ap7am logo

విలువల నిచ్చెనపై... 'విప్రో' సారథి!

Thu, Mar 31, 2016, 10:38 AM
Related Image

21 ఏళ్ల యవ్వనంలో ప్రతిష్ఠాత్మక వర్సిటీ... స్టాన్ ఫోర్డ్ లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న అజిమ్ హషిమ్ ప్రేమ్ జీ, ఇంకొంత కాలం ఉంటే చదువు పూర్తి చేసేవాడే. అయితే, ఓ రోజు పిడుగులాంటి వార్త అందింది. తండ్రి ఎంహెచ్ హషిమ్ ప్రేమ్ జీ మరణ వార్తను మోసుకొచ్చిన ఆ సందేశంతో ఉన్నపళంగా స్వదేశం వచ్చేయాల్సి వచ్చింది. అయితే మళ్లీ స్టాన్ ఫోర్డ్ వెళ్లే వెసులుబాటు అతడికి చిక్కలేదు. తండ్రి ఆకస్మిక మరణం నేపథ్యంలో కుటుంబంతో పాటు తమనే నమ్ముకున్న వందలాది మంది కార్మికుల జీవనోపాధిని అతడు భుజాన వేసుకోవాల్సి వచ్చింది. తప్పలేదు మరి. ఇంకేముంది... ఇంజినీర్ కావాలన్న కల మధ్యలోనే కొండెక్కేసింది. ఓనమాలు తెలియకుండానే వ్యాపార రంగంలోకి దిగాల్సి వచ్చింది. కాకపోతే తండ్రి తనలో నూరిపోసిన విలువల మంత్రం అప్పటికప్పుడు నిద్ర లేచింది. ముందడుగు వేయమంటూ ఉద్బోధిస్తూ ఊహించని తీరాలకు పరుగులు పెట్టించింది. వందలుగా ఉన్న కార్మికుల సంఖ్య వేలు కూడా దాటేసి, లక్షను తాకింది. అయితే ఈ పరిణామానికి కొంత కాలమైతే పట్టింది కాని, అతడి కీర్తితో పాటు భారత ప్రతిష్ఠ విశ్వవ్యాప్తవంగా మరింత ఇనుమడించింది. 

పట్టుదలతో ఇంజినీరింగ్ సాధించిన ప్రేమ్ జీ

తండ్రి ఆకస్మిక మరణం నేపథ్యంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ను మధ్యలోనే వదిలేసి వచ్చిన ప్రేమ్ జీ, ఎలాగైనా ఇంజినీరింగ్ పట్టాను చేపట్టాల్సిందేనని నిర్ణయించుకున్నారు. అందుకే వదిలేసి వచ్చిన పాఠాలను దూరవిద్య విధానంలో అభ్యసిస్తానని వర్సిటీ అధికారులను ఒప్పించి మరీ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇక చదువు మీదకు దృష్టి సారించే తీరిక ఆయనకు చిక్కలేదు. తండ్రి అప్పగించిపోయిన వ్యాపారాన్ని నిర్వహించేందుకే సమయమంతా సరిపోతుంటే, ఇక చదివెలా సాధ్యం? అందుకే చదువుపై మమకారం వదులుకున్న ప్రేమ్ జీ, దానికి దూరమైన పిల్లలకు మాత్రం చదువు చెప్పించేందుకు కష్టపడుతున్నారు. ఖర్చు పెడుతున్నారు కూడా.

1945, జూలై 24న ముంబైలో జన్మించిన ప్రేమ్ జీ...1966 నాటికే వ్యాపార పగ్గాలు చేపట్టారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుదామనుకుంటే... మెకానికల్, కంప్యూటర్ ఇంజినీరింగ్ నిపుణులు చేయాల్సిన పనులు చేపట్టాల్సి వచ్చిన ప్రేమ్ జీ, అందులో ఆ రంగాల నిపుణులను తలదన్నేలా రాణించారు. తనకు పరిచయం లేని రంగంలోకి కొండంత విశ్వాసంతో దిగి, అనూహ్య ఫలితాలు సాధించారు. మార్కెట్ వర్గాలు ముక్కున వేలేసుకునేలా చేశారు. ఆఖరుకు యావత్తు భారత దేశానికే టెక్నాలజీ కింగ్ గా అవతరించారు. 

నూనెల తయారీతో రంగ ప్రవేశం

జీవించి ఉన్నంత కాలం నూనెల తయారీ వ్యాపారం కొనసాగించిన హషిమ్ ప్రేమ్ జీ, పోతూపోతూ తన వ్యాపారాన్ని అజిమ్ ప్రేమ్ జీకి వారసత్వంగా ఇచ్చి వెళ్లారు. దీంతో అనుభవం, ఇష్టం లేకున్నా ఆ వ్యాపారంలోకి ప్రేమ్ జీ దిగేయాల్సి వచ్చింది. ఒక్కసారి అందులో కాలుపెట్టిన ఆయన, వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. నూనెలు, సబ్బులు, డిటర్జెంట్లు, టాయిలెటరీస్, చిన్నపిల్లల ఉత్పత్తులు తదితరాలతో దినదినాభివృద్ధి చెందిన వ్యాపారం నేడు దేశంలోనే కాక ప్రపంచంలోనూ అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటిగా నిలిచింది. అప్పట్లో 20 లక్షల డాలర్ల విలువ చేసే వ్యాపారాన్ని చేపట్టిన ప్రేమ్ జీ, 8 బిలియన్ డాలర్ల విలువకు తీసుకెళ్లారు. ఈ స్థాయికి చేరేందుకు ప్రేమ్ జీ, అహరహం కృషి చేయాల్సి వచ్చింది. అంతేకాక మరిన్ని కొత్త రంగాలకూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో ఎన్నడూ తొణుకుబెణుకు లేకుండానే ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. 

వెస్టర్న్ ఇండియా... సంక్షిప్తంగా విప్రో

తండ్రి కార్యకలాపాలు సాగించిన వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, కాలక్రమేణా విప్రోగా మారిపోయింది. ప్రస్తుతం విప్రో పూర్తి పేరు చెప్పమంటే ఏ కొద్ది మందో తప్పించి మెజార్టీ ప్రజలకు తెలియదు. అదే విప్రో పేరు చెబితే, ఠక్కున ప్రేమ్ జీ గుర్తుకొచ్చేస్తారు. ఈ గుర్తింపు ఒక్క భారత్ లోనే కాదు సుమా. విశ్వవ్యాప్తంగా విప్రో అంటే, ప్రేమ్ జీ గుర్తుకు రావాల్సిందే. ఐటీ సేవల్లో కాలిడిన ప్రేమ్ జీ అద్భుతాలనే సృష్టించారు. 1970 దశకం చివరలో మొదలైన సాఫ్ట్ వేర్ విప్లవం నేపథ్యంలో 1980లో విప్రో కూడా బెంగళూరు కేంద్రంగా ఐటీ వ్యాపారంలోకి అడుగిడింది. కాలుమోపిన 15 ఏళ్లలోనే భారత్ లోనే అతిపెద్ద ఐటీ ఆధారిత సేవల కంపెనీగా విప్రో అవతరించడం విశేషం. విప్రో టెక్నాలజీస్ పేరిట పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన ఈ సంస్థ, ఒక్కసారిగా రూ.1,042 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరుకుంది. 

వాటాలు కొనిపించి, కోటీశ్వరులుగా మార్చి..!

తన కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వెళ్లిన సమయంలో తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్లు, నౌకర్లతో తన షేర్లను బలవంతంగా కొనిపించిన ప్రేమ్ జీ, వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దారు. అంతేకాక, స్నేహితులతో కూడా షేర్లను కొనిపించి, అప్పటిదాకా షేర్ మార్కెట్ దిశగా దృష్టి సారించని ఎందరినో అబ్బురపరిచారు.  

ఎంత ఎదిగినా, సామాన్యుడిగానే!

వ్యాపారంలో కోట్లకు పడగలెత్తిన ప్రేమ్ జీ, ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ఎప్పుడో స్థానం సంపాదించారు. ఒకానొక దశలో భారత్ లోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. అయితే ఇప్పటికీ ఆయన సాధారణ జీవితాన్నే ఇష్టపడతారు. ఎక్కడికెళ్లాలన్నా, ఎకానమీ తరగతిలోనే ప్రయాణిస్తారు. బయటి ప్రాంతాల్లో బస చేయాల్సి వస్తే, కంపెనీ అతిథి గృహాలను ఆశ్రయిస్తారు తప్పించి, లగ్జరీ హోటళ్ల దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. అంతేకాదు, కంపెనీ కార్యాలయ ప్రాంగణంలో ఆయన కారుకు అసలు రిజర్వడ్ పార్కింగ్ అన్న స్థలమే  వద్దంటారు. తానొచ్చిన సమయంలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడే కారును పార్క్ చేయమని చెబుతారట. ఇక కోట్లు సంపాదించిన ప్రేమ్ జీ, వాడే కారు ఎంత ఖరీదు ఉంటుందోనని ఆరా తీస్తే, ఆశ్చర్యపోక తప్పదు. తాను వాడే హోండా కారు పాతబడింది, కొత్తది కొనండన్న సిబ్బందికి ప్రేమ్ జీ షాకిచ్చారట. తనవద్ద పనిచేస్తున్న సిబ్బంది వాడిన సెకండ్ హ్యండ్ మెర్సిడెజ్ బెంజ్ ను కొనుక్కుని మురిసిపోయారట. 

దాతృత్వంలో అగ్రగణ్యుడు

ఇక సామాజిక సేవా కార్యక్రమాలకు పెద్ద పీట వేసే ప్రేమ్ జీ, అందుకు కేటాయించే నిధుల విలువ చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు. గ్రామీణ భారతంలో విద్య, సామాజికాభివృద్ధి కార్యక్రమాలకు ఒకేసారి రూ.8 వేల కోట్లను విడుదల చేసి, భారత్ లో సేవా కార్యక్రమాలకు అధిక మొత్తం వెచ్చించిన వ్యాపార వేత్తగా అవతరించారు. అంతేకాక తన వ్యక్తిగత ఆస్తిలో 25 శాతం వాటాను సేవా కార్యక్రమాలకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుని భారత పారిశ్రామిక వేత్తలకే మార్గదర్శిగా నిలిచారు. 2001లో అజిమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసిన ఆయన పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలకు తెరతీశారు. ఈ ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల్లో విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలదే అగ్రతాంబూలం. 

విలువలను వల్లె వేస్తూ...!

కార్పోరేట్ ప్రపంచంలో అగ్రభాగాన నిలిచిన ప్రేమ్ జీ, నిత్యం వ్యాపారాంశాలను చర్చిస్తూ గడిపేస్తారనుకుంటే మనం పొరబడినట్లే. ఎందుకంటే నిత్యం ఆయన... మనిషిగా మనం పాటించాల్సిన విలువలు, వాటి వల్ల కలిగే తృప్తి తదితరాలనే ఎక్కవగా ప్రస్తావిస్తారట. విప్రో విజయంలోనూ తాను పాటించిన విలువలే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని కూడా ఆయన చెబుతుంటారు. సర్వశక్తులన్నీ కూడదీసుకుని లక్ష్యం దిశగా పరుగు ప్రారంభించాలని చెప్పే ఆయన, ఐదు పౌండ్ల సంపాదన కన్నా, ఒక్క రూపాయి సంపాదనే విలువైనదిగా భావిస్తారట. సత్యనిష్టకే  ప్రాధాన్యతనిచ్చే ప్రేమ్ జీ, విలువలను వదులకునే దుస్సాహసం చేయొద్దంటారు. సామాన్యుడిని కూడా విలువలున్న బృందంలో చేరిస్తే, అతడు మెరుగైన కార్యసాధకుడిగా రూపాంతరం చెందుతాడనడంలో తనకెంత మాత్రం అనుమానం లేదని కాస్త గట్టిగానే వాదిస్తారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy