ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తక్కువ బడ్జెట్ లో సింగపూర్ టూర్ ఇలా ప్లాన్ చేసుకోండి!

Wed, Apr 26, 2017, 02:37 PM
Related Image

ఆధునిక నిర్మాణశైలి, ఆర్కిటెక్చర్ అద్భుతాలతో నిర్మితమైన సింగపూర్ అందాలను చూడడం మరపురాని అనుభవం. కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్ కు సింగపూర్ చెక్కేస్తే స్వీట్ మెమొరీస్ మూటగట్టుకోవచ్చు. కొత్త జంటలే కాదు వీలైతే ప్రతి ఒక్కరూ చూడతగిన దేశం ఇది. 719 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అత్యాధునికంగా ఉంటుందీ దేశం. 

విమాన, వసతి, ఆహార చార్జీలు... 

సాధారణంగా టూర్ ప్యాకేజీలను ఎంచుకుని వెళితే చార్జీలు అన్నీ కలిసే ఉంటాయి. అయితే, స్వయంగా పర్యటనను ప్లాన్ చేసుకుని వెళ్లాలనుకునే వారు అన్ని ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి సింగపూర్ కు విమానయాన చార్జీలు సుమారు రూ.7,000 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఆఫర్ సేల్ సమయంలో ఇందులో సగానికే అంటే 5వేల రూపాయలకు కూడా టికెట్ సొంతం చేసుకోవచ్చు. చెన్నై, బెంగళూరు నుంచి కూడా ఇంచుమించు ఇవే స్థాయిలో ధరలు ఉన్నాయి. 

ఇక, అక్కడ మెట్రో రైళ్లలో టికెట్ ధర ఒకటి లేదా రెండు సింగపూర్ డాలర్లు (ఒక డాలర్ సుమారు 50 రూపాయలు) ఉంటుంది. ట్యాక్సీలో ప్రయాణానికి ప్రారంభ చార్జీ 3 డాలర్లు. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ ప్రయాణానికి అర డాలర్ చార్జీ వసూలు చేస్తారు. డ్రైవర్లు తప్పనిసరిగా మీటర్ వేసి ఆ ప్రకారమే చార్జీ తీసుకుంటారు. 

సింగపూర్ లో మంచి హోటల్లో బసకు రోజుకు సుమారు 5వేల రూపాయలు ఉంటుంది. ఫర్వాలేదు అనుకున్న హోటళ్లలో రూమ్ కు 3 వేల రూపాయల చార్జీ ఉంటుంది. ఇంకా లో బడ్జెట్ లో కావాలంటే వెతికి పట్టుకునేందుకు కొంచెం శ్రమించాలి.  హోటళ్ల వివరాలను http://www.budgethotels.sg/ సైట్ నుంచి పొందవచ్చు. ఆహారం విషయానికొస్తే సెరంగూన్ రోడ్డులోని కోమల విలాస్ రెస్టారెంట్ లో దక్షిణాది వంటకాలు 136 రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. దక్షిణాది వంటకాలకు ప్రసిద్ధిగాంచిన శరవణభవన్ లో బ్రేక్ ఫాస్ట్ ఏడు సింగపూర్ డాలర్లు, లంచ్, డిన్నర్ 8 డాలర్లుగా ఉంది. చార్జీల కోసం http://saravanabhavan.com.sg/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. 

పర్యాటకులు స్వయంగా పర్యటన ప్లాన్ చేసుకుని వెళ్లేట్లు అయితే, విమానయానం, స్థానిక రవాణా, హోటల్ చార్జీలు, ఆహారం ఇతరత్రా ఖర్చులు అన్నీ కలిపి పర్యాటక సంస్థలు అందిస్తున్న ప్యాకేజీల కంటే ఎక్కువ వ్యయం అవుతుంది. అయితే, స్వయంగా వెళితే కావాలంటే పర్యటనను పొడిగించుకుని మరిన్ని ప్రదేశాలు చూడ్డానికి వీలుంటుంది. 

టూర్ ప్యాకేజీలు...

మేక్ మై ట్రిప్, థామస్ కుక్, యాత్రా తదితర సంస్థలు నిత్యం ఎన్నోఆఫర్లతో టూర్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. వీటిలో భాగంగా భారత్ లోని ఢిల్లీ, ముంబై తదితర ప్రముఖ విమానాశ్రయాల నుంచి రాను పోను ఉచితంగా విమాన ప్రయాణం, ఉచిత వసతి, బ్రేక్ ఫాస్ట్ అందజేస్తారు. ఒక్కో వ్యక్తికి రూ.18,000 నుంచీ ప్యాకేజీలు ఉన్నాయి. సాధారణంగా మూడు రాత్రులు, నాలుగు రోజులతో మొదలవుతాయి.  

సింగపూర్ మలేసియా ఒకేసారి చుట్టేయాలంటే... 

సింగపూర్, మలేసియా ఈ రెండు దేశాలను ఒకేసారి చూసి రావాలనుకునే వారికి కూడా ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. యాత్రా సంస్థ ఆరు రాత్రులతో కూడిన ప్యాకేజీని 61,448 రూపాయలకు అందిస్తోంది. జీఎస్టీ 3.625 శాతం, ప్రయాణ బీమా చార్జీలు అదనం. 3 రోజులు సింగపూర్ లో, మూడు రోజులు కౌలాలంపూర్ లో పర్యటన ఉంటుంది. వీటిలో భాగంగా ఒక రోజు నగర సందర్శనకు ఉచితంగా తీసుకెళతారు. ఉచితంగా అల్పాహారం అందిస్తారు. థామస్ కుక్ సంస్థ అందిస్తున్న సింగపూర్ మలేసియా టూర్ ప్యాకేజీ ధర 78,350. ఆరు రాత్రులతో కూడిన ఏడు రోజుల ప్యాకేజీ ఇది. 3 స్టార్ హోటల్లో బస. రానుపోను విమాన ప్రయాణం, అల్పాహారం ఉచితంగా సమకూరుస్తారు. 

సింగపూర్ మలేసియా సౌత్ స్పెషల్

ఇది ఆరు రాత్రులతో కూడిన ఏడు రోజుల థామస్ కుక్ సంస్థ పర్యాటక ప్యాకేజీ. ఆఫర్ ధర... 52,990 రూపాయలు. 

సందర్శనీయ స్థలాలు.. 

200 మీటర్ల ఎత్తులో.. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుంటే.. ఆ అనుభూతే వేరు కదా... సింగపూర్ లోని మెరినా బే శాండ్స్ పార్క్ ఈ అనిర్వచనీయ అనుభూతిని సందర్శకులకు అందిస్తోంది. సింగపూర్ అంతటినీ 360 డిగ్రీల కోణంలో ఈ పార్క్ నుంచి వీక్షించవచ్చు. 57 అంతస్తులతో  ఉన్న మూడు ఆకాశ హర్మ్యాల భవనాలు... ఆ మూడింటినీ కలుపుతూ పై భాగంలో ఏర్పాటు చేసిన వేదిక. సందర్శకులను కట్టిపడేసేలా తీర్చిదిద్దారు. ఈ టవర్లలోనే షాపింగ్ మాల్, రెస్టారెంట్, హోటల్ ఇలా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఎత్తయిన జెయింట్ వీల్ సింగపూర్ లో ఉంది. 541 అడుగుల ఎత్తుతో ఉండే ఈ వీల్ ఎక్కేసి 30 నిమిషాల పాటు గిర్రున తిరిగేయవచ్చు. సింగపూర్ అంతటినీ చూసేయవచ్చు. 

సింగపూర్ లో పచ్చదనానికీ తగినంత ప్రాధాన్యం ఉంది. ఇందుకు నిదర్శనంగా సెంట్రల్ సింగపూర్ లో మెరీనా రిజర్వాయర్ ను ఆనుకుని 250 ఎకరాల  విస్తీర్ణంలో ఏర్పాటైందే గార్డెన్స్ బై ద బే. ఇది ప్రపంచంలో టాప్ 10 ఇండోర్ గార్డెన్. ఐదు లక్షల మొక్కలు, 2,200 రకాల జాతులు ఉన్నాయి. పువ్వు ఆకారంలో ఉన్న డ్రోమ్ చల్లటి, పొడి వాతావరణంతో, ఐదు ఖండాలకు చెందిన విభిన్న వాతావరణాన్ని పర్యాటకులు స్వయంగా అనుభూతి చెందవచ్చు. అతి పొడవైన ఇండోర్ వాటర్ ఫాల్ కూడా ఇక్కడ ఉంది. 138 అడుగుల ఎత్తయిన క్లౌడ్ మౌంటెయిన్ సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. 

69 ఎకరాల్లో ఉన్న జూపార్క్ లో  315 రకాల జంతువులు ఉన్నాయి. ఏటా 17 లక్షల మంది దీన్ని సందర్శిస్తుంటారు. ఒరాంగుటాన్లకు ప్రత్యేకంగా ఓ పెద్ద కాలనీయే ఉంది. ప్రాన్సిస్ నీగో అనే నిపుణుడు 1977లో ఇక్కడ ఒరాంగుటాన్లతో ఆరు నెలల పాటు కలిసుండి వాటి ప్రవర్తనను అధ్యయనం చేశాడు. 

సింగపూర్ లోని జీవ వైవిధ్య పార్క్ కూడా ప్రముఖ సందర్శనీయ స్థలాల్లో ఒకటి. 156 ఏళ్ల చరిత్ర దీని సొంతం. యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కూడా పొందింది. రాఫెల్స్ హోటల్, చాంగి చాపెల్ అండ్ మ్యూజియం, సెంటోసా ఐలాండ్, ఆర్చర్డ్ రోడ్, క్లార్క్ క్వే, గ్రానైట్ ఐలాండ్ కూడా చూడాల్సిన వాటిలో ఉన్నాయి. 

X

Feedback Form

Your IP address: 54.196.46.127
Articles (Education)