ap7am logo

బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీకి ఎన్నో మార్గాలు!

Sun, May 14, 2017, 12:10 PM
Related Image

రెండు బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీలకు పలు రకాల పేమెంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో తక్షణమే నగదు పంపాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఆ సందర్భంలో ఏ పేమెంట్ సర్వీసు అనువైనదన్న విషయం తెలిసి ఉండాలి. NEFT, RTGS, IMPS, ఏటీఎం ఇలా పలు రకాల పేమెంట్ విధానాలలో ఏది ఎలా పనిచేస్తుంది, చార్జీలు, పట్టే సమయం తదితర వివరాలు తెలుసుకుందాం.

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ (ఎన్ఈఎఫ్ టీ), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ (RTGS) ఈ రెండూ ఎలక్ట్రానిక్ క్లియరింగ్  విధానం (ECS)లో భాగమే. ఈ విధానంలో ఇంటర్నెట్ బ్యాకింగ్ ద్వారా అదే బ్యాంకులోని మరో ఖాతా లేదా వేరొక బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసుకోవచ్చు. కంపెనీలతోపాటు వ్యక్తులు కూడా ఈ విధానంలో నగదు పంపుకోవచ్చు. ఎన్ఈఎఫ్ టీ, ఆర్టీజీఎస్ విధానంలో నగదు పంపుకోవడానికి ఏ ఖాతాకు జమ చేయాలనుకుంటున్నారో ఆ ఖాతా నంబర్, ఖాతాదారుని పేరు, బ్యాంకు పేరు, శాఖ, శాఖ కోడ్ నంబర్, ఐఎఫ్ఎస్ సీ వివరాలు ఉండాలి. 

NEFT

ఎన్ఈఎఫ్ టీ విధానంలో నగదు బదిలీకి కనిష్ట  పరిమితులు లేవు. రూపాయి మొదలుకొని లావాదేవీలు సాధ్యమే. ఈ విధానంలో నగదు ట్రాన్స్ ఫర్ చేసిన వెంటనే లావాదేవీ పూర్తి కాదు. నగదును బ్యాచిల వారీగా పంపుతారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు గంటకోసారి చొప్పున మొత్తం 11 బ్యాచుల్లో నగదు బదిలీలు జరుగుతుంటాయి. ఉదాహరణకు 11.10 గంటలకు నగదు బదిలీ చేస్తే... అది 12 గంటల లావాదేవీలో భాగంగా అవతలి వైపు ఖాతాకు జమ అవుతుంది. ఇక శనివారం అయితే, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఎన్ఈఎఫ్ టీ లావాదేవీలు జరుగుతాయి. ఈ సమయం తర్వాత ఎన్ఈఎఫ్ టీ విధానంలో డబ్బులు పంపాలనుకున్నా... పంపినా... అవి మరుసటి రోజు ప్రారంభ బ్యాచిలో పూర్తవుతాయి. 

RTGS

ఆర్టీజీఎస్ లో మాత్రం బ్యాచిల వారీ కాకుండా ఎప్పటికప్పుడు లావాదేవీలు పూర్తవుతుంటాయి. అంటే ఈ విధానంలో నగదును తక్షణమే బదిలీ చేసుకోవడానికి వీలుంటుంది.సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, శనివారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఆర్టీజీఎస్ లో వెంటనే నగదు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. కనీసం 2 లక్షల రూపాయల లావాదేవీ అయి ఉండాలి. గరిష్ట పరిమితి కొన్ని బ్యాంకుల్లోనే ఉంది. 

చార్జీలు

రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు... ఎన్ఈఎఫ్ టీ లావాదేవీల్లో లక్ష రూపాయల వరకు 5 రూపాయలకు మించి చార్జీ వసూలు చేయరాదు. అలాగే ఒకటి నుంచి రెండు లక్షల వరకు 15 రూపాయలు, 2 లక్షలకు పైబడితే 25 రూపాయలు మాత్రమే చార్జీగా తీసుకోవాలి. దీనికి స్వల్పంగా సర్వీసు చార్జీ ఉంటుంది. ఆర్టీజీఎస్ లావాదేవీలకు 2 నుంచి 5 లక్షల రూపాయల మధ్య లావాదేవీలకు 25 రూపాయలు, అంతకు పైబడిన లావాదేవీలకు 50 రూపాయలు చార్జీ ఉంటుంది. 

నగదు జమ కాకపోతే...?

లావాదేవీ ఫెయిల్ అయితే... అంటే అవతలి వైపు ఖాతా నంబర్ లో తప్పున్నా... ఖాతా మనుగడలో లేకపోయినా ఇలాంటి పలు కారణాలతో లావాదేవీ సక్సెస్ కాకపోతే ఆ నగదు మొత్తాన్ని సంబంధిత బ్యాంకు తిరిగి లావాదేవీ నిర్వహించిన బ్యాంకుకు వెనక్కి పంపేస్తుంది. అప్పుడు బ్యాంకు ఆ మొత్తాన్ని తమ ఖాతాదారుడి ఖాతాలో జమ చేస్తుంది. 

ఇమీడియెట్ పేమెంట్ సర్వీస్ (IMPS)

మొబైల్ ఫోన్ల ద్వారా చేసుకునే తక్షణ నగదు బదిలీ సేవ ఇది. వారంలో అన్ని రోజులూ అన్నివేళలా ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఎన్ఈఎఫ్ టీ, ఆర్జీజీఎస్ రెండు సేవల్లోనూ ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్షణమే నగదు బదిలీకి అవకాశం లేదు. ఆ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ఐఎంపీఎస్ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానంలో కనిష్ట పరిమితి లేదు. 10వేల రూపాయల వరకు 2.5 రూపాయలు... 10 నుంచి లక్ష రూపాయల వరకు 5 రూపాయలు, లక్ష నుంచి రెండు లక్షల రూపాయల్లోపు నగదుకు 15 రూపాయల చార్జీ, దానిపై సర్వీసు చార్జీ విధిస్తారు. రూ.2 లక్షలకు మించితే రూ.25 సేవా చార్జీ ఉంటుంది.  

representation image

ఏటీఎం నుంచి కూడా

ఏటీఎం కేంద్రాల నుంచి అదే బ్యాంకులోని మరో ఖాతాదారుడికి లేదా మరొక బ్యాంకు ఖాతాదారుడికి నగదు బదిలీ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కాగా, రెండు బ్యాంకుల మధ్య నగదు బదిలీ సేవను యెస్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, కెనరా, ఆంధ్రా బ్యాంకులు అందిస్తున్నాయి. ఎస్ బీఐ ఇతర బ్యాంకులు తమ బ్యాంకు ఖాతాల పరిధిలోనే ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడం చాలా సులభం. నగదు ఎవరికైతే పంపాలనుకుంటున్నామో... వారి 16 అంకెల డెబిట్ కార్డు నంబర్ ను తెలుసుకోవాలి. ఉదాహరణకు ఎస్ బీఐ ఖాతాదారుడు ఏటీఎం సెంటర్ కు వెళ్లి కార్డును స్వైప్ చేసిన తర్వాత  ట్రాన్స్ ఫర్ ఆప్షన్ ఎంపిక చేసుకుకోవాలి. పిన్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత కార్డు టు కార్డు ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత నగదు పంపుతున్న బెనిఫీషియరీ డెబిట్ కార్డు నంబర్ ను నమోదు చేయాలి. తర్వాత నగదు మొత్తాన్ని టైప్ చేసి, సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ లలో ఏదో కన్ ఫర్మ్ చేస్తే లావాదేవీ పూర్తయిపోతుంది. బ్యాంకులు ఈ విధానంలో 15 వేల రూపాయల వరకు బదిలీకి అనుమతిస్తున్నాయి. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy