ap7am logo

మీ జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధులు ఇవే...

Mon, May 08, 2017, 11:13 AM
Related Image ఒకప్పటితో పోలిస్తే నేటి జీవనశైలిలో ఎంతో మార్పు వచ్చింది. ఇంకా మారుతూనే ఉంది. శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరుగుతోంది. ఆహార, పానీయాల్లో మార్పులు, నిద్ర వేళల్లోనూ మార్పులు... ఫలితమే నేడు చిన్న వయసు నుంచే మహమ్మారి వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆ జీవనశైలి వ్యాధులు ఏంటన్న వాటిపై ఓ లుక్కేయండి...

అంటు వ్యాధులైన మలేరియా, కలరా, పోలియో వంటివి నేడు వైద్యం అభివృద్ధి చెందడం వల్ల అదుపులోకి వచ్చేశాయి. కానీ, అదే సమయంలో లైఫ్ స్టయిల్ డీసీజెస్ (జీవనశైలి వ్యాధులు) పెరిగిపోతున్నాయి. వీటిని అభివృద్ధి కారణంగా తలెత్తే విపరిణామాలుగానూ పేర్కొనవచ్చు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి. వేగంగా విస్తరిస్తున్నాయి. లైఫ్ స్టయిల్ వ్యాధుల కారణంగా ఏటా 1.4 కోట్ల మంది (30 - 69 ఏళ్ల మధ్య) ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్నారు. వారసత్వంగా సంక్రమించే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల కారణంగా సంభవించే మరణాలకంటే ఇలా జీవనశైలి కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో కన్ను మూస్తున్నవారే అధికం.

అనారోగ్య తిండి అలవాట్లు
representational imageపోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకే తరహా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక ఫ్యాట్ తో కూడుకున్న ఆహారం, తీపి పదార్థాలు ఇవన్నీ మనిషి ఆధునిక జీవనానికి హానికారకాలే. తాజా ఆహారానికి బదులు నిల్వ ఉంచిన ఆహార సేవనం కూడా చేటు చేసేదే.

శారీరక శ్రమ లేకపోవడం
నగరీకరణ, పట్టణీకరణ జీవనం నిత్యం ఉరుకుల పరుగులే. కాలు బయటపెడితే నడిచి వెళ్లకుండా సకల సదుపాయాలు, కోరితే అన్నీ ఇంటికే వచ్చేసే వెసులుబాటు ఇవన్నీ సుఖమయ జీవనాన్ని పెంచుతున్నాయి. దీంతో శారీరక శ్రమ తగ్గుతోంది. వ్యాయామాలు చేయడం ద్వారా దీన్నుంచి బయట పడదామన్న శ్రద్ధ కూడా తక్కువ మందిలో కనిపిస్తోంది. ఈ కారణాల వల్ల మధ్య వయసుకే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీర్ఘకాలంలో ఈ రెండూ కొనసాగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్స్ బారిన పడే ముప్పు పెరుగుతుంది.  

representational imageవీటికి తోడు పొగతాగడం, పొగాకు పదార్థాలు నమలడం, మద్యపాన సేవనం, శీతల పానీయాలు, పాల పదార్ధాలు అధికంగా తీసుకోవడం, అర్ధరాత్రి సమయాల్లో ఆహార సేవనం, అర్ధరాత్రి తర్వాత ఆలస్యంగా నిద్రించడం, తగినంత నిద్ర లేకపోవడం, రోజంతా కంప్యూటర్ల ముందే కూర్చుని పనిచేస్తుండడం, వాయు కాలుష్యం వంటివి కూడా లైఫ్ స్టయిల్ వ్యాధులకు కారణం అవుతాయి. అవేంటో చూద్దాం.

ఒబెసిటీ, డయాబెటిస్, ఆర్టిరియో స్కెలరోసిస్, గుండె జబ్బులు, స్ట్రోక్, హైపర్ టెన్షన్, లివర్ సిర్రోసిస్, నెఫ్రైటిస్, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, అలెర్జీలు, వినికిడి సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలు, వెన్ను సంబంధిత సమస్యలు. వ్యక్తుల అలవాట్లు, ప్రవర్తన, చర్యలే లైఫ్ స్టయిల్ వ్యాధుల బారిన పడేదీ లేనిదీ నిర్ణయిస్తాయి. అయితే, వ్యక్తుల పరంగా నియంత్రించుకునే అంశాలు, నియంత్రించుకోలేని అంశాలంటూ ఉంటాయి. పొగతాగడం, ఆహార అలవాట్లు, వ్యాయామం, ఎంత మేరకు నిద్రించాలి? అన్నది నియంత్రించుకోగల అంశాలు. మన చేతుల్లో లేని అంశాలు... వయసు, సంతతి, లింగము, వారసత్వం.

ఓబెసిటీ (స్థూలకాయం)
representational imageఅనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, భారీ సైజు భోజనాలు, శారీరక వ్యాయామం తగ్గడం ఇవన్నీ స్థూలకాయానికి దారితీస్తాయి. ఉండాల్సిన బరువుకంటే అధికంగా ఉన్న వారు శ్వాస తీసుకోవడంలో సమస్యలు, రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 15.5 కోట్ల మంది స్థూలకాయులున్నారు. ప్రపంచంలో ఈ విషయంలో మన ర్యాంకు నంబర్ 2. మన దేశంలోనూ స్థూల కాయుల సంఖ్య ఏటేటా 30 శాతానికి పైగా పెరుగుతుండడం ప్రమాదకరం.

ఒత్తిడి, ఆందోళన
representational imageఆధునిక జీవన శైలి వల్ల ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇవి రక్తపోటు, గుండెజబ్బులు, డయాబెటిస్, ఆస్తమా, అల్జీమర్స్ వంటి సమస్యలకు కారణమవుతాయి. పని భారం, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వస్తాయి. దీనివల్ల కంటినిండా నిద్ర కరవవుతుంది. పనిచేసే చోట, ఇంట్లోనూ నేడు ఒత్తిళ్లు పెరిగిపోయాయి. చివరికి పాఠశాలలు, కాలేజీల్లోనూ విద్యార్థులకు చదువుల భారం విపరీతంగా పెరిగి ఒత్తిడికి కారణమవుతున్న పరిస్థితిని చూస్తున్నాం.

టైప్ 2 డయాబెటిస్ (మధుమేహం/షుగర్)
representational imageపాంక్రియాస్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి రక్తంలో చేరిన గ్లూకోజ్ ను కణాలకు శక్తిగా అందించడంలో ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, టైప్ 2 డయాబెటిస్ బారిన పడిన వారిలో పాంక్రియాస్ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది గానీ, కణాలు దాన్ని వినియోగించుకోలేవు. దీన్ని ఇన్సులిన్ నిరోధకత(ఇన్సులిన్ రెసిస్టెన్స్)గా పేర్కొంటారు. కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకపోవచ్చు. సాధారణంగా ఇన్సులిన్ కాలేయంలో గ్లూకోజ్ స్థాయులను అదుపు చేస్తుంది. అయితే, ఇన్సులిన్ నిరోధక వల్ల కాలేయం నుంచి గ్లూకోజ్ అసంబద్ధంగా విడుదల అవుతుంది.

అలాగే, కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత లేకపోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయి. ఫలితమే డయాబెటిస్. ఇన్సులిన్ నిరోధకత, పాంక్రియాస్ లోని బీటా కణాలు ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేకపోవడం అన్నది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి ప్రాథమికంగానే ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది. అటువంటి వారిలో ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపం కొంచెమే ఉండొచ్చు. మరికొందరిలో ఇన్సులిన్ నిరోధకత అన్నది కొంచెమే ఉండొచ్చు. కానీ ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకపోవచ్చు. అంతర్జాతీయ డయాబెటిస్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం మన దేశంలో 6కోట్ల మందికి పైగా టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నారు. అధిక బరువు, జీవక్రియలు గతి తప్పడం, అధిక తీపి పదార్థాలున్న వాటిని తీసుకోవడం వంటివి కూడా టైప్ 2 డయాబెటిస్ కు కారణమవుతాయి.

ఆర్టీరియో స్కెలరోసిస్
ఈ సమస్యలో గుండె నుంచి శరీరంలోని అవయవాలకు రక్తాన్ని, పోషకాలను, ఆక్సిజన్ ను తీసుకెళ్లే ధమనుల గోడలు మందంగా మారి, సాగే గుణాన్ని కోల్పోతాయి. ధమనుల గోడల్లో కొవ్వు చేరడం వల్ల రక్త సరఫరాలో అవాంతరాలు ఏర్పడి ఈ సమస్యకు దారితీస్తుంది. దీంతో గుండె సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యతో రక్తపోటు కూడా నియంత్రణ తప్పుతుంది. అలాగే, ఛాతీలో నొప్పి, గుండెపోటు సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆరోగ్యకరమైన ధమనులు సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. కానీ ఈ సమస్యలో ధమనుల లోపలి గోడలు గట్టిగా మారతాయి.

గుండె జబ్బులు
representational imageగుండె కణజాలం, రక్తనాళాల్లో ఏర్పడే సమస్యలే గుండె పోటు, ఇతర సమస్యలకు కారణం అవుతాయి. రక్తం, ఆక్సిజన్ గుండెకు అందకపోవడం గుండెపోటులో ప్రధానంగా కనిపిస్తుంది. గుండె, రక్త నాళాలు దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. పొగతాగడం, అధికంగా మద్యపాన సేవనం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, వ్యాయామం లేకపోవడం గుండె జబ్బులకు కారణాలు. ఏటా గుండె జబ్బుల కారణంగా సంభవించే మరణాల్లో 30 శాతానికి పైగా  34-64 ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఉంటున్నాయి. గుండె జబ్బులున్న వారి సంఖ్యా పరంగా మన దేశం ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంది. మన దేశంలో 5 కోట్ల మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు.  

అధిక రక్తపోటు
representational imageప్రతీ వ్యక్తికీ నిర్ణీత పరిమాణం మేర రక్తపోటు ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా కావాలంటే అందుకు ఇది అవసరం. అయితే, ఎన్నో కారణాల వల్ల ఇది పరిమితి దాటుతుంది. దాని వల్ల దీర్ఘకాలంలో ప్రాణాలకు రిస్క్ ఏర్పడుతుంది. 120/80 వరకు సాధారణంగానే పరిగణిస్తారు. 140/90 లేదా ఆ పైస్థాయిలను అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ గా పేర్కొంటారు. ఒత్తిడి, స్థూలకాయం, జన్యు సంబంధిత అంశాలు, ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకోవడం, వయసు పైబడడం వంటివి అధిక రక్తపోటు రావడానికి కారణాలు. దేశంలో 10 కోట్ల మందికిపైగా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు.

కేన్సర్
representational imageకేన్సర్ కారణంగా ఏటా 5 లక్షలకు పైగా మన దేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. మన శరీరంలో కోట్ల కొద్దీ కణాలుంటాయి. అయితే, ఈ కణాల్లో అసాధారణ పెరుగుదల చోటుచేసుకుంటే అది కేన్సర్ అవుతుంది. కేన్సర్ లో 100కు పైగా రకాలున్నాయి. ముఖ్యంగా మనదేశంలో బ్రెస్ట్ కేన్సర్, కొలన్ కేన్సర్, లంగ్ కేన్సర్, ప్రొస్టేస్ కేన్సర్, లింఫోమా ఎక్కువగా ఉంటున్నాయి. నేడు గుర్తిస్తున్న ప్రతి 10 కేన్సర్ కేసుల్లో 9 కేసులు పర్యావరణ అంశాల కారణంగా తలెత్తుతున్నవేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పొగతాగడం, ఆల్కహాల్, వాయు కాలుష్యం వంటివి కారణాలుగా పేర్కొంటున్నారు. పైగా ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితమే ఒకప్పుడు కేన్సర్ అంటే పెద్దగా తెలియని మన దగ్గర నేడు అధిక సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి.

స్ట్రోక్ (పక్షవాతం)
మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో అడ్డంకులు ఏర్పడి పూడుకుపోయి... మెదడుకు రక్తం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.  స్ట్రోక్స్ బారిన పడిన వారిలో 15 శాతం వరకు 40 ఏళ్ల వయసులోపు వారే ఉంటున్నారు. జీవనశైలి ప్రభావమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డీసీజ్
ఈ సమస్యలో శ్వాrepresentational imageస తీసుకోవడం కష్టంగా మారుతుంది. దీర్ఘకాలంలో ఊపరితిత్తులను దెబ్బతీస్తుంది కూడా. మరీ ముఖ్యంగా పొగతాగడం, వాయు కాలుష్యం ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ఇవే అంశాలు సమస్య బారిన పడిన వారిని మరింత ఇబ్బంది పాలు చేస్తాయి. ఇంకా పెయింట్స్ తరహా రసాయనాలను పీల్చడం, దుమ్ము కూడా ఈ సమస్యకు కారణాలు.

సిర్రోసిస్
అధికంగా ఆల్కహాల్ సేవనం, దీర్ధకాలిక హెపటైటిస్ సిర్రోసిస్ కు దారితీస్తాయి. ఏటా ఈ సమస్య వల్ల మన దేశంలో 36,149 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాలేయంలో ఆరోగ్యమైన కణాలు దీర్ఘకాలం పాటు దెబ్బతినడం వల్ల సమస్య బారిన పడతారు. సిర్రోసిస్ వచ్చిన వారి లివర్ లో సాధారణ కణజాలం స్థానంలో స్కార్ టిష్యూ ఏర్పడుతుంది. దీంతో కాలేయం గట్టిపడిపోతుంది. ఈ స్కార్ టిష్యూ లివర్ లోకి రక్త సరఫరాను అడ్డుకుంటుంది. సిర్రోసిస్ కు కాలేయ మార్పిడి మినహా మరో చికిత్స లేదు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy