ap7am logo

పన్ను ఆదా, రాబడుల్లో మేటి... ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ పథకాలు

Fri, Jul 28, 2017, 11:14 AM
Related Image

పన్ను ఆదా చేసే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) మ్యూచువల్ ఫండ్ పథకాల గురించి వినే ఉంటారు. వేతన జీవులు, పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన పెట్టుబడి సాధనం ఈఎల్ఎస్ఎస్.


ఈఎల్ఎస్ఎస్ పథకాల గురించి సమగ్రంగా తెలిసిన వారు కొద్ది మందే. పన్ను ఆదా చేసే ఫండ్స్ అని తెలుసుగానీ దీనికి సంబంధించిన నిబంధనలపై అవగాహన ఉన్నవారు తక్కువే. వీటిని మొదటగా 1991లో ప్రవేశపెట్టారు. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే రూ.10,000 పెట్టుబడిపై సెక్షన్ 80సీసీబీ కింద పన్ను మినహాయింపు ఇచ్చారు. అనంతరం ఈ సెక్షన్ ను ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 88లో కలిపేశారు. ఆ తర్వాత దీని స్థానంలో 2005 ఏప్రిల్ 1 నుంచి సెక్షన్ 80సీ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద వివిధ రకాల సాధనాల్లో చేసే రూ.1,50,000 పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోనూ ఈ మేర పెట్టుబడులు పెట్టి పన్ను మినహాయింపులు పొందొచ్చు.

representational imageలాకిన్ పీరియడ్
ఈ పథకాల్లో చేసే పెట్టుబడులు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెనక్కి తీసుకునేందుకు వీలుండదు. కనీసం మూడేళ్ల పాటు ఆగాల్సి ఉంటుంది. ఆ కాలాన్నే లాకిన్ పీరియడ్ గా పేర్కొంటారు. కొన్ని ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇది ఐదేళ్లు, పదేళ్లుగానూ ఉంది. ఇది ఎలా అంటే ఉదాహరణకు మీరు రూ.1,00,000ను 2017 జనవరి 1న ఓ ఈఎల్ఎస్ఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మూడేళ్ల లాకిన్ పీరియడ్ అయితే 2020 జనవరి 15నే ఉపసహరించుకోవడానికి అనుమతిస్తారు. అలాగే, 2017 జనవరి 1న సిప్ విధానంలో ఓ ఈఎల్ఎస్ఎస్ పథకంలో రూ.5,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. అది కూడా 2020 జనవరి 1కి గడువు తీరుతుంది. ఫిబ్రవరి 1న చేసిన సిప్ ఇన్వెస్ట్ మెంట్ రూ.5,000 2020 ఫిబ్రవరి 1న విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకానీ, సిప్ ప్రారంభించిన తేదీ నుంచి మూడేళ్ల తర్వాత మొత్తం పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి వీలవదు. ఒకవేళ లాకిన్ పీరియడ్ పూర్తి కాకముందే ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి మరణిస్తే నామినీ లేదా వారసులకు డబ్బు చెల్లిస్తారు. అది కూడా యూనిట్లు కేటాయించిన తేదీ నుంచి ఏడాది తర్వాతనే. అత్యవసరమైనా వారసులకూ వెంటనే నిధులు అందవు.

ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో రకాలు
ఈఎల్ఎస్ఎస్ పథకాల నియమ, నిబంధనలన్నీ ఒకటే అయినప్పటికీ... పథకాల ఇన్వెస్ట్ మెంట్ విధానం ఆధారంగా వీటిని పలు రకాలుగా చెప్పుకోవచ్చు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఎంత మేర ఇన్వెస్ట్ చేయాలన్నది ఈఎల్ఎస్ఎస్ పథకాలన్నింటిలోనూ ఒకే విధంగా ఉండదు. పథకాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది. కొన్ని ప్రధానంగా లార్జ్ క్యాప్ పైనే దృష్టి సారించొచ్చు. కొన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కు ఎక్కువ నిధులు కేటాయించొచ్చు. లార్జ్ క్యాప్ అయితే ఆటుపోట్లు తక్కువగాను, మిడ్, స్మాల్ క్యాప్ పై ఫోకస్ చేసే ఫండ్లలో ఆటుపోట్లు ఎక్కువగానూ ఉంటాయి. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ తో పోలిస్తే లార్జ్ క్యాప్ లో రిస్క్ కొంచెం తక్కువ.

రిస్క్ ను బట్టి పథకం
రాబడుల్లో గత పని తీరు ఆధారంగా కాకుండా ఫండ్స్ పెట్టుబడుల తీరు, రిస్క్ ఆధారంగా ఈఎల్ఎస్ఎస్ పథకాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అధిక రిస్క్ తీసుకునే ఉద్దేశంతో ఉండి, రాబడులు అధికంగా కోరుకునేవారు మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే వాటిని ఎంచుకోవచ్చు. రిలయన్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్, సుందరం ట్యాక్స్ సేవర్ ఫండ్, ఐడీబీఐ ఈక్విటీ అడ్వాంటేజ్ ఈ కేటగిరీ కిందకు వస్తాయి. వీటిలో మూడేళ్ల కాలంలో సగటు రాబడులు 24 నుంచి 25.5 శాతం మధ్య ఉన్నాయి. అదే సమయంలో అస్థిరతను ఇష్టపడకుండా, స్థిరమైన రాబడులు ఆశించే వారు లార్జ్ క్యాప్ ఆధారిత ఈఎల్ఎస్ఎస్ పథకాలను ఎంచుకోవచ్చు. ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా ట్యాక్స్ సేవింగ్స్, ఎడెల్వీజ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఈ విభాగం కిందకే వస్తాయి. ఇవి మూడేళ్లలో సగటున 17.92 శాతం వరకు రాబడులను ఇచ్చాయి. ఫ్రాంక్లిన్ పథకం టాప్ లో ఉండగా, ఎడెల్వీజ్ 13.60 శాతం రాబడులతో దిగువన ఉంది. ఇక ఈ రెండింటికీ మధ్యస్థంగా ఉండాలనుకునేవారికి యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ ప్లాన్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లాంగ్ టర్మ్ వంటి ఈఎల్ఎస్ఎస్ ప్లాన్లు సరిపోతాయి. వీటిలో మూడేళ్ల కాలంలో రాబడులు సగటున 20-21.63 శాతం మధ్య ఉన్నాయి.

representational imageఇన్వెస్ట్ మెంట్ కు కమిట్ మెంట్ అవసరం
తరచూ ఈఎల్ఎస్ఎస్ పథకాలను మార్చుకోవడం మంచిది కాదన్నది నిపుణుల సూచన. తమ రిస్క్ సామర్థ్యానికి సరిపోలే, రాబడుల విషయంలో మెరుగ్గా ఉండే ఒకటి రెండు పథకాలను ఎంచుకుని వాటిలోనే పెట్టుబడులు కొనసాగించాలని సూచిస్తుంటారు. పెట్టుబడులు కొనసాగించలేనంతగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే లాకిన్ పీరియడ్ తర్వాత... పెట్టుబడులు ఉపసహరించుకుని, ఆ నిధులను తిరిగి ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ట్యాక్స్ మినహాయింపు పొందొచ్చు. సిప్ విధానంలో ప్రతీ నెలా చేసిన పెట్టుబడులను... మూడేళ్ల తర్వాత నుంచీ ప్రతీ నెలా గడువు తీరే ఒక్కో సిప్ అమౌంట్ ను వెనక్కి తీసుకుంటూ తిరిగి పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. ఇలా జీవిత కాలం లేదంటే కోరుకున్నంత కాలం కొనసాగించొచ్చు. ఆర్థిక వెసులుబాటు ఉంటే మాత్రం ఈఎల్ఎస్ఎస్ లో పెట్టుబడులను వీలైనంత కాలం కొనసాగించాలని, లాకిన్ పీరియడ్ ముగిసిన తర్వాత ఉపసంహరించుకోకుండా ఉండాలన్నది నిపుణుల సలహా. కొన్ని ఫండ్స్ దీర్ఘకాలానికి అద్భుతమైన రాబడులను ఇచ్చే అవకాశం ఉంటుంది. లాకిన్ పీరియడ్ అయింది కదా అని వెనక్కి తీసుకుంటే అవి కోల్పోవచ్చు. పన్ను ఆదాకోసం ఈఎల్ఎస్ఎస్ పథకాలను ఎంచుకున్నప్పటికీ కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులను కొనసాగించేలా ఉండాలని నిపుణులు అంటుంటారు.

ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోనే ఎందుకు?
పన్ను ఆదా కోసమంటూ ప్రత్యేకంగా ఏదో పథకంలో పెట్టుబడి పెట్టడం కాకుండా, వ్యక్తులు వారి అవసరాలు, లక్ష్యాలను చేరుకునేందుకు వీలు కల్పించే సాధనాలను ఎంచుకోవాలన్నది నిపుణుల సూచన. పన్ను ఆదా కోసం ఈఎల్ఎస్ఎస్ పథకంలో పెట్టుబడి పెడితే దానిపై రాబడి 18 - 20 శాతం ఉండొచ్చు. అలా కాకుండా మంచి రాబడులే గీటురాయి అయితే, ఈఎల్ఎస్ఎస్ పథకాలను మించి రాబడులను ఇచ్చేవి ఉంటే వాటినే ఎంచుకోవచ్చుగా. పైగా ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులపై రిస్క్ ఎలానూ ఉంటుంది. కాకపోతే సిప్ విధానంలో పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో రిస్క్ చాలా వరకు ఉండదు. మార్కెట్ల హెచ్చు, తగ్గుల్లో పెట్టుబడులు కొనసాగుతాయి గనుక కొనుగోలు ధర సగటున తగ్గుతుంది. రాబడులు అధికంగా ఉంటాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy