ap7am logo

స్టైలిష్ హెయిర్ సొంతం కావాలంటే ఏం చేయాలి...?

Sun, May 14, 2017, 12:30 PM
Related Image హెయిర్ స్టైలిష్ గా ఉండాలి. ఆరోగ్యంగా చూడగానే ఆకట్టుకునేలా ఉండాలి. అందరూ ఇలా కోరుకోవడంలో తప్పులేదు. కానీ కాలుష్యం, పోషకాహార లేమి కారణంగా నేడు అందమైన శిరోజాలు గగన కుసుమంలా మారాయి. జుట్టు రాలిపోతుంటే, చుండ్రు వేధిస్తుంటే, స్త్రీలకు కురుల చివర చిట్లుతుంటే షాంపూల వెంట షాంపూలు మారుస్తుంటారు. ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. కానీ, ఫలితం కనిపించదు. ఎక్కువ మందిని వేధిస్తున్న ఈ తరహా సమస్యల పరిష్కారానికి నిపుణులు సూచించే సహజ చికిత్సలు ఏంటో చూద్దాం.

నిత్యం 100 నుంచి 150 వెంట్రుకలు రాలిపోవడాన్ని సహజంగానే చెబుతారు. కనుక దువ్వినప్పుడు ఓ పదో, ఇరవయ్యో రాలిపోతే కంగారపడిపోకండి.

కోడిగుడ్డు
representational imageకోడిగుడ్డు కురుల కండీషనింగ్ కు చక్కగా పనికొస్తుంది. పొడి జుట్టు, పెళుసు బారుతుంటే కోడిగుడ్డులోని తెల్లసొన అందుకు పరిష్కారం. కోడిగుడ్డులో తెల్లసొన లేదా మొత్తం తెల్లసొన పచ్చసొనను జుట్టుకు పట్టించి ఓ 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. మంచి ఫలితం ఉంటుంది.

శుభ్రత ముఖ్యం
శిరోజాలను శుభ్రంగా ఉంచుకోవాలి. జుట్టు రాలిపోవడానికి చుండ్రు, స్కాల్ప్ దురదే ముఖ్య కారణం. కనుక శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా చుండ్రుకు కళ్లెం వేయాలి.

వేడి నీరు వద్దు
వేడినీటితో తల స్నానం పనికిరాదు. దీనివల్ల జుట్టు పొడిబారి, పెళుసుగా మారుతుంది. పైగా జుట్టును ఆరోగ్యంగా ఉంచే సహజ నూనెలను వేడి నీరు తొలగిస్తుంది. గోరువెచ్చని నీరు, శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం ఎక్కువ వేడి ఉండే నీటితో స్నానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

సొరకాయ
representational imageసొరకాయ రసాన్ని కురులకు పట్టించి అరగంట పాటు ఉంచిన తర్వాత తల స్నానం చేయండి. మంచి ఫలితం కనిపిస్తుంది.

మెరిసే, మృదువైన జుట్టుకు
రెండు మూడు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తడి జుట్టుకు పట్టించాలి. ఆ తర్వాత 30నిమిషాల పాటు అలా ఉంచి కడిగేసుకోవాలి.

బేకింగ్ సోడా థెరపీ
మూడు టేబుల్ టీ స్పూన్ల బేకింగ్ సోడాను నీటితో కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. తలకు షాంపూతో శుభ్రం చేసుకున్న తర్వాత బేకింగ్ సోడా మిశ్రమంతో కడిగేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మరోసారి బేకింగ్ సోడా మిశ్రమంతో కడిగేసుకోవడం వల్ల షాంపూ ఏ మాత్రం లేకుండా అంతా వదిలిపోతుంది. దీనివల్ల జుట్టు చక్కగా కనిపిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

బౌన్సీ హెయిర్ కోసం
జుట్టు ఎగిరెగిరి పడాలనుకునే వారు వేడినీటికి యాపిల్ సిడెర్ వెనిగర్ కలిపి జుట్టుకు పట్టించాలి. ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

తరచూ తల స్నానం వద్దు
తలస్నానం రోజూ చేసే అలవాటు కొందరిలో కనిపిస్తుంది. కానీ, కనీసం మూడు రోజులకోసారి చేయడం బెటర్. జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహజ నూనెలు అనేవి విడుదల అవుతుంటాయి. అందుకే కనీసం మూడు రోజులు మధ్యలో విరామం ఇవ్వడం వల్ల ఆ నూనెలు శిరోజాల రక్షణకు ఉపయోపడతాయి.

మంచి కండిషనర్
శిరోజాల్లో తగినంత తేమ ఎప్పుడూ ఉండడం వల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి. మంచి కండిషనర్ ను స్వయంగా మనమే చేసుకోవచ్చు. గుడ్డు సొన, పెరుగు కలిపి కురుల మొదళ్లలో పట్టించాలి. 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

బలమైన జుట్టుకోసం
పొడిబారిన జుట్టు, దెబ్బతిన్న శిరోజాలకు బాదం నూనె చక్కగా పనిచేస్తుంది. ఓ పాత్రలో కొంచెం బాదం నూనె వేసుకుని, దాన్ని 40 సెకండ్ల పాటు వేడి చేయాలి. ఆ తర్వాత తల వెంట్రుకలకు రాసుకోవాలి. 30 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. చల్లటి నీటితోనే చేయాలి. అలాగే కండిషనర్ కుడా అప్లయ్ చేయాలి.

డల్ హెయిర్ కు
representational imageతల వెంట్రుకలు కళ తప్పినట్టు ఉంటే తలస్నానం చివరన ఒక స్పూన్ నిమ్మరసం పట్టించాలి. ఆ తర్వాత టవల్ తో తుడిచేసుకోవాలి.

ఈత కొలను
ఈత కొట్టేందుకు కొలనులో దిగడం చాలా మందికి సరదా. ఆ సమయంలో జుట్టు తడవకుండా రక్షణ కల్పించుకోవాలి. నీటిలో జుట్టుకు హానిచేసే కెమికల్స్ ఉంటాయి. కనుక తల వెంట్రుకలు తడవకుండా క్యాప్ ధరించాలి. లేదంటే జుట్టుకు మంచి కండిషనర్ ను పట్టించి కొలనులోకి దిగితే ఎటువంటి హాని ఉండదు.

ఎండ కారణంగా దెబ్బతిన్న జుట్టుకు
అర కప్పు తేనె, రెండు చెంచాల ఆలివ్ ఆయిల్, రెండు చెంచాల గుడ్డులోని పచ్చసొన మిశ్రమాన్ని తల వెంట్రుకలకు పట్టించి 20 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. ఆ తర్వాత వేడి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే కెరాటిన్ ప్రొటీన్ బాండ్స్ తిరిగి భర్తీ అవుతాయి.

గట్టిగా చుట్టేయొద్దు
మహిళలు జుట్టుని గట్టిగా చుట్టేసి పెట్టడం చేస్తుంటారు. పెళుసుబారిన జుట్టు చిట్లిపోకుండా నివారించేందుకు జుట్టుని గట్టిగా ముడేయకుండా, ఎటువంటి బ్యాండ్లను పెట్టకుండా ఉండడమే బెటర్.

దువ్వడం కూడా ముఖ్యమే
representational imageప్లాస్టిక్ దువ్వెనతో దువ్వడం వల్ల స్టాటిక్ ఎలక్ట్రిసిటీ విడుదలై జుట్టు చిట్లిపోతుంది. ఇక దువ్వడం కూడా టెక్నిక్ గా ఉండాలి. ముందు చివర్లన దువ్వుకోవాలి. ఆ తర్వాత కుదుళ్ల నుంచి జుట్టు చివరి వరకు దువ్వుకోవాలి. వెంట్రుకల చివర్లో చిట్లకుండా ఉండేందుకు వెడల్పాటి పళ్లున్న దువ్వెనలను వాడాలి. తరచూ హెయిర్ స్టయిల్ చేయించుకోవద్దు. నైలాన్ బ్రిస్టల్స్ ఉన్న దువ్వెనలను వాడాలి. తగినంత నీరు తాగాలి. ట్రిమ్మింగ్
శిరోజాలు పెళుసుబారిపోకుండా, చిట్లకుండా ఉండేందుకు కనీసం ప్రతీ ఆరు వారాలకోసారి అయినా జుట్టును ట్రిమ్ చేసుకోవాలి. జుట్టు చివర్లలో పావు నుంచి అర అంగుళం మేర వెంట్రుకలను కత్తిరించొచ్చు. దీనివల్ల వెంట్రుకల చివర్లు చిట్లిపోయే సమస్య కూడా ఆగుతుంది.

తడి జుట్టుపై దువ్వుకోవద్దు
నిజానికి స్త్రీలు గానీ, పురుషులు గానీ తలస్నానం తర్వాత తడి జుట్టుపైనే దువ్వడం చేస్తుంటారు. కానీ, పొడి జుట్టుకంటే తడిసిన సమయంలో వెంట్రుకలు మూడు రెట్లు బలహీనంగా ఉంటాయి. కనుక రాలిపోవడం ఎక్కువగా జరుగుతుంది. అందుకే ముందు టవల్ తో జుట్టును తడి లేకుండా తుడుచుకుని ఆ తర్వాత పళ్లు దూరంగా ఉన్న దువ్వెనతో దువ్వుకోవాలి. తల స్నానం తర్వాత జుట్టును సహజంగానే ఆరనివ్వాలి. బ్లో డ్రయర్లతో ఆరపెట్టుకోవద్దు. దీనివల్ల జుట్టు మరింత పొడిబారి, పెళుసుగా అవుతుంది.

పోషకాహారం
జుట్టు బలంగా ఉండేందుకు సరైన ఆహారం కూడా అవసరం. అందుకోసం పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.

జుట్టు రాలిపోతోందా...?
వేడి నూనెతో మస్సాజ్: కొబ్బరి నూనె లేదా బాదం నూనెను వేడి చేసుకోవాలి. దీన్ని వెంట్రుకలకు రాసుకుని కుదుళ్లను వేళ్లతో మర్ధన చేసుకోవాలి. దీనివల్ల హెయిర్ ఫాలికుల్స్ కు రక్తసరఫరా మెరుగుపడుతుంది. దాంతో కుదుళ్లు బలపడతాయి. మంచి కండిషన్ కూడా అందుతుంది.

ఉల్లిగడ్డ రసం: ఉల్లిలో సల్ఫర్ ఉంటుంది. ఉల్లిగడ్డ రసం జుట్టురాలిపోయే సమస్యను నివారించడంతోపాటు, హెయిర్ ఫాలికుల్స్ కు రక్త representational imageసరఫరా జరిగేలా చూస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణం స్కాల్ప్ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే క్రిములను చంపేస్తుంది. స్కాల్ప్ ఇన్ఫెక్షన్ కారణంగానూ జుట్టు రాలిపోతుంది.
బీట్ రూట్ జ్యూస్: పోషకాహార లోపం కారణంగా జుట్టు రాలిపోతుంటే అందుకు బీట్ రూట్ రసం చక్కని పరిష్కారం. కనుక వీలైతే రోజూ బీట్ రూట్ ను వంటలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

గ్రీన్ టీ: శిరోజాలు తిరిగి జీవం పోసుకోవడానికి, జుట్టు పెరుగుదల మెరుగుపడడానికి గ్రీన్ టీ మంచిగా తోడ్పడుతుంది. శరీరంలో జీవ క్రియలను గ్రీన్ టీ మెరుగు పరుస్తుంది. ఇది పరోక్షంగా శిరోజాల ఆరోగ్యానికీ ఉపయోగపడుతుంది. గ్రీన్ టీని జుట్టుకు కండిషనర్ గానూ వాడుకోవచ్చు.

మెడిటేషన్: ప్రతీ రోజూ కొంత సమయం పాటు మెడిటేషన్ చేయడం ఎంతో మంచిది. దీనివల్ల జుట్టు రాలిపోయే సమస్య చాలా వరకు పరిష్కారమవుతుందంటున్నారు నిపుణులు.

ఉసిరి: విటమిన్ సీ లోపం కారణంగానూ జుట్టు రాలిపోతుంటుంది. అటువంటి సమస్యకు ఉసిరి మంచి ఆప్షన్.

వేప ఆకులు: జుట్టు రాలిపోయే సమస్యకు వేపాకులు ఓ మంచి ఔషధం. వేపాకులను నీళ్లలో వేసి ఉడికించి వాటిని పేస్ట్ లా చేసుకుని  దాన్ని షాంపూతో తలస్నానం చేసిన తర్వాత జుట్టు మొదళ్లకు పట్టేలా రాసుకోవాలి. అరగంట తర్వాత కడిగేసుకోవాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

representational imageఅలోవెరా: ఆరోగ్యకమైన శిరోజాల పెరుగుదలకు ఉపయోపడే ఎంజైమ్ లు అలోవెరాలో ఉన్నాయి. అలోవెరా జ్యూస్ లేదా జెల్ జుట్టు కుదుళ్లకు రాసుకోవాలి. అలాగే అలోవెరా జ్యూస్ ను రోజూ ఓ టీ స్పూన్ కడుపులోకి తీసుకున్నా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు.

గుడ్డు పెరుగు: గుడ్డులోని తెల్లసొన, పెరుగు మిశ్రమం కూడా జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. రెండు కోడిగుడ్లలోని తెల్లసొనను కప్పులోకి తీసుకుని దానికి రెండు చెంచాల తాజా పెరుగు కలుపుకోవాలి. దీనికి నీమ్ పౌడర్ కలుపుకుని జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు రాలిపోవడం ఆగిపోతుంది.

సల్ఫేట్ లేని షాంపూనే వాడాలి
మీరు వాడుతున్న షాంపూలో సల్ఫేట్ ఉందేమో చూసుకోండి. ఉంటే పక్కన పెట్టేయండి. ఎందుకంటే షాంపులోని సల్ఫేట్స్ జుట్టులోని సహజ నూనెలను వదిలిస్తాయి. దీంతో జుట్టు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. జుట్టు కుదుళ్లలో ఇర్రిటేషన్ అనిపించినట్టయితే, జుట్టు ఎక్కువగా పొడిబారినట్టు అర్థం. అందుకే సల్ఫేట్స్ లేని షాంపూలను ఎంచుకోవాలి.

పొడి జుట్టా...?
representational imageమీది పొడి జుట్టు అయితే హెయిర్ డై (జుట్టుకు రంగు వేసుకోవడం) వద్దు. నిమ్మరసం, తేనె జుట్టును సాఫ్ట్ గా మారుస్తాయి. నిమ్మరసాన్ని నీటితో కలిపి దీన్ని జుట్టుపై చల్లుకోవాలి.

కండిషనర్
బాదం, కొబ్బరి నూనె, 200 ఎంఎల్ వాటర్ తీసుకోవాలి. ముందు 200 ఎంఎల్ వాటర్ ను తీసుకుని దానిలో రెండు మూడు చుక్కల కొబ్బరి నూనె, ఐదు చుక్కుల బాదం నూనె కలుపుకోవాలి. దీనికి మంచి సువాసన కోసం లావెండర్ ను కలుపుకోవచ్చు. దీన్ని హెయిర్ కండిషనర్ గా రెండు మూడు చుక్కులు వాడుకోవచ్చు.

హెయిర్ ప్యాక్
గుడ్డు, పెరుగు, ఆవనూనె మిశ్రమం అన్ని సమస్యలకు పరిష్కారంగా చెబుతారు. గుడ్డులో విటమిన్ ఏ, బి12, డీ, ఈ, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

వెంట్రుకలు చిట్లకుండా....
బొప్పాయి: బొప్పాయి పండు గుజ్జు తీసుకుని దానికి అర కప్పు పెరుగు కలుపుకోవాలి. దీన్ని హెయిర్ మాస్క్ లా వేసుకోవచ్చు. 30 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వెంట్రుకలు చిట్లడాన్ని నివారిస్తుంది.

ఆముదం: ఆముదం నూనెతో జుట్టును మస్సాజ్ చేసుకోవాలి. ఆముదానికి ఆవనూనె కలిపి రాసుకుంటే వెంట్రుకలు చిట్లడం తగ్గిపోతుంది. ఇలా అరగంట పాటు ఉంచుకున్న తర్వాత కడిగేసుకోవాలి.

తేనె: తేనె కూడా వెంట్రుకలు చిట్లకుండా నివారించడంలో తోడ్పడుతుంది. చెంచాడు తేనె, పెరుగుతో కలుపుకోవాలి. దీన్ని తలవెంట్రుకలకు రాసుకోవాలి. ముఖ్యంగా వెంట్రుకలు చివర్లలో రాయడం మర్చిపోవద్దు. ఓ 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

representational imageబీర్: బీర్ అన్నది తల వెంట్రుకలకు మంచి కండిషనర్ గా ఉపయోగపడుతుంది. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత బీర్ తో కడుక్కోవాలి. దీంతో వెంట్రుకల చివర్ల చిట్లడం ఆగిపోతుంది.

అవకాడో: అవకాడో గుజ్జును తల వెంట్రుకలు, వెంట్రుకల చివరల్లో రాసుకుని 30 నిమిషాల పాటు ఉంచేయాలి. ఆ తర్వాత కడుక్కోవాలి. రాత్రి నిద్రించే ముందు రాసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసినా సరిపోతుంది.

ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ తో  రాత్రి నిద్రించే ముందు మస్సాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం లేదా, రాసిన గంట తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.

అరటిపండు: అరటి పండు గుజ్జుకు, కొంత తేనె, పాలు కలిపి వెంట్రుకలకు మాస్క్ లా వేసుకోవాలి. గంట తర్వాత కడిగేసుకోవాలి. మెంతులను పేస్ట్ లా చేసుకుని దాన్ని ప్యాక్ లా వేసుకోవాలి. రెండు గంటల తర్వాత కడిగేయడం వల్ల సిల్క్ గా జుట్టు కనిపిస్తుంది.

విటమిన్ ఈ:  గోరువెచ్చని నీటిని రెండు మూడు విటమిన్ ఈ కేప్సుల్స్ ను కలుపుకుని వెంట్రుకలకు రాసుకుంటే చిట్లడం ఆగిపోతుంది.

కాలుష్యం
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తలకు రక్షణగా వదులుగా ఉండేది ఏదైనా ధరించాలి. క్యాప్ కావచ్చు. చేతి రుమాలు కావచ్చు. తడి జుట్టుతో బయటకు వెళ్లొద్దు. దీనివల్ల దుమ్ము, మురికి ఎక్కువగా పట్టేస్తుంది.

ఔషధాలు
శిరోజాల ఆరోగ్యానికి పోషకాహారం అవసరమని చెప్పుకున్నాం కదా. అందుకోసం ఫోలిక్ యాసిడ్, బయోటిన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

నెయ్యితో శిరోజాల సౌందర్యం... ట్రై చేయండి!

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy