ap7am logo

భారత పారిశ్రామిక రంగానికి నడకలు నేర్పిన జంషెట్జీ టాటా!

Wed, Mar 30, 2016, 10:36 PM
Related Image

అప్పటికే బ్రిటిషర్ల కబంధ హస్తాల్లో చిక్కుకున్న భరత మాత విలవిల్లాడిపోతోంది. తనలోని సహజ వనరులన్నింటినీ చేజిక్కించుకునే క్రమంలో బ్రిటిషర్లు పన్నని పన్నాగం అంటూ లేదు. చేయని దురాగతం లేదు. తెల్లదొరల దుర్మార్గ పాలనలో ఛిన్నాభిన్నమైన తన బిడ్డలు ఒక్కటై, శత్రువును తరిమికొట్టేందుకు ఎప్పుడెప్పుడు కదులుతారా? అంటూ చూస్తున్న సమయంలో...1839, మార్చి 3న భరత మాతకు ఓ బిడ్డ జన్మించాడు. తనను విశ్వ వాణిజ్య విపణిలో సమున్నత స్థానంలో నిలపగల సత్తా ఆ బిడ్డ సొంతమని ఆమెకు తెలుసు. అయితే అందుకోసం కాస్త సమయం పడుతుందని కూడా తెలిసిన భరత మాత, ఆ బిడ్డకు జాగ్రత్తగా నడకలు నేర్పింది. అంచెలంచెలుగా ఎదిగిన ఆ బిడ్డ, తన తల్లి రుణం తీర్చుకున్నాడు. ఆమెను విశ్వ వాణిజ్య విపణిలో సమున్నతంగా నిలపడమే కాక, తమపై ఆధిపత్యం చెలాయించిన నోళ్లతోనే పొగడ్తలూ వెల్లువెత్తేలా చేశాడు. అతడే భారత వ్యాపార రంగ నవ వైతాళికుడు... జంషెట్జీ టాటా.

19 ఏళ్లకే గ్రీన్ స్కాలర్ పట్టా!

గుజరాత్ లోని చిన్న పట్టణం నవ్సారిలో పార్సీ మత బోధకుల ఇంట జంషెట్జీ టాటా జన్మించారు. తరాలుగా వస్తున్న మత బోధకుల వృత్తిని వదిలేసి, ఆ తరహా కుటుంబ కట్టుబాట్లను కాదని తొలిసారి వ్యాపార రంగం బాట పట్టిన నుస్సర్వాన్జీ టాటా, జీవన్ బాయి టాటాలకు జ్యేష్ఠ సంతానంగా పుట్టిన జంషెట్జీ, 14 ఏళ్ల వయసుకే పదేళ్ల హీరాబాయి దాబూని బాల్య వివాహం చేసుకోవాల్సి వచ్చింది.

సరిగ్గా సిపాయిల తిరుగుబాటు జరిగిన మరుసటి ఏడాది 19 ఏళ్ల వయసులో జంషెట్జీ టాటా, నాటి బాంబే లోని ఎల్ఫిన్ స్టోన్ కళాశాల నుంచి 1858లో నేటి డిగ్రీతో సమానమైన గ్రీన్ స్కాలర్ పట్టా పొందారు. మరుసటి ఏడాది తండ్రి స్థాపించిన చిన్నపాటి వ్యాపారంలో కుదురుకున్నారు. ఈ క్రమంలో తండ్రి వద్ద వ్యాపార మెళకువలను ఒంటబట్టించుకున్న జంషెట్జీ, 29 ఏళ్ల వయసు వచ్చేసరికి సొంతంగా వ్యాపారం చేసేందుకు సిద్ధపడ్డారు. కేవలం రూ. 21,000లతో మొదలుపెట్టిన ఈ వ్యాపారం, కలిసి రాకపోగా, ఆయనను కుంగదీసింది. ఈ క్రమంలో జరిగిన తన తొలి ఇంగ్లండ్ పర్యటన, ఆయనకు పాఠాలు బాగానే నేర్పింది. వస్త్ర తయారీ రంగం మెళకువలపై అవగాహననూ పెంచింది. 

తుప్పుపట్టిన ఆయిల్ మిల్లునే కాటన్ మిల్లుగా మార్చేశారు!

వస్త్ర తయారీ రంగంలో భారత పరిశ్రమలకు బంగారు భవిష్యత్తు ఉందని గ్రహించిన జంషెట్జీ, ఆ దిశగా అడుగులు వేశారు. బాంబే పారిశ్రామిక వాడలోని చింక్పోలిలో దివాళా తీసి, మూలనపడ్డ ఓ పాడుబడ్డ నూనె మిల్లును1869లో చేజిక్కించుకున్న ఆయన అలెగ్జాండ్రా మిల్లుగా పేరుమార్చి కాటన్ మిల్లుగా తీర్చిదిద్దారు. అయితే స్వల్ప కాలంలోనే దీనిని వదిలించుకున్నారు. అయితే ఈ సందర్భంగా కొంత మేర లాభాన్ని జేబులో వేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇంగ్లండ్ లో పర్యటించి, అక్కడి లాంక్ షైర్ లోని వస్త్ర వ్యాపార రీతులపై సుదీర్ఘ అధ్యయనం చేశారు. అక్కడి మెషీన్లు, వృత్తి నైపుణ్యాలు ఆయనను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే, అక్కడి తీరుతోనే భారత్ లో ప్రయోగాలు చేయాలనే తలంపుతో పర్యటనను ముగించుకుని వచ్చారు. 

సకల సౌకర్యాలుండే ప్రాంతంలోనే ప్రయోగం

ఈ క్రమంలో సొంతంగా జౌళి రంగంలో ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించుకున్న జంషెట్జీ, అందుకు అనువైన ప్రాంతం కోసం వెదకడం మొదలుపెట్టారు. జౌళి రంగానికి కేంద్రంగా ఉన్న బాంబేను మించి మెరుగైన ప్రాంతం ఎక్కడ దొరుకుతుందన్న భావన నుంచి బయటకు వచ్చిన ఆయన, పత్తి సాగు చేసే పొలాలు దగ్గరగా ఉండటంతో పాటు అందుబాటులో రైల్వే జంక్షన్, నీరు, ఇంధనం సమృద్ధిగా లభించే నాగ్ పూర్ ను ఎంచుకున్నారు. 1874లో రూ.1.5 లక్షల పెట్టుబడితో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యూఫ్యాక్చరింగ్ కంపెనీని నెలకొల్పారు. మూడేళ్ల తర్వాత 1877, జనవరి 1న బ్రిటన్ రాణి విక్టోరియా, ’ఇంప్రెస్ ఆఫ్ ఇండియా‘ పొగడ్తతో సదరు కంపెనీ ఒక్కసారిగా ఇంప్రెస్ మిల్స్ గా మారిపోయింది. ఇంప్రెస్ మిల్స్ తో జంషెట్జీ, ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

తీరని కోరికలు మూడే!

1880 నుంచి తాను మరణించిన 1904 వరకు జంషెట్జీ, ఎప్పుడూ ఓ మూడు కలలు కంటూ ఉండేవారు. ఉక్కు కర్మాగారం, జల విద్యుత్ ప్రాజెక్టు, సైన్స్ సంబంధిత అంశాల్లో భారతీయ విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బోధనలు చేసే విద్యా సంస్థలను నెలకొల్పాలని ఆయన భావించారు. అయితే అవి సాకారం కాకముందే జంషెట్జీ గతించారు. అయితే మరో చిరకాల వాంఛ అయిన హోటల్ నిర్మాణాన్ని మాత్రం పూర్తి చేయగలిగారు. ఏ స్థాయిలోనంటే, అప్పటిదాకా దేశంలో ఎక్కడా లేనంత నూతనత్వంతో నిర్మించారు.

దాదాపు అప్పుడే రూ.4.21 కోట్ల విలువ చేసే తాజ్ మహల్ హోటల్, అమెరికా ఫ్యాన్లు, జర్మన్ ఎలివేటర్లు, టర్కిష్ టాయిలెట్లు, ఇంగ్లీష్ బట్లర్లతో అత్యంత ఆధునిక హంగులతో 1903లో సేవలందించడం ప్రారంభించింది. అప్పటికి బాంబేలో విద్యుత్ వినియోగిస్తున్న హోటల్ గానూ తాజ్ వినుతికెక్కింది. ఆయన గతించినా, ఆయన ఆశయాలు నిజరూపం దాల్చాయి. అందుకు నిదర్శనమే టాటా స్టీల్, టాటా పవర్ కంపెనీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. జంషెట్జీ టాటా ఆశయాలకు ఆయన వారసులు జీవం పోయకపోతే ఇవన్నీ మనకు అందుబాటులోకి వచ్చేవే కావు. 

చేయూతలో విశిష్టత

ఛారిటీ సంస్థలకు నిధులు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం జంషెట్జీకి అసలిష్టం లేదు. అయితే సేవా కార్యక్రమాలను ఆయన ఏమాత్రం అలక్ష్యం చేయలేదు. 1892లో జేఎన్ టాటా ఫౌండేషన్ పేరిట సంస్థను ఏర్పాటు చేసిన ఆయన, కుల, మత, ప్రాంత, జాతి సంబంధిత అంశాలతో ఏమాత్రం సంబంధం లేకుండా భారత విద్యార్థులు ఇంగ్లండ్ లో విద్యనభ్యసింసేందుకు చేయూతనందించారు. ఇది ఎంతగా ఫలితాలిచ్చిందంటే, 1924 వరకు సివిల్ సర్వీసులకు ఎంపికైన ప్రతి ఐదుగురు భారతీయుల్లో, ఇద్దరు టాటా స్కాలర్ షిప్పులతో విద్యనభ్యసించిన వారే నిలిచేంతగా! ఈ దిశలో రూపుదిద్దుకున్నదే ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. అయితే ఈ విద్యా సంస్థ ఏర్పాటు కార్యరూపం దాల్చడానికి దాదాపు పుష్కర కాలం పట్టింది. 

కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట

తనతో ఏమాత్రం సంబంధం లేని వారికే ఆ స్థాయిలో చేయూతనందించిన జంషెట్జీ, మరి తన కార్మికులకు ఏం చేయలేదా? అంటే, అదో పెద్ద ఇతిహాసమే అవుతుంది. తన కంపెనీల్లో పనిచేసే కార్మికుల కోసం ఆయన తీసుకున్న పటిష్ఠ చర్యల కారణంగానే నేడు జంషెడ్పూర్ పారిశ్రామిక కళతో అలరారుతోంది. తాను మరణించడానికి ఐదేళ్ల ముందే, కార్మికుల సంక్షేమం కోసం ఆయన ప్రత్యేకంగా చర్యలకు ఉపక్రమించారు. కార్మికుల నివాసం, ఇతర సౌకర్యాల కోసం సేకరించిన ప్రాంతమే, టాటా కంపెనీలతో పాటు ఎదుగుతూ, టాటాల ఆధ్యుడైన జంషెట్జీ పేరిటే, జంషెడ్పూర్ గా రూపాంతరం చెందిందనే విషయం తెలిసిందే. 

కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై చనిపోవడానికి రెండేళ్ల ముందు జంషెట్జీ, తన పెద్ద కుమారుడు దొరాబ్ టాటాకు ఓ లేఖ రాశారు. కార్మికుల కాలనీలో వెడల్పాటి రోడ్లు, అత్యంత వేగంగా పెరిగి నీడనిచ్చే చెట్లు నాటాలని ఆ లేఖలో సూచించారు. అంతేకాక కార్మికులు సేదదీరేందుకు భారీ విస్తీర్ణంలో పచ్చిక బయళ్లను, తోటలను ఏర్పాటు చేయడంతో పాటు ఫుట్ బాల్, హాకీ  తదితర ఆటలు, పార్కుల కోసం కూడా భారీ విస్తీర్ణంలో ఖాళీ స్థలాలను కేటాయించాలని కూడా సదరు లేఖలో జంషెట్జీ సూచించారంటే, ఆయన ముందు చూపు ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది. ఇక కార్మికుల భవిష్యనిధి, గ్రాట్యూటీ తదితరాలు భారత్ లో చట్టబద్ధమయ్యే సమయానికి చాలాకాలం ముందే టాటా కార్మికులకు అందించిన ఘనుడు జంషెట్జీ టాటా. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy