ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 Etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాఫీ, టీ... మంచి మూడ్ దేనితో..?

Mon, Aug 28, 2017, 04:19 PM
Related Image

కాఫీ అయినా టీ అయినా వాటిలో ఉండే పదార్థాలు మన మెదడులో పలు రసాయనిక మార్పులకు కారణం అవుతాయి. దీంతో ఉత్సాహం, చురుకుదనం వస్తాయి. దీనికితోడు వీటిలో ఉండే కేలరీల వల్ల శరీరానికి శక్తి కూడా అందుతుంది. అందుకే పని అలసటతో ఉన్నవారు తరచుగా వీటిని తీసుకుంటుంటారు. ‘ఇక చాలు విశ్రాంతి తీసుకో’ అని మన మెదడుకు సూచించే న్యూరో ట్రాన్స్ మీటర్  అడెనోసిన్ ను కొద్ది సమయంపాటు కాఫీ, టీలో ఉండే కెఫైన్ బ్లాక్ చేస్తుంది. దాంతో అప్పటి వరకు నిద్రమత్తుతో తూగిన వారు టీ, కాఫీ తీసుకున్న తర్వాత మత్తు దిగి కాస్తంత ఉత్సాహంగా కనిపిస్తారు. ఇలా వీటి గురించి మనకు తెలియని ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఓ సారి తెలుసుకుందాం...

representational imageకెఫైన్
టీ, కాఫీ రెండింటిలోనూ ప్రధానంగా కెఫైన్ ఉంటుంది. టీని కామెల్లియా సైనెన్సిస్ అనే మొక్క ఆకులు, ఇతర భాగాలతో తయారు చేస్తుంటారు. ఈ మొక్కతో చేసే ఏ టీ అయినా అందులో కెఫైన్ ఉంటుంది. కాకపోతే ఆకులు, కాడలు, మొగ్గలు వేటితో టీ పొడి తయారైందన్న దాని ఆధారంగా కెఫైన్ స్థాయిల్లో తేడాలుంటాయి. కెఫైన్ అన్నది సహజ ఉత్ప్రేరకం. చాలా రకాల మొక్కల్లో ఇది ఉంటుంది. వీటిలోమనకు ప్రధానంగా తెలిసింది, ఉపయోగించేవి టీ, కాఫీలే. వీటి వల్ల మనకు ఎంత ఉపయోగం ఉందో, అధిక వినియోగంతో అంతే అనర్థం కూడా ఉంటుంది. అందుకే పరిమితంగా సేవించడం మంచిది.

సాధారణంగా ఒక కప్పు(200ఎంఎల్) టీలో 15 మిల్లీ గ్రాముల నుంచి 70 మిల్లీ గ్రాముల వరకు కెఫైన్ ఉంటుందని గుర్తించారు. అదే కాఫీలో 135 మిల్రీ గ్రాముల వరకు కెఫైన్ ఉంటుంది. అంటే టీతో పోలిస్తే కాఫీలో ఎక్కువ కెఫైన్ ఉంటుందని తెలుస్తోంది. ఎస్పెస్రో కాఫీలో కెఫైన్ ఇంకా అధిక స్థాయిలో ఉంటుంది. ప్రతి రోజులో 200 నుంచి 300 మిల్లీ ట్రాముల వరకు కెఫైన్ తీసుకోవడం వల్ల అనర్థాలు ఉండవని మాయో క్లినిక్ సూచిస్తోంది. అదే రోజు వారీ కెఫైన్ పరిమాణం 500 నుంచి 600 మిల్లీ గ్రాముల వరకు ఉంటే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయంటోంది. లివర్ పనితీరు మందగించడం జరుగుతుందని చెబుతోంది. గర్భిణులు రోజులో 200 మిల్లీ గ్రాములకు మించకుండా కెఫైన్ తీసుకుంటే నష్టం ఉండదు. టీ పొడిని రోస్ట్ చేయడం వల్ల అందులోని కెఫైన్ స్థాయి తగ్గుతుంది. టీలో ఇతర పదార్థాలను కలిపి బ్లెండ్ చేసినా కెఫైన్ తగ్గుతుంది.

representational imageఎల్ - థియానిన్
టీలో అదనంగా ఎల్ -  థియానిన్ అనే కాంపౌండ్ కూడా ఉంటుంది. ఇది కెఫైన్ తో కలవడం వల్ల ఏకాగ్రత, చురుకుదనాన్ని పెంచుతుంది. అందుకే మంచి మూడ్ వస్తుందని చెబుతారు. ఎల్ థియానిన్ మన శరీరం కెఫైన్ ను గ్రహించడాన్ని నిదానం చేస్తుంది. రక్తం ద్వారా మెదడులోకి వెళ్లి గాబా అనే న్యూరోట్రాన్స్ మీటర్ ను ప్రేరేపిస్తుంది. దీంతో ఆందోళన తగ్గుతుంది.

కాఫీ నుంచి టీకి మారితే...
కాఫీ వల్ల పళ్లపై దీర్ఘకాలంలో మచ్చలు పడే అవకాశం ఉంది. టీ వల్ల ఈ సమస్య తక్కువ. అందుకే కాఫీ  అయినా, టీ అయినా తాగిన తర్వాత కొంచెం నీటితో నోటిని పుక్కిలించి ఊసేయడం మంచిది. అన్ ఫిల్టర్డ్ కాఫీతో కొంచెం ప్రమాదమే అంటున్నారు పరిశోధకులు. ఫిల్టర్ చేయకపోవడం వల్ల కాఫెస్టోల్, కావెల్ అనే కాంపౌండ్లు అలానే ఉండిపోతాయి. ఇవి చెడ్డ కొలెస్ట్రాల్ అయిన ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ఇది పెరిగితే గుండె జబ్బుల ముప్పు పెరిగినట్టే.

కాఫీ తీసుకోవడం వల్ల అన్నవాహిక, కడుపు మధ్య ఉన్న కండరం వదులవుతుంది. దీంతో కడుపులోని యాసిడ్స్ వెనక్కి వచ్చేస్తాయి. దీంతో మంట, ఉబ్బరం వంటివి కనిపిస్తాయి. అందుకే కెఫైన్ తక్కువగా ఉండే టీ తాగడం నయమని చెబుతుంటారు. ఇక అప్పటికే కడుపు మంట సమస్య ఉన్నవారు కాఫీ జోలికి వెళ్లకపోవడమే బెటర్. కెఫైన్ అన్నది ఉత్ప్రేరకం కనుక, అధిక కెఫైన్ ఉండే కాఫీని తీసుకోవడం వల్ల మంచి నిద్ర వెంటనే రాకపోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కాఫీ అధికంగా తీసుకుంటే శరీరం మెగ్నీషియంను గ్రహించడం తగ్గుతుందని పేర్కొంటున్నారు. దీనివల్ల కండరాల తిమ్మిర్లు వస్తాయి. కొన్ని ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్ల తరహా మందులు మెగ్నీషియం స్థాయిలను తగ్గిస్తాయని,  ఈ తరహా మందులు తీసుకుంటూ, కాఫీ తాగే వారిలో మెగ్నీషియం మరింత తక్కువ స్థాయిలకు చేరుతుందని హెచ్చరిస్తున్నారు.

representational imageపరిశోధనలు
కాఫీ టైప్-2 డయాబెటిస్ ను నివారిస్తుందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. ఎలా అన్నదానికి కాఫీ ప్రొటీన్లను పెంచుతుందని, అవి సెక్స్ హార్మోన్లు అయిన టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ లను శరీరమంతటికీ అందిస్తాయని, దాంతో టైప్ 2 మధుమేహం నివారణ సాధ్యమవుతుందని వివరించాయి. కానీ, ఈ తరహా పరిశోధన ఫలితాలు ఇంకా అంగీకార స్థాయికి రాలేదు. కాఫీ, టీ రెండింటినీ వేరు చేసి చూడలేమని అమెరికన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎండీ ఎలియట్ మిల్లర్ అన్నారు. 6,800 మంది గుండె జబ్బులతో ఉన్న వారి అభిప్రాయాలు తీసుకోగా, అందులో 75 శాతం మంది కాఫీ తాగే వారున్నరని వీరు గుర్తించారు.

కాఫీ వల్ల ప్రయోజనాలు
కాఫీ తాగడం వల్ల డిప్రెషన్ తగ్గుతుందని, మానసిక స్థితి మెరుగు అవుతుందని చాలా పరిశోధనల్లో నిర్ధారణ అయిన విషయం. ఈ విషయంలో టీ స్థానం వెనకేనట. కాఫీ తాగేవారిలో లివర్, కొలన్ కేన్సర్ రిస్క్ తగ్గుతుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. అలాగే, మల్టిపుల్ స్కెలరోసిస్ రిస్క్ కూడా తగ్గుతుందని తేలింది. ఇక టీ అన్నది చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. కాఫీ, టీ రెండింటిలోనూ ఈసీజీసీ అనే యాంటీ ఆక్సిడెంట్లు  ఉన్నప్పటికీ టీలో అధికంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ పై పోరాడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడటంలో యాంటీ ఆక్సిడెంట్లు కీలకం. ఇక శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా ఉండాలంటే ఈ విషయంలో కాఫీతో పోలిస్తే టీ కొంచెం నయం.

representational imageఉదయాన్నే ఏది బెటర్
కాఫీతో మంచి, చెడు రెండూ ఉన్నప్పటికీ ఉదయం పరగడుపున దాన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందంటున్నారు పరిశోధకలు. ఖాళీ కడుపుతో తీసుకుంటే కాఫీ యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని, అదే పనిగా దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణకోశం గోడల లైనింగ్ ను దెబ్బతీస్తుందంటున్నారు వైద్య పరిశోధకలు. దాంతో అజీర్ణం తదితర సమస్యలకు కారణం అవుతుందంటున్నారు. కాఫీ అయినా, టీ అయినా ఈ రెండూ ఆకలిని తగ్గించేవని, అసిడిటీని పెంచేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా తీసుకుంటే శరీర జీవక్రియలపైనా ప్రభావం ఉంటుందంటున్నారు. ఇక ఆహారం తిన్న వెంటనే కాఫీ తీసుకుంటే అందులోని పోషకాలను శరీరం సరిగా గ్రహించలేదు. కాఫీ, టీ రెండింటితోనూ ప్రయోజనాలున్నాయి. కాకపోతే మితంగా తీసుకున్నప్పుడే.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
 
Articles (Education)