ap7am logo

చైనాలో వైద్య విద్య చౌకగానే లభిస్తోంది!

Mon, Apr 17, 2017, 12:48 PM
Related Image

తక్కువ వ్యయం అన్నది భారతీయ విద్యార్థులను చైనా వైపు అడుగులు వేయిస్తోంది. చైనా వెళ్లే వారిలో దాదాపుగా అధిక శాతం మంది వైద్య విద్య కోసమే. అడ్మిషన్లు సులభంగా పొందడంతోపాటు ట్యూషన్ ఫీజులు కూడా తక్కువగా ఉండడం ఆకర్షణీయాంశాలు. 

ఫీజులు తక్కువ

భారత్ తో పోలిస్తే చైనాలోని విద్యా సంస్థలు వైద్య విద్యను తక్కువ ఫీజులకే అందిస్తున్నాయి. చైనాలో ఒక సెమిస్టర్ కు ఫీజు సుమారు వెయ్యి డాలర్లలోపే ఉంది. షార్ట్ టర్మ్ కోర్సుల ఫీజులు వందల డాలర్లలోపే ఉంటాయి. ఎకనమిక్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎంబీయే, ఫైనాన్స్ కోర్సులకు కూడా ఇక్కడ మంచి ఆదరణ ఉంది. అయితే, పూర్తి స్థాయి అధ్యయనం తర్వాతే చైనా వెళ్లడం శ్రేయస్కరం. 

చైనాలోని వైద్య విద్యా సంస్థలు, వాటిల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి తదితర వివరాలతో ఏటా చైనా విద్యా శాఖ (ఎంఓఈ) ఓ జాబితా విడుదల చేస్తుంది. ఈ సమాచారం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని చైనాలోని భారతీయ ఎంబసీ వెబ్ సైట్ నుంచి పొందవచ్చు. ఈ జాబితాలో లేని విద్యా సంస్థల్లో చేరవద్దని చైనా విద్యా శాఖే స్వయంగా విద్యార్థులను హెచ్చరిస్తోంది. ఎంఓఈ అనుమతించిన విద్యా సంస్థల్లో చదివిన వారికే భారతీయ వైద్య మండలి అర్హత సర్టిఫికెట్లను జారీ చేస్తుంది. అంతేకాదు, వీరే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసేందుకు అర్హులు. ఇందులో అర్హత సాధిస్తే చైనా లేదా భారత్ లో ఇంటర్న్ షిప్ చేసుకోవచ్చు. తర్వాత వైద్యుడిగానూ ప్రస్థానం ప్రారంభించవచ్చు. చైనాలోని వర్సిటీల్లో మెడిసిన్ కోర్సులో అడ్మిషన్ ను నేరుగా పొందే అవకాశం ఉంది. ఇందు కోసం ఇంటర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో కనీసం 50 నుంచి 60 శాతం మార్కులైనా కలిగి ఉండాలి. యూనివర్సిటీలను బట్టి ఈ అర్హతలు వేర్వేరుగా ఉన్నాయి.

సిలబస్ మాత్రం ఒకటే!

వాస్తవానికి భారత్, అమెరికా, యూకేల నుంచి సేకరించిన పాఠ్యాంశాలతోనే చైనా కరికులమ్ రూపొందించింది. డాలియన్ మెడికల్ యూనివర్సిటీ, హార్బిన్ మెడికల్ యూనివర్సిటీ, గ్వాంగ్జీ మెడికల్ యూనివర్సిటీ, లియాంగింగ్ మెడికల్ యూనివర్సిటీలను ప్రధానమైనవిగా పేర్కొనవచ్చు. చాలా కళాశాలలో హాస్టల్ వసతి కలదు. విద్యా సంస్థకున్న పేరు, అక్కడున్న వసతులు, ఫ్యాకల్టీ ప్రమాణాల గురించి తెలుసుకుంటే మేలు. ఏజెంట్ల సాయంతో చైనాకు వెళ్లేవారు ముందుగా ఆయా ఏజెంట్ల విశ్వసనీయత గురించి విచారించుకోవాలి. చైనా అధికార భాష మాండరిన్ నేర్చుకోవడం పెద్ద కష్టమేమీకాదు. కొన్ని నెలల్లో ప్రాథమిక పరిజ్ఞానం వస్తుంది. ఏడాది తిరిగేసరికి చైనా భాషలో మాట్లాడడం సాధ్యమే. చైనాలో వైద్య విద్యలో భాగంగా రోగులను పరీక్షించాల్సి ఉంటుంది. వారితో మాండరిన్ లోనే మాట్లాడాల్సి ఉుంటుంది. కనుక ఈ బాష నేర్చుకోవడం కూడా తప్పనిసరి.

భద్రత విషయంలో...

భద్రత విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా దక్షిణ చైనాలో ఇటీవలి కాలంలో దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోయాయి. వివిధ దేశాల విద్యార్థుల మద్య ఘర్షణలు సాధారణమైపోయాయి. ఈ నేపథ్యంలో నివాస సముదాయాల వద్ద, ప్రయాణ సమయంలోనూ తగిన అప్రమత్తత కలిగి ఉండాలి. చేతిలో ఎక్కువగా నగదు ఉంచుకోరాదు. బ్యాంకు అకౌంట్ లో ఉంచుకోవడం సురక్షితం.  

చైనాలో చదువుకుంటూ ఉద్యోగం చేసుకుని ట్యూషన్ ఫీజులు చెల్లించడానికి కుదరదు. ఇలా అని ఏ ఏజెంట్ అయినా చెప్పినట్లయితే అది తప్పుడు సమాచారంగా భావించాల్సి ఉంటుంది. ఏజెంట్ ఏవైనా హామీలు ఇస్తే వాటిని లిఖితపూర్వకంగా తీసుకోండి. వివాదం ఏర్పడిన సందర్భాల్లో ఆధారంగా పనికొస్తుంది. నాణ్యతలేని కాలేజీలలో చేరితే సమస్యే. చైనా విద్యా శాఖ నిర్దేశించిన ప్రమాణాల మేరకు అన్ని కళాశాలలు లేవు. ఈ విషయంలోనూ విద్యార్థులు తగిన విచారణలు చేసుకోవడం అవసరం. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఆరోగ్య అవసరాలకు వ్యయం ఎక్కువగా ఉంటుంది. కనుక మెడికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. చైనా వెళ్లిన వెంటనే భారతీయ ఎంబసీ కాన్సులర్ అధికారికి ఈ మెయిల్ లేదా లెటర్ ద్వారా భారతీయ విద్యార్థులు తమ పూర్తి వివరాలు తెలియజేయాలి.

రెండు రకాల వీసాలు

చైనా విద్యార్థుల వీసాలు ఎక్స్ 1, ఎక్స్ 2అని రెండు రకాలుగా ఉన్నాయి. ఆరు నెలలకు మించిన కాల వ్యవధి గల కోర్సులకు ఎక్స్ 1 వీసా జారీ చేస్తారు. అంతకంటే స్వల్పకాలానికి అయితే ఎక్స్ 2 వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ 1 వీసాను గరిష్ఠంగా ఐదేళ్ల కాల వ్యవధి కోసం ఇస్తారు. ఈ వీసాతో చైనా వెళ్లిన వారు నెలలోగా పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో వద్ద నమోదు చేసుకోవాలి. అప్పుడు చైనా నివాస అనుమతి జారీ చేస్తారు. 

వైద్య విద్యకు టాప్ టెన్
వైద్య విద్యా సంస్థల్లో పెకింగ్ యూనియన్ మెడికల్ కళాశాల, థర్డ్ మిలటరీ మెడికల్ యూనివర్సిటీ, సెకండ్ మిలటరీ మెడికల్ యూనివర్సిటీ, ద ఫోర్త్ మిలటరీ మెడికల్ యూనివర్సిటీ, కేపిటల్ మెడికల్ యూనివర్సిటీ, సౌతర్న్ మెడికల్ యూనివర్సిటీ, బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ చైనీస్ మెడిసిన్, తియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ, చైనా ఫార్మాస్యూటికల్ యూనివర్సిటీ, హార్బిన్ మెడికల్ యూనివర్సిటీలు మొదటి పది స్థానాల్లో ఉన్నాయి.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy