ap7am logo

యువ కెరటాల అద్భుత సృష్టి... ఫ్లిప్ కార్ట్!

Tue, Apr 19, 2016, 07:25 PM
Related Image

యువ కెరటాల అద్భుత సృష్టి... ఫ్లిప్ కార్ట్!

ఈ-కామర్స్... పెను సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్. అప్పటికే అమెరికాకు చెందిన ‘అమెజాన్’ విశ్వవ్యాప్తంగా పలు దేశాల్లో గట్టి పునాదులు వేసుకుంది. అందులో భారత్ కూడా ఒకటి. ఇక రోజుకో కొత్త ఐడియాతో దూసుకొస్తున్న కుర్రకారు... ఈ రంగంలో నిత్యం పోటీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో కేవలం కాస్తంత అనుభవంతోనే రంగ ప్రవేశం చేసిన ఇద్దరు కుర్రాళ్లు... దేశీయ ఈ-కామర్స్ రంగంలో సత్తా చాటి, కొత్త పుంతలు తొక్కించారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలు కూడా అచ్చెరువొందేలా దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతున్నారు. కొత్తగా ఎన్ని సంస్థలు పుట్టుకొస్తున్నా... ఆ కుర్రాళ్ల ముందు నిలబడటం సాధ్యం కావడం లేదు.  సదరు కుర్రాళ్ల నిత్య నూతన చర్యలకు జైకొడుతున్న వినియోగదారులు వారిని వదిలిపోవడం లేదు. వారే 'ఫ్లిప్ కార్ట్' వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్!


బన్సల్ ద్వయం... బంధువులేమీ కాదు

పేర్ల చివరన బన్సల్ ట్యాగ్ తో ఇద్దరూ కవలలో, సోదరులే అయి ఉంటారనుకుంటారంతా. సోదరులు కాదు కదా, అసలు బంధువులు కూడా కాదు వీరిద్దరు. ఇద్దరి కుటుంబాలదీ వేర్వేరు నేపథ్యమే. అయితే పుట్టి పెరిగింది మాత్రం ఇద్దరూ ఛండీఘడ్ లోనే. పాఠశాల విద్యను పూర్తి చేసింది ఒకే పాఠశాలలోనే. అయినా, ఒకరికి ఒకరు తెలియదు. అయితే కంప్యూటర్ ఇంజినీరింగ్ విద్యనభ్యసించే క్రమంలో ఇద్దరూ ఐఐటీ ఢిల్లీకే వెళ్లారు. ఒకే కళాశాల, ఒకే విభాగంలో చదువుతున్న నేపథ్యంలో అక్కడ వారిమధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కూడా ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకునే వరకే. మళ్లీ ఎవరి దారి వారిదే!

 సచిన్ టెక్ స్పాన్ లో చేరితే, బిన్నీ సర్నాఫ్ లో చేరాడు. ఆయా సంస్థల్లో ఏడాది కాలం పనిచేసిన ఇద్దరు, ఈసారి ఒకే కంపెనీ అమెజాన్.కామ్ లో చేరారు. ఇక్కడే వీరి మధ్య అసలు స్నేహం మొదలైంది. అక్కడే వీరి వ్యాపార సామ్రాజ్యానికి బీజం పడింది. ఇన్ని సారూప్యతలున్నా కూడా వీరు అమెజాన్ లో చేరేదాకా అసలు పూర్తి స్థాయిలో కలవనే లేదంటే ఆశ్చర్యమే మరి.

రూ.4 లక్షల పెట్టుబడితో మొదలు

ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ రోజుకు రూ.1.5 కోట్ల విలువ చేసే వస్తువులను తయారీదారుల నుంచి వినియోగదారులకు చేరవేస్తోంది. అయితే దీనిని 2007లో ప్రారంభించేందుకు బన్సల్ మిత్ర ద్వయం కేవలం రూ.4 లక్షలను వెచ్చించిందట. అమెజాన్.కామ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న బన్సల్ మిత్రులు, అంత మంచి ఉద్యోగాలను వదిలేసి వచ్చేశారంటే, వారిపై వారికి ఎంత నమ్మకమో మరి. అప్పటికే అమెజాన్.కామ్... ఈ-కామర్స్ విభాగంలో బాగానే రాణిస్తోంది. ఆ కంపెనీలో పనిచేసిన అనుభవం, వీరి బుర్రలకు పదును పెట్టినట్లే ఉంది. ముందూవెనుకా చూడకుండా బయటకు వచ్చేశారు. జేబులో ఉన్న చిన్నమొత్తంతోనే వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే అతిస్వల్ప కాలంలోనే భారీ విజయాలను నమోదు చేస్తామన్న పూర్తి స్థాయి నమ్మకంతోనే వారు వడివడిగా అడుగులు వేశారు. అనుకున్నదానికంటే పెద్ద విజయాలను, అతి తక్కువ వ్యవధిలోనే సాధించారు.

కంపెనీ ఏర్పాటులోనే వైవిధ్యం

అసలు ఫ్లిప్ కార్ట్... భారత్ కేంద్రంగానే పనిచేస్తోందా? అంటే కాదనే సమాధానమే వస్తుంది. అయితే ఈ కంపెనీ సింగపూర్ కు చెందినది. కార్యాలయం సింగపూర్ లో, కార్యకలాపాలు భారత్ లోనా? అనే కదా అనుమానం. అదంతే. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహంపై పరిమితులున్న నేపథ్యంలో బన్సల్ మిత్రులు ఈ ఉపాయాన్ని ఎంచుకున్నారు. అయితే కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తకుండా భారత్ లోని ఓ థర్డ్ పార్టీ కంపెనీ సహాయాన్ని తీసుకున్నారు. దీనిపై ఓ సందర్భంలో ఫ్లిప్ కార్ట్ పై ఆరోపణలు వెల్లువెత్తినా, 2012లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో అవరోధాలన్నీ సమసిపోయాయి.

కంపెనీ నిర్వహణలో కొనుగోలుదారుడి విశ్వాసాన్ని చూరగొనడాన్ని ప్రధాన అంశంగా చేసుకున్న బన్సల్ ద్వయం, అందులో అనతి కాలంలోనే విజయం సాధించారు. ఇక ఆపై వెనుదిరిగి చూడాల్సిన అవసరం వారికి రాలేదు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ను విశ్వసించిన భారతీయులు 2.4 కోట్ల మంది ఉన్నారు. వీరంతా వారికి కావాల్సిన ప్రతి వస్తువును దాదాపుగా ఫ్లిప్ కార్ట్ నుంచే కొనుగోలు చేస్తారు. నానాటికీ పెరుగుతున్న వినియోగదారుల సేవల కోసం ఫ్లిప్ కార్ట్ కూడా తన సిబ్బందిని పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో 33 వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు.

ఆదిలోనే టేకోవర్ల సాహసం

చిన్న వయసులోనే వ్యాపారం ప్రారంభించిన బన్సల్ మిత్రులు... కంపెనీ నిర్వహణలో ఏమాత్రం తొట్రుపాటు లేకుండానే నడిపిస్తున్నారు. సంస్థ ప్రారంభమైన మూడేళ్లకు 2010లో ‘వియి రీడ్’ అనే సోషల్ నెట్ వర్క్ సైట్ ను కొనుగోలు చేసిన మిత్రులు, ఆ మరుసటి ఏడాదే ‘మైమ్ 360’ పేరిట నడుస్తున్న డిజిటల్ ఆధారిత కంపెనీని చేజిక్కించుకున్నారు. అదే ఏడాది ‘చక్ పక్. కామ్’ పేరిట ఏర్పాటైన బాలీవుడ్ వార్తల సైట్ ను కొనేశారు. 2012లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్న ‘లెట్స్ బై.కామ్’ ను కొనుగోలు చేశారు. దీంతో లెట్స్ బై మూతపడగా, ఆ సైట్ లోని వినియోగదారులు గంపగుత్తగా ఫ్లిప్ కార్ట్ కు మారిపోయారు. ఈ కంపెనీని చేజిక్కించుకునేందుకు బన్సల్ ద్వయం 25 మిలియన్ డాలర్ల   మేర నిధులను వెచ్చించింది. ఇక గతేడాది ‘మింత్రా. కామ్’ ను కొనుగోలు చేసింది. ఫ్యాషన్ ఉత్పత్తులను విక్రయించే మింత్రా కొనుగోలు కోసం ఫ్లిప్ కార్ట్, రూ.200 కోట్లను వెచ్చించింది. అయితే మింత్రా కొనుగోలుతో ఫ్లిప్ కార్ట్ వ్యాపారం బిలియన్ డాలర్లను దాటిపోయి, ఈ-కామర్స్ విభాగంలో భారత్ లోనే అత్యధిక మొత్తంలో వ్యాపారం సాగిస్తున్న సంస్థగా ఆవిర్భవించింది.

ఆన్ లైన్ మార్కెట్ లో సరికొత్త పంథాకు నాంది!

అప్పటిదాకా ఆన్ లైన్ లో వస్తువులు కొనాలంటే... క్రెడిట్ కార్డుండాలి. ఇంటర్నెట్ వినియోగం అప్పుడప్పుడే ఊపందుకుంటున్న నేపథ్యంలో మోసాలు కూడా భారీగానే జరిగేవి. దీంతో నెటిజన్లు ఆన్ లైన్ షాపింగ్ పై అంతగా ఆసక్తి చూపేవారు కారు. అయితే ఫ్లిప్ కార్ట్ దీనినే ప్రధానాస్త్రంగా తీసుకుని ముందుకు సాగిందని చెప్పొచ్చు. తమ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన వస్తువును అందుకున్న తర్వాతే వినియోగదారుడు డబ్బు చెల్లించే విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో వినియోగదారులు కూడా ఫ్లిప్ కార్ట్ పై నమ్మకం పెంచుకున్నారు. కొత్తగా మరింతమందీ పెంచుకుంటున్నారు. దీంతో ఈ సైట్ కు నానాటికీ వినియోగదారుల సంఖ్య శరవేగంగా పెరిగిపోతోంది.

ప్రతి భారతీయుడు ఆన్ లైన్ కొనుగోళ్లు జరిపేదాకా తాము విశ్రమించబోమని బన్సల్ మిత్రులు దృఢ విశ్వాసంతో చెబుతున్నారు. వీరి దూకుడు చూస్తుంటే, అనతికాలంలోనే వీరు తమ లక్ష్యాన్ని చేరుకుంటారనిపించక మానదు. ఈ క్రమంలో కొత్తగా పలు సరికొత్త తరహా పథకాలతో దూసుకెళుతోంది. 30 రోజుల వ్యవధిలో వస్తు మార్పిడి, ఆన్ లైన్ ఈఎంఐ, ఫ్రీ షాపింగ్ తదితర వినూత్న పథకాలతో పాటు క్యాష్ ఆన్ డెలివరి, ఫ్లిప్ కార్ట్ విజయానికి సోపానంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

పెట్టుబడుల ప్రవాహం

కేవలం రూ.4 లక్షల పెట్టుబడితో ఫ్లిప్ కార్ట్ ను నెలకొల్పిన బన్సల్ ద్వయం... కంపెనీని పెట్టీపెట్టగానే టేకోవర్ల దిశగా అడుగులు ఎలా వేయగలిగింది? నిధుల లభ్యత లేనిదే, అది సాధ్యం కాదు కదా? అయితే బన్సల్ వ్యాపార ప్రణాళికలు చూసిన వారు ఇట్టే నోరెళ్లబెట్టేయడం ఖాయం. అవును మరి. ప్రపంచంలోనే పెట్టుబడుల్లో విఖ్యాతి గాంచిన వారంతా బన్సల్ మిత్రుల కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు బారులు తీరారు మరి. ఫ్లిప్ కార్ట్ లో పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో సింగపూర్ కు చెందిన జీఐసీ, యాక్సెల్ పార్టనర్స్, డీఎస్టీ గ్లోబల్, ఐకోనిక్ కేపిటల్, మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్, సోఫినా తదితర దిగ్గజాలున్నాయి. ఈ కారణంగానే ఫ్లిప్ కార్ట్ కు ఇప్పటిదాకా నిధుల కొరతనే సమస్యే తలెత్తలేదు. క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిన ఫ్లిప్ కార్ట్ కు వస్తువులు ఇచ్చేందుకు తయారీదారులు కూడా వెనుకంజ వేయకపోవడానికి కారణమిదే. అయితే పెట్టుబడులు పెట్టినంత మాత్రాన, వ్యాపార నిర్వహణలో మేమూ పాలుపంచుకుంటామనే పెట్టుబడిదారులకు బన్సల్ ద్వయం నిర్ద్వంద్వంగా నో చెప్పేస్తారట.

అవార్డులు, రివార్డులు బోలెడన్ని!

వినూత్న ప్రణాళికతో శరవేగంగా దూసుకెళుతున్న ఫ్లిప్ కార్ట్... తన వ్యవస్థాపకులకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెట్టింది. కంపెనీ ప్రారంభించిన నాలుగేళ్లలోనే దేశ వాణిజ్య రంగాన్నే కాక ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల దృష్టిని ఆకట్టుకున్న బన్సల్ మిత్ర ద్వయం, మరో మూడేళ్లలోనే భారత్ లో ప్రఖ్యాత వ్యాపార వేత్తలుగా ఎదిగారు. ఈ క్రమంలో 2011లో మూడు ప్రతిష్ఠాత్మక అవార్డులను కైవసం చేసుకున్న బన్సల్ మిత్రులు, 2012లో ఆరు అవార్డులను పొందారు. 2013లో మూడింటితో సరిపెట్టుకున్న వీరు, గతేడాదిలో నాలుగు అవార్డులను గెలుచుకున్నారు. ఈ క్రమంలో భారత్ లో మెరుగైన భవిష్యత్తు ఉన్న కంపెనీల్లో ఫ్లిప్ కార్ట్... తొలి పది స్థానాల్లో స్థానం సంపాదించింది. అంతేకాదు... ఎక్కడ విద్యార్థుల చిన్న మంద కనిపించినా, వారి సంభాషణల్లో ఒక్కసారైనా ఫ్లిప్ కార్ట్ ప్రస్తావన దొర్లి తీరాల్సిందే. విద్యార్థులతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకూ బన్సల్ మిత్రులు మార్గదర్శకులుగా నిలిచారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy