ap7am logo

అనుభవాలే... ఆర్థిక విజయాలకు సోపానాలు!

Wed, May 31, 2017, 11:49 AM
Related Image

సంపాదన, వ్యయం, పొదుపు, మదుపు ఇవన్నీ ప్రతీ వ్యక్తి జీవితంలో భాగమే. పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించి సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతుంటాయి. వీటిలో కొన్ని అనుభవాలు ఎంతో విలువైనవి అయి ఉంటాయి. వీటి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. ఆర్థిక ప్రయాణం అన్నది లాభాలు, రాబడుల వెంట రేసింగ్ మాదిరిగా ఉండరాదు. ఇటుక, ఇటుక పేర్చి ఇల్లు కట్టిన చందంగా ఉండాలి.  


జీరో బ్యాలన్స్
representative imageజేబులో రూపాయి కూడా లేని సందర్భం ఒక్క సారైనా తటస్థ పడుతుంది. ఖాళీ జేబే కాదు... బ్యాంకులోనూ సున్నా బ్యాలన్స్ ఉండే సందర్భాలు అనుభవమే. ఈ తరహా గడ్డు పరిస్థితులు చాలా మందికి పలు మార్లు ఎదురవడం సర్వ సాధారణం. తొలి నాళ్లలో ఉద్యోగం లేని సందర్భాల్లో ఇటువంటివి ఎక్కువగా ఉంటుంటాయి. జేబులో రూపాయి లేకుండా పడిన కష్టాలు కొంత మందిని గొప్ప స్థాయికి చేరుకునే దిశగా అడుగులు వేయిస్తాయి. రూపాయికి కటకటగా ఉన్న సందర్భంలో ధన సాయం చేసేందుకు ఒక్కరూ ముందుకు రాని సమయంలో అవసరాలను తీర్చుకోవడానికి పడిన మానసిక వేదనే ఆ తర్వాతి కాలంలో విజయానికి సోపానంగా మారుతుంది. అవసరంలో ఆదుకునే వారు కానరాక, రూపాయి పుట్టించడానికి పడ్డ ఇబ్బందులు, అవమానాలే వారిలో సాధించాలన్న లక్ష్యాన్ని సాకారం చేస్తాయి.

మార్గదర్శకుడితో కలసి అడుగులు
representative imageఏదేనీ రంగంలో పనితీరు గొప్పగా ఉండాలంటే అందుకు సరైన మార్గదర్శనం అవసరం. విద్యార్థికి టీచర్ మాదిరిగానే... సంపద సృష్టికి ఓ మార్గదర్శకుడు కూడా అవసరం. కొంత మంది తమ జీవితంలో ఎంతో మంది మార్గదర్శకుల సాయం పొందుతుంటారు. ఉదాహరణకు భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు. అప్పుడు పెట్టుబడులపై మంచి అనుభవం ఉన్న వ్యక్తిని సంప్రదించడం వల్ల గణనీయమైన రాబడులను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంత మందికి ఒకరి నుంచి సలహాలు తీసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా తామే స్వయంగా చేయాలనుకుంటుంటారు. కానీ, ఆర్థిక శాస్త్రంలో ఈ తీరు మంచి ఫలితాలను ఇవ్వదు. సంపద కూడబెట్టాలనుకుంటే మాత్రం ఆర్థిక నిపుణులను సంప్రదించి సలహాలు పొందడమే మంచిది.

బేర్ మార్కెట్
2008లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఆ సమయంలో షేర్ల ధరలు పేక మేడల్లా కుప్పకూలాయి. ఇన్వెస్టర్ల సంపద భారీగా తరిగిపోయింది. భయంతో వచ్చినంతలే అనుకుంటూ కొందరు ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న షేర్లన్నింటినీ అమ్మేశారు. కానీ, మార్కెట్ పట్ల సరైన అవగాహన, నిలకడత్వం ఉన్న వారు మాత్రం ఒక్క షేర్ కూడా అమ్మకుండా నిలకడగా వేచి చూశారు. ఎనిమిదేళ్ల తర్వాత నాటి షేర్లను ఒక్కసారి గమనిస్తే... ఇప్పుడు అవే షేర్లు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. సహనం, క్రమశిక్షణ సహా ఎన్నో విషయాలను బేర్ మార్కెట్ ఇన్వెస్టర్ కు నేర్పిస్తుంది. అస్సెట్ అలోకేషన్ (ఆస్తుల కేటాయింపులు/దేనిలో ఎంత పెట్టుబడి పెట్టాలోఅనుసరించే విధానం) తెలియకుంటే పెట్టుబడులు కళ్లెదుటే కరిగిపోతాయి. రిస్క్ కు తగ్గట్టు పోర్ట్ ఫోలియోను నిర్మించుకోవాలి.

బుల్ మార్కెట్
representative imageదేశీయ స్టాక్ మార్కెట్లు జీవిత కాల గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఇప్పుడే కాదు 2008 స్టాక్ మార్కెట్ల పతనం సమయంలోనూ సూచీలు గరిష్ట స్థాయులకు చేరినవే. మళ్లీ నాడు మొదలైన సూచీల ప్రయాణం 2017లో కొత్త శిఖరాలకు చేరుకుంది. రెండు మూడేళ్ల క్రితం పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రాబడులు వచ్చి ఉంటాయి. ఇక 2008 పతనం తర్వాత పెట్టుబడులు పెట్టిన వారికి తిరుగులేని రాబడులు వచ్చి ఉంటాయి. ఈ బుల్ ర్యాలీలు కొత్త ఇన్వెస్టర్లను స్టాక్ మార్కెట్ల వైపు ఆకర్షిస్తుంటాయి. అంతే కాదు, ప్రస్తుత ఇన్వెస్టర్లలోనూ మరింత పెట్టుబడులు పెట్టాలన్న ఆకాంక్షకు దారితీస్తుంది. ఈక్విటీల్లో రాబడుల రుచి తెలిసేది బుల్ ర్యాలీల్లోనే. అందుకే బుల్ ర్యాలీలో పెట్టుబడులు పెట్టడం కాకుండా... మార్కెట్లు కరెక్షన్ కు గురైనప్పుడు, తక్కువలో ట్రేడవుతున్నప్పుడు అధిక పెట్టుబడులు పెట్టడం, క్రమానుగత పెట్టుబడుల ద్వారా మంచి రాబడులకు అవకాశం ఉంటుంది.

ద్రవ్యోల్బణం మంట
ద్రవ్యోల్బణం సెగ తగలని మానవుడు ఉండడు. జేబులో రూ.500 నోటు పెట్టుకుని బయటకు వెళ్లి చూడండి. ఎన్ని వస్తువులు కొనుగోలు చేయగలరు...? పెట్టుబడులకు సంబంధించి ద్రవ్యోల్బణం అన్నది ప్రధాన ఆర్థిక అంశాల్లో ఒకటి. దీన్ని ఓడిస్తేనే ఆర్థికంగా విజయం సాధించగలుగుతారన్న విషయాన్ని తెలుసుకోవాలి. ద్రవ్యోల్బణం ప్రతీ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నా... దీని గురించి చాలా మందికి తెలియదు. తెలిసిన వారిలోనూ దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది తెలిసింది ఏ కొద్ది మందికో!

పర్సనల్ ఫైనాన్స్ లైబ్రరీ
representative imageనచ్చిన వస్తువు కొంటుంటారు. రూ.20వేలు పెట్టి స్మార్ట్ ఫోన్ కూ సిద్ధమవుతారు. కానీ, పర్సనల్ ఫైనాన్స్ లైబ్రరీ ఏర్పాటు చేసుకునే వారు ఎక్కడైనా కనిపిస్తారా...? లేదు. అసలు మనీ మేనేజ్ మెంట్ పట్ల ఆసక్తి చాలా తక్కువ మందిలో కనిపిస్తుంటుంది. దీన్ని బాగా వంట పట్టించుకుంటే ఇక వారి జీవితంలో డబ్బు పిల్లలు పెడుతూనే ఉంటుంది. ఓ ఇన్వెస్టర్ గా పన్సనల్ ఫైనాన్స్ లైబ్రరీని తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. మనీ మేనేజ్ మెంట్ గురించి చదువుతున్నప్పుడు మీ మదిలో అద్భుతమైన ఆలోచనలు రావచ్చు. వాటిని ఓ పుస్తకంలోకి ఎక్కించండి. మనీ మేనేజ్ మెంట్ కు సంబంధించి ఎన్ని పుస్తకాలు చదివితే అంత విషయ జ్ఞానం అలవడుతుంది.

రుణాలు
అప్పుతో అవసరం ఏర్పడని వారు అరుదే. ఏదో ఓ సమయంలో ఎవరో ఒకరి నుంచి అప్పు పుచ్చుకోవడం, లేదా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం సహజమే. కానీ, రుణమన్నది స్లో పాయిజన్. రుణ ఊబిలో కూరుకుపోతే దాన్నుంచి బయటపడగలిగేది కొంత మందే. కొంత మంది రుణంపై ఇల్లు, రుణంపై కారు కొని, క్రెడిట్ కార్డుతో అవసరాలు తీర్చుకుంటుంటారు. సరైన ప్రణాళికతో వీటిని ఉపయోగిస్తే ఇబ్బంది ఉండదు. కానీ, ఓ లెక్క లేకుండా వెళితే మాత్రం ఊబిలో కూరుకున్నట్టే. దీనర్థం ఆర్థిక వనరులను అస్తవ్యస్తం చేసుకోవడంలో మాస్టరేట్ పుచ్చుకున్న చందంగా ఉంటుంది. రుణాల నుంచి బయట పడిన వారి లైఫ్ చాలా వేగంగా ఉంటుంది.

మేథావులతో కొంత సమయం
ఆర్థికంగా సర్వస్వతంత్రులైన వారు, తమ కాళ్లపై తాము నిలబడిన వారితో కొంత సమయం గడపడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఓ బృందంగా కలసి కాఫీ లేదా టీ తాగుతూనే ఆర్థిక విషయాలపై చర్చించుకోవాలి. విజయవంతమైన వ్యాపార వేత్తను కలిసిన ప్రతిసారీ ఒకటో రెండో విజయ సూత్రాలు తెలుసుకోవచ్చు. డబ్బు విషయంలో వారి ఆలోచనలు, మార్గాలు, వారు పనిచేసే విధానం ఇలాంటి అంశాలను గమనించాలి.

కాంపౌండింగ్ మహిమ
representative imageసంపద సృష్టిలో కాంపౌండింగ్ ప్రధాన కాంపోనెంట్. నెలనెలా కొంత చొప్పున సిప్ చేస్తూ వెళ్లండి. పదేళ్లలో కాంపౌండింగ్ మహిమ ఏంటన్నది గుర్తిస్తారు. ప్రతీ నెలా రూ.10,000 చొప్పున సిప్ రూపంలో 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే వార్షికంగా 12 శాతం రాబడుల అంచనా మేరకు పదేళ్లలో రూ.25 లక్షలు అవుతాయి. అదే 20 ఏళ్లలో రూ.1.2 కోట్లు, 30 ఏళ్లకు రూ.4.4 కోట్లు అవుతాయి. పదేళ్ల తర్వాత వేగం పుంజుకుందంటే అది కాంపౌండింగ్ మహిమే. దీని గురించి మీ వారసులకూ తెలియజేయండి. వారూ అస్వాదిస్తారు.

తల్లిదండ్రుల అనుభవ జాడల్లో అడుగులు
పెద్దయితే తల్లిదండ్రులను పెద్దగా పట్టించుకోకపోవడం నేటి కాలంలో కనిపిస్తోంది. కానీ, పిల్లలకు పెద్ద సంపద తల్లిదండ్రులే. జీవితంలో అన్ని రకాల అనుభవాలను ఎదుర్కొన్న వారి నుంచి విషయాలను తెలుసుకుంటూ ఉండడం, వారి సూచనలు తీసుకోవడం, వారిని సంప్రదించడం మిమ్మల్ని ఆర్థికంగా మరింత అనుభవజ్ఞులను చేస్తుంది. ప్రతీ వ్యక్తి జీవితంలో విజయాలు, వైఫల్యాలు సర్వసాధారణం. తల్లిదండ్రులుగా వారిలోని ప్రతికూలతలను విమర్శించకండి. వారి విజయ సూత్రాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి.

మెడిటేషన్
మానసిక దృఢత్వం అన్నది పెట్టుబడులకు బలమైన పునాది. ధనం అన్నది శారీరక వస్తువు మాత్రమే. కానీ, ఈ ధనాన్ని వృద్ధి చేసే ఆలోచనలకు, అడుగులకు, ఆవిష్కరణలకు వేదిక మనసే. అందుకే దాన్ని జాగ్రత్తగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకోసం ప్రాణాయామం, యోగసనాలు ఉపకరిస్తాయి.

దాతృత్వం
representative imageఎంత సంపాదించామన్నది కాదు... పరుల కోసం ఎంత దానం చేశామన్నదీ కీలకమే. సంపాదించిన మొత్తంలో ఎంతో కొంత తిరిగి సమాజానికి ఇవ్వాలని బిల్ గేట్స్, వారెన్ బఫెట్, అజీమ్ ప్రేమ్ జీ, మార్క్ జుకర్ బర్గ్ వంటి ఎంతో మంది సంపన్నులు సందర్భానుసారంగా గుర్తు చేస్తూనే  ఉన్నారు. ఒకరికి రూపాయి ఇస్తే తిరిగి రెండు రూపాయలు వస్తాయంటారు. అందుకే దానం కూడా జీవితంలో భాగం కావాలి.

పిల్లలకు డబ్బు పాఠాలు
పిల్లలకు చక్కని పాఠశాల విద్యే కాదు, కుటుంబ విషయాలు, ఆర్థిక పరమైన విషయాల గురించి తెలియచెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఇది కూడా జీవితంలో భాగంగానే ఉండాలి. డబ్బు, పెట్టుబడులు, ప్రతిఫలాల విషయంలో మీ అనుభవాలను వారితో పంచుకోండి. కేవలం తమ పిల్లలకే అని కాదు... ఇరుగు పొరుగు చిన్నారులకూ తెలియజేయవచ్చు. నిపుణులు కానక్కర్లేదు. మీకు తెలిసిన ఆ కాస్త పరిజ్ఞానం చాలు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy