ap7am logo

ఉద్యోగం వీడుతున్నారా... ఈ బెనిఫిట్స్ తీసుకోవడం మరవకండి!

Mon, May 22, 2017, 10:33 AM
Related Image

ఉద్యోగ విరమణ... లేదా ఉద్యోగానికి ఓ వ్యక్తి స్వచ్చందంగా రాజీనామా చేసినా... లేదా ఓ ఉద్యోగి అకస్మాత్తుగా మరణానికి గురైనా... కంపెనీ చెల్లించాల్సిన నగదు ప్రయోజనాలున్నాయి. ప్రతీ ఉద్యోగి వాటి గురించి తప్పక తెలుసుకోవడం ప్రయోజనకరం. కానీ, చాలా కంపెనీలు ఈ ప్రయోజనాలను ఎగ్గొడుతుంటాయి. అందుకని వీటి పట్ల అవగాహన చాలా అవసరం...


గ్రాట్యుటీ
ఒకే విడతలో ఇచ్చే నగదు ప్రయోజనం ఇది. ఉద్యోగి అప్పటి వరకూ కంపెనీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఇచ్చే ప్రయోజనం. ఉద్యోగి తానే కంపెనీకి రాజీనామా చేసినా లేక ఉద్యోగ విరమణ చేసినా ఇవ్వాల్సిన నిర్దిష్టమైన ప్రయోజనం.

నిబంధనలు
పది మంది అంతకంటే ఎక్కువ ఉద్యోగులను కలిగిన ప్రతీ కంపెనీ కూడా తప్పనిసరిగా గ్రాట్యుటీ అందించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఫ్యాక్టరీ లేదా వ్యాపార సంస్థలు ఏవైనా 10 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంటే గ్రాట్యుటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లోపు ఉంటే చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. గడిచిన 12 నెలల కాలంలో సగటున 10 మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. స్వచ్చంద సంస్థలు, హాస్పిటల్స్, విద్యా సంస్థలు కూడా గ్రాట్యుటీ పరిధిలోకి వస్తాయి. ప్రతీ ఉద్యోగి ఈ గ్రాట్యుటీ ప్రయోజనాన్ని అందుకోవాలంటే ఒక కంపెనీలో అంతరాయం లేకుండా ఐదేళ్ల పాటు పని చేసి ఉండాలి. గ్రాట్యుటీని నిర్ణీత ఫార్ములా మేరకు అందిస్తే దానిపై పన్ను లేదు. ఏ కోర్టూ ఈ ప్రయోజనాన్ని నిలిపివేయదు. ఒకవేళ ఉద్యోగి కంపెనీకి నష్టం కలిగిస్తే దీన్ని జప్తు చేస్తారు. అలాగే, ఉద్యోగి దుష్ప్రవర్తన, హింసతో కూడిన చర్యల కారణంగా కంపెనీ అతన్ని లేదా ఆమెను తొలగిస్తే నైతిక ఉల్లంఘన జరిగినందుకు తొలగించినా గ్రాట్యుటీ చెల్లించక్కర్లేదు.

ఐదేళ్ల సర్వీసు
representational image240 రోజుల పని కాలాన్ని ఏడాదిగా పరిగణిస్తారు. కనుక ఓ ఉద్యోగి 4 ఏళ్ల 8 నెలలకు రాజీనామా చేస్తే గ్రాట్యుటీ పొందే అవకాశాలుంటాయి. అలాగే, ఐదేళ్ల ఏడు నెలలు పనిచేస్తే దాన్ని ఆరేళ్లుగా రౌండప్ చేస్తారు. అలాగే, ఐదేళ్ల ఐదు నెలలు మాత్రమే పనిచేస్తే ఐదు సంవత్సరాలుగానే పరిగణనలోకి తీసుకుంటారు. విరామం లేకుండా సర్వీసు ఉండాలంటే సెలవు, అనారోగ్యం, ప్రమాదం ఇలాంటి వాటిని అంతరాయంగా పరిగణించరు. అలాగే, సమ్మె, లేఆఫ్ లేదా లాకవుట్ కూడా కౌంట్ కావు. ఉద్యోగి తప్పిదం లేని ఎటువంటి విరామమైనా దాన్ని సర్వీసు అంతరాయాల కింద చూడరు.  

ఈ సమయాల్లో
ఉద్యోగి మరో ఉద్యోగంలో చేరేందుకు రాజీనామా చేసినా, పదవీ విరమణ చేసినా గ్రాట్యుటికీ అర్హులే. ఐదేళ్లు పూర్తయిన తర్వాత కూడా కంపెనీలో కొనసాగుతుంటే మధ్యలో ఇచ్చే ప్రయోజనం కాదు ఇది. ఉద్యోగం వీడిన తర్వాత అందించేది.

మరణం, అంగవైకల్యం
ఉద్యోగి మరణించినా లేక ప్రమాదం కారణంగా అంగవైకల్యానికి గురైనా సంబంధిత వ్యక్తుల సర్వీసు ఐదేళ్లు పూర్తి కాకపోయినా సరే గ్రాట్యుటీని అందించాల్సి ఉంటుంది. నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు దీన్ని చెల్లిస్తారు.

పన్ను
ప్రభుత్వం నిర్దేశించిన ఫార్ములా మేరకు చెల్లించే గ్రాట్యుటీకి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంది. ఫార్ములా మేరకే ఇవ్వాలని లేదు. సంస్థ తనకు సమ్మతం అయితే ఎక్కువే ఇచ్చుకోవచ్చు. అయితే నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ గ్రాట్యుటీ చెల్లిస్తే అదనంగా చెల్లించిన మొత్తంపై పన్ను విధింపు ఉంటుంది. గరిష్టంగా 10,00,000 వరకు పన్ను లేదు.

గ్రాట్యుటీ ఎంత మేర చెల్లిస్తారు
representational imageఒక ఏడాది సర్వీసుకుగాను 15 రోజుల వేతనాన్ని చెల్లిస్తారు. వేతనం అంటే మూలవేతనం (బేసిక్ పే) కరువు భత్యం ఈ రెండు కలపగా వచ్చేది. చివరగా అందుకున్న మూలవేతనం కరువు భత్యాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. వారంలో ఒక రోజు సెలవు ఉంటుంది కనుక 26 రోజులను ఒక నెల కింద పరిగణించడం జరుగుతుంది. నెల వేతనంలో 57.69 శాతం ఏడాదికి గాను అందుకునే గ్రాట్యుటీగా భావించవచ్చు. ఒకవేళ ఉద్యోగి దినసరి వేతనంపై పనిచేస్తున్నట్టు అయితే గత మూడు నెలల సగటు వేతనాన్ని ఒక రోజు వేతనంగా పరిగణించి గ్రాట్యుటీ చెల్లించడం జరుగుతుంది. సాధారణంగా ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు బేసిక్ పే తక్కువగా ఉండేది ఈ కారణం వల్లే. ఉద్యోగికి అందించే ప్రయోజనాలను తగ్గించుకునేందుకు బేసిక్ పే, డీఏను తక్కువగా చూపిస్తాయి. హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్ ల రూపంలో ఎక్కువ వేతనాన్ని చూపుతుంటాయి. గ్రాట్యుటీని లెక్కించుకోవాలనుకుంటే.... చివరిగా అందుకున్న మూలవేతనం డీఏను కలపండి. అది ఒక నెల వేతనం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పని చేశారో నోట్ చేసుకోండి. వేతనం* పని చేసిన సంవత్సరాలు*15/26దీన్ని లెక్కిస్తే వచ్చే మొత్తమే మీకు గ్రాట్యుటీగా వచ్చేది.

కంపెనీ నష్టాల్లో ఉంటే
కంపెనీ నష్టాల్లో ఉన్నా సరే గ్రాట్యుటీని చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. కంపెనీ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగి కంపెనీని వీడడానికి నెల నుంచి మూడు నెలల ముందే నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగి నోటీసు ఇచ్చి నిర్ణీత కాలం పాటు పనిచేయకపోయినా సరే... గ్రాట్యుటీ నిబంధనల మేరకు ఉద్యోగి సర్వీసు కాలం ఉంటే ఆ ప్రయోజనాన్ని అందించాల్సి ఉంటుంది.

ఎన్ క్యాష్ మెంట్ లీవ్
సర్వీసు నిబంధనల మేరకు ఉద్యోగి రాజీనామా చేసినట్టయితే లీవ్ ఎన్ క్యాష్ మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగికి ఏటా నిర్ణీత సంఖ్యలో ఈఎల్స్ ఇవ్వాలి. వీటిని అదే ఏడాదిలో ఉపయోగించుకోవాలి. మిగిలిపోయిన వాటికి నగదును చెల్లించాలి. అలా చెల్లించకపోతే వాటిని మరుసటి ఏడాదికి జమ చేయవచ్చు. ఇలా ఉద్యోగి సర్వీసు కాలంలో మిగిలిపోయిన ఈఎల్స్ కు నగదును కంపెనీలు ఉద్యోగి పదవీ విరమణ లేదా రాజీనామా చేసిన సందర్బాల్లో చెల్లించాల్సి ఉంటుంది. కానీ చాలా కంపెనీలు ఈఎల్స్ కు పేమెంట్ ఇవ్వడం లేదు. ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ప్రతీ ఉద్యోగికి ఈ ప్రయోజనాన్ని అందిస్తారు.

ఫామ్ 16 తీసుకోవడం మరవొద్దు
కంపెనీలు ఏటా ఉద్యోగులకు ఫామ్ 16 (వేతనం/శాలరీ సర్టిఫికెట్)ను జారీ చేస్తాయి. వీటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. భవిష్యత్తులో ఆదాయపన్ను పరంగా అభ్యంతరాలు వ్యక్తమైతే ఆధారంగా ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరం మధ్యలో కంపెనీని వీడి మరో కంపెనీలో చేరితే పాత కంపెనీలో అందుకున్న వేతనం గురించి కొత్త కంపెనీకి తప్పకుండా తెలియజేయాలి. లేదా పాత కంపెనీలో తీసుకున్న ఫామ్ 16ను ఇస్తే చాలు.

వైద్య బీమా
representational imageకొన్ని కంపెనీల్లో ఉద్యోగులకు గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది. ఉద్యోగానికి రాజీనామా చేసిన వారికి గ్రూపు మెడిక్లెయిమ్ పాలసీని వ్యక్తిగత వైద్య బీమా పాలసీ కింద మార్చేందుకు కొన్ని బీమా కంపెనీలు అంగీకరిస్తున్నాయి. ఆ అవకాశం ఉందేమో కనుక్కుని తక్కువకే వస్తుందని అనుకుంటే తీసుకోవచ్చు.

వేతన ఖాతా
వేతన ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఉంచాల్సిన అవసరం లేదు. కానీ, ఉద్యోగం మారిపోయిన తర్వాత నెలనెలా అందులో వేతనం జమకాకపోతే బ్యాంకు దాన్ని సాధారణ ఖాతాగానే పరిగణిస్తుంది. అప్పుడు దానిలో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సి వస్తుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Advertisements