టౌన్ షిప్ లో ఇల్లు లేదా ఫ్లాట్... ఏది మంచిది?

Mon, Apr 24, 2017, 03:32 PM
Related Image

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ప్రతి వారు వారి వారి ఆర్థిక స్తోమతకు తగినట్టు కొనుగోలుకు ప్లాన్ చేసుకుంటారు. ఇల్లు అయినా, ఫ్లాటయినా భారీ మొత్తంలో బడ్జెట్ తో ముడిపడి ఉంటుంది. మరి సొంతిల్లు అన్న తర్వాత అన్ని రకాలుగా సంతృప్తిని ఇవ్వాలి. మార్కెట్ పరంగా మంచి విలువ కూడా కలిగి ఉండాలి. ఇలా చూసినప్పుడు టౌన్ షిప్/గేటెడ్ కమ్యూనిటీ లో కొనుగోలు మంచి నిర్ణయం అవుతుంది. అదెలానో చూద్దాం... 

టౌన్ షిప్ లో అటు నివాసాలు, ఇటు షాపులు, స్కూళ్లు, హాస్పిటల్, పార్కులు, రోడ్లు, తాగు నీరు తదితర మౌలిక సదుపాయాలు అన్నీ ఉంటాయి. ఫలితంగా ఈ సదుపాయాలతో సౌకర్యవంతమైన జీవనానికి అవకాశం ఉంటుంది. అన్నింటికీ వాహనం తీసుకుని పరుగెత్తడం అంటే నగర వాసులకు కాలం హరించే, శ్రమతో కూడుకున్న పని. అందుకే నేడు ప్రతి ఒక్కరూ తామున్న చోటే అన్ని రకాల వసతులు ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టౌన్ షిప్ లు/ గేటెడ్ కమ్యూనిటీలు అనువుగా ఉంటాయని చెప్పవచ్చు. 

చక్కని భద్రత

భద్రత పరంగా చూసుకున్నా గేటెడ్ కమ్యూనిటీలే ఉత్తమం. ప్రాజెక్టు చుట్టూ ప్రహరీ గోడ, సెక్యూరిటీ సిబ్బందితో కట్టుదిట్టంగా ఉంటుంది. ఇతరులు అంత సులువుగా ప్రవేశించలేరు. ఆ టౌన్ షిప్ లో నివాసితులు కాకుండా కొత్తవారు లోపలికి చొరబడినా వెంటనే పసిగట్టడానికి వీలుంటుంది. దీంతో నేరాలకు అంత ఆస్కారం ఉండదు. అదే ఇతర ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ఫ్లాట్ లేదా ఇల్లు కొనుగోలు చేసినట్లయితే ఈ సదుపాయాలు, భద్రతకు భరోసా లేదు కదా. అందుకే సాధారణ ప్రాజెక్టుల కంటే గేటెడ్ కమ్యూనిటీల్లో విక్రయాలు వేగంగా పూర్తవుతుంటాయి. దీన్ని బట్టి డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లే కదా. పెట్టుబడి పరంగా చూసినా గేటెడ్ కమ్యూనిటీల్లో కొనుగోలు మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది. వీటిలో ఉన్న సౌకర్యాలు, అనుకూలతల దృష్ట్యా విక్రయానికి పెట్టినా తొందరగా అమ్ముడుపోగలదు.

ఇతర సదుపాయాలు

సాధారణ ప్రాజెక్టులతో పోలిస్తే గేటెడ్ కమ్యూనిటీలు/టౌన్ షిప్ లలో ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటుంది. నడిచేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్, గార్డెన్, ప్లేగ్రౌండ్ తదితర వసతులు ఉంటాయి. దీంతో వ్యాయాయం చేసుకోవడానికి, సేద తీరడానికి, చిన్నారులు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. నగరంలో ఓ చిన్న పట్టణంగా వీటిని పేర్కొనవచ్చు. నివాస, వాణిజ్య, విద్యా, ఆరోగ్యం, క్రీడలు వంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. 

కాలుష్య ప్రభావమూ తక్కువే

సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టులు ట్రాఫిక్, కాలుష్యం తక్కువ ఉండే ప్రాంతాల్లోనే ఉంటాయి. అలా చూసుకున్నా ప్రయోజనకరమే. ప్రాజెక్టు లోపల చెట్లు, మొక్కలతో తగినంత పచ్చదనం కూడా ఉంటుంది కనుక ఆరోగ్యానికి కూడా అనుకూలంగా ఉంటుంది. భార్యా, భర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే వారికి ఇలాంటివే తగినవి. సెక్యూరిటీ సిబ్బంది, సీసీ కెమెరాలతో పరిసరాలపై నిఘా కూడా ఉంటుంది. ఫలితంగా ఇంటితోపాటు, ఇంట్లో చిన్నారులు ఉన్నా,  వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నా వారికి రక్షణ ఉంటుంది. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy