ap7am logo

భారత గూఢచర్య సంస్థలు... ‘ఇంటెలిజెన్స్ బ్యూరో’, ‘రా’ గురించి కొన్ని విషయాలు

Sun, Jun 18, 2017, 12:42 PM
Related Image

ఉగ్రవాదులు, అల్లర్లు, దేశ వ్యతిరేక శక్తులు, విదేశీ సైన్యాల కుట్రలు ఇలా ఒకటేమిటి... దేశ భద్రతను కాంక్షిస్తూ ముప్పును ముందే పసిగట్టి సర్వసన్నద్ధం చేసే నిఘా, గూఢ చర్య సంస్థలే ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా). వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ రెండు విభాగాలూ దేశ భద్రత దృష్ట్యా అత్యంత గౌరవనీయ, కీలకమైన సంస్థలు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రపంచంలో ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న గూఢచర్య విభాగాల్లో ఐబీ కూడా ఒకటి. ఇంటెలిజెన్స్ బ్యూరోను 1887 డిసెంబర్ 23న బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేశారు. అఫ్ఘానిస్థాన్ లో రష్యా దళాల కదలికల గురించిన సమాచారం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. రష్యా దళాలు భారత్ పై దండయాత్ర చేస్తాయేమోనన్న భయంతో బ్రిటిష్ పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రారంభంలో దేశంలోనూ, దేశం వెలుపలా గూఢచర్య బాధ్యతలను ఐబీనే నిర్వహించేది. ఆ తర్వాత దేశం లోపల నిఘా, గూఢచర్య బాధ్యతల కోసం ఐబీ... దేశం వెలుపల ఈ బాధ్యతలు చూసేందుకు 'రా' అంటూ రెండు విభాగాలుగా ఏర్పాటు చేశారు. 1962లో చైనా, భారత్ మధ్య యుద్ధం... 1965లో పాకిస్థాన్ తో యుద్ధాలను ముందుగానే పసిగట్టడంలో ఐబీ విఫలమైంది. అందుకే విదేశాల్లో నిఘా కోసం ప్రత్యేకంగా రా పేరుతో యూనిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
representational image
ఇంటెలిజెన్స్ బ్యూరోను 1947లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోగా మార్చారు. ఇది కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది. ఐబీ అధికారులు ఏం చేస్తారన్నది బయటకు తెలియనీయరు. అత్యంత గోప్యతను పాటిస్తారు. కనీసం ఏం చేస్తారు, ఎక్కడున్నారన్న విషయాలను ఆఖరికి వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియనీయరు. క్షేత్ర స్థాయిలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు పనిచేస్తుంటారు. పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ కేడర్ కు సమాన హోదా ఇది. సూపరింటెండెంట్ స్థాయి వరకూ తమ ఉద్యోగ జీవిత కాలంలో ఎదిగేందుకు అవకాశం ఉంది. పోలీసు బలగాల్లో ఈ అవకాశం లేదు. ఇండియన్ పోలీసు సర్వీసు, ఇండియన్ రెవెన్యూ సర్వీసుకు చెందిన అధికారులను ఈ విభాగంలో కీలక పోస్టుల కోసం తీసుకుంటుంటారు. ఈ విభాగానికి డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారే వ్యవహరిస్తారు.

ఐబీ ఏజెంట్లు సమాజంలోకి సామాన్యులుగా చొచ్చుకుపోగలరు. పరిచయాలు పెంచుకుని, తమకు సమాచారం అందించే వనరులను ఏర్పాటు చేసుకోవడంలో సిద్ధహస్తులు. రహస్యంగా నిఘా వేసి ఉంచుతారు. అనుమానితుల ఆనుపానులను ట్రాక్ చేస్తుంటారు. కానీ వారిని పట్టుకోరు. ప్రమాదం ముంచుకురాకముందే ఆ విషయాన్ని పసిగట్టి పోలీసు, భద్రతా దళాలకు సమాచారాన్ని చేరవేస్తారు. ఓ కంప్యూటర్, ప్రింటర్, టెలిఫోన్ వీరి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు. దేశ సరిహద్దుల్లో, అంతర్గతంగానూ వివిధ కీలక ప్రాంతాల్లో వీరు రహస్యంగా సంచరిస్తూ విధులు నిర్వహిస్తుంటారు. వీఐపీ భద్రతా విధులను కూడా చేపడుతుంటారు. ఏటా వీరికి ఒక నెల వేతనాన్ని అదనంగా ఇస్తుంటారు.

ఇంటెలిజెన్స్ బ్యూరోను పాలకులు తమ స్వప్రయోజనాలకు కూడా వాడుకుంటున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రతిపక్ష నేతలపై నిఘా కోసం, ఎన్నికల్లో తమ విజయావకాశాలు తదితర పనుల కోసం ఐబీ సేవలను వినియోగించుకున్న సందర్భాలున్నాయి. ఇందిరాగాంధీ సైతం తన హయాంలో ఐబీని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి.

రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)
representational imageఈ విభాగం 1968 సెప్టెంబర్ 21 నుంచి పనిచేయడం ప్రారంభించింది. ఏ అంశంలోనైనా సరే 'రా' దేశ పార్లమెంటుకు జవాబుదారీ కాదు. ఈ సంస్థకు సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద కోరడానికీ లేదు. దేశ ప్రధాని, జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీకి మాత్రమే రా సమాధానం చెప్పుకోవాలి. తొలుత ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇండియన్ పోలీసు సర్వీసు నుంచి అధికారులను నియమించుకునేవారు. ప్రస్తుతం సాధారణ ప్రక్రియలోనూ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు.

రా అధికారులను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు పంపించి కఠినమైన ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణనిస్తారు. అమెరికా, యూకే, ఇజ్రాయెల్ దేశాలు కూడా జాబితాలో ఉన్నాయి. రా సిబ్బందికి శిక్షణ సుదీర్ధకాలం పాటు కొనసాగుతుంది. బేసిక్, అడ్వాన్స్డ్ అని రెండు రకాలుగా శిక్షణ ఉంటుంది. బేసిక్ శిక్షణ పది రోజులే. ఈ సమయంలో గూఢచర్యం గురించి అవగాహన కల్పిస్తారు. ఆర్థిక, వాణిజ్యపరమైన పరిశోధన, అంతరిక్ష విజ్ఞానం, సమాచార భద్రత, ఇంధన భద్రత, శాస్త్ర పరిజ్ఞానంలో శిక్షణనిస్తారు. ఓ విదేశీ భాషను నేర్పిస్తారు. ఇతర దేశ గూఢచర్య సంస్థలపై కేస్ స్టడీకి పంపిస్తారు.

representational imageబేసిక్ శిక్షణ ముగిసిన తర్వాత క్షేత్రస్థాయి గూఢచర్య బాధ్యతల్లో దింపుతారు. ఏడాది నుంచి రెండేళ్ల పాటు శిక్షణ కొనసాగుతుంది. తీవ్రమైన చలి వాతావరణంలో, రహస్య ఆపరేషన్లలో సుశిక్షితులుగా తీర్చిదిద్దుతారు. రాత్రి సమయాల్లో ఎలా పనిచేయాలి, చొరబాటు ఎలా, ఇతర దేశాల భద్రతా బలగాలు పట్టుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ దొరికిపోతే విచారణ ఎదుర్కోవడం ఎలా, ఇలా ఎన్నో రకాల నైపుణ్యాలను నేర్పిస్తారు. క్షేత్ర స్థాయిలో రాటుదేలిన తర్వాత తిరిగి మళ్లీ స్కూల్ కు తీసుకెళ్లి తుది మెరుగులు దిద్దుతారు.

మన దేశ భద్రతపై ప్రభావం చూపగల దేశాల్లో రాజకీయ, సైనిక, ఆర్థిక, శాస్త్రపరమైన మార్పులను పరిశీలిస్తూ ఉండడం రా అధికారుల విధుల్లో భాగం. విదేశీ ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేస్తుంటారు. పాకిస్థాన్ కు అంతర్జాతీయంగా సహకారాన్ని పరిమితం చేసేందుకూ కృషి చేస్తుంటారు. కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అజీజ్ మధ్య సంభాషణను రా విజయవంతంగా వినగలిగింది. ఈ సంభాషణలో కార్గిల్ చొరబాటును మొహమ్మద్ అజీజ్ నిర్ధారించడం గమనార్హం. బంగ్లాదేశ్ అవతరణలోను, దేశంలో సిక్కిం ఓ రాష్ట్రంగా కలసిపోవడంలోనూ రా పాత్ర ఉంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Advertisements