ap7am logo

మీ పార్ట్ నర్ కు ఈ సీక్రేట్స్ తప్పకుండా చెప్పాలండోయ్...?

Thu, May 18, 2017, 02:56 PM
Related Image

చిన్న తప్పులు కొన్ని సందర్భాల్లో ఎక్కువ నష్టాన్ని తెచ్చిపెడతాయి. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమై ఉండే వారు మనలో చాలా తక్కువ మందే ఉంటారు. వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న తేలిక ధోరణి కనిపిస్తుంది. కానీ, దురదృష్టవశాత్తూ కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అకాల మరణానికి గురైతే...  ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా కష్టాలు వచ్చిపడతాయి. అవి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త అవసరం. ఇందుకు ఏం చేయాలన్నది చూద్దాం...


‘‘నేను మరణిస్తే నా కుటుంబం తప్పకుండా తెలుసుకోవాల్సినవి ఏవి?’’ అని ఓ సారి ప్రశ్నించుకోండి. మన దేశంలో సాధారణంగా ఎక్కువ శాతం పురుషులు కుటుంబానికి ఆధారంగా, పెద్దగా వ్యవహరించడం కనిపిస్తుంది. అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలను వారే చక్కబెడుతుంటారు. మహిళలు వీటి గురించి పెద్దగా ఆసక్తి చూపరు. ఒకవేళ మహిళే సంపాదిస్తూ ఆధారంగా ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక వ్యవహారాలను ఆమె భర్త లేదా తండ్రి ఇలా వేరొకరు చక్కబెడుతుండడం జరుగుతుంది. సంపాదనాపరులు, ఆర్థిక వ్యవహారాలు చూసేవారు ఎవరైనా గానీ... ఒకవేళ హఠాత్తుగా మరణం చెందడం వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

representational imageయూజర్ ఐడీలు, పాస్ వర్డ్ లు
ఈ మెయిల్ ఖాతాలు: బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డు బిల్లులు, ఫోన్ బిల్లులు, బీమా సంస్థల నుంచి ముఖ్యమైన మెయిల్స్ వచ్చే ఈ మెయిల్ ఖాతాల సమాచారాన్ని ఓ చోట పొందుపరచాలి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీటులో మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ లను పొందుపరిచి ఎక్సెల్ షీటుకు పాస్ వర్డ్ పెట్టుకోవాలి.
ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్: ఈ రోజు చాలా రకల వ్యవహారాలను స్మార్ట్ ఫోన్ నుంచే చక్కబెట్టేస్తున్నారు. లేకపోతే ల్యాప్ టాప్. ఈ పరికరాల్లోకి లాగిన్ అయ్యే ఐడీ, పాస్ వర్డ్ లను కూడా ఎక్సెల్ షీటులో భద్రపరచుకోవాలి.
బ్యాంకు అకౌంట్ ఐడీ, పాస్ వర్డ్ లు: సంపాదనాపరులు మరణిస్తే ముందు వారి కుటుంబ సభ్యులకు అవసరమయ్యేది డబ్బుతోనే. నిర్వహించాల్సిన కార్యక్రమాలు, బిల్లుల చెల్లింపుల అవసరాలకు డబ్బులను డ్రా చేయాల్సి వస్తుంది. అందుకే బ్యాంకు అకౌంట్ నంబర్, నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లను ఎక్సెల్ షీటులో సేవ్ చేసి ఉంచాలి.
డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు పిన్ లు: డెబిట్, క్రెడిట్ కార్డుల పిన్ లను ఎక్కడా రాసి పెట్టుకోకుండా గుర్తుంచుకోవడం చాలా మంది చేసే పని. మీరున్నంత వరకూ మీ వ్యక్తిగత కార్డుల సమాచారం మరొకరికి తెలియాల్సిన అవసరం లేదు. కానీ, మీరు లేని సమయంలో వాటితో తప్పకుండా అవసరం పడుతుంది. అందుకే వాటి వివరాలను కుటుంబ సభ్యులకు తెలిసేలా భ్రదం చేయాలి.

నామినీ
representational imageమీపై ఆధారపడిన వారు మీకు నామినీగా ఉండాలి. ఉద్యోగంలో చేరిన కొత్తలో తమ పేరిట ఉన్న నామినీగా తల్లి లేదా తండ్రి లేదా సోదరులను సూచించడం చాలా మంది చేసే పని. ఆ తర్వాత కాలంలో వివాహం చేసుకున్నప్పటికీ నామినీగా వారి పేరునే కొనసాగిస్తుంటారు. కానీ, వివాహం అయిన తర్వాత నామినీగా భార్య లేదా పిల్లలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఈ చిన్న అలక్ష్యం ఒకవేళ మరణం సంభవిస్తే ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. అందుకే మిమ్మల్ని నమ్ముకున్న వారినే నామినీలుగా పేర్కొనాలి. ఒకరికి మించిన నామినీలను సూచించే అవకాశం కూడా ఇటీవల అందుబాటులోకి వచ్చింది.

ఒకవేళ ఒకరికి మించి ఉంటే ప్రయోజనంలో ఎవరికి ఎంత శాతం దక్కాలన్నవివరాల్ని కూడా నిర్దేశించవచ్చు.బ్యాంకు ఖాతాలు, వేతన ఖాతాలు, డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, ఫిక్స్ డ్ డిపాజిట్, లాకర్ వీటికి సంబంధించిన పేర్లను ఓ జాబితాగా రాయాలి. అలాగే, పాస్ వర్డ్ లను కూడా పేర్కొనాలి. ఒక్కొక్కరి పేరిట ఒకటికి మించిన బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. ఇలా అన్ని ఖాతాల నంబర్లు, ఆ ఖాతాల సమస్త సమాచారాన్ని కుటుంబ సభ్యులు అవసరంలో తెలుసుకునే ఏర్పాటు చేయాలి. ప్రావిడెంట్ ఫండ్ నిధులను నామినీకే చెల్లిస్తారు. అందుకే రిటైర్మెంట్ సేవింగ్స్ ఖాతాకు నామినీ పేరును సరిగా ఇవ్వడం ఎంతో అవసరం. పేరులో తప్పులు లేకుండా చూసుకోవాలి. జీవిత బీమా అన్నది పన్ను ఆదా కోసం చేసే పథకం కాదు. తాను లేని పరిస్థితుల్లో తన కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు. అందుకే అన్ని బీమా పాలసీలకు నామినీ వివరాలను సరిగా ఇవ్వడమే కాకుండా ఆ వివరాలను కుటుంబ సభ్యులు తెలుసుకునే విధంగా అందుబాటులో ఉంచాలి.

పెట్టుబడుల సమాచారం
representational imageమ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు, షేర్లలో, బాండ్లలో, ఇతర సాధనాల్లో పెట్టుబడులు పెట్టి ఉండొచ్చు. అన్నింటికీ ఒకే ఖాతా నుంచి నిర్వహించడం అసాధ్యం. కనుక ఈ పెట్టుబడుల సమాచారమంతటినీ ఒక చోట పొందుపరచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. షేర్ల కోసం డీమ్యాట్ ఖాతా ఉంటే వాటికి నామినీగా మీపై ఆధారపడిన వారి పేరును ఇవ్వడాన్ని మర్చిపోవద్దు. ఈ పెట్టుబడుల సమాచారాన్ని సైతం ఎక్సెల్ షీటులో భద్రపరచాలి. షేర్లలో పెట్టుబడులు ఉంటే ఏ కంపెనీలో ఎన్ని, అవి ఉన్న డీమ్యాట్ ఖాతా నంబర్, పాస్ వర్డ్, నామినీ పేరు ఇలా కీలకమైన సమాచారాన్ని పాస్ వర్డ్ తో కూడిన ఎక్సెల్ షీటులో ఉంచాలి. మ్యూచువల్ పండ్స్ అయితే, ఫోలియో నంబర్లు, పెట్టుబడి పెట్టినదెంత, ఎందుకోసం ఈ పెట్టుబడులను వినియోగించాలన్న సమాచారాన్ని కూడా పేర్కొనాలి. అలాగే గోల్డ్ ఈటీఎఫ్ లు ఉంటే ఆ సమాచారం, గోల్డ్ బాండ్లు, డిజిటల్ రూపంలో ఆన్ లైన్ లో ఎక్కడైనా బంగారాన్ని కొని ఉంటే ఆయా ఖాతాల సమాచారాన్ని కూడా జాగ్రత్త పరచాలి. వెండిని కొన్నా సరే ఆ వివరాలను కూడా పొందుపరచాలి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు చాలా విలువతో కూడుకుని ఉంటాయి. వీటికి సంబంధించి స్థలం లేదా ఇల్లు ఎక్కడ ఉన్నది, డాక్యుమెంట్లు, అద్దె ఆదాయం వస్తుంటే ఆ సమాచారాన్ని తెలిసేలే భద్రపరచాలి.

చెల్లింపులు, బాధ్యతలు
నెలవారీ చేయాల్సిన చెల్లింపుల గురించి కుటుంబ సభ్యులకు ముందే తెలియజెప్పడం మంచిది. అలా చేయకుంటే కనీసం వాటి వివరాలను ఎక్సెల్ షీటులో లేదంటే డైరీలో రాసి పెట్టాలి. ఉదాహరణకు... గృహ రుణ చెల్లింపులు, ఇంటర్నెట్, టెలిఫోన్ బిల్లు, ఇంటి పన్నులు, బీమా ప్రీమియంలు (కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నవి) ఇలా అన్ని రకాల సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి. ఇంకా వ్యక్తిగత రుణం, ఎవరి దగ్గర అయినా బదులు తీసుకుని ఉంటే ఆ సమాచారాన్ని కూడా తెలిసే ఏర్పాటు చేయాలి. ఇంకా పిల్లల స్కూలు ఫీజులు చెల్లింపు వివరాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. లేదంటే స్కూల్ యాజమాన్యం అప్పటికే ఫీజులు చెల్లించినప్పటికీ, మరోసారి ఫీజులు చెల్లించాలని కోరితే ఆధారాలు ఉండాలి కదా?

మీరు ఎవరికైనా రుణం ఇచ్చి ఉంటే...?
మీరు స్నేహితులకో, సహచర ఉద్యోగులకో, బంధువులకో ధన సాయాన్ని అప్పు రూపంలో ఇచ్చి ఉండొచ్చు. మీరు లేరని తెలిస్తే మీ నుంచి అప్పు పుచ్చుకున్న వారు ప్లేట్ ఫిరాయించే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలా తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలి. బదులు  తీసుకున్న వారు రాసిచ్చిన ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, ఇతర డాక్యుమెంట్లు, వారికి మీరు ఏ రూపంలో ఎంత డబ్బు ఇచ్చారు ఆ సమాచారం, ఆధారాలను జాగ్రత్త చేసి ఉంచాలి. మీరు లేకపోతే వాటిని వసూలు చేసుకోవాల్సిందంటూ మీ కుటుంబ సభ్యులకు తెలియజేయాలి.

ఇదంతా అవసరమా...?
కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి ఉన్నంత వరకు వీటితో వారి కుటుంబ సభ్యులకు అవసరం పడదు. కానీ, వారు లేకుంటే మాత్రం వీటి గురించి కచ్చితంగా తెలియాలి. లేకుంటే దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. తక్షణ అవసరాల కోసం ఇతరుల వద్ద చేయి చాచాల్సి వస్తుంది. అందుకే పైన చెప్పుకున్నటువంటి సమస్త సమాచారాన్ని ఓ చోట భద్రపరచాలి. తాను లేకుంటే ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులు సులభంగా తెలుసుకునేలా ఉండాలి.

క్లెయిమ్ గురించి చెప్పాలి
ఒకవేళ తాను మరణిస్తే తన పేరిట ఉన్న బీమా పాలసీల కంపెనీలకు సమాచారం ఎలా ఇవ్వాలి. బీమా పరిహారం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న సమాచారాన్ని తప్పకుండా ఇవ్వాలి. దీనివల్ల కుటుంబ సభ్యులకు పని సులభం అవుతుంది. ఒక్కోసారి ఇటువంటి సమాచారం తెలియకపోవడం వల్ల సమయంతోపాటు ఆర్థికంగానూ నష్టపోవాల్సి వస్తుంది.

ఎక్కడ భద్రపరచాలి...?
representational imageఎక్సెల్ షీటులో కీలకమైన సమాచారాన్ని పొందుపరిచి దానికి ఓ పాస్ వర్డ్ పెట్టాలి. ఆ పాస్ వర్డ్ ను నోట్ చేసి ఉంచుకోవాలని భార్యకు సూచించండి. ఎక్సెల్ షీటును కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లోని మై డాక్యుమెంట్స్ లో ఉంచుకోవచ్చు. ఒక కాపీని యూఎస్ బీ ఫ్లాష్ డ్రైవ్ లో భద్రపరిచి దాన్ని అల్మారాలో సేఫ్ గా ఉంచండి. ఈ మెయిల్ లోనూ ఈ షీటును స్వయంగా మెయిల్ చేసి ఉంచుకోవచ్చు. ఇలా ఫలానా చోట పొందుపరిచినట్టు భార్యకు తెలియజేయాలి. పాస్ వర్డ్ లను తరచూ మార్చుకోవడం జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో మార్చిన సమాచారాన్ని డాక్యుమెంట్లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలి. లేదంటే ఆ సమాచారం అవసరంలో ఉపయోపడదు. ఆస్తుల డాక్యుమెంట్లు, బ్యాంకు పాస్ బుక్కులు, చెక్ బుక్కులు, బీమా పాలసీ పత్రాలు ఇలా అన్నింటిని జాగ్రత్తగా ఓ అల్మారాలో ఉంచి ఆ విషయాన్ని అర్ధాంగికి తెలియజేయాలి.

తీవ్ర అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరితే...?
అసలు ముందు మీరు లేకపోతే ఏం జరుగుతుందన్నది ఓ ఊహకు రండి. అలాగే, తీవ్ర అనారోగ్యం బారిన పడి ఆస్పత్రి పాలైతే ఏంటి పరిస్థితి...? ఎవరు చూసుకోవాలి. వైద్య బీమా ఉందా...? బీమా పరిహారానికి మించి బిల్లు వస్తే వాటికి సర్దుబాటు ఎలా...? వీటన్నింటికీ మీరే ప్లాన్ చేయాలి. అప్పుడే మీరు ఎంతగానో ప్రేమించే వారికి ఇబ్బందులు తప్పుతాయి. మీరు తీవ్ర అనారోగ్యం పాలై ఆస్పత్రిలో ఉన్నా, ఇంట్లో మంచమెక్కినా కొంత కాలం పాటు కుటుంబ పోషణ గడిచేందుకు ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర నిధి, క్రిటికల్ ఇల్ నెస్, ప్రమాదంలో అంగవైకల్యం పాలైతే పరిహారం చెల్లించే పాలసీలను తీసుకోవాలి. ఇలా అనారోగ్యం బారిన పడితే ఆర్థిక, న్యాయపరమైన వ్యవహరాలను నిర్వహించలేని పరిస్థితుల్లో మరో వ్యక్తికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వొచ్చు.

వీలునామా
ఇది ఎంతో అవసరం. మీరు లేకుంటే మీ ఆస్తులు ఎవరికి చెందాలన్నది విల్లు రూపంలో నిర్దేశించవచ్చు. దీని వల్ల న్యాయపరమైన చిక్కులు తగ్గుతాయి. ఆస్తుల బదలాయింపు కూడా సులభతరం అవుతుంది. మీ పిల్లల సంక్షేమాన్ని ఎవరు చూడాలి. కుటుంబ అవసరాలను ఎవరు పట్టించుకోవాలి, అప్పులు ఉంటే అవి, వాటిని ఎలా తీర్చాలి? తదితర సమాచారాన్ని విల్లులో రాయవచ్చు. ఆస్తులు ఎక్కువ ఉంటే వాటి నిర్వహణకు ఒకరిని మించి సూచించవచ్చు. ఈ విల్లుపై ఇద్దరు సాక్షి సంతకాలు చేయించాలి. నోటరీ చేయించడం మంచిది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy