ap7am logo

తల బద్దలయ్యేంత నొప్పి... మైగ్రేయిన్... ఎందుకొస్తుంది..?

Sun, Jun 18, 2017, 12:40 PM
Related Image

ఉన్నట్టుండి తల నొప్పి ప్రారంభమవుతుంది. అది తీవ్ర స్థాయికి చేరి తల పగిలిపోతున్నంతగా బాధిస్తుంది. తల తిరుగుతున్నట్టు, కడుపులో తిప్పుతున్నట్టూ ఉండొచ్చు. కొందరిలో వాంతులు కూడా అవుతాయి. వెలుగును చూడలేనంత తీవ్రంగా వచ్చే ఈ నొప్పి గురించి కొన్ని వివరాలు....


మెదడులో జరిగే కొన్ని రకాల మార్పులు మైగ్రేయిన్ నొప్పికి దారితీస్తాయి. మైగ్రేయిన్ నొప్పికి కచ్చితమైన కారణాలు ఏంటన్నవి ఇంతవరకు నిర్ధారణ కాలేదు. మెదడులోని కణాల మధ్య సమాచారానికి తోడ్పడే నాడీ ప్రసారణుల్లో(న్యూరో ట్రాన్స్ మీటర్), రసాయనాలు, రక్త ప్రసారాల పరంగా జరిగే మార్పులు, హెచ్చు తగ్గులు మైగ్రేయిన్ పెయిన్ కు దారితీస్తాయని భావిస్తున్నారు.

representational imageఎలా గుర్తించడం...?
కళ్లు నొప్పిగా అనిపిస్తాయి. వెలుగును చూడలేరు. శబ్దాలు, ఘాటైన వాసనలు కష్టంగా అనిపిస్తాయి. సాధారణంగా తలలో ఒక వైపున వచ్చే దీన్ని పార్శ్వపు నొప్పి అని కూడా అంటుంటారు. కొందరిలో రెండు వైపులా రావచ్చు. ఒక్క మైగ్రేయినే అని కాదు, మరికొన్ని రకాల తలనొప్పుల్లోనూ తీవ్రమైన నొప్పి వస్తుంది. కానీ, అవి మైగ్రేయిన్ కాదు.

మైగ్రేయిన్ ను మోడరేట్ (మోస్తరు), సివియర్ (అధికం), ఇంటెన్సిటీ (తీవ్రమైన) అని మూడు రకాలుగా వర్గీకరించారు. మైగ్రేయిన్ వచ్చినప్పుడు మెట్లెక్కడం, శారీరక శ్రమ, పరుగెత్తడం వంటివి సమస్యను అధికం చేస్తాయి. మైగ్రేయిన్ రావడానికి ముందు మూడింట ఒక వంతు మందిలో కంటి చూపు పరంగా అడ్డంకులు కనిపిస్తాయి. చాలా స్వల్ప సమయం పాటు చూపులో అస్పష్టత కనిపించొచ్చు. ఇలా ఓ గంట పాటు ఉంటుంది. కళ్లలో కాంతి మెరుపులు కనిపించొచ్చు. తిమ్మిరి లేదా బలహీనంగా అనిపించొచ్చు. మాట్లాడడం కష్టంగా అనిపించొచ్చు. మైగ్రేయిన్ నొప్పి కొన్ని గంటల పాటు నుంచి కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.

ఈ లక్షణాల ఆధారంగా మైగ్రేయిన్ నొప్పా కాదా? అన్నది వైద్యులు గుర్తించి తగిన మందులు సూచిస్తారు. కొంత విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తుంటారు. వైద్యుల వద్దకు వెళ్లేందుకు సమయం పట్టేట్టు ఉంటే ఉపశమనం కోసం ప్యారాసెటమాల్ టాబ్లెట్లను వేసుకోవచ్చు. ఎంఆర్ఐ, బ్రెయిన్ సీటీ స్కాన్, బ్రెయిన్ వేవ్ టెస్ట్ వంటివి ఉన్నప్పటికీ మైగ్రేయిన్ పెయిన్ ను వైద్యులు ఈ పరీక్షలు అవసరం లేకుండా సులభంగానే గుర్తించగలరు. మైగ్రేయిన్ ఎంత తరచుగా వస్తోంది, వచ్చిన తర్వాత ఎంత సమయం పాటు ఉంటోంది, నొప్పి తీవ్రత ఇతర లక్షణాలను బట్టి మందులు సూచించడం జరుగుతుంది. మైగ్రేయిన్ కు పలు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఎవో  కొన్ని సందర్భాల్లో తప్పితే ఇది మందులకు లొంగే నొప్పిగానే చెబుతారు. అధిక అలసట కారణంగా, శృంగార సమయంలో తీవ్రమైన తల నొప్పి వస్తుంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి.

మైగ్రేయిన్ ను ప్రేరేపించేవి
representational imageహార్మోన్లలో మార్పులు, ఒత్తిడి, తీవ్ర స్థాయి శబ్దాలు, కొన్ని రకాల ఆహార పదార్థాలు మైగ్రేయిన్ ను ప్రేరేపిస్తాయి. పిల్లలు పుట్టకుండా రక్షణ కోసం వాడే పిల్స్ వల్ల కూడా మైగ్రేయిన్ రావచ్చు. చాక్లెట్లు, డైరీ ఉత్పత్తులు, చిప్స్ వంటి ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు, కృత్రిమ తీపి పదార్థాలు, మోనోసోడియం గ్లూటామేట్, అధిక నిద్ర, ఆల్కహాల్ కూడా మైగ్రేయిన్ నొప్పిని ప్రేరేపించేవే. ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటివి కూడా మైగ్రేయిన్ కు దారితీస్తాయి. వాతావరణం మారినప్పుడు కూడా ఈ సమస్య వేధిస్తుంది. బాగా శీతల వాతావరణం, బాగా వేడితో కూడిన వాతావరణంలోనూ మెదడులో మార్పులు జరిగి నొప్పి రావచ్చు. ఘాటైన పెయింట్, పెర్ ఫ్యూమ్, పువ్వుల వాసనలు నొప్పికి కారణమవుతాయి.

ముందే తెలుసుకోవచ్చు...
మైగ్రెయిన్ నొప్పి రావడానికి ముందు మలబద్ధకం, ప్రవర్తన పరమైన మార్పులు, ఎక్కువ ఆహారం తీసుకోవాలని అనిపించడం, దాహం, మూత్ర విసర్జన పెరగడం వంటివి కనిపిస్తాయి. అందరిలోనూ ఇలానే కనిపించాలని లేదు.

వచ్చే రిస్క్ ఎవరికి?
25 శాతం మందికి తమ జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో మైగ్రేయిన్ నొప్పి అనుభవమే. దీని బాధితులు ఎక్కువగా మహిళలే. యవ్వన దశలోకి ప్రవేశించిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి నలుగురు బాధితుల్లో ముగ్గురు మహిళలే ఉంటున్నారు. జన్యుపరంగా మార్పులు, కుటుంబంలో పెద్దవారికి ఉంటే తర్వాత తరం వారికి ఇది రావడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులకు కూడా మైగ్రెయిన్ తలనొప్పి వచ్చేందుకు అవకాశం ఉంది. కాకపోతే ఇది చాలా తక్కువ శాతమే.  

మైగ్రేయిన్, ఆందోళన నొప్పి మధ్య తేడా
మైగ్రేయిన్ తల నొప్పికి, ఆందోళన కారణంగా వచ్చే తలనొప్పికి మధ్య తేడా ఉంది. ఆందోళన కారణంగా వచ్చే నొప్పి పెరుగుతూ, తగ్గుతూ ఉండదు. ఒత్తిడి, పట్టేసినట్టు ఉంటుంది. నొప్పి తీవ్రత తక్కువ నుంచి మధ్యస్తంగా ఉండొచ్చు. మైగ్రేయిన్ మాదిరిగా శారీరక శ్రమ వల్ల ఈ నొప్పి పెరగదు. ఇక వాంతులు, వికారం వంటివి కూడా ఉండవు.

మీకు మీరే గుర్తించాలి
representational imageఏ ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు నొప్పి వచ్చింది, మైగ్రేయిన్ నొప్పి రావడానికి ముందు 48 గంటల నుంచి మీరు చేసిన పనులు, తలనొప్పి వచ్చినప్పుడు నొప్పి తీవ్రత, వస్తూ పోతుందా, పెరుగుతూ తగ్గుతోందా, తరచుగా వస్తోందా, వచ్చిన తర్వాత ఎన్ని గంటలు ఉంటోంది, ఇంకా ఏవైనా బాధలు ఉన్నాయా, కంటి చూపు ఎలా ఉంటోంది, వెలుగును చూడగలుగుతున్నారా, వాంతులు, వికారం ఏవైనా ఉన్నాయా... ఇలా ఏవైతే మీరు గుర్తించిన వాటన్నింటినీ ఓ పేపర్ పై రాసి వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు చెప్పాలి. దీంతో వ్యాధి నిర్ధారణ సులభం అవుతుంది.

ఈ జాగ్రత్తలతో దూరం...
representational imageఆహార, నిద్ర వేళలు క్రమం తప్పకుండా రోజూ నిర్ణీత వేళల ప్రకారం ఉండేలా చూసుకోవాలి. మైగ్రేయిన్ నొప్పి తీవ్రమయ్యేందుకు దారి తీసే ఆహారానికి దూరంగా ఉండాలి. పైన కొన్ని ఆహార పదార్థాలు గురించి చెప్పుకున్నాం. తగినంత నీరు తాగుతూ ఉండాలి. కొందరిలో ఆల్కహాల్ కూడా మైగ్రేయిన్ సమస్యను పెంచుతుంది. మెడిటేషన్ లేదా యోగా చేయడం వల్ల మైగ్రేయిన్ నొప్పి నుంచి నివారణ పొందొచ్చని పలు పరిశోధనల్లో రుజువైంది. ఈ సమస్య ఉన్న వారు ఉపవాసాల పేరుతో ఆహారాన్ని స్కిప్ చేయకూడదు. దానివల్ల గ్లూకోజు స్థాయుల్లో మార్పులు జరిగి తలనొప్పి వస్తుంది. వయసు పై బడుతున్న కొద్దీ మైగ్రేయిన్ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. పూర్తిగా కనుమరుగు కూడా కావచ్చు. రోజువారీ జీవనంలో సిస్టమ్స్ ముందు కూర్చుని పనిచేసే వారు కళ్లపై ఎక్కువగా ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

గర్భిణుల్లో
గర్భం దాల్చిన తర్వాత మైగ్రేయిన్ సమస్య తగ్గిపోవడం సాధారణంగా చాలా మందిలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో హార్మోన్ల విడుదలలో వచ్చే మార్పులే కారణం. ఒకవేళ గర్భంతో ఉన్నప్పుడు మైగ్రేయిన్ నొప్పి వస్తే సొంతంగా టాబ్లెట్లు వేసుకోకూడదు. అవి గర్భంలో ఉన్న పిండానికి హాని కలిగిస్తాయి. వైద్యుల సూచనతోనే ఏ టాబ్లెట్ అయినా వేసుకోవాలి.

మైగ్రేయిన్ లో కడుపు నొప్పి
representational imageమైగ్రేయిన్ అంటే తలనొప్పి మాత్రమే అనుకోవడానికి లేదు. కడుపులో వచ్చే అబ్డామినల్ మైగ్రేయిన్ కూడా ఉంది. ఇది చిన్నారుల్లో పత్రి 100 మందిలో ఇద్దరికి వస్తుంది. కుటుంబంలో మైగ్రేయిన్ తలనొప్పి ఉన్న వారి పిల్లలకు ఇది రావచ్చు. అబ్డామినల్ మైగ్రేయిన్ వచ్చిన పిల్లలకు బొడ్డు భాగంలో నొప్పి వేధిస్తుంది. వీరు పెద్దయిన తర్వాత ఇదే తలనొప్పిగానూ మారొచ్చు.

అశ్రద్ధ మంచిది కాదు
తరచుగా తలనొప్పి వస్తుంటే ముందుల షాపు నుంచి మందులు తెచ్చుకుని వేసుకునే అలవాటు మంచిది కాదు. రక్తపోటు, రక్త ప్రసారంలో అవాంతరాలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, మెదడులో కణితులు ఇలా ఎన్నో కారణాల వల్ల కూడా తలనొప్పి రావచ్చు. అలక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy