ap7am logo

చదువుల కేంద్రం పారిస్... అవకాశాలెక్కువే!

Mon, Apr 17, 2017, 01:09 PM
Related Image

ఫ్రాన్స్ రాజధాని పారిస్ విదేశీ విద్యార్థులకు చదువుల కేంద్రంగా వర్థిల్లుతోంది. స్వదేశీ, విదేశీ విద్యార్థులను ఒకే రీతిలో చూడడం ఇక్కడి ప్రత్యేకత. ట్యూషన్ ఫీజులు స్థానిక విద్యార్థుల వలే విదేశీ విద్యార్థులకూ సమానంగా ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే ఇక్కడ ఎవరైనా లోకలే అన్న రితిలో సాగిపోతుంది. పారిస్ లో ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలు ఎన్నో ఉన్నాయి. ఇదో విశ్వనగరం. 

విద్య నాణ్యం... ఖర్చు ఘనం

ఫ్రాన్స్ లో 3500 విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిలో 77 వరకు యూనివర్సిటీలే. ఈకోల్ నార్మల్ సుపీరియర్ పారిస్, ఈకోల్ పాలిటెక్నిక్ పారిస్ టెక్, యూనివర్సిటీ పీర్ ఎట్ మేరీ క్యూరీ, ఈకోల్ నార్మల్ సుపీరియర్ డీ ల్యాన్, యూనివర్సిటీ పారిస్ జాబితాలో ముందు వరుసలో ఉంటాయి. బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల ట్యూషన్ ఫీజు 1500 యూరోల నుంచి ఏడు వేల యూరోల (ఒక యూరో 76 రూపాయలతో సమానం) లోపు ఉంటుంది. మన కరెన్సీలో 1.14 లక్షల రూపాయలు. నివాస వ్యయానికి వస్తే 10 నుంచి 18వేల యూరోలు. పీజీ డిగ్రీ ట్యూషన్ ఫీజులు ఏడు వేల యూరోల నుంచి ప్రారంభం అవుతాయి. ఎంచుకున్న సిటీ, ఫ్లాట్ లేదా యూనివర్సిటీని హాస్టల్ ని బట్టి నెలవారీ ఆహారం, నివాసం, ఇతర ఖర్చులు అన్నీ కలుపుకుని నెలకు 800 యూరోల నుంచి 1500 యూరోల వరకు అవుతుంది. ఉదాహరణకు సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కు 450 యూరోల వరకు, యూనివర్సిటీలో రూమ్ అయితే నెలకు 240 యూరోల అద్దె ఉంటుంది. యూనివర్సిటీలో వసతి లేదా విడిగానూ ఉండవచ్చు. యూనివర్సిటీలో ఆహారంతో కూడిన వసతి లేదా కేవలం వసతి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. విద్యార్థి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకునేట్లు అయితే కేవలం అకాడమేషన్ తీసుకుంటే సరిపోతుంది.

ప్రవేశాల పద్ధతి 

ఇంటర్ లో 60 నుంచి 70 శాతం (యూనివర్సిటీలను బట్టి) మార్కులు కలిగి ఉండాలి. ఫ్రెంచ్ తెలిసి ఉండాలని గతంలో నియమం ఉండేది. కానీ ప్రస్తుతం ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్ తదితర కోర్సులను అక్కడి యూనివర్సిటీలు ఇంగ్లిష్ మాధ్యమంలో అందిస్తున్నాయి. అయితే, ఫ్రెంచ్ తెలిసి ఉండడం అదనపు ప్రయోజనం అవుతుంది. కాలేజీలను ఎంపిక చేసుకున్న తర్వాత ఆయా విద్యా సంస్థల వెబ్ సైట్లను చూడడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ, అర్హతల గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. జీమ్యాట్, జీఆర్ఈ కోర్సుల ఆధారంగానూ కొన్ని వర్సిటీలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇంగ్లిష్ భాషకు సంబంధించి టోఫెల్, ఐఈఎల్టీఎస్ పూర్తి చేయాలి. సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే కోర్సులకు ఫిబ్రవరి నుంచి మే నెల వరకు దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని మార్చి నెలలో అడ్మిషన్లు నిర్వహిస్తుంటాయి. వీటికి నవంబర్ నుంచి జనవరిలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగావకాశాలు ఎక్కువే!

 జీవన వ్యయం ఎక్కువ. కనుక విదేశీ విద్యార్థులు ప్రయాణానికి స్టూడెంట్ మెట్రో కార్డును వినియోగించడం, యూనివర్సిటీల్లోని స్టూడెంట్ కేఫ్ టేరియాలలో తినడం, స్టూడెంట్ ఐడీ కార్డును చూపించి తక్కువ చార్జితోనే సినిమా చూడడం తదితర చిట్కాలు పాటించాలి. విద్యార్థులు చదువుకుంటూనే ఏడాదిలో 964 గంటలపాటు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అనంతరం కోర్సుకు తగిన రంగంలో ఉద్యోగం చూసునేందుకు ఏడాది పాటు ఉండవచ్చు. ఉద్యోగ అవకాశం వస్తే వెంటనే వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారు అనంతరం ఏడాది కాలానికి తాత్కాలిక నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస వేతనానికి 1.5రెట్ల అధిక వేతనం ఉన్న ఉద్యోగమైతే తమ వీసాను ఉద్యోగ వీసాగా మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు మాస్టర్స్ లేదా పీహెచ్ డీ కోర్సును ఫ్రాన్స్ లో చేస్తే ఐదేళ్ల కాల పరిమితి గల వీసాను పొందవచ్చు. 

అనుభవం వుంటే మంచిది!

 ఫ్రెంచ్ నేర్చుకుని ఉన్నవారికే ఫ్రాన్స్ లో ఉద్యోగానికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రత్యేకమైన విద్యార్హతలు ఉండి, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఉంటే ఫ్రెంచ్ రాకపోయినా జాబ్ పొందవచ్చు. ఫ్రాన్స్ లో ఐటీ నిపుణుల కొరత ఉంది. కనుక ఈ రంగానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. సాధారణంగా ఫ్రాన్స్ లో సెటిల్ అయిన భారతీయుల అభిప్రాయాల ప్రకారం... భారత్ లో మూడు నాలుగేళ్ల ఉద్యోగ అనుభవం తర్వాత ఫ్రాన్స్ లో మేనేజ్ మెంట్ కోర్సులో చేరి ఇంటర్న్ షిప్ అనంతరం ఉద్యోగం వెతుక్కోవడం నయం. భారత్ నుంచి నేరుగా ఉద్యోగ అన్వేషణ చేయడం కంటే ఈ విధంగా ప్రయత్నించడం లక్ష్యానికి దగ్గర చేరుస్తుంది. వృత్తి విద్యార్హతలు కలిగి అత్యున్నతస్థాయి ఉద్యోగ నైపుణ్యం ఉన్న వారు పూర్తిస్థాయి వర్క్ పర్మిట్ కూడా పొందవచ్చు. 

షార్ట్ స్టే వీసా...

సాధారణంగా ఇక్కడి వీసాలను రెండు రకాలుగా వర్గీకరించారు. షార్ట్ స్టే వీసా లేదా షెంజెన్ వీసా. రెండోది లాంగ్ స్టే వీసా. 90 రోజుల కాలపరిమితి ఉంటుంది. పర్యాటకులు, వ్యాపారపని మీద వచ్చేవారు, కుటుంబ సభ్యులను చూసేందుకు వచ్చే వారి కోసం వీటిని జారీ చేస్తుంటారు. ట్రైనింగ్, ఇంటర్న్ షిప్, సదస్సులు, వ్యాపార సమావేశాలు, లేదా ఉద్యోగం వీటిలో ఏదైనా గానీ లేదా కొన్ని సందర్భాల్లో ఇతర అవసరాల కోసం వచ్చే వారికి కూడా 90 రోజుల కాలపరిమితితో ఈ వీసా మంజూరు చేస్తారు. అంతేకాదు, ఫ్రాన్స్ అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా తమ గమ్యస్థానాలకు వెళ్లాలనుకునే విదేశీయులు కూడా ఈ వీసానే తీసుకోవాల్సి ఉంటుంది. షార్ట్ స్టే వీసాపై వెళ్లేవారు ఉద్యోగం వెతుక్కునేందుకు అనుమతి లేదు. 

లాంగ్ స్టే వీసా (టైప్ డీ)

విద్య, ఉద్యోగం, కుటుంబ సభ్యులతో కలసి ఉండాలనుకునేవారి కోసం లాంగ్ స్టే జారీ చేస్తారు. కారణమేదైనా గానీ, 90 రోజుల కంటే ఎక్కువ కాలం ఫ్రాన్స్ లో ఉండాలనుకునే వారు ఈ వీసాను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీసాతో ఫ్రాన్స్ లో అడుగుపెట్టిన వారు ఆఫీస్ ఆఫ్ ప్రాన్స్ ఇమిగ్రేషన్ అండ్ ఇంటెగ్రేషన్ (ఓఎఫ్ఎఫ్ఐ) వద్ద నమోదు చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నివాసానికి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లాంగ్ స్టే వీసానే తొలి ఏడాదికి నివాస పరిమితిగానూ పనిచేస్తుంది. ఏడాది తర్వాత గడువు పొడిగింపునకు తిరిగి దరఖాస్తు చేసుకోవాలి. కళాకారులు, క్రీడాకారులు కూడా ప్రదర్శనలు, పోటీల్లో  పాల్గొనేందుకు వెళ్లాలనుకుంటే వర్క్ పర్మిట్ తీసుకోవాలి. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy