ap7am logo

పాలలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా..?

Sun, May 14, 2017, 12:04 PM
Related Image

నేడు పట్టణ ప్రాంతాల్లో అధిక శాతం ప్యాకెట్ పాల వినియోగమే. గ్రామీణ ప్రాంతాల్లోకి సైతం పాల ప్యాకెట్లు చొచ్చుకుపోతున్నాయి. ఎన్నో కంపెనీలు నేడు మార్కెట్లో పలు రకాల పాలను అందిస్తున్నాయి. వాటిని కొని వినియోగించడం మినహా… అందులో ఏమున్నాయన్న విషయాన్ని గమనించే వారు తక్కువ. ఆ సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నమే ఇది.   

స్కిమ్డ్ మిల్క్

వెన్న లేని పాలు ఇవి. ఈ పాలను అధిక వేగంతో చిలుకుతూ పాల నుంచి వెన్నను వేరు చేస్తారు. ఈ పాలలో కాల్షియం 30 శాతం, ప్రొటీన్ 17 శాతం, కార్బోహైడ్రేట్స్ 4 శాతం, ఫ్యాట్ 0.5 శాతం లోపు ఉంటాయి. అలాగే, విటమిన్ బీ12, రైబోఫ్లావిన్, ఫాస్ఫరస్, మినరల్స్ ఉంటాయి. హోల్ మిల్క్ లో ఉండే అన్ని పోషకాలు ఉంటాయి. అయితే క్యాలరీల విషయానికొస్తే సగమే ఉంటాయి. వెన్నలో ఏ, డీ విటమిన్లు ఉంటాయి. వెన్నను తీస్తారు కనుక ఏ, డీ విటమిన్లను ప్రత్యేకంగా పాలకు కలుపుతారు. గర్భిణులకు, అధిక కొలెస్ట్రాల్ (కొవ్వు), ఊబకాయం సమస్యలతో బాధపడేవారికి ఈ పాలు ఉపయోగకరం. ఐదేళ్ల లోపు చిన్నారులకు వీటికి బదులు హోల్ మిల్క్ వాడితే ప్రయోజనం.

హోల్ మిల్క్

వీటినే ఫుల్ క్రీమ్ మిల్క్ అని కూడా అంటారు. పాలల్లో కనీసం 6 శాతం వెన్న ఉండేలా ప్రాసెస్ చేస్తారు. వెన్న పరిమాణం ఎక్కువగా ఉంటుంది కనుక చిన్నారులకు ఇవి బలవర్ధకం. సాధారణంగా రైతుల నుంచి సేకరించిన పాలలో కేవలం కొద్ది పరిమాణంలోనే వెన్నను తీసి ఈ పాలను విక్రయిస్తుంటారు.   

representational image

ఫ్లావర్డ్ మిల్క్

పాలకు, పంచదార, రంగులు, వివిధ రకాల రుచులను (చాక్లెట్, మ్యాంగో, వెనిల్లా, స్ట్రాబెర్రీ తదితర) కలుపుతారు. ఈ పాల తయారీలో పాశ్చురైజేషన్ విధానాన్ని పాటిస్తారు. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ట్రీట్ మెంట్ తో వీటిని తయారు చేయడం వల్ల సాధారణ పాల కంటే ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంటాయి. ఈ పాలలో కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, ప్రొటీన్, ఏ, డీ, బీ12 విటమిన్లు, కృత్రిమంగా కలిపే తీపి, అధిక కొవ్వు ఉంటాయి. వీటి కంటే సాధారణ పాలే ఆరోగ్యప్రదం. సాధారణంగా ఫ్లావర్డ్ పాలను తరచూ తీసుకుంటే దీర్ఘకాలంలో ఒబెసిటీ, దంత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరిక. 

యూహెచ్ టీ (అల్ట్రా హై టెంపరేచర్)

సూక్ష్మక్రిములు అన్నవి లేకుండా ఈ పాలను ప్రాసెస్ చేస్తారు. 137 డిగ్రీల సెంటీ గ్రేడ్ వద్ద పాలను 3 సెకెండ్ల పాటు వేడి చేస్తారు. ఆ తర్వాత సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకు వస్తారు. తర్వాత గాలి చొరబడని ఆరు లేయర్ల టెట్రా ప్యాక్ లలో ప్యాక్ చేస్తారు. దీని వల్ల వెలుతురు, గాలి, బ్యాక్టీరియా చొరబడడానికి అవకాశం ఉండదు. దీంతో రిఫ్రిజిరేషన్ లేకుండా గదిలో సాధారణ ఉష్ణోగ్రతలో ఇవి నిల్వ ఉంటాయి. ఫినో రకం ప్యాకేజింగ్ అయితే 90 రోజులు, బ్రిక్ ప్యాక్ అయితే 180 రోజులపాటు నిల్వ ఉంటాయి. పాలను వేడి చేయకుండా నేరుగా తాగవచ్చు.  

కండెన్స్ డ్ మిల్క్

ఇది క్రీమ్ లా ఉండే మిల్క్. పాలలో నీటిని 60 శాతం వరకు ఆవిరయ్యేలా చేస్తారు. పంచదారను కూడా కలుపుతారు. దాంతో క్రీమ్ గా తయారవుతుంది.  ఉదాహరణకు నెస్లే మిల్క్ మెయిడ్ తెలుసు కదా. అది కండెన్స్ డ్ రకమే. రిఫ్రిజిరేషన్ అవసరం లేకుండా ఈ పాలను కేన్లలో బయటే సంవత్సరాలపాటు నిల్వ ఉంచుకోవచ్చు. సాధారణంగా ఈ పాల పదార్థాన్ని బేకింగ్ ఉత్పత్తుల్లో రుచి కోసం వాడుతుంటారు. కాఫీ, టీలలో రుచి కోసం కూడా కొందరు వినియోగిస్తుంటారు. ఇందులోనూ పంచదార కలపని కండెన్స్ డ్ పాలు ఉన్నాయి. వాటిని ఎవాపరేటెడ్ మిల్క్ అంటారు. 

మిల్క్ పౌడర్

పాలలో తేమ శాతాన్ని తక్కువ స్థాయికి తీసుకొస్తారు. హీట్ ప్రాసెసింగ్ లో పాలలోని నీటిని ఆవిరయ్యేలా చేసి పొడిగా మారుస్తారు. ఏడాది పాటు ఇంట్లో రిఫ్రిజిరేషన్ అవసరం లేకుండానే పాల పొడిని నిల్వ చేసుకోవచ్చు. 

టోన్డ్, డబుల్ టోన్డ్ మిల్క్

టోన్డ్ మిల్క్ తయారీ విధానం భారత్ లోనే రూపొందింది. స్కిమ్డ్ మిల్క్, పాల పొడి, నీరు కలిపి టోన్డ్, డబుల్ టోన్డ్ మిల్క్ తయారు చేస్తారు. దాంతో పాలు ఖర్చు తగ్గుతుంది. సాధారణంగా పాల లభ్యత డిమాండ్ కంటే ఎక్కువగా ఉన్న సమయాల్లో డెయిరీ కంపెనీలు అదనంగా ఉన్న పాలను స్కిమ్డ్ మిల్క్ పౌడర్ గా మార్చి నిల్వ చేస్తాయి. పాల లభ్యత తగ్గిన  సమయంలో ఆ పొడిని తిరిగి టోన్డ్ పాలుగా మారుస్తాయి. సాధారణంగా గేదె పాలలో వెన్న 8 శాతం వరకు, ఎస్ఎన్ఎఫ్ 10 శాతం వరకు ఉంటాయి. టోనింగ్ విధానంలో వెన్నను 3 శాతానికి తగ్గించేస్తారు.  అదే డబుల్ టోన్డ్ మిల్క్ లో ఈ వెన్నను 1.5శాతానికే పరిమితం చేస్తారు. 

representational image ఎస్ఎన్ఎఫ్

పాల ప్యాకెట్లపై ఫ్యాట్ కాకుండా ఎస్ఎన్ఎఫ్ అని కూడా ప్రింటింగ్ లో కనిపిస్తుంది. దీనర్థం మిల్క్ సాలిడ్స్ నాట్ ఫ్యాట్ అని. అంటే పాలల్లో వెన్న కాకుండా ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ మొదలైనవి ఎంత శాతం ఉన్నాయో తెలియజేసేది.  

పాశ్చురైజ్డ్

పాశ్చురైజ్డ్, హోమోజినైజ్డ్ అని రాసి ఉండడాన్ని కూడా గమనించే ఉంటారు. పాలను వేడి చేసే ప్రక్రియలో ఓ రకమే పాశ్చురైజ్డ్. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన పాలలో బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి టాక్సిన్లను, ఎంజైమ్ లను ఉత్పత్తి చేస్తాయి. దాంతో పాలు త్వరగా చెడిపోతాయి. అందుకే రైతుల నుంచి  డెయిరీలకు తరలించిన తర్వాత పాలను పాశ్చురైజేషన్ లో హానికారక బ్యాక్టీరియాను చంపేస్తారు. పాల సహజ రుచి, ఇతర పోషకాలు మాత్రం అలానే ఉంటాయి. ఫ్రాన్స్ కు చెందిన లూయిస్ పాశ్చుర్ ఈ విధానాన్ని కనుగొన్నారు. కనుక ఈ ప్రక్రియకు ఆయన పేరు స్థిరపడిపోయింది. పాలను కనీసం 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 సెకండ్ల పాటు వేడి చేస్తారు. ఆ తర్వాత 6 లేదా అంతకంటే తక్కువ డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద చల్లబరుస్తారు. దీంతో హానికారక బ్యాక్టీరియా తొలగిపోతుంది. రిఫ్రిజిరేటర్ లో ఉంచితే రెండు రోజుల పాటు ఇవి తాజాగా ఉంటాయి. 

హోమోజినైజేషన్

పాలలో వెన్న ముద్దలుగా కనిపించకుండా అంతటా కలసిపోయేలా చేసే ప్రక్రియ హోమోజినైజేషన్. పాశ్చురైజేషన్ తర్వాత దీన్ని చేస్తారు. అన్ని డెయిరీలలో ఈ సాంకేతిక ఉండాలని లేదు. హోమోజినైజేషన్ చేయడం వల్ల పాలల్లోని వెన్న ముద్దలుగా పాల పైకి చేరి కనిపించదు. ప్యాకెట్ పాలల్లో అలా కనిపించిందంటే ఈ సాంకేతికత వినియోగించలేదని అర్థం. 

స్టెరిలైజేషన్

120 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాలు వేడి చేస్తారు. ఫ్లావర్డ్ మిల్క్ తయారీలో ఈ ప్రక్రియను వినియోగిస్తారు. మూడు నెలల వరకు గది ఉష్ణోగ్రతలోనూ ఇవి పాడవకుండా ఉంటాయి. 

సోయా మిల్క్

సోయా గింజలతోనూ పాలను తయారు చేస్తారు. సోయా గింజలను నీళ్లలో నానబెట్టి నీళ్లతో కలిపి రుబ్బుతారు. దాన్నుంచి పాలను వేరు చేస్తారు. ఈ పాలలో 3.5శాతం ప్రొటీన్, 2 శాతం ఫ్యాట్, 2.9 శాతం కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. వీటిలో లాక్టోస్ (తీపిలాంటి) ఉండదు. ఆవు పాలు పడని వారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం. అయితే, అలెర్జీ సంబంధిత సమస్యలున్న వారికి సోయా మిల్క్ సరిపడవు. వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. 

కొబ్బరిపాలు

పచ్చి కొబ్బరిని రుబ్బి పాలను వేరు చేస్తారు. జంతు సంబంధిత పదార్థాలను ఇష్టపడనివారికి ఇవి ప్రత్యామ్నాయం. బర్మా, కంబోడియా, పిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, శ్రీలంక, మన దేశంలో కేరళ ప్రాంతాల్లో వీటి వినియోగం ఎక్కువ. ఈ పాలల్లో శాచ్యురేటెడ్ కొవ్వు ఉంటుంది. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Advertisements