే తేల్చేసుకుంటారు. అందుకే విచ్చలవిడిగా మార్కెట్ లోకి వచ్చి పడుతున్న బఫెట్ పెట్టుబడుల దరిచేరేందుకు నష్టాలు కూడా జంకుతాయట!

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy