ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 Etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

క్రిటికల్ ఇల్ నెస్ పాలసీ... తీవ్ర అనారోగ్యం బారిన పడితే ఆదుకుంటుంది!

Tue, Sep 12, 2017, 10:05 PM
Related Image

హఠాత్తుగా మరణం సంభవిస్తే అతని కుటుంబ సభ్యులను ఆదుకునేది జీవిత బీమా పాలసీ. అనారోగ్యమో, ప్రమాదం కారణంగానో ఆస్పత్రి పాలైతే అయ్యే వ్యయాలను చెల్లించేవి హెల్త్ పాలసీలు. అలాగే, క్రిటికల్ ఇల్ నెస్ పాలసీల వల్ల కూడా ఓ ప్రత్యేకమైన రక్షణ పొందొచ్చు. ఇవి స్థిరమైన ప్రమోజనాలతో కూడిన పాలసీలు. కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయిందనుకోండి... వెంటనే రూ.20 లక్షల పాలసీ తీసుకుని ఉంటే, ఆ మొత్తాన్ని కంపెనీలు చెల్లించేస్తాయి. క్లిష్టమైన, ప్రాణాంతక వ్యాధుల్లో ఆదుకునే ఈ పాలసీల ప్రాముఖ్యతను తప్పక తెలుసుకోవాలి.


క్రిటికల్ ఇల్ నెస్ (తీవ్రమైన అనారోగ్యం) బారిన పడితే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు. మంచంపైనే చాలా కాలం పాటు ఉండిపోవాల్సి రావచ్చు. ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ సమయంలో ఆస్పత్రి ఖర్చులు, కుటుంబానికి అవసరమైన పోషణ ఖర్చులన్నింటినీ సమకూర్చుకోవడం కష్టమవుతుంది. హెల్త్ పాలసీలో అయితే ఎన్నో పరిమితులు ఉంటాయి. రూమ్ రెంట్ క్యాప్, ఐసీయూ క్యాప్ తదితరమైనవి ఉదాహరణలు. అందుకే ఎటువంటి పరిమితులు లేకుండా ఏకమొత్తంలో చెల్లించే క్రిటికల్ ఇల్ నెస్ పాలసీల అవసరం ఎంతో ఉంది.

నేటి కాలంలో జీవన విధానం కారణంగా వచ్చే ప్రాణాంతక వ్యాధులు పెరిగిపోయాయి. హార్ట్ ఎటాక్, కేన్సర్, స్ట్రోక్, మూత్ర పిండాల వైఫల్యం ఈ తరహా కేసుల సంఖ్య భారీగా ఉంటోంది. వీటి బారిన పడితే క్రిటికల్ ఇల్ నెస్ పాలసీలు ఆదుకుంటాయి. సాధారణంగా తీవ్ర వ్యాధుల బారిన పడిన వారిలో ఎక్కువ మంది చికిత్సతో సాధారణ జీవితాన్ని గడిపేయొచ్చు. కానీ, అనారోగ్యం కారణంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడొచ్చు. దాంతో ఆదాయం ఆగిపోతుంది. పిల్లల విద్య, ఇతర ఆర్థిక వ్యవహారాలకు ఇబ్బందులు ఎదురవుతాయి.  

representational imageదేనికి ఎంత రిస్క్?
కేన్సర్ బారిన పడిన వారిలో 76 శాతం మంది ప్రాణాలతో బయటపడగలరు. స్ట్రోక్ లో ఇది 65  శాతం. అవయవాల మార్పిడి చేసుకున్న వారిలో 83 శాతం, నాడీ వ్యాధుల్లో నూరు శాతం, హార్ట్ ఎటాక్ వచ్చిన వారిలో 60 శాతం, మూత్రపిండాల వైఫల్యం ఎదురైన వారిలో 52 శాతం, పక్షవాతం వచ్చిన వారిలో 94 శాతం మంది జీవించి ఉండే అవకాశాలున్నాయని వైద్య గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఇలా తీవ్ర వ్యాధులకు లోనై ప్రాణాలతో బయటపడిన వారికి ఎన్నో ఆర్థిక వనరుల అవసరం ఏర్పడుతుంది. మరి వీటిని హెల్త్ పాలసీ తీరుస్తుందా..?

హెల్త్ పాలసీ అనేది సాధారణ అనారోగ్యం, వైద్య చికిత్సలకు నిస్సందేహంగా ఉండాల్సిందే. మరి క్రిటికల్ ఇల్ నెస్ సమయాల్లో హెల్త్ ప్లాన్ ఒక్కటీ సరిపోదు. ఎందుకంటే హెల్త్ పాలసీలో కవరేజీ పరిమితంగానే ఉంటుంది. పైగా హెల్త్ పాలసీల్లో తీవ్ర అనారోగ్యాలకు కవరేజీ పరిమితమే. ఇక హెల్త్ పాలసీలో కొన్ని రకాల వ్యాధులకు ఇంతే పరిహారం అని,  ఆస్పత్రిలో గది అద్దెలు, ఐసీయూ చార్జీల్లో పరిమితులు విధిస్తుంటాయ. ఏదో విధంగా చికిత్స తీసుకుని బయటపడినప్పటికీ ఆ తర్వాత కుటుంబ పోషణ అవసరాలకు కావాల్సిన ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇటీవలి కాలంలో వైద్య బీమా పాలసీల్లో చాలా వరకు క్రిటికల్ ఇల్ నెస్ కవరేజీని మినహాయిస్తున్నాయి. ఇది కూడా గమనించాల్సిన విషయం. జీవన విధానంలో మార్పులతో ఎవరికి ఎప్పుడు ఏ రూపంలో వ్యాధుల ముప్పు ఏర్పడుతుందో తెలియని పరిస్థితి. పెరిగిపోతున్న ప్రాణాంతక వ్యాధుల ముప్పును గమనంలోకి తీసుకుని ప్రతి ఒక్కరూ క్రిటికల్ హెల్త్ కవరేజీ తీసుకోవడం మంచిది. ఇక వైద్య చికిత్సల వ్యయాలు సైతం భారీగా పెరిగిపోతున్నాయి. వైద్య బీమా ద్రవ్యోల్బణం 10 - 12 శాతంగా ఉంది. ఈ విధంగా చూసుకున్నా క్రిటికల్ ఇల్ నెస్ పాలసీ అవసరం ఉంటుంది.

కవరేజీ ఎంత?
క్రిటికల్ ఇల్ నెస్ పాలసీలో ఎంత కవరేజీ ఉండాలన్న విషయంలో కొందరిలో సందేహాలు ఉండొచ్చు. కనీసం రూ.10 లక్షల మేర కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ఇంకా చెప్పాలంటే వార్షిక ఆదాయానికి కనీసం మూడు నుంచి ఐదు రెట్ల మేర కవరేజీ ఉండాలని ప్లానర్లు సూచిస్తారు. గుర్తుంచుకోవాల్సిన అంశమేమిటంటే కవరేజీ అధికంగా కోరుకుంటే ప్రీమియం కూడా ఎక్కువగా చెల్లించుకోవాల్సి వస్తుంది.  

representational imageవేటికి?
అన్ని రకాల తీవ్ర అనారోగ్యాలు, అవయవాలకు కవరేజీ ఉండే పాలసీని ఎంచుకోవాలి. అందులోనూ ఒకే అవయవానికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులకూ రక్షణనిచ్చేదై ఉండాలి. నిజానికి వైద్యానికి సంబంధించి చాలా పదాలు అర్థం కానివై ఉంటాయి. పాలసీ తీసుకునే ముందు ఈ విధమైన సందేహాలు, అర్థం కాని పదాలుంటే ఫ్యామిలీ డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

ఉప పరిమితులు...
బీమా సంస్థలు ప్రతీ వ్యాధికి ఇంతంటూ పరిహారం విషయంలో ఉప పరిమితి విధిస్తాయి. ఉదాహరణకు రూ.10 లక్షల క్రిటికల్ ఇల్ నెస్ పాలసీ తీసుకున్నారనుకోండి. అందులో గుండెకు సంబంధించి అనారోగ్యం బయటపడితే పరిహారం పరిమితి రూ.5 లక్షలుగానే అని పేర్కొనవచ్చు. ఆ సమయంలో బీమా కంపెనీ రూ.5 లక్షలు చెల్లిస్తుంది. మిగిలిన వ్యాధులకు రూ.5 లక్షల పరిమితితో కవరేజీ కొనసాగుతుంది.

జీవిత కాలానికి
క్రిటికల్ ఇల్ నెస్ పాలసీలో చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం. జీవితాంతం సదరు కవరేజీని రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం ఉందా, లేదా అని. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ తీవ్ర వ్యాధుల ముప్పు పెరుగుతుంది. వాస్తవానికి పెద్ద వయసులో దీని అవసరం ఇంకా ఎక్కువ. అందుకే జీవితాంతం పునరుద్ధరించుకునే పాలసీ అయి ఉండాలి.

మినహాయింపులు
పాలసీ పత్రంలో మినహాయింపులన్నీ వివరంగా ఉంటాయి. వాటిని చూసి తెలుసుకోవాలి. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు సాధారణంగా మూడేళ్ల తర్వాతే కవరేజీ అమలవుతుంది. కొన్ని కంపెనీలు నాలుగేళ్ల నిబంధన పెడుతున్నాయి. కొన్నింటిలో తక్షణం కవరేజీనిస్తున్నప్పటికీ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటోంది.

representational imageసర్వైవల్ పిరియడ్
ఇక ఈ పాలసీల్లో ఉన్న ప్రధాన ప్రతికూలాంశం సర్వైవల్ లేదా వెయిటింగ్ పిరియడ్ క్లాజ్. ఉదాహరణకు పాలసీ తీసుకున్న వ్యక్తికి మూత్రపిండాల వైఫల్యం ఉన్నట్టు బయటపడిందనుకోండి. అప్పుడు కొంత కాలం పాటు పాలసీదారుడు జీవించి ఉంటేనే క్లెయిమ్ మంజూరు చేస్తాయి. మరింత వివరంగా చెప్పుకోవాలంటే సర్వైవల్ పిరియడ్ కింద 30 రోజులు ఉందనుకోండి. తీవ్ర వ్యాధి లేదా అనారోగ్యం బయటపడిన తర్వాత 30 రోజులపాటు జీవించి ఉంటేనే బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోగలరు. ఒకవేళ ఇలాంటి క్రిటికల్ ఇల్ నెస్ బయటపడిన 30 రోజుల్లోపే మరణిస్తే ఆ క్లెయిమ్ లను బీమా కంపెనీలు స్వీకరించవు. ఒక్కో వ్యాధికి ఒక్కో విధంగా ఈ సర్వైవల్ పిరియడ్ ఉంటుంది. పాలసీ తీసుకునే ముందే చెక్ చేసుకోవాలి. పాలసీ తీసుకున్న మొదటి 90 రోజుల్లో క్రిటికల్ ఇల్ నెస్ వచ్చినప్పటికీ బీమా కంపెనీలు పరిహారం ఇవ్వవు. కొన్ని కంపెనీలు మాత్రం తక్షణం కవరేజీనిస్తున్నాయి. వీటిని పరిశీలించడం ప్రయోజనం.

ప్రీమియం భరించగలరా?
అన్ని రకాల ప్రయోజనాలు ఆశించినప్పుడు ప్రీమియం సహజంగానే పెరిగిపోతుంది. అందుకే మీ అవసరాలకు కచ్చితంగా ఎంపిక చేసుకుని, ప్రీమియం భరించే స్థాయిలో ఉందా, లేదా? అన్నది గమనించాలి. పెద్ద వయసు వారయితే ప్రీమియం ఇంకా ఎక్కువే ఉంటుంది.

క్లెయిమ్ సెటిల్ మెంట్ నిష్పత్తి
ముఖ్యంగా ఏ బీమా పాలసీ అయినా చూడాల్సింది చెల్లింపుల చరిత్రే. ఎన్ని క్లెయిమ్ లు వస్తే కంపెనీ ఎన్నింటిని పరిష్కరించింది, ఎన్నింటికి చెల్లింపులు చేసిందన్నది ముఖ్యం. ఈ రేషియో ఐఆర్డీఏ వెబ్ సైట్ లో లభ్యమవుతుంది. కొన్ని కంపెనీలు సగటున ఓ క్లెయిమ్ పరిష్కారానికి ఆరు నెలలు కూడా సమయం తీసుకుంటున్నాయి. పాలసీ తీసుకునే ముందు దీన్ని కూడా చూడాలి.

representational imageరైడర్ గానా, లేక విడిగా పాలసీ రూపంలోనా?
ఇతర పాలసీలకు రైడర్లుగా క్రిటికల్ ఇల్ నెస్ పాలసీలు అందుబాటులో ఉంటున్నాయి. అలాగే విడిగా పాలసీల రూపంలోనూ ఉన్నాయి. జీవిత బీమా కంపెనీలు, హెల్త్ పాలసీలకు రైడర్ గా వచ్చే క్రిటికల్ ఇల్ నెస్ పాలసీలపై ప్రీమియం తక్కువగా ఉంటుంది. విడిగా క్రిటికల్ ఇల్ నెస్ పాలసీ తీసుకోవాలనుకుంటే వాటిపై ప్రీమియం కాస్త ఎక్కువే భరించాల్సి ఉంటుంది. కాకపోతే ఇతర పాలసీలతో రైడర్ గా వచ్చే క్రిటికల్ ఇల్ నెస్ పై కవరేజీ అసలు పాలసీ మొత్తంతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు రూ.10 లక్షలకు జీవిత బీమా పాలసీ తీసుకున్నారనుకోండి. గరిష్టంగా రూ.10 లక్షలకు మించి క్రిటికల్ ఇల్ నెస్ కవరేజీ ఎంచుకోవడానికి అవకాశం లేదు. ఇలా కాకుండా విడిగా తీసుకుంటే అందులో కవరేజీ ఎంత కావాలన్న ఎంపిక మనదే అవుతుంది.

విడిగా తీసుకునే క్రిటికల్ ఇల్ నెస్ పాలసీ ప్రీిమియం అన్నది వయసు ఆధారంగా పెరిగిపోతుంది. అదే జీవిత బీమా పాలసీకి రైడర్ గా తీసుకుంటే ప్రీమియం కాల వ్యవధి వరకు మారదు. ఎందుకంటే జీవిత బీమా పాలసీపై ప్రీమియం ఏటేటా పెరగదు కనుక. మరో అనుకూలాంశం జీవిత బీమా పాలసీకి ప్రీమియం చెల్లించేస్తే ఏక కాలంలో రెండింటికీ చెల్లించినట్టే అవుతుంది. విడిగా తీసుకుంటే విడిగానే రెండింటికీ ప్రీమియం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అందుకే జీవిత బీమా పాలసీకి అనుబంధంగా మంచి కవరేజీతో, ఎటువంటి పరిమితులు లేకుండా వచ్చే క్రిటికల్ ఇల్ నెస్ రైడర్లను ఎంచుకోవడం లాభదాయకం.

representational imageఒక్కో వ్యాధికి ఒక్కో పాలసీ
ఇప్పుడు కేన్సర్, హార్ట్ ఎటాక్, డయాబెటిక్ అంటూ వివిధ రకాల వ్యాధులకు ప్రత్యేకించిన పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో వ్యాధికి ఒక్కో పాలసీ కంటే కూడా అన్నింటికీ సమగ్రంగా కవరేజీతో వచ్చే క్రిటికల్ ఇల్ నెస్ పాలసీ తీసుకోవడమే నయం.

ప్రీమియం ఎంత...?
ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి రూ.10 లక్షలకు క్రిటికెల్ ఇల్ నెస్ పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం కనీసం 1,404 నుంచి రూ.14,600 వరకూ ఉంది. ఎక్కువ వ్యాధులకు కవరేజీ నిస్తున్న పాలసీల్లో అపోలో మ్యూనిచ్ ఆప్టిమా వైటల్ నిలుస్తుంది. ఇది 37 తీవ్ర అనారోగ్యాలకు కవరేజీనిస్తోంది. రూ.2లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కవరేజీ ఎంచుకోవచ్చు. కనీస ప్రీమియం రూ.3,835. తర్వాత మ్యాక్స్ బూపా క్రిటికేర్ లో 20 వ్యాధులకు కవరేజీ ఉంది. రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు పాలసీ ఎంచుకోవచ్చు. కనీస ప్రీమియం రూ.2,368. రెలిగేర్ అష్యూర్ లో 20 వ్యాధులకు రక్షణ ఉంది. రూ.3లక్షల నుంచి రూ.కోటి వరకు కవరేజీ అందిస్తోంది. ప్రారంభ ప్రీమియం రూ.3,367.

పన్ను ప్రయోజనాలు
క్రిటికల్ ఇల్ నెస్ పాలసీకి చెల్లించే ప్రీమియానికి సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు ఉంది. నగదు రూపంలో ప్రీమియం చెల్లిస్తే మాత్రం ఈ ప్రయోజనాన్ని కోల్పోయినట్టేనని గుర్తుంచుకోవాలి. ఈ పాలసీ కింద పరిహారం కోసం చేసే క్లెయిమ్ పైనా పన్ను పడదు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
 
Articles (Education)