ap7am logo

అమెరికాలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలు

Tue, May 02, 2017, 12:06 PM
Related Image

అమెరికాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులు అందుకు ప్రాథమికంగా కొన్ని అర్హతలు సాధించాల్సి ఉంటుంది. ప్రధానంగా బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులలో ప్రవేశాలకు శాట్ లేదా యాక్ట్ పరీక్ష... మాస్టర్స్ డిగ్రీలలో ప్రవేశాలకు జీమ్యాట్, జీఆర్ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వీటికి తోడు ఇంగ్లిష్ భాషా నైపుణ్యానికి సంబంధించి టోఫెల్ లేదా ఐఈఎల్టీఎస్ పరీక్షలను రాయడం తప్పనిసరి. అసలు ఈ పరీక్షల ప్రాధాన్యం, అవసరాలు, రిజిస్ట్రేషన్ తదితర వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్)

అమెరికాలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు శాట్ పరీక్ష అర్హత కల్పిస్తుంది. సింగపూర్, కెనడా సహా పలు దేశాల్లోని ప్రముఖ వర్సిటీలు సైతం శాట్ స్కోర్ ను గుర్తిస్తున్నాయి. ఈ పరీక్షను కాలేజ్ బోర్డ్ అనే లాభాపేక్ష రహిత సంస్థ నిర్వహిస్తోంది. విద్యార్థులందరికీ ప్రతిభ ఆధారంగా సమాన అవకాశాలు కల్పించడమే ఈ సంస్థ ఆశయం. ఇంటర్ పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్షలో రీజనింగ్, సబ్జెక్ట్ టెస్టులనే రెండు విభాగాలు ఉన్నాయి.  

రీజనింగ్ టెస్ట్

శాట్ రీజనింగ్ పరీక్షను రైటింగ్, క్రిటికల్ రీడింగ్, మ్యాథ్స్ అంశాలపై నిర్వహిస్తారు. విద్యలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలను, విశ్లేషణాత్మక, సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాలను ఇందులో చూస్తారు. మూడు పేపర్లు కలిపి మొత్తం 2,400 మార్కులకు ఉంటుంది. ప్రతీ విభాగానికి 800 మార్కులు. మ్యాథ్స్ సగటు స్కోర్ 516 మార్కులు, క్రిటికల్ రీడింగ్ పేపర్ సగటు మార్కులు 501 మార్కులు, రైటింగ్ సగటు మార్కులు 492. పరీక్షా సమయం 3 గంటల 45 నిమిషాలు. మొత్తం పది సెక్షన్లు. ప్రతీ సెక్షన్ లోనూ మూడు విభాగాలతోపాటు ఈక్వేటింగ్ సెక్షన్ ఒకటి ఉంటుంది. ఒకరు ఎన్నిసార్లయినా పరీక్షను రాయవచ్చు. కొన్ని టాప్ కాలేజీలు, యూనివర్సిటీలు 2200 స్కోర్ అడుగుతాయి. చాలా కాలేజీలు, యూనివర్సిటీలు సగటు స్కోరును అడ్మిషన్లకు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

క్రిటికల్ రీడింగ్ సెక్షన్ లో మూడు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు 25 నిమిషాల చొప్పున, ఒక పేపర్ 20 నిమిషాలకు ఉంటుంది. క్రిటికల్ రీడింగ్, సెంటెన్స్ లెవల్ రీడింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కంప్లీషన్స్, పేరాగ్రాఫ్ లెంత్ క్రిటికల్ రీడింగ్ అంశాలపై పరీక్ష ఉంటుంది. ఇక, మ్యాథమేటిక్స్ సెక్షన్ లోనూ 25 నిమిషాల చొప్పున రెండు పేపర్లు, 20 నిమిషాలతో మరో పేపర్ ఉంటుంది. నంబర్లు, ఆపరేషన్లు, అల్జీబ్రా, ఫంక్షన్స్, జామెట్రీ, స్టాటిస్టిక్స్ తదితర అంశాల్లో పరీక్ష నిర్వహిస్తారు. కాలిక్యులేటర్ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. మూడో పరీక్ష ప్రాబ్లమ్ సాల్వింగ్ పై ఉంటుంది. 60 నిమిషాల వ్యవధిలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు 35 నిమిషాలు, వ్యాసరచనకు 25 నిమిషాల సమయం ఇస్తారు. 

శాట్ సబ్జెక్ట్ టెస్టులు

ఇంగ్లిష్, హిస్టరీ, మ్యాథమేటిక్స్, సైన్స్, లాంగ్వేజ్ అంశాల్లో పరీక్షలు ఉంటాయి. అప్పటి వరకు స్టూడెంట్ లైఫ్ లో విద్యార్థి ఈ సబ్జెక్టులలో ఆర్జించిన విజ్ఞానాన్ని పరీక్షిస్తారు. వీటిలో కనీసం రెండు సబ్జెక్ట్ అంశాల్లో మంచి స్కోరును అమెరికాలోని చాలా కళాశాలలు అడుగుతున్నాయి. కళాశాలలను సంప్రదించినప్పుడు శాట్ లో ఏ సబ్జెక్టులలో స్కోరు కావాలన్న విషయం తెలుస్తుంది. మరికొన్ని కళాశాలలు సబ్జెక్ట్ అంశాన్ని విద్యార్థుల ఇష్టానికే వదిలేస్తున్నాయి. ప్రిపరేషన్ పుస్తకాలను యూఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సహా పలు సంస్థలు అందిస్తున్నాయి. ఏటా అక్టోబర్ నుంచి జూన్ మధ్యలో ఆరు సార్లు పరీక్ష నిర్వహిస్తారు. దేశంలో హైదరాబాద్ తోపాటు అన్ని ప్రముఖ నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

శాట్ స్కోరుతోపాటు హైస్కూల్లో గ్రేడ్ పాయింట్ యావరేజ్, టీచర్ల నుంచి రికమెండేషన్ లెటర్లు, ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థుల అర్హతలను తేలుస్తాయి. అలాగే, ప్రవేశానికి ముందు వ్యాస రచన, పర్సనాలిటీ టెస్టుల్లో కూడా విద్యార్థుల సామర్థ్యాన్ని కొన్ని కళాశాలలు పరీక్షిస్తాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎక్కడ కూడా బ్యాక్ లాగ్స్ లేకుండా చూసుకోవాలి. భవిష్యత్తులో అమెరికాలో చదువుకోవాలనే కలలతో ఉన్నవారు  హైస్కూల్ నుంచి ఇంటర్ వరకు మెరిట్ పరంగా ఉన్నత స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. సగటున 65 శాతానికి తగ్గకుండా చూసుకుంటే మంచిది.  వివరాలకు http://studyabroad.shiksha.com/  https://collegereadiness.collegeboard.org/sat వెబ్ సైట్ లను చూడవచ్చు.

శాట్ పరీక్ష కోసం ప్రిపరేషన్ ఇంటర్ మొదటి సంవత్సరం తర్వాత నుంచే ప్రారంభించడం మంచిది. ఓ నెల కఠిన సాధన చాలా వరకు ఉపకరిస్తుంది. ఆ తర్వాత మాక్ టెస్టులు రాస్తూ ఉంటే మంచి అనుభవం పొందవచ్చు. పరీక్ష పూర్తయ్యే వరకూ రోజుకో టెస్ట్ రాసేవారూ ఉన్నారు. అదే సమయంలో మంచి కాలేజీని ఎంచుకుకోవడంపైనా దృష్టి సారించాలి. 

representational image

అమెరికన్ కాలేజీ టెస్టింగ్ (ఏసీటీ/యాక్ట్)

అమెరికాలోని కొన్ని యూనివర్సిటీలు బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు యాక్ట్ టెస్టును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇది అచ్చం శాట్ పరీక్ష వంటిదే. శాట్ పరీక్ష, యాక్ట్ పరీక్షకు మధ్య తేడా ఏమీ లేదు. కాకపోతే యాక్ట్ లో ఎక్కువగా విద్యార్థి ఆప్టిట్యూడ్ ను పరీక్షిస్తారు. అయితే అమెరికాలోని చాలా వర్సిటీలు శాట్, యాక్ట్ రెండింటినీ ఆమోదిస్తున్నాయి. కొన్ని మాత్రం శాట్ ఒక్కదాన్నే ఆమోదిస్తున్నాయి. కనుక అడ్మిషన్ కోరుకునే యూనివర్సిటీని బట్టి రెండింటిలో ఏ పరీక్ష రాయలన్న విషయాన్ని నిర్ణయించుకోవచ్చు. ఇంటర్ పూర్తయిన వారు లేదా ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న వారు సైతం యాక్ట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే ఐదేళ్ల పాటు గడువు ఉంటుంది. అంటే ఆ లోపు తిరిగి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. 

ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, రీడింగ్, సైన్స్ అంశాల్లో యాక్ట్ పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్ 75 ప్రశ్నలతో 45 నిమిషాల పాటు ఉంటుంది. మ్యాథమేటిక్స్ 60 ప్రశ్నలతో 60 మార్కులకు, రీడింగ్ 40 ప్రశ్నలతో 35 నిమిషాల పాటు, సైన్స్ 40 ప్రశ్నలతో 35 నిమిషాల పాటు ఉంటుంది. యాక్ట్ ప్లస్ పరీక్షలో అప్షనల్ గా 30 నిమిషాలకు రాత పరీక్ష కూడా ఉంటుంది. ఇందులో హైస్కూల్ స్థాయి ఇంగ్లిష్ రచనా నైపుణ్యాన్ని చూస్తారు. యాక్ట్ పరీక్షకు 2.55 గంటలు, యాక్ట్ ప్లస్ పరీక్షకు 3.25 గంటల పాటు పరీక్షా సమయం ఉంటుంది. సెప్టెంబర్ నుంచి జూన్ వరకు ఏటా ఆరు సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంటారు. రిజిస్ట్రేషన్ ఇతర పూర్తి వివరాలకు http://www.act.org/ వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. 

representational image

టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారీన్ లాంగ్వేజ్ (టోఫెల్)

అమెరికా వర్సిటీల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు శాట్ తో పాటు టోఫెల్ పరీక్ష కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారీన్ లాంగ్వేజ్ (టోఫెల్) అనేది అభ్యర్థుల ఇంగ్లిష్ నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు నిర్వహించే పరీక్ష. అభ్యర్థి విదేశీ యూనివర్సిటీలలో చేరితే అక్కడి ఇంగ్లిష్ బోధనను అర్థం చేసుకోగలడా? మాట్లాడగలడా? రాయడంలో అతడికి ఉన్న నైపణ్యం, ఇతరత్రా సామర్థ్యాలను ఈ పరీక్ష ద్వారా చూస్తారు. 10 2 పూర్తి చేసిన వారు దీన్ని రాసేందుకు అర్హులు. ఇంగ్లిష్ మాతృ భాషగా లేని దేశాల వారు అమెరికా వంటి ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో ఉన్నత విద్య కోసం ఈ పరీక్ష ద్వారా ఇంగ్లిష్ భాషా సామర్థ్యాలు ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని కళాశాలలు శాట్ లో టాప్ స్కోరు ఉన్న వారికి టోఫెల్ నుంచి మినహాయింపు కల్పిస్తున్నాయి. ఈ అవకాశం అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్న యూనివర్సిటీలో ఉందా? లేదా? అన్నది పరిశీలించుకుని తదుపరి అడుగు వేయాలి. యూనివర్సిటీని సంప్రదించినప్పుడు ఇలాంటి మినహాయింపులు, కావాల్సిన అర్హతలపై పూర్తి వివరాలు పొందవచ్చు. 

ఇంగ్లిష్ మాట్లాడడం, రాయడం, చదవడం, వినడం అనే అంశాలపై పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. రీడింగ్ విభాగంలో 36 నుంచి 56 ప్రశ్నలు ఉంటాయి. 60 నుంచి 80 నిమిషాల వ్యవధి ఉంటుంది. మూడు నుంచి నాలుగు ప్యాసేజీలను చదివి వాటికి జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. రెండో పరీక్షలో లెక్చర్లు, క్లాస్ రూమ్ లో చర్చలు, సంభాషణలను విని 34 నుంచి 51 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. సమయం 60 నుంచి 90 నిమిషాలు ఇస్తారు. స్పీకింగ్ సెక్షన్ లో టాపిక్స్ పై మాట్లాడాల్సి ఉంటుంది. ఇందులో ఆరు టాస్క్ లకు గాను 20 నిమిషాల సమయం ఇస్తారు. చివరిగా ఇంగ్లిష్ రాసే విభాగంలో రెండు టాస్క్ లు ఇచ్చి 50 నిమిషాల సమయం ఇస్తారు. 

అమెరికాలో చాలా వరకు టాప్ యూనివర్సిటీలలో ఎంఎస్ వంటి మాస్టర్స్ డిగ్రీలలో ప్రవేశాలకు టోఫెల్ లో 100 స్కోరు తప్పనిసరి. కొన్ని ప్రముఖ వర్సిటీలు 90 మార్కులు వచ్చినా ఆమోదిస్తున్నాయి. మిగతా వర్సిటీలో ప్రవేశాలకు కనీసం 80 స్కోరు అయినా ఉండాలి. ఏ యూనివర్సిటీ ఎంత స్కోరును చూస్తుందన్న విషయాన్ని http://www.msinus.com/content/toefl-cut-off-score-323/#.VvK2G9J95kg వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. యూనివర్సిటీ వెబ్ సైట్లలోనూ సమాచారం అందుబాటులో ఉంటుంది. 

టోఫెల్ పరీక్షను వారాంతపు రోజుల్లో ఏడాది పొడవునా నిర్వహిస్తుంటారు. దేశవ్యాప్తంగా 71 సెంటర్లలో జరుగుతుంది. పరీక్షకు సంబంధించి మరిన్ని వివరాలకు http://www.ets.org/toefl, http://studyabroad.shiksha.com/exams/toefl/home ని సందర్శించవచ్చు. భారతీయులైతే స్వదేశంలో ఇంటర్నెట్ ఆధారిత పరీక్ష(ఐబీటీ) రాయాల్సి ఉంటుంది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుంతో మూడు రోజుల ముందు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ఫోన్, మెయిల్ ద్వారా, వ్యక్తిగతంగానూ మాస్టర్ టోఫెల్ ఐబీటీ సెంటర్ కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, పరీక్షా కేంద్రం వివరాలకు https://www.ets.org/ వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా పూర్తి వివరాలపై అవగాహనకు రావచ్చు. పరీక్ష ఫీజు 160 నుంచి 250 డాలర్ల మధ్య ఉంటుంది.

representational image

ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్టీఎస్)

ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్టీఎస్) కూడా టోఫెల్ వంటిదే. దీన్ని బ్రిటిష్ కౌన్సిల్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, ఐడీపీ ఐఈఎల్టీఎస్ ఆస్ట్రేలియా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియంలో చదివేందుకు వీలుగా విద్యార్థికి అవసరమైన భాషా నైపుణ్యాలను ఈ పరీక్షలో భాగంగా అంచనా వేస్తారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అకడమిక్ లేదా జనరల్ ట్రైనింగ్ రీడిండ్... రైటింగ్ మాడ్యూల్స్ లో ఒక దాన్ని ఎంచుకునే సౌలభ్యం ఉంది. ఉన్నత విద్య కోసం అయితే అకడమిక్… విద్యాయేతర శిక్షణ, పని అనుభవం, ఇమిగ్రేషన్ అవసరాల కోసం అయితే, జనరల్ ట్రైనింగ్ పరీక్ష రాయాలి. అమెరికాలోని మూడువేల విద్యా సంస్థలతోపాటు బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని విద్యా సంస్థలు ఐఈఎల్టీఎస్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అమెరికాలోని చాలా వర్సిటీలు ఐఈఎల్టీఎస్ లో కనీసం 6 స్కోరును అడుగుతున్నాయి. యూనివర్సిటీల వెబ్ సైట్లలోనూ ఈ సమాచారం లభిస్తుంది. అలాగే http://www.msinus.com/content/180-ielts-universities-ielts-score-6-700/#.VvK4jdJ95kg  వెబ్ సైట్ ను చూడడం ద్వారా కొంత సమాచారం తెలుసుకోవచ్చు.  

ప్రపంచ వ్యాప్తంగా 1100 కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుంది. టెస్ట్ ఫార్మాట్ లో నాలుగు ఉప పరీక్షలు ఉంటాయి. రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ అంశాలపై పరీక్ష ఉంటుంది. ఈ నాలుగింటినీ రాయాల్సి ఉంటుంది. అకడమిక్, నాన్ అకడమిక్ రాసే వారు అందరూ లిజనింగ్, స్పీకింగ్ కామన్ గా రాయాలి. రీడింగ్, రైటింగ్ మాత్రం ఇద్దరికీ వేర్వేరుగా ఉంటుంది. మొత్తం 2.45 గంటల పాటు పరీక్ష ఉంటుంది. లిజనింగ్ విభాగంలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో దానిలో పది ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 30 నిమిషాల సమయం ఉంటుంది. స్పీకింగ్ పరీక్షకు 11 నుంచి 14 నిమిషాల సమయం ఇస్తారు. రీడింగ్ పేపర్ లో 60 నిమిషాల చొప్పున సమయం ఇస్తారు. మూడు సెక్షన్లు, నలభై ప్రశ్నలు ఉంటాయి. రైటింగ్ విభాగంలో రెండు టాస్క్ లు ఇస్తారు. 150 నుంచి 2750 వరకు పదాలు ఉంటాయి. 60 నిమిషాల సమయం ఉంటుంది. లిజనింగ్, రీడింగ్, రైటింగ్ ఈ మూడు విభాగాల్లోని పరీక్షలు ఒకరోజులోనే పూర్తవుతాయి. స్పీకింగ్ మాడ్యూల్ మరో రోజు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ ఇతర వివరాలకు https://www.britishcouncil.in/exam/ielts/test-dates-fees-and-locations, https://www.ielts.org/ వెబ్ సైట్లను పరిశీలిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. 

representational image

గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ (జీఆర్ఈ)

ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్) అనే సంస్థ జీఆర్ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఎంఎస్, ఎంబీయే, ఎంఈఎం, డాక్టోరల్ వంటి కోర్సులలో ప్రవేశాలకు, ఫెలోషిప్ లు, పరిశోధన కార్యక్రమాల్లో ప్రవేశాల కోసం జీఆర్ఈ రాయాల్సి ఉంటుంది. భారత్ నుంచి ఎక్కువ మంది అమెరికాలో ఎంఎస్, బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సులు చేసేందుకు వెళుతున్న విషయం తెలిసిందే. గతంలో బిజినెస్ కోర్సుల కోసం వెళ్లేవారు కచ్చితంగా జీమ్యాట్ రాయాల్సి వచ్చేది. అయితే, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 600 వరకు బిజినెస్ స్కూళ్లు జీఆర్ఈ ఆధారంగానూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. యూరోప్, యూకే, ఆస్ట్రేలియా వర్సిటీలు సైతం జీఆర్ఈ స్కోరును ఆమోదిస్తున్నాయి. 

బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సు చేసిన వారు లేదా 16 సంవత్సరాల విద్య పూర్తి చేసుకున్న వారు ఎవరైనా సరే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, అమెరికాలోని వర్సిటీల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ అగ్రికల్చరల్, బీఆర్క్ కోర్సుల్లో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వారు జీఆర్ఈ రాయకుండానే నేరుగా మాస్టర్స్ ప్రోగ్రాములలో ప్రవేశం పొందవచ్చు. 

జీఆర్ఈలో హై స్కోరు ఉంటే సీటు వచ్చేస్తుందని అనుకోవద్దు. ఇంకా చాలా పారా మీటర్లలో అభ్యర్థుల అర్హతలను తేల్చిన తర్వాతే ప్రవేశం కల్పిస్తారు. భారత్ లో కంప్యూటర్ పై ఈ పరీక్ష ఉంటుంది. వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్ (క్వాంట్), అనలైటికల్ రైటింగ్ అనే మూడు విభాగాల్లో పరీక్ష ఉంటుంది. ప్రముఖ కళాశాలల్లో ప్రవేశం కావాలనుకుంటే కనీసం 320 మార్కులు సాధించాలి.  ఒక అభ్యర్థి ఏడాదిలో ఐదు సార్లు ఈ పరీక్ష రాయవచ్చు. రెండు పరీక్షల మధ్య 21 రోజుల విరామం ఉండాలి. 

సబ్జెక్ట్ టెస్టులు

జీఆర్ఈ జనరల్ టెస్ట్ తో పాటు ఏడు రకాల సబ్జెక్ట్ టెస్టులు కూడా ఉంటాయి. వీటి ద్వారా ప్రత్యేకంగా ఆ రంగంలో అభ్యర్థి నాలెడ్జ్ ను పరీక్షిస్తారు. బయోకెమిస్ట్రీ, సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, బయాలజీ, కెమిస్ట్రీ, లిటరేచర్ ఇన్ ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ సబ్జెక్టుల్లో ఒక దానిలో అభ్యర్థి విజ్ఞానాన్ని పరీక్షిస్తారు. 160 దేశాల్లో ఈ పరీక్ష జరుగుతుంటుంది. ఒకసారి పరీక్ష రాస్తే ఆ స్కోరును రెండేళ్ల వరకు యూనివర్సిటీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా కశాశాలలు, భారత్ లోని బిజినెస్ కళాశాలలు కూడా ప్రవేశాలకు జీఆర్ఈ స్కోర్ ను ఆమోదిస్తున్నాయి. 

జీఆర్ఈ జనరల్ టెస్ట్ ద్వారా వెర్బల్ రీజనింగ్, క్వాంట్, క్రిటికల్ థింకింగ్, అనలైటికల్ రైటింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. సబ్జెక్ట్ టెస్టులో ప్రత్యేకంగా ఆయా సబ్జెక్ట్ నైపుణ్యాన్ని అంచనా వేస్తారు. మొత్తం పరీక్షా సమయం 3 గంటల 45 నిమిషాలు. ఆరు సెక్షన్లు ఉంటాయి. అనలైటికల్ రైటింగ్ మొదటిది. ప్రతీ పరీక్షకు ఒక నిమిషం మాత్రమే బ్రేక్ ఉంటుంది. క్వాంట్ సెక్షన్ లో పదో తరగతి స్థాయి మ్యాథ్స్ పై ప్రశ్నలు ఇస్తారు. 20 ప్రశ్నలకు 35 నిమిషాల సమయం ఉంటుంది. 

వెర్బల్ రీజనింగ్ సెక్షన్ లో వొకాబ్యులరీ, ఇంగ్లిష్ లో ప్రాథమిక పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉంటాయి. దీనికి 30 నిమిషాల్లో 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఈ పరీక్షలో మంచి స్కోరు రావాలంటే కొన్ని నెలల ముందు నుంచే సాధన ప్రారంభించడం మంచిదని సీనియర్ విద్యార్థుల సలహా. అనలైటికల్ రైటింగ్ అసెస్ మెంట్ (ఏడబ్ల్యూఏ) సెక్షన్ లో రెండు చిన్న వ్యాసాలను రాయాల్సి ఉంటుంది. ఇందుకు 30 నిమిషాల సమయం ఇస్తారు. ప్రిపరేషన్ బుక్స్ ను పరిశీలించడం ద్వారా ఏ విధమైన రచనా తీరును కోరుతున్నదీ అభ్యర్థులు అర్థం చేసుకోవచ్చు.  ఒక్కో సెక్షన్ కు 170 మార్కుల చొప్పున మొత్తం 340 మార్కులు ఉంటాయి. రైటింగ్ పరీక్షకు ఆరు మార్కులు ఉంటాయి గానీ, దీన్ని మెయిన్ స్కోర్ కు కలపరు.  

అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలలో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే వారు జీఆర్ఈలో కనీసం 320 మార్కులు తెచ్చుకోవడం మంచిదని సీనియర్లు, నిపుణుల సూచన. 320 నుంచి 330 మధ్య స్కోరు ఉంటే సురక్షితమని భావిస్తారు. అత్యధిక స్కోరు ఉన్నంత మాత్రాన అడ్మిషన్ వస్తుందనే గ్యారంటీ లేదు. 338 మార్కులు తెచ్చుకున్నవారి దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురైన సందర్భాలు ఉన్నాయి. 300 మార్కులతోనూ పలు యూనివర్సిటీలలో ప్రవేశం సాధించవచ్చు. టాప్ యూనివర్సిటీలు ఎంత స్కోరును పరిగణనలోకి తీసుకుంటున్నాయన్న సమాచారాన్ని http://www.msinus.com/content/average-gre-scores-us-universities-219/#.VvKYmdJ95kh,  http://www.atozbulletin.com/2013/09/list-of-all-us-universities-based-on.html వెబ్ సైట్ లింకుల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఆయా యూనివర్సిటీ వెబ్ సైట్లను చూడడం ద్వారాను సమాచారం తెలుస్తుంది.  

ఆన్ లైన్, ఫోన్, ఫ్యాక్స్, మెయిల్ ద్వారా జీఆర్ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. ముందుగా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా తగిన మెటీరియల్ పొంది ప్రిపేర్ అవడానికి తగినంత సమయం ఉంటుంది. ww.gre.org వెబ్ సైట్ ను సందర్శించి మరిన్ని వివరాలు పొందడంతోపాటు పరీక్షకు నమోదు చేసుకోవచ్చు. 91-124-4147700 ఫోన్ నంబర్ కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చు. హైదరాబాద్ లో జీఆర్ఈ పరీక్షా కేంద్రం చిరునామా చూస్తే… 

HYDERABAD 8908, INDIA

PROMETRIC TESTING PVT LTD

Plot # 96, Road #2, Meenakshi Banjara Ville,

HYDERABAD

representational image

గ్రాడ్యుయేట్ మేనేజ్ మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్ )

అమెరికాతోపాటు పలు దేశాల్లో బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాల కోసం. ఎంబీయే వంటి డిగ్రీలు చేయాలనుకునే విద్యార్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్, మ్యాథ్స్ అంశాలతోపాటు, అనలైటికల్, లాజికల్ స్కిల్స్ ను పరిశీలిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేల ప్రొగ్రామ్ లలో అడ్మిషన్లకు ఈ పరీక్షను ప్రామాణికంగా తీసుకుంటున్నారు .అమెరికాలోని బిజినెస్ స్కూళ్లు, యూరప్, ఇతర దేశాల్లో బిజినెస్ స్కూళ్లలో జీమ్యాట్ ద్వారా ప్రవేశం పొందవచ్చు. స్టాన్ ఫర్డ్, హార్వర్డ్, యేల్ వంటి టాప్ టెన్ బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాలు పొందాలనుకుంటే జీమ్యాట్ లో 800 మార్కులకు గాను 720పైన మార్కులు తెచ్చుకోవాలి. మధ్యస్థాయి కాలేజీల్లో సీటు కోసం కనీసం 570 మార్కులైనా తెచ్చుకోవాలి. పరీక్ష రాసిన వారిలో మూడింట రెండు వంతుల మంది స్కోరు 400 నుంచి 600 మధ్యలో ఉంటోంది. 

ఈ పరీక్షలో భాగంగా డిగ్రీ కోర్సుల్లో అభ్యర్థి సాధించిన అనుభవం, మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఉన్న సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. భారత్ లోని మేనేజ్ మెంట్ స్కూళ్లు సైతం జీమ్యాట్ పర్సంటైల్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. దీనితోపాటు పర్సంటైల్, గ్రూపు డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థుల అర్హతను నిర్ణయిస్తారు. అనలైటికల్ రైటింగ్ అసెస్ మెంట్ సెక్షన్ కు 30 నిమిషాల సమయం ఇస్తారు. ఇంటెగ్రేటెడ్ రీజనింగ్ సెక్షన్ లో 12 ప్రశ్నలకుగాను 30 నిమిషాల సమయం ఉంటుంది. క్వాంట్ పై 37 ప్రశ్నలకు 75నిమిషాల వ్యవధి ఇస్తారు. వెర్బల్ కు సంబంధించి 41 ప్రశ్నలకు 75 నిమిషాల సమయంలో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. 

అనలైటికల్ రైటింగ్ అసెస్ మెంట్

అనలైటికల్ రైటింగ్ అసెస్ మెంట్ లో అభ్యర్థి కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని చూస్తారు. ఐడియాలు, తన ఆలోచనలను అభ్యర్థి ఎంత సమర్థవంతంగా చెప్పగలడనేది వ్యాసరచన ద్వారా నిర్ణయిస్తారు. 30 నిమిషాల సమయం ఇస్తారు. రాసిన తర్వాత అభ్యర్థి వ్యాసాన్ని కంప్యూటర్ ప్రోగ్రామ్ మదించి ఒక స్కోరు ఇస్తుంది. ఇది కాకుండా ఓ నిపుణుడు కూడా ప్రతీ పేపర్ ను ప్రత్యక్షంగా వాల్యుయేషన్ చేసి స్కోరు ఇస్తారు. రెండు స్కోర్లను కలిపి సగటు స్కోర్ ను ఖరారు చేస్తారు. 

ఇంటెగ్రేటెడ్ రీజనింగ్

భిన్న రకాల వేదికల నుంచి ఏరి కోరి తీసుకొచ్చిన డేటాను ఇచ్చి ఒక్కటిగా మదింపు చేయమంటే ఎలా చేస్తారు?  ఈ పరీక్షలో ఇలాంటివే అడగడం ద్వారా అభ్యర్థి సామర్థ్యాన్ని చూస్తారు. 12 ప్రశ్నలు, వాటిలో సబ్ పార్ట్స్ కూడా ఉంటాయి. టేబుల్, గ్రాఫ్స్ లు కూడా ఇస్తారు. 

క్వాంట్ సెక్షన్

ఆల్జీబ్రా, జామెట్రీ, అర్థమెటిక్ పై ప్రశ్నలు ఉంటాయి. గ్రాఫిక్ డేటా ఇచ్చి సమస్యలను పరిష్కరించాలని అడుగుతారు. స్కోర్ రేంజ్ 0 నుంచి 60 మధ్యలో ఉంటుంది. 

వెర్బల్ సెక్షన్

డేటాను చదివి దాన్ని విశ్లేషించడం, సమాచారాన్ని సరిదిద్దడం వంటి టాస్క్ లు ఇందులో ఉంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్, క్రిటికల్ రీజనింగ్, సెంటెన్స్ కరెక్షన్ ఉంటుంది. జీమ్యాట్ పరీక్ష పూర్తయిన తర్వాత రాసిన తీరుపై సంతృప్తి అనిపించకపోతే పరీక్షా ఫలితాలను రద్దు చేయాలని కోరేందుకు అవకాశం ఉంది. అలా కోరిన తర్వాత తిరిగి పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. ఏడాదిలో ఐదు పర్యాయాలు మాత్రమే రాయడానికి అవకాశం ఉంటుంది. నాలుగు విభాగాలుగా ఈ పరీక్ష ఉంటుంది. 

జీమ్యాట్ పరీక్ష ఏడాది పొడవునా జరుగుతుంది. పరీక్షకు కొన్ని నెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవడం నయం. స్లాట్లు పరిమితంగా ఉంటాయి కనుక ముందుగా బుక్ చేసుకుంటేనే స్లాట్ లభిస్తుంది. ఆన్ లైన్, ఫోన్, మెయిల్, ఫ్యాక్స్ ద్వారానూ నమోదు చేసుకోవచ్చు. జీమ్యాట్ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలకు http://www.mba.com/india వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు.

మెడికల్ కాలేజీ అడ్మిషన్ టెస్ట్ (ఎంక్యాట్)

నార్త్ అమెరికాలోని మెడికల్ కాలేజీలలో చేరాలంటే ఎంక్యాట్ రాయడం తప్పనిసరి. ఏడాది పొడవునూ ఈ పరీక్ష ఉంటుంది. నాలుగున్నర గంటల పాటు జరిగే పరీక్షలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. వెర్బల్ రీజనింగ్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్సెస్, వాలంటరీ ట్రయల్ సెక్షన్లున్నాయి. మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో జరిగే ఈ పరీక్షలో ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, రైటింగ్ నైపుణ్యాలు ఎలా ఉన్నదీ చూస్తారు. 

ఈ ఆర్టికల్ మీ మిత్రులకు, దగ్రరి వాళ్లకు  కూడా ఉపయోగ పడుతుందని భావిస్తున్నారా... అయితే షేర్ చేయడం మరవకండి!

Read: అమెరికాలో చదువుకోవాలంటే... పూర్తి సమాచారం.. సంక్షిప్తంగా! 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy