ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రీలంకను చుట్టేద్దాం... రండి!

Tue, May 02, 2017, 02:00 PM
Related Image

రావణుడు ఏలిన నేల.. శ్రీసీతారాముల పాదాలతో తరించిన నేల శ్రీలంక. దక్షిణ భారత దేశానికి సమీపంలో… హిందూ మహాసముద్రంలో విస్తరించి ఉన్న దీవి. సింహళ, తమిళ భాషలు ఇక్కడ ప్రధానంగా మాట్లాడతారు. నగరాల్లో ఇంగ్లిష్ మాట్లాడేవారు కనిపిస్తారు. భిన్న రకాల సంస్కృతి, రామాయణ చారిత్రక విశేషాలతో కూడిన శ్రీలంక భారతీయ పర్యాటకుల జాబితాలో తప్పక ఉంటుంది. రాజధాని కొలంబో నుంచి మొదలు పెడితే దేశం నలుమూలలా విస్తరించి ఉన్న ఎన్నో అందాలను చూసి రావచ్చు. ఒక అనిర్వచనీయమైన, ఆనందానుభూతిని శ్రీలంక పర్యటనతో సొంతం చేసుకోవవచ్చు. 

హైదరాబాద్ నుంచి కొలంబోకు విమానంలో వెళ్లేందుకు 10 వేల రూపాయలు ఖర్చవుతుంది. నెల రోజులు ముందుగానే బుక్ చేసుకుంటే రూ.6వేలకే టికెట్ సొంతం చేసుకోవచ్చు. చెన్నై, బెంగళూరు నుంచి రూ.6 వేలు ఖర్చవుతుంది. కొలంబోలో సిటీ బస్సు చార్జీలు 10 శ్రీలంక రూపాయలు (ఒక శ్రీలంక రూపాయి సమారుగా భారతీయ కరెన్సీలో అర్ధరూపాయితో సమానం) నుంచి 50 రూపాయల వరకు ఉన్నాయి. అయితే, అక్కడి బస్సులు బాగా కిక్కిరిసి ఉంటాయి. రైలు చార్జీలు తక్కువే అయినప్పటికీ అవి కూడా తక్కువ సర్వీసుల వల్ల జనంతో కిటకిటలాడుతుంటాయి. వీటికి బదులు కొంచెం ఖర్చయినా సరే ట్యాక్సీల్లో ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. ట్యాక్సీ చార్జీ ప్రతి కిలోమీటర్ కు 60 రూపాయల నుంచి వసూలు చేస్తారు. ఒక గంట వెయిటింగ్ కు గాను 100 రూపాయలు ఉంటుుంది.  representational image

భోజనం ధర మామూలు రెస్టారెంట్లో అయితే 250 రూపాయలు, మెక్ డొనాల్డ్స్ లో అయితే 650 రూపాయల వరకు ఉంటుంది. బీర్ ధర 200 రూపాయలు. ఇంప్టోర్టెడ్ బీరు కావాలంటే రెట్టింపు చెల్లించుకోవాలి. డ్రింక్ ధర 75 రూపాయలు, వాటర్ బాటిల్ ధర 50 రూపాయలు. చట్నీస్, షణ్ముగ వంటి ప్రముఖ రెస్టారెంట్లు సైతం ఇక్కడ ఉన్నాయి. మంచి హోటళ్లలో ఒక రోజు విడిదికి గాను భారతీయ కరెన్సీలో సుమారు వెయ్యి రూపాయలు ఉంటుంది. ఇంత కంటే తక్కువ ధరల్లోనూ ఉన్నప్పటికీ శుభ్రత, సౌకర్యాల విషయంలో తేడా ఉంటుంది. 

టూర్ ప్యాకేజీలు

థామస్ కుక్ సంస్థ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి రూ.26,000 ప్రారంభ ధరతో ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. ఇది మూడు రాత్రులు, నాలుగు రోజుల పర్యటనకే పరిమితం. ఇతర సంస్థలు కూడా ఈ స్థాయి ధరల నుంచి పలు రకాల ప్యాకేజీలను అందిస్తున్నాయి.  

representational image

సందర్శనీయ క్షేత్రాలు

కొలంబో: చూడ్డానికి ఆధునికంగా ఉంటుంది. నగరంలో ఉత్తర భాగం వ్యాపార కేంద్రంగా ఉంటే, దక్షిణ భాగం నివాసాలు, పచ్చదనంతో ఆహ్లాదంగా ఉంటుంది. 

అనురాధపుర: శ్రీలంకకు తొలి రాజధాని. క్రీస్తు పూర్వం 380లో రాజధానిగా ఏర్పడగా... వెయ్యేళ్లకుపైగా సింహళీయులు అనురాధపురను రాజధానిగా చేసుకుని పాలన సాగించారు. ఇక్కడి మహాబోధి వృక్షం పవిత్ర ప్రదేశంగా గుర్తింపు పొందింది. 

క్యాండీ: పర్వత ప్రాంతంలో నిర్మితమైన ఈ పట్టణం ఒకప్పుడు బౌద్ధుల రాజధానిగా విలసిల్లింది. ప్రకృతిపరమైన అందాలతో ఎక్కువ మంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. 

సిగిరియా: రాతితో కూడిన చారిత్రక ప్రదేశం. 656 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఐదో దశాబ్దానికి చెందినది. 1500 ఏళ్ల క్రితం గోడలపై వేసిన చిత్రాలు ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం విశేషం.  

అకున: 43 అడుగుల ఎత్తులో ఉన్న ఐదో శతాబ్ద కాలానికి చెందిన బుద్ధ విగ్రహం ఇక్కడి ప్రత్యేకత. 

యాల: దక్షిణ ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశం 98వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. చిరుతలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. ఇతర జంతువులకు కూడా ఇది సంరక్షణ కేంద్రంగా ఉంది. 

పొలన్నరువా: 12వ శతాబ్ద కాలపు శిల్ప నిర్మాణ నైపుణ్యంతో  ఉంటుంది. ప్రాచీన నీటి పారుదల పద్ధతులు, నీటి తొట్టెలు తదితర విశేషాలను ఇక్కడ చూడవచ్చు. 

representational image

దంబుల్లా: ఎన్నో గుహల సముదాయం. వాటిల్లో బౌద్ధ చరిత్రకు సంబంధించిన విశేషాలను దర్శించుకోవచ్చు. 

హిక్కదువా: సాగర తీరంలో రిసార్టులతో పర్యాటకులను, డైవింగ్ ప్రియులను ఆకర్షిస్తోంది. 

ఉనవటున: తాబేళ్ల కేంద్రం. సంజీవని కోసం హిమాలయ పర్వత భాగాన్ని హనుమంతుడు తీసుకెళుతుండగా రాలి పడిన చిన్న భాగమే ఉనవటువగా చెబుతారు. ప్రపంచంలో ప్రముఖ అందమైన బీచ్ లలో ఇది కూడా ఒకటి. 

ఉదవలావే: 30,800 హెక్టార్లలో ఉన్న ఈ నేషనల్ పార్క్ లో సుమారు 400 వరకు ఏనుగులు నివసిస్తున్నాయి. ఇతర జంతువులకు కూడా ఆవాసంగా ఉంది.  

ఆడమ్స్ పీక్: సెంట్రల్ శ్రీలంకలో 7,359 అడుగుల ఎత్తయిన పర్వత ప్రదేశం. శ్రీపాదగా దీనికి పేరు. బుద్ధుడి పాద ముద్రలు ఉన్న ప్రాంతంగా చెబుతారు. చారిత్ర ప్రాధాన్యం ఉన్న ప్రదేశం. 

బెంటోట: తీర పట్టణం. ఆయుర్వేద వైద్యానికి కేంద్రం. కొలంబోకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

X

Feedback Form

Your IP address: 67.225.212.107
Articles (Education)