ap7am logo

భారత బయో టెక్నాలజీ ఊపిరి...కిరణ్ మజుందార్ షా!

Mon, Apr 11, 2016, 01:13 PM
Related Image

5 వేల మంది శాస్త్రవేత్తలు...వారిలో 2 వేల మంది మహిళలే. ఔషధ పరిశోధన రంగంలో విశేష ప్రతిభా పాటవాలు కలిగిన భారత యువ శాస్త్రవేత్తలు క్రమంగా విదేశాల నుంచి తిరుగు బాట పట్టారు. భారత్ లో అవకాశాలు లేక విదేశం వెళ్లిన వీరు, తిరిగి వెనుదిరిగి రావడానికి కారణం 'బయోకాన్'. 30 ఏళ్ల అవిశ్రాంత కృషి, మొండి పట్టుదలతో కిరణ్ మజుందార్ షా అడుగేయకుంటే, ఇప్పటికీ మన శాస్త్రవేత్తలు ఇంకా విదేశీ బాటలోనే నడిచేవారేమో. అవును మరి, భారత్ లో బయోటెక్నాలజీ రంగంలో తొలి కంపెనీని నెలకొల్పి, ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థగా తీర్చిదిద్దారు షా. సామాన్యుడికి కూడా వైద్య సేవలను దగ్గర చేసేందుకు షా వేసిన అడుగులు, పెను మార్పులకు దారి తీశాయి.., బయోటెక్నాలజీ రంగంలో మరిన్ని కార్పొరేట్ సంస్థలు అడుగుపెట్టేందుకు దోహదం చేశాయి.

మద్యం తయారీ రంగ నిపుణురాలు షా..!

వైద్య రంగంలో ప్రవేశించాలనుకున్న కిరణ్ మజుందార్ షా, అనుకోకుండా జీవ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కూడా 1975లో మరో కొత్త కోర్సు, మద్యం తయారీ (బ్రూవరీ)లో మాస్టర్స్ డిగ్రీ చేతబట్టారు. తద్వారా మద్యం తయారీ రంగంలో మాస్టర్స్ డిగ్రీ చేతబట్టిన తొలి భారతీయురాలుగానూ షా చరిత్రపుటలకెక్కారు. మాస్టర్ డిగ్రీ చేసిన మద్యం తయారీ రంగంలోనే కొంతకాలం పాటు వివిధ సంస్థల్లో ఉద్యోగం చేశారు. మూడేళ్ల వ్యవధిలో ఆరు కంపెనీలన్నట్లు సాగింది, ఆమె ఉద్యోగ ప్రస్థానం. ఈ మూడేళ్ల కాలంలో కార్ల్ టన్ అండ్ యునైటెడ్ బ్రూవరీస్, బారెట్ బ్రదర్స్, జుపిటర్ బ్రూవరీస్ లిమిటెడ్, స్టాండర్డ్ మాల్టింగ్ కార్పోరేషన్ తదితర కంపెనీల్లో పని చేశారు. ఇక బ్రూవరీ రంగంలో తనకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించవని భావించిన షా, 1978లో బయోకాన్ బయోకెమికల్స్ లో మేనేజ్ మెంట్ ట్రైనీగా చేరారు. అక్కడే ఆమెలోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్త నిద్ర లేచారు.

కోల్ కతాలో పుట్టి, బెంగళూరులో స్థిరపడ్డారు

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు చెందిన ఓ మార్వాడీ కుటుంబంలో 1953, మార్చి 23న జన్మించిన కిరణ్ మజుందార్ షా, ఆ తర్వాత కుటుంబంతో పాటు బెంగళూరు వెళ్లారు. పాఠశాల విద్యతో పాటు ఉన్నత, కళాశాల విద్య కూడా బెంగళూరులోనే ముగించారు. విద్యాభ్యాసం ముగియగానే ఉద్యోగం నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లిన షా, ఆ తర్వాత తిరిగి బెంగళూరు వచ్చారు. తదనంతరం బెంగళూరును విడిచివెళ్లాల్సిన అవసరం ఆమెకు రాలేదు. ఎందుకంటే, ఆమె భారత్ గర్వించదగ్గ కంపెనీని నిర్మించారు. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బయోకాన్ లిమిటెడ్ లో 6 వేల మంది పనిచేస్తున్నారు. అయితే ఆరు వేల మంది సిబ్బంది పనిచేసేందుకు అవసరమైన భారీ కార్యాలయాన్ని రూపొందించేందుకు షాకు 30 ఏళ్లకు పైగానే సమయం పట్టింది. పవన విద్యుత్ రంగ నిపుణుడు జాన్ షాను వివాహం చేసుకున్న షా, బెంగళూరునే తన స్థిర నివాసంగా చేసుకున్నారు.

ప్రతిదీ ప్రతిబంధకమే!

25 ఏళ్ల వయసులో ఎలాంటి వ్యాపార నేపథ్యం గాని, అనుభవం కాని లేని మహిళ... ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా, అదీ అప్పటిదాకా ఎవరూ వినని రంగంలో కాలు మోపితే ఎలా ఉంటుంది? ప్రతి అంశమూ ముందరి కాళ్లకు బంధమేసేదిలాగే తయారవుతుంది. సరిగ్గా, కిరణ్ మజుందార్ షా పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. కొత్త వ్యాపారాన్ని నమ్మి రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాలేదు. సరికొత్తగా తెరపైకి వచ్చిన కంపెనీలో ఉద్యోగం చేసేందుకు నిరుద్యోగులూ ఆసక్తి చూపలేదు. అంతేమరి, అద్దె ఇంటిలోని గ్యారేజీలో కేవలం రూ.10 వేల పెట్టుబడితో ప్రారంభమైన బయోకాన్ లో పనిచేసేందుకు ఎవరు మాత్రం ధైర్యం చేస్తారు? అయితే మొండి ధైర్యంతోనే షా కంపెనీని నడిపించుకొచ్చారు. నిధుల కోసం అర్రులు చాచిన బయోకాన్ ను నిధుల వరద ముంచెత్తే స్థాయికి తీసుకురాగలిగారు,

సింగిల్ డేలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు!

బయోకాన్ తొలినాళ్లలో నిధుల లేమితో కొట్టుమిట్టాడింది. అయితే 2004లో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన బయోకాన్ ను తొలి రోజుననే బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వరదలా ముంచెత్తాయి. తద్వారా ఇష్యూ ప్రారంభ దినాన్నే బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు రాబట్టిన రెండో భారత కంపెనీగా వినుతికెక్కింది. ఒక మహిళగా కిరణ్ మజుందార్ షా, బయోకాన్ ను ఆ స్థాయిలో నిలబెట్టేందుకు 30 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా కష్టపడ్డారు. సరికొత్త రంగమైనా, దేశీయ వాణిజ్య రంగంలోనే కాక విశ్వవాణిజ్య విపణిలోనూ తనదైన శైలిలో రాణించిన బయోకాన్, యాంటీ బయాటిక్స్ ఉత్పత్తిలో ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా అవతరించింది. అంతేకాక బయో టెక్నాలజీ రంగంలో పరిశోధనల దిశగా భారీ కసరత్తు చేస్తున్న కంపెనీగానూ ఖ్యాతిగాంచింది.

సామాన్యుడికి అందుబాటులో వైద్యమే... షా లక్ష్యం

బయో టెక్నాలజీ రంగంలో కాస్త నెమ్మదిగానే అయినా, భారీ పరిణామాలకు తెర తీసిన బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా లక్ష్యం ఒక్కటే. భారత్ లో కనీస వైద్య సేవలకూ నోచుకోని సగంపైగా జనాభాకు వారి ముంగిట్లోకి సేవలను తీసుకురావడమే. ఇందులో భాగంగా షా, పలు సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నారు. వైద్య సేవల దరిదాపుల్లో లేని మారుమూల ప్రాంతాల ప్రజలకు సాధారణ వైద్య పరీక్షలతో పాటు అరుదైన చికిత్సలను అందించేందుకు బృహత్ కార్యాచరణకు ఎప్పుడో శ్రీకారం చుట్టారు. ఏటా 3 లక్షల మంది ప్రజలకు ఈ సేవలందించేందుకు పెద్ద సంఖ్యలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నారు. నారాయణ హృదయాలయ అధినేత దేవి శెట్టితో చేతులు కలిపి బెంగళూరులోని బొమ్మసంద్రలో 1,400 పడకల కేన్సర్ ఆస్పత్రిని నెలకొల్పారు. అతి తక్కువ ఖర్చుతోనే ఈ ఆస్పత్రి కేన్సర్ బాధిత రోగులకు చికిత్స అందిస్తోంది.

ఐదేళ్లలో 2 వేలకు పైగా అత్యున్నత స్థాయి పరిశోధన లైసెన్సులు

2005-10 మధ్యలో షా నేతృత్వంలోని బయోకాన్, 2,200 అత్యున్నత పరిశోధనలు సాగించి, వాటికి లైసెన్సులు కూడా పొందగలిగింది. ఇందుకోసం పలు ఫార్మా, బయో ఫార్మా కంపెనీలతో జత కట్టింది. బయోకాన్ సాధించిన ఈ ఘనత, ఔషధాలను సామాన్యుడు కొనగలిగే స్థాయికి దిగజార్చింది. అదే క్రమంలో విశ్వ వాణిజ్య విపణిలోకి అడుగిడి, పలు కంపెనీలను చేజిక్కించుకుని సత్తా చాటింది. ఈ తరహా దూకుడు నేపథ్యంలో అమెరికా వాణిజ్య ప్రచురణ సంస్థ ‘మెడ్ యాడ్ న్యూస్’ బయోకాన్ కు ప్రపంచంలోని 20 అగ్రగణ్య బయో టెక్నాలజీ కంపెనీల్లో ఏడో స్థానాన్ని కట్టబెట్టింది. కేవలం పరిశోధన కోసమే 1994లో ‘సింజిన్’ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసిన షా... చికిత్సల పురోభివృద్ధి కోసం 2000 ఏడాదిలో ‘క్లినిజీన్’ను నెలకొల్పారు.

ముమ్మాటికీ శక్తిమంతమైన మహిళే!

బడా పారిశ్రామిక వేత్తలు చేయని రీతిలో నేల విడిచి సాము చేసిన కిరణ్ మజుందార్ షా, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు సాధించారు. 30 ఏళ్ల పాటు అవిశ్రాంత కృషి చేసి, బయో టెక్నాలజీ రంగంలో అనూహ్య ఫలితాలను సాధించిన షాకు ఆ స్థాయి గౌరవం దక్కడం సబబే. అనుపమాన రీతిలో విజయాలు సాధించిన షాను భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీ, పద్మ భూషణ్ తదితర పురస్కారాలతో సత్కరించింది. హైదరాబాద్ లో బిజినెస్ టైకూన్ల సారధ్యంలో రూపుదిద్దుకున్న ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ లో షా పాత్ర కూడా కీలకమే. సదరు విద్యాలయంలో షా, బయో టెక్నాలజీ రంగంలో ఓ పరిశోధన కేంద్రాన్ని కూడా ఆవిష్కరించారు. తాజాగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, బెంగళూరుకు ఆమె చైర్ పర్సన్ గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Advertisements