ap7am logo

అసలు సిసలు వ్యాపార వేత్తగా రాణించాలనుకుంటున్నారా...?

Mon, May 15, 2017, 11:35 AM
Related Image

మీ మనసులో ఓ కొత్త వ్యాపారానికి సంబంధించిన ఐడియా ఉందా...? వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారా....? లేదా ఇప్పటికే మీరు వ్యాపార వేత్తలుగా ఉన్నా సరే... ముందు వ్యాపార లక్షణాలు, వ్యక్తిత్వ లక్షణాలు మీలో ఉండడం ఎంతో అవసరం. అప్పుడే విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తారు. దీర్ఘకాలిక విజయం అన్నది ఏదో అదృష్టం కొద్దీ వచ్చేది కాదు. అంకిత భావం, కృషితో వచ్చేది. అసలు సిసలు వ్యాపార వేత్తకు ఉండాల్సిన ఈ తరహా లక్షణాలేంటో తెలుసుకుందాం....


ఒక అంచనా ప్రకారం... కొత్తగా ప్రారంభమయ్యే వ్యాపారాల్లో 20 శాతం మొదటి ఏడాదిలోనే చాప చుట్టేస్తున్నాయి. 50 శాతం రెండు మూడేళ్ల తర్వాత పరాజయం బాటలో పయనిస్తున్నాయి. చివరికి నిలదొక్కుకునేవి 30 శాతం మాత్రమే ఉంటున్నాయి. వైఫల్యం చెందే వాటిలో 27 శాతం వరకు నిధుల సమస్య వల్లే అటకెక్కుతున్నాయి. అంటే మెజారిటీ శాతం ఇతరత్రా కారణాల వల్లే మూతపడుతున్నట్టు తెలుస్తోంది. అవి వ్యాపార లక్షణాలు లోపించడమే.

స్పష్టమైన దృష్టి
representational imageభవిష్యత్తు పట్ల స్పష్టమైన దృష్టిని కలిగి ఉండాలి. వ్యాపారం ప్రారంభించడానికి ముందు ఆ వ్యాపారానికి సంబంధించి స్పష్టమైన ఆలోచన అవసరం. ఏ తరహా వ్యాపారంలోకి అడుగు పెడుతున్నాం, ఏ తరహా వ్యక్తులతో వ్యవహారాలు నెరపబోతున్నాం, ఏ విధమైన మెటీరియల్ ను వాడుతున్నామో తెలుసుకుని ఉండాలి. చాలా మంది డబ్బులుంటే వ్యాపారం మొదలు పెట్టేయవచ్చని చెబుతుంటారు. నిజమే డబ్బులుంటే గంటలో వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. కానీ, అది నిలదొక్కుకోవాలన్నా, రాణించాలన్నా అందుకు స్పష్టమైన అవగాహన, ఆలోచన అవసరం కదా. దాన్ని పేపర్ పై వివరంగా రాసుకోగలగాలి. మీ వ్యాపార లక్ష్యాలు, వాటిని ఏ విధంగా చేరుకునేదీ ఓ సమగ్ర ప్రణాళిక అవసరం. ఇలా సమగ్రమైన అవగాహన, ఆలోచన, ప్రణాళిక, లక్ష్యంతో ఉంటే నిశ్చింతగా వ్యాపారం ప్రారంభించేయవచ్చు.

ప్రత్యేకమైన ఆలోచన
representational imageకొంత మందికి వ్యాపారం ప్రారంభించాలని ఉంటుంది. కానీ, ఏదన్నది అర్థం కాని అయోమయంలో ఉంటారు. ఏ వ్యాపారమైనా అది విజయం సాధించడం, సాధించకపోవడాన్ని కస్టమర్లే నిర్ణయిస్తారు. కనుక అప్పటికే మార్కెట్లో ఉన్న వ్యాపారాలకంటే భిన్నమైన ఆలోచన అవసరం. సరికొత్త ఆలోచన అయితే అది నిజంగా అభినందించతగ్గదే. కొత్త ఆలోచన రావడం కష్టంగా ఉంటే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఉత్పత్తులను పరిశీలిస్తే కొత్త ఆలోచన స్ఫురించొచ్చు. ఆలోచన వస్తే అది దీర్ఘకాలం పాటు మనుషుల అవసరాలను తీర్చేదై ఉండాలి. అటువంటి ఆలోచనే ఉంటే మీ వ్యాపారాన్ని సులభంగానే లాభాల దిశగా నడిపించుకోవచ్చు.

వేగంగా, సాహసోపేత నిర్ణయాలు
representational imageకొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మీలో చురుకుదనం తప్పనిసరి. ఔత్సాహిక వ్యాపారులు నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్ణయాలు తీసుకోగల సత్తా ఉండాలి. అంతేకాదు అవకాశాలను అందిపుచ్చుకునేలానూ ఉండాలి. అవకాశం ఎదురైతే దాన్ని అందిపుచ్చుకుని వినియోగించుకునే సామర్థ్యం అవసరం. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందన్నట్టు... వచ్చిన అవకాశం ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండదు. వేగంగా దానిపై నిర్ణయం తీసుకునేలా ఉండాలి. ఏం జరిగినా సంసిద్ధంగా ఉండాలి. నియమించుకున్న ఉద్యోగులు తగిన ఫలితాలను చూపించలేకపోతే వారిని దిశానిర్దేశం చేసేలా ఉండాలి. దారిలో పెట్టేట్టూ ఉండాలి.

ఒకప్పుడు నోకియా మొబైల్స్ ప్రపంచాన్ని ఏలాయి. ఇప్పుడు శాంసంగ్ మొబైల్స్ ఆ స్థానంలో ఉన్నాయి. కారణం వేగంతో కూడిన సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం వల్లే. 2007 నుంచి 2011 వరకు మొబైల్స్ మార్కెట్ కొత్తదనం కోసం ఎదురు చూస్తున్న రోజులు. ఆ సమయంలో నోకియా సింబియాన్ ఆధారిత బేసిక్, ఫీచర్ ఫోన్లకే పరిమితమైంది. కానీ, మార్కెట్లోకి ఆండ్రాయిడ్ రంగ ప్రవేశం చేసింది. దాంతో శాంసంగ్ వేగంగా ఆండ్రాయిడ్ తయారీ సంస్థతో ఒప్పందం చేసుకుని మొదటి ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. శాంసంగ్ ను ఎదుర్కొనేందుకు దీటుగా నోకియా ఆ దిశగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. దాంతో నోకియా వెనుకబడిపోయింది. శాంసంగ్ లీడర్ గా అవతరించింది. ఆ తర్వాత కాలంలో నోకియా మొబైల్స్ ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటేనే వ్యాపారంలోకి వెళ్లాలి. ఒక్కోసారి నిర్ణయాలు కరెక్ట్ గా ఉండకపోవచ్చు. అయిప్పటికీ దాన్ని సరిచేసుకుని మెరుగైన ఫలితాలను పొందే మరో ఆలోచనను ఆవిష్కరించేలా ఉండాలి.

ఒత్తిడిని తట్టుకోవాలి
representational imageకొత్తగా వ్యాపారం ప్రారంభించడం, దాన్ని విజయవంతంగా నడిపించడం అన్నది అంత తేలికైన విషయం కాదు. ఇందుకు ఎంతో సమయం, శక్తి అవసరం అవుతాయి. ఈ సమయంలో ఎంతో ఒత్తిడిని, శ్రమను ఓర్చుకోవాల్సి ఉంటుంది. వ్యాపారం ప్రారంభంలో రిజిస్ట్రేషన్ తో ప్రారంభమయ్యే ఈ ఒత్తిడి ఆ తర్వాతా కొనసాగుతుంది. ఒకవైపు అధికారుల నుంచి ఆమోదంతోపాటు మరోవైపు నిధులు, ఉద్యోగుల నిర్వహణ, విక్రయాలు, లాభాలు ఇలా ఎన్నో అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో అంశాలను ఫాలో అవుతూ గడువుకు అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు సేవలు అందించగలరు. ఇందుకోసం సరైన ఉద్యోగ బృందాన్ని ఏర్పాటు చేసుకోవడంపైనా విజయం ఆధారపడి ఉంటుంది.

ఆర్థిక పరిజ్ఞానం
కొంత మంది చూస్తుండగానే వ్యాపారం ప్రారంభించడం, లాభాలతో మంచి స్థాయికి చేరడం కనిపిస్తుంది. వాస్తవానికి సంపన్నులు కావాలన్న అభిలాష తప్పేమీ కాదు. మన దగ్గరున్న ధనాన్ని దీర్ఘకాలం పాటు సంపదగా నిర్వహించేందుకు ఆర్థిక  పరిజ్ఞానం అన్నది ఎంతో అవసరమని ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్  నమ్ముతారు.

సవాళ్ల గుర్తింపు
వ్యాపారం ప్రారంభించడం అన్నది వాస్తవానికి ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. కొన్ని సవాళ్లు వ్యాపారాన్ని దెబ్బతీస్తాయి. దీన్నుంచి బయటపడేందుకు చాలా సమయం కూడా పడుతుంది. అంటే కేవలం సురక్షిత వ్యాపారాన్నే చేపట్టాలన్న అర్థం కాదు. విజయం సాధించాలంటే సవాళ్లను స్వీకరించేలా ఉండాలి. వీటన్నింటినీ వ్యాపారాన్ని ప్రారంబించడానికి ముందే పరిశీలించుకోవడం అవసరం. భారత టెలికం మార్కెట్ విపరీతమైన పోటీలో ఉంది. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ తదితర సంస్థలు టెలికం రంగలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సమయంలో సవాళ్లను స్వీకరిస్తానంటూ వచ్చింది జియో. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులతో జియో పేరిట ముకేశ్ అంబానీ పెద్ద సాహసమే చేశారు. మొబైల్ ఇంటర్నెట్ ప్లాన్లు దేశంలో చాలా ఖరీదుగా ఉన్నాయంటూ ఉచిత డేటా పథకాలతో సేవలను ప్రారంభించింది జియో. స్వల్ప కాలంలోనే 10 కోట్ల మంది కస్టమర్లను సంపాదించేసింది. టెలికం మార్కెట్లో మరో సంస్థకు అవకాశం లేని పరిస్థితుల్లో జియో రావడమే కాదు, తానేంటో చూపించింది. అంతేకాదు, భవిష్యత్తు పట్ల ముకేశ్ అంబానీ ఎంతో ఆశావహ దృక్పథంతో ఉన్నారు. మరో లక్ష కోట్ల పెట్టుబడులను కూడా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. సవాళ్లను స్వీకరించడం, సాహసోపేత నిర్ణయాలను తీసుకోవడం, వ్యాపారం, కస్టమర్ల అవసరాల పట్ల బలమైన విశ్వాసం, స్పష్టత ఉండడం ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి.

నమ్మకం, నాయకత్వం
representational imageవ్యాపారాన్ని ప్రారంభించడం అంటే, ఓ బృందాన్ని ముందుండి నడిపించడం. మీ అవసరాలకు అనుగుణంగా వారిని పనిచేయించుకోవాలనుకుంటే ముందు మీపై, మీ సమర్థతపై మీకు నమ్మకం ఉండాలి. మీలోని ఆత్మ విశ్వాసం సానుకూల ద్పక్పథానికి కారణమవుతుంది. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ముందుకు నడిచేలా ఇది తోడ్పడుతుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే భారీ స్థాయి వ్యాపార లక్ష్యాలకు చేరుకునేందుకు కష్టించగలరు. దీంతో వ్యాపారాన్ని సరైన దిశగా నడిపించగలరు. మీ బృందంలోని ప్రతి ఒక్కరికీ మీరు మార్గదర్శకంగా ఉండి, వారికి స్ఫూర్తినిచ్చేలా ఉండాలి. నాయకత్వ లక్షణాలు లేకుంటే వాటిని అలవరుచుకోవడం సులభమే. కాకపోతే అందుకు కష్టించి పనిచేయాలి. సమర్థత, ఇతర విజయవంతమైన వ్యాపార లక్షణాలకు సంబంధించి ఇక్కడ ఓ ఉదాహరణ చెప్పుకోవచ్చు. ధీరూభాయి అంబానీ స్థాపించిన రిలయన్స్ సామ్రాజ్యం ఆయన మరణం తర్వాత రెండు ముక్కలైంది. ముకేశ్ అంబానీ, ఆయన తమ్ముడు అనిల్ అంబానీ తండ్రి స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాన్ని దాదాపు చెరిసగం పంచుకున్నారు. ఇది 2005లో జరిగింది. కానీ ఇప్పుడు ముకేశ్ అంబానీ నిర్వహణలో ఉన్న వ్యాపారాల విలువ అనిల్ అంబానీకి అందనంత ఎత్తులో ఉన్నాయి. ముకేశ్ అంబానీ సంపద 30.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2 లక్షల కోట్లు). అనిల్ అంబానీ సంపద 3.4 బిలియన్ డాలర్లు (రూ.22,100 కోట్లు).

సమస్యలను పరిష్కరించే నైపుణ్యం
representational imageసమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే నైపుణ్యం కూడా అవసరం. వ్యాపారాన్ని ప్రారంభించే సమయంలో, ప్రారంభించిన తర్వాత కొత్తలో ఎన్నో సమస్యలు, ఆటుపోట్లు ఎదురవుతుంటాయి. వాటిని ధైర్యంగా, సమర్థంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిష్కరించే సత్తా లేకపోతే చిన్న సమస్యలే పెద్దవై కూర్చుంటాయి. సమస్యలను చక్కగా పరిష్కరించగలిగేవారు తమ వ్యాపార విషయమై వినియోగదారుల సమస్యలను సైతం పరిష్కరించగలరు. దీంతో వినియోగదారులకు స్నేహపూర్వక కంపెనీ అవుతుంది. ఎటువంటి సమస్య ఎదురైనా బాధ పడిపోకుండా చక్కగా పరిష్కరించగలనని భావిస్తేనే వ్యాపారంలోకి అడుగుపెట్టాలని నిపుణుల సూచన.

ప్రభావవంతంగా చెప్పగలగాలి...
representational imageఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పడం ఓ కళ. అది ఓ నైపుణ్యం. ఇది లేకుండా వ్యాపారంలో విజయం సాధించడం కష్టం. సరైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు లేకపోతే మీ నాయకత్వం ఫలితాన్నివ్వలేదు. ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. వ్యాపారం పట్ల మీకున్న విశ్వాసం మీ మాటల్లో వ్యక్తీకరణ కావాలి. మాట్లాడేటప్పుడు కచ్చితత్వంతో వ్యవహరించాలి. మీ వ్యాపారం గురించి ఎదుటి వారికి చక్కగా వివరించే నైపుణ్యం అవసరం. ఇందుకు గాను మీ వ్యాపారం గురించి, మీ ప్రాజెక్టుల గురించి, సేవల గురించి కొన్ని అంశాల పట్ల సన్నద్ధులై ఉండాలి. వ్యక్తులతో సత్సంబంధాలు కూడా వ్యాపార విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. స్టీవ్ జాబ్స్ తన కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వల్ల యాపిల్ సంస్థ విజయవంతంగా మారింది. మీ దగ్గర గొప్ప ఐడియాలు ఉండొచ్చు. కానీ, వాటి గురించి ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పి, వాటిపై చర్యలు తీసుకునేలా ఒప్పించలేకుంటే అవి విజయవంతమైన ఉత్పత్తులు, సేవలు కాలేవు.

నిర్వహణ, నిర్మాణం
కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఉండాల్సిన మరో లక్షణం వ్యాపారాన్ని సరైన దిశగా నిర్వహించగలగడం. తాను మాత్రమే పద్ధతిగా ఉండడం కాదు... వ్యాపారాన్నీ అదే విధంగా నడిపించాలి. అందుకోసం ఓ వ్యవస్థను నిర్మించాలి. అవాస్తవికమైన లక్ష్యాలను నిర్ణయించుకోవద్దు. ఉద్రేకంలో ఉన్నప్పుడు ఇలా అవాస్తవికమైన లక్ష్యాలను నిర్ణయించుకుంటే వాటిని చేరుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా తగిన వ్యవస్థను నిర్మించుకోవడం కూడా వ్యాపార విజయానికి కీలకం. మీ ఉద్యోగులకు మొద్దు బాస్ గా కనిపించకూడదు. సర్వ సన్నద్ధంగా కనిపించాలి. ఈ రోజు చేసిన మంచి ఏంటి...? అని ప్రతీ రోజూ ప్రశ్నించుకోవాలి. దాంతో మరుసటి రోజుకు మిమ్మల్ని మీరు మెరుగ్గా సన్నద్ధం చేసుకోవాలి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Advertisements