ap7am logo

హాలిడేకు ప్లాన్ కోసం... ఈ యాప్స్ సాయం తీసుకుంటే పోదూ!

Fri, Jun 16, 2017, 05:13 AM
Related Image

దేశీయంగా పర్యాటక ప్రదేశాలు ఇటీవలి కాలంలో తెగ సందడిగా ఉంటున్నాయి. పర్యాటక అందాలను వీక్షించే వారి సంఖ్య ఏటేటా పెరుగుతూ పోతోంది. దీంతో మారుమూలనున్న అందమైన ప్రదేశాలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పుడూ ఇల్లు, ఆఫీసేనా అని బోర్ గా ఫీలయ్యే వారు, ప్రకృతి అందాలను ఆస్వాదించాలని కోరుకునే వారు పర్యటనలకు ప్లాన్ చేసుకోవాల్సిందే మరి. ఈ విషయంలో సాయం చేసేందుకు, సమగ్ర సమాచారం ఇచ్చేందుకు బోలెడు యాప్స్ ఉన్నాయి. అందులో సౌకర్యంగా ఉండే కొన్నింటి గురించి చూద్దాం.


ఫ్లయిట్ బుకింగ్
representative imageమేక్ మై ట్రిప్, యాత్రా, క్లియర్ ట్రిప్, ముసాఫిర్, ఎక్స్ పీడియా, ఇక్సిగో, ఐబిబో, స్కైక్రానర్, కాయక్ ఈ యాప్స్ అన్నీ కూడా ఫ్లయిట్ టికెట్ల బుకింగ్ కు ఉపయోగపడేవే. వీటిలో విమానయాన సంస్థల టికెట్ల చార్జీల్లో ఉన్న వ్యత్యాలసాలు కూడా తెలుస్తాయి. అదే సమయంలో క్రెడిట్, డెబిట్ కార్డు, బ్యాంకుల ఆఫర్లు ఏమైనా ఉన్నాయేమో, డిస్కౌంట్లను కూడా పరిశీలించాలి. ట్రావెల్ టికెట్లు ఇతర బుకింగ్ లు అన్నీ పూర్తయ్యాక ఆయా టికెట్లను ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బుక్ చేయడం పూర్తయిన తర్వాత ఆయా టికెట్లను, ఇతర బుకింగ్ లు అన్నింటినీ ఒక్క చోటే భద్రపరిచేందుకు ‘ట్రిప్ ఎల్ టీ’ యాప్ ఉపయోగపడుతుంది. మెయిల్ బాక్స్ ను ఆటోమేటిక్ గా స్కాన్ చేసి టికెట్ల సమాచారాన్ని యాప్ లోకి తీసుకొచ్చి ఒక్కచోటే చూపిస్తుంది. మ్యాన్యువల్ గానూ టికెట్లను యాడ్ చేసుకోవచ్చు. ప్రయాణ సమయం, హోటల్ లో చెక్ ఇన్, చెక్ అవుట్ సమయాలను తెలియజేస్తుంది. పాస్ పోర్ట్, వీసా తదితర కీలక డాక్యుమెంట్లను కూడా యాప్ లో నిల్వ చేసుకోవచ్చు. అలాగే, అత్యవసర కాంటాక్ట్ నంబర్ ను కూడా ఇచ్చుకోవచ్చు. సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ సైతం గూగుల్ ట్రిప్స్ పేరుతో ట్రావెల్ ప్లానర్ సేవలు అందిస్తోంది. పైన చెప్పుకున్న సదుపాయాలకు అదనంగా మీ సమీపంలో చూడాల్సిన ఆకర్షణీయమైన స్థలాల గురించి తెలియజేస్తుంది. ఆ సమాచారాన్ని ఫోన్లో డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్లో ఉపయోగించుకునే వీలు కూడా ఉంది.

హోటల్ బుకింగ్స్
representative imageఫ్లయిట్ బుకింగ్స్ కు సంబంధించిన యాప్స్ లో చాలా వరకు హోటల్ బుకింగ్స్ కూ వీలు కల్పించేవే. కేవలం హోటల్ బుకింగ్స్ కోసమే అయితే ట్రివగో యాప్ ను పరిశీలించొచ్చు. ఏ ప్రాంతంలో ఏ తరహా రూమ్ కావాలో, ఎప్పుడు చెక్ ఇన్, ఎప్పుడు చెక్ అవుట్ అవ్వాలనుకుంటున్నారో తేదీ వివరాలు ఇస్తే చాలు... అందుబాటులో ఉన్న అన్ని హోటల్స్ చార్జీలను ఫిల్టర్ చేసి తక్కువ ధరలు ఎక్కడున్నదీ యాప్ చేప్పేస్తుంది. హోటల్ ఏదైనా కానీ, బుకింగ్ కు ముందు సంబంధిత హోటల్ వెబ్ సైట్ నూ ఓ సారి పరిశీలించడం మంచిది.ఎయిర్ బీఎన్ బీ అనే మరో యాప్ కూడా ఉంది. ఇందులో హోటల్ కాకుండా అద్దెకు ఇచ్చే ఫ్లాట్స్, ఇళ్ల సమాచారం లభిస్తుంది. వాటికి సంబంధించిన ఫొటోలు సైతం అందుబాటులో ఉంటాయి. ఏ ప్రాంతంలో అయితే పర్యటించదలుచుకున్నారో... అక్కడ అద్దెకు ఏమైనా ఉన్నాయా, వాటి అద్దె ధరలు ఎంత? అన్న వివరాలను ఈ యాప్ సాయంతో తెలుసుకోవచ్చు.

వెంట ఏవి తీసుకెళ్లాలి...?
representative imageఎక్కడికైనా దూర ప్రయాణం పెట్టుకుంటే వెంట ఏవేవి తీసుకెళ్లాలన్న సందిగ్ధం ఒకటైతే, వాటిని గుర్తు పెట్టుకోవడం రెండో ఇబ్బంది. అవసరమైనవి మర్చిపోవడం, అంతగా అవసరపడనివి బ్యాగులో సర్దేయడం కూడా అనుభవమే. కానీ, ఈ విషయంలోనూ సాయం చేసే యాప్స్ ఉన్నాయి. ప్యాక్ పాయింట్ యాప్ అని ఒకటుంది. మీ వయసు, లింగం, ఏ ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నారు, ఏ అవసరం కోసం వెళుతున్నారు? తదితర వివరాలు అడుగుతుంది. వెళ్లిన తర్వాత అక్కడ ఏమేం చేయాలనుకుంటున్నారో వివరాలు ఇస్తే చాలు. బ్యాగ్ లో ఏవేవి పెట్టుకోవాలి, ఏమేం చేయాలన్నది యాపే చెప్పేస్తుంది. దాంతో అనవసరమైన వాటిని పక్కన పడేసి, అవసరమైన వాటినే వెంట తీసుకెళ్లొచ్చు. ప్రీమియం వెర్షన్ యాప్ కూడా ఉంది. దీని ధర రూ.190. ఇందులో అయితే మరింత సమాచారాన్ని పొందొచ్చు.

ఐఆర్ సీటీసీ కనెక్ట్
ఇది రైల్వే శాఖకు చెందిన యాప్. దేశవ్యాప్తంగా ఒక చోట నుంచి మరో చోటుకు ఏఏ రైళ్లు అందుబాటులో ఉన్నాయి, వాటి టికెట్స్ బుకింగ్, సేవలను సులభంగా పొందొచ్చు.

రైల్ యాత్రి
representative imageరైలు యాత్రి యాప్ ద్వారా రైలు రిజర్వేషన్ వాస్తవ స్థితిని తెలియజేసే పీఎన్ఆర్ స్టాటస్, రైలు ఏ ప్లాట్ ఫామ్ పైకి వస్తుందో చెప్పే సమాచారం, సీట్ల లభ్యత, ఏ సమయానికి రైలు వస్తుంది, ఏ సమయానికి బయల్దేరుతుంది? తదితర సమాచారం తెలుసుకోవచ్చు. ఆర్డర్ చేస్తే ఆహార పదార్థాలను రైల్లోని మీ సీట్ దగ్గరకే తెచ్చిస్తారు. రెండు స్టేషన్ల మధ్య తిరిగే రైళ్ల గురించి, ఫలానా స్టేషన్ నుంచి క్యాబ్ లు అందుబాటులో ఉన్నాయా, లేవా? అన్న సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.

సైట్ సీయింగ్
ట్రిప్ అడ్వైజర్ పర్యటనకు సంబంధించి సమగ్ర సమాచార వేదిక. ఏ క్షేత్రాలను చూడాలి, ఏఏ టూరిస్ట్ స్పాట్స్ కు దూరంగా ఉండాలి, పెద్దగా తెలియని టూరిస్ట్ ప్రదేశాలు, అప్పటికే ఆయా ప్రాంతాలను సందర్శించిన వారు తమ అనుభవాలను తెలియజేస్తూ రాసిన ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ వేదికలో అందుబాటులో ఉన్నాయి.

'అరౌండ్ మీ' అనే మరో యాప్ ఉంది. మీరు పర్యటించే ప్రాంతంలో ఉన్న పార్కులు, పబ్ లు, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్ల సమాచారాన్ని ఇది తెలియజేస్తుంది. వాటికి ఎలా వెళ్లాలో రూట్ మ్యాప్ కూడా చూపిస్తుంది. కాంటాక్ట్ నంబర్ల సమాచారం కూడా ఉంటుంది. మ్యాట్రిక్స్ ట్రావెల్ కంపానియన్ అనే మరో యాప్ కూడా ఉంది. రెస్టారెంట్లు, పర్యాటక ఆకర్షణల గురించి తెలియజేస్తుంది. దగ్గర్లోని షాపుల గురించి కూడా చెబుతుంది. క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు. మొబైల్ రీచార్జ్ కూడా చేసుకోవచ్చు.

ట్రిప్ ప్లానర్
ట్రిప్ ప్లానర్ అనే యాప్ దేశంలోని పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. చాలా ప్రాచుర్యం పొందిన, అంతగా ప్రాచుర్యం లేని వాటి గురించి కూడా సమాచారాన్ని ఇవ్వగలదు. ట్రిప్ లో భాగంగా సరదా కోసం చేయతగిన వాటి గురించి కూడా చెబుతుంది.

గైడ్ అక్కర్లేదు...
representative imageఆడియో కంపాస్ అనేది కేంద్ర పర్యాటక శాఖ సహకారంతో తీసుకొచ్చిన యాప్. టూరిస్ట్ ప్రదేశాలు, అక్కడ చూడాల్సిన విశేషాల గురించి ఆడియో రూపంలో వివరిస్తుంది. ఈ యాప్ లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఆఫ్ లైన్ లోనూ పనిచేయడం. కొత్త ప్రదేశాన్ని చూసేందుకు వెళ్లేవారు అక్కడి విశేషాలను తెలుసుకునేందుకు గైడ్ ను పెట్టుకోవద్దనుకుంటే ఈ యాప్ ఉపయోగకరం. మరీ ముఖ్యంగా భారత్ కు విచ్చేసే విదేశీయులకు ఇది ఓ వరం, ఫ్రెండ్ వంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే భాషా పరంగా ఇబ్బందుల్లేకుండా స్పష్టమైన, స్వచ్ఛమైన ఇంగ్లిష్ లో ప్రాంతాల సమాచారాన్ని వారు వినొచ్చు.

ట్రిపోటో
ఉదాహరణకు ఊటీ వెళ్లాలనుకుంటున్నారు. అక్కడకు వెళ్లిన తర్వాత స్థానికులతో కనెక్ట్ అవ్వాలనుకున్నా, వారి సహకారాన్ని పొందాలనుకున్నా అందుకు ట్రిపోటో యాప్ వీలు కల్పిస్తుంది. తోటి పర్యాటకులతోనూ పరిచయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. పర్యాటకుల మధ్య షోషల్ నెట్ వర్క్ వేదికగా ఇది పనిచేస్తుంది. పర్యాటక ప్రాంతాల ఫొటోలు, రివ్యూలు కూడా ఉంటాయి.

అన్నీ ఒకే చోట...
ఒక్కో దానికి ఒక్కో యాప్ వద్దనుకుంటే... మేక్ మై ట్రిప్ యాప్ కు వెళ్లిపోవడమే. రైలు, బస్సు, ఫ్లయిట్ టికెట్ల బుకింగ్, హోటల్స్ లో గదుల బుకింగ్ సేవలన్నింటినీ ఒక్కచోటే పొందొచ్చు. క్యాబ్ లను కూడా బుక్ చేసుకోవచ్చు. హోటల్ కాకుండా, ఇంటి వాతావరణంలో విడిది చేయాలనుకునేవారికీ ఆ అవకాశం కూడా ఉంది. పేయింగ్ గెస్ట్ గా చక్కని వసతి సదుపాయాలను బుక్ చేసుకోవచ్చు. అలాగే వివిధ పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన ఆర్టికల్స్ కూడా స్టోరీల విభాగంలో ఉన్నాయి.

విట్రావెల్ సోలో
ఒక్కరే పర్యటించాల్సి వచ్చినప్పుడు తోడు కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఒంటరిగా పర్యటించే వారికి సోల్ మేట్ ను చూపిస్తుంది. ఏదైనా ఓ ప్రాంతానికి వెళుతున్నప్పుడు, అదే పర్యటనలో ఉన్న వారితో కలుపుతుంది. అలాగే, భిన్నమైన పర్యటన ఆలోచనలూ యాప్ లో ఉంటాయి.

ట్రావెల్ ఖానా
రైల్లో ప్రయాణిస్తూ ఏదైనా తినాలనిపించిందా... ట్రావెల్ ఖానా యాప్ ఓపెన్ చేసి మెనూ చూసి ఆర్డర్ చేస్తే చాలు. మీ టికెట్ పీఎన్ఆర్ నంబర్, ఏ స్టేషన్ లో అందివ్వాలి అన్న వివరాలు అందిస్తే ... సరిగ్గా అదే స్టేషన్ లో ఫుడ్ ప్యాక్ మీ చేతిలో ఉంటుంది.
 
ఆఫ్ లైన్ మ్యాప్స్
representative imageమ్యాప్స్ తో ఎక్కడికైనా సులభంగా వెళ్లేంత టెక్నాలజీ నేడు అందుబాటులోకి వచ్చింది. కాకపోతే చాలా రకాల యాప్స్ కు మొబైల్ డేటా అవసరం. అయితే ‘మ్యాప్స్ డాట్ మి’ యాప్ మాత్రం ఆఫ్ లైన్ లోనూ చక్కగా పని చేస్తుంది.

లైవ్ ట్రాకర్
ఈ యాప్ మీ పర్యటన వివరాలన్నింటినీ రికార్డ్ చేసేస్తుంది. మీరు వెళ్లొచ్చిన మార్గం, ఎక్కడ ఫొటోలు తీశారు, ఎక్కడ బస చేశారు, వీడియోలను ఎక్కడ షూట్ చేశారు తదితర పర్యటనకు సంబంధించి సమగ్ర సమాచారంతో ఓ బ్లాగ్ ను కూడా క్రియేట్ చేస్తుంది.

మరికొన్ని...
రెడ్ బస్: బస్సు టికెట్ల బుకింగ్ కోసం అనువైన యాప్. దేశంలో దిగ్గజ బస్ టికెటింగ్ సంస్థ ఇది.
ఓయోరూమ్స్: ఎక్కడైనా సరే కావాల్సిన బడ్జెట్ లో హోటల్ రూమ్ బుక్ చేసుకోవాలంటే అనువైనది. హోటల్ రూమ్స్ బుకింగ్ కోసమే ప్రత్యేకించిన యాప్ ఇది.
జస్ట్ డయల్: లోకల్ సెర్చింజిన్ ఇది. మీరు పర్యటించే ప్రాంతంలో షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, హాస్పిటల్స్, ఔషధ దుకాణాలు ఇలా అన్ని రకాల సమాచార వేదిక.
జొమాటో: రెస్టారెంట్లకు సంబంధించిన అతిపెద్ద డిక్షనరీ ఇది. కస్టమర్ల సమీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy