ap7am logo

బ్యాంకు ఖాతా చెక్ చేసుకుంటున్నారా....? అనవసర చార్జీలు బాదేస్తారు మరి!

Tue, Aug 15, 2017, 05:26 PM
Related Image

నేడు దాదాపుగా ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతున్నాయి. వ్యాపారస్థులు అయితే, బ్యాంకు ఖాతా తప్పనిసరి. అన్నింటికీ కీలకంగా మారుతున్న బ్యాంకు ఖాతాలపై ఖాతాదారులు తప్పకుండా ఓ కన్నేసి ఉంచాలి. లేకుంటే తెలియని చార్జీల రూపంలో చిల్లులు పడొచ్చు.

సాధారణంగా బ్యాంకులు తమ సేవలకు సంబంధించిన చార్జీలను ఎప్పటికప్పుడు ఖాతాల్లోని బ్యాలన్స్ నుంచి డెబిట్ చేస్తుంటాయి. కొన్ని చార్జీలను సంబంధిత త్రైమాసికం ముగిసేలోపే ఖాతాలోంచి డెబిట్ చేసేస్తాయి. కొన్నింటిని మాత్రం ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఎప్పుడైనా చార్జ్ చేసేందుకు అవకాశం ఉంది. కానీ, ఈ చార్జీలు సరిగానే విధిస్తున్నారా, వాటిలో ఏవైనా తప్పులుంటున్నాయా? అన్న విషయాలను కొందరు గమనించరు. బ్యాంకులపై జవాబుదారీ ఉంటుంది గనుక ఏం ఫర్వాలేదులే అనుకుంటారు. కానీ ఈ విధమైన అలక్ష్యం వల్ల ఒక్కోసారి నష్టపోవాల్సి రావచ్చు. నిజానికి ఓ ప్రముఖ బ్లాగ్ నిర్వాహకుడికి ఈ విధమైన సమస్యే ఎదురైంది. దాంతో ఈ విషయాన్ని పొల్లు పోకుండా ఆయన సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మందికి తెలియజేశారు. చివరికి అన్యాయంగా చార్జీలు విధించిన బ్యాంకు కొమ్ములు విరిచారు.ఎదురైన సమస్య ఇది...

ఇటీవల ఓ రోజు బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్ ను పరిశీలించిన నివేష్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఎందుకంటే 2016 ఫిబ్రవరి 29న డీడీ తీసుకోగా, అందుకు సంబంధించిన చార్జీలను 2017 ఏప్రిల్ లో వసూలు చేశారు. డీడీ చార్జీల కింద రూ.1,005ను మినహాయించారు. వాస్తవానికి డీడీపై చార్జీలు లేవని తీసుకునే సమయంలో బ్యాంకు సిబ్బంది చెప్పారు. అయినప్పటికీ చార్జీలు వసూలు చేయడం, అందులోనూ ఏడాది దాటిన తర్వాత ఇలా చేయడం ఏ మాత్రం సరిగ్గా లేదనుకున్న నివేష్ హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు రిలేషన్ షిప్ మేనేజర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా దీన్ని సరికాదంటూనే ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. 2016 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలోపు చార్జీలను వసూలు చేయలేదు. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనూ డెబిట్ చేయకుండా, 2018 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేయడం బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమేనని నివేష్ భావించారు.

కస్టమర్ కేర్ కు ఫిర్యాదు
దీంతో విషయాన్ని తెలియజేస్తూ నివేష్ హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుకు ([email protected]) ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ‘‘29-2-2016 నాటి డీడీఇష్యూ చార్జీలు అంటూ రూ.1,005ను నా ఖాతాలో నుంచి 18-4- 2017న డెబిట్ చేయడం నా దృష్టికి వచ్చింది. ఉచితంగా డీడీ తీసుకునే అవకాశం బ్యాంకు ఖాతాదారుడిగా నాకుంది. డీడీ తీసుకున్న సమయంలో సిబ్బంది నాకిదే చెప్పారు. కానీ, ఏడాది రెండు నెలల తర్వాత ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా చార్జీలను ఎలా వసూలు చేస్తారు?’’ అని నివేష్ తన మెయిల్ లో ప్రశ్నించారు.

కొన్ని రోజుల తర్వాత డీడీ జారీ చేసిన బ్యాంకు శాఖ మేనేజర్ నుంచి నివేష్ కు కాల్ వచ్చింది. చార్జీలను వసూలు చేయడం సరైన నిర్ణయమేనని బ్రాంచ్ మేనేజర్ సమర్థించుకున్నారు. అయితే, ‘‘ఏడాది రెండు నెలల క్రితమే డీడీ జారీ చేయగా, అప్పుడే ఎందుకు చార్జీలు వసూలు చేయలేదు? పోనీ వెంటనే కాకపోయినా అదే ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ఎందుకు చేయలేదు? ఏడాది రెండు నెలల తర్వాత చార్జీలు విధించారు కదా, ఒకవేళ ఈ లోపు నేను ఖాతా క్లోజ్ చేసి వెళ్లుంటే ఏం చేసేవారు?’’ అంటూ నివేష్ ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ, బ్యాంకు మేనేజర్ నుంచి సమాధానం రాలేదు. అనంతరం ఈ విషయాన్ని నివేష్ ‘చేంజ్.ఓఆర్జీ’, ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ మాధ్యమాల ద్వారా సమాజానికి తెలియజేశాడు.

ఆ తర్వాత హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి నివేష్ కు మరో మెయిల్ వచ్చింది. బ్రాంచ్ మేనేజర్ కాల్ చేసి చార్జీల గురించి వివరించారని, ఇంకా ఏదైనా సాయం కావాలంటే, పరిష్కారంపై సంతృప్తి చెందకపోతే తిరిగి మళ్లీ సంప్రదించాలని కూడా అందులో సూచించారు. దీంతో గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కు నివేష్ ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత రెండు రోజులకే సారీ చెప్పిన బ్యాంకు వసూలు చేసిన రూ.1,005 రూపాయలను తిరిగి నివేష్ ఖాతాలో జమ చేసింది.

అందుకే... చెక్ చేసుకోవాలి
బ్యాంకుల్లో అంతా పారదర్శకంగా జరుగుతుందన్న గుడ్డి నమ్మకం వద్దు. ఒకప్పుడు ఈ తరహా విధానాలు కనిపించేవి కావు. కానీ, మారుతున్న క్రమంలో ఆదాయంపై బ్యాంకుల దృష్టి పెరగడం ఈ తరహా విధానాలకు దారితీస్తోంది. అందుకే వీలైతే ప్రతీ వారం బ్యాంకు ఖాతా లావాదేవీల రిపోర్ట్ ను పరిశీలించాలి. లేదంటే కనీసం నెలకోసారి అయినా పరిశీలించుకోవాలి. లోపాలు, తప్పులుంటే వెంటనే పిర్యాదు చేయాలి. ఒకటి లేదా రెండుకు మించి బ్యాంకు ఖాతాలొద్దు. ఒకవేళ ఈ రెండు ఖాతాల్లోనూ వాడని ఖాతా ఉంటే వెంటనే క్లోజ్ చేయడం బెటర్. ఎందుకంటే ఖాతాలు ఎక్కువై, ఒక్కో ఖాతాలో కొన్ని లావాదేవీలు చొప్పున చేస్తూ ఉంటే వాటిని గమనిస్తుండడం కష్టమవుతుంది. ఒకే ఖాతా నుంచి చేస్తుంటే ట్రాక్ చేయడం తేలిక. సమస్య ఏర్పడితే ఎవరికి ఫిర్యాదు చేయాలన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి. బ్యాంకు వెబ్ సైట్లలో ఈ సమాచారం ఉంటుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy