ap7am logo

వ్యాపారం ప్రారంభించే ముందు ఇవి తెలుసుకోండి...

Sun, May 07, 2017, 11:31 AM
Related Image భారత్ ను తయారీ కేంద్రంగా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. నేడు స్టార్టప్ లు ఎన్నో మొగ్గతొడుగుతున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సైతం ఒకప్పుడు స్టార్టపే. వ్యాపారం ప్రారంభించాలని, సొంతంగా ఉన్నత స్థాయికి ఎదగాలని, పది మందికి ఉపాధి కల్పించాలని ఎంతో మందిలో ఉంటుంది. వ్యాపారం ప్రారంభించాలన్న ఆసక్తి ఉన్నా, అందుకు పాటించవలసిన నిబంధనల గురించి చాలా మందికి తెలియదు. కనుక ఓ కంపెనీని ప్రారంభించే ముందు ఏవేవి అవసరమో చూద్దాం.

కంపెనీల్లో రకాలు...
దేశంలో వ్యాపారం ప్రారంభించేందుకు ఐదు భిన్న రకాలైన అవకాశాలున్నాయి. పన్నులు, యాజమాన్య పరంగా బాధ్యతలు, పెట్టుబడులు, నిధులు వంటి అంశాల ఆధారంగా వీటిలో ఏదో ఒక రకాన్ని ఎంచుకోవచ్చు.

సోల్ ప్రొప్రైటర్ షిప్
వ్యాపారం ప్రారంభించేందుకు సులభమైన విధానం. సంస్థ అందించే సేవలు, వ్యాపారాన్ని బట్టి ఆయా ప్రభుత్వ విభాగం వద్ద నమోదు చేసుకోవాలి. సోల్ ప్రొప్రైటర్ షిప్ విధానంలో యాజమాన్యాన్ని ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి బదలాయించేందుకు అవకాశం లేదు. అయితే, ఆస్తులను మాత్రం విక్రయించుకోవచ్చు.  

పార్ట్ నర్ షిప్
representative imageఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది భాగస్వామ్యంతో వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. గరిష్టంగా 20 మంది వరకు భాగస్వామ్యులుగా ఉండేందుకు చట్టం అనుమతిస్తోంది. పార్ట్ నర్ షిప్ డీడ్ లో ప్రతీ భాగస్వామి సమకూర్చిన మూలధన పెట్టుబడి ఎంత... లాభం, నష్టాలను ఏ నిష్పత్తిలో పంచుకోవాలి, వేతనం ఎంత? తదితర వివరాలు ఉంటాయి. ఈ తరహా భాగస్వామ్య సంస్థలకు ఆదాయపన్ను శాఖ ప్రత్యేకంగా పాన్ నంబర్ జారీ చేస్తుంది. పార్ట్ నర్ షిప్ సంస్థలకు రిజిస్ట్రార్ ఆఫ్ ఫర్మ్స్ (ఆర్వోఎఫ్) వద్ద నమోదు తప్పనిసరికాదు. అయితే, ఇలా నమోదు చేయించుకుంటేనే పార్ట్ నర్ షిప్ డీడ్ ను చట్టబద్ధమైన పత్రంగా పరిగణిస్తారు. విదేశీయులు పార్ట్ నర్ షిప్ సంస్థను స్థాపించేందుకు అవకాశం లేదు.

పరిమిత బాధ్యతతో కూడిన భాగస్వామ్యం (ఎల్ఎల్పీ)
పార్లమెంటులో చట్టం ద్వారా ఎల్ఎల్పీని అమల్లోకి తేవడం జరిగింది. ఈ విధానంలో భాగస్వాములకు యాజమాన్యం విషయంలో వెసులుబాటు ఉంటుంది. బాధ్యతపరంగా రక్షణ కూడా ఉంటుంది. వారు పెట్టే పెట్టుబడి మొత్తాన్ని బట్టి ఈ బాధ్యత ఆధారపడి ఉంటుంది. భాగస్వాములు చేసే చట్టవిరుద్ధమైన, గుర్తింపులేని చర్యల నుంచి మిగిలిన భాగస్వాములకు రక్షణ ఉంటుంది. సంస్థకు ప్రత్యేకంగా పాన్ అవసరం.

ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ
కంపెనీని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వద్ద నమోదు చేయించుకోవాలి. ఆర్టికల్ ఆఫ్ అసిసోయేషన్ (కంపెనీ నియమావళి), డ్రాఫ్ట్ ఆఫ్ మొమోరాండం ఆఫ్ అసిసోయేషన్ పై కంపెనీ వ్యవస్థాకులు అందరూ సంతకం చేయాల్సి ఉంటుంది. ఇద్దరి నుంచి 200 మంది వరకు కనీసం రూ.1,00,000 షేర్ కేపిటల్ తో కంపెనీని ఏర్పాటు చేసుకోవచ్చు. కనీసం ఇద్దరు డైరెక్టర్లు, గరిష్ఠంగా ఏడుగురు డైరెక్టర్లను వాటాదారుల ఆమోదం మేరకు నియమించాల్సి ఉంటుంది. కనీసం ఒకరు భారత పౌరులై ఉండాలి. పార్ట్ నర్ షిప్ ఎల్ఎల్పీ తో పోలిస్తే ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో ఆదాయపన్ను శాఖ, కంపెనీల చట్టాలకు అనుగుణంగా ఖాతాలను నిర్వహించాల్సి ఉంటుంది. కంపెనీని మూసి వేయాలంటే కొంచెం కష్టతరమైన వ్యవహారం. కంపెనీ నిర్వహణకు ఎటువంటి ఆటంకాలకు కలిగించకుండానే వాటాదారులు మారిపోవచ్చు. యాజమాన్యం, కార్యకలాపాల పరంగా విభజన ఉంటుంది. కనుక వాటాదారులు ఎవరైనా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సులభంగా వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది.

పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ
ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ తరహాలోనే ఇది కూడా ఉంటుంది. అయితే, వాటాదారుల విషయంలో పరిమితి ఉండదు. కనీసం ఏడుగురు ఉండాలి. స్టాక్ ఎక్సేంజ్ లో నమోదు చేయడం లేదా అన్ లిస్టెడ్ గా కొనసాగించడం అన్నది యజమానుల ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అన్నది ప్రజలకు మరింతగా సమాచారాన్ని అందించాలి. అలాగే, ప్రభుత్వం, సెబీ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి. బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమించాలి. ఖాతా పుస్తకాలను, డైరెక్టర్లు, సీఈవోల వేతన వివరాలను, సమగ్ర సమాచారాన్ని నియంత్రణ సంస్థలకు అందించాల్సి ఉంటుంది.

కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ...
ఏ తరహా కంపెనీని ఏర్పాటు చేయాలన్నది నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చట్ట ప్రకారం నమోదు చేసుకునే ప్రక్రియను పాటించాలి. ముందు చార్టర్డ్ అకౌంటెంట్ ను నియమించుకోవాలి. ఆయనకు కంపెనీల చట్టం గురించి దాదాపుగా తెలిసి ఉంటుంది. తర్వాత ప్రతిపాదిత డైరెక్టర్లు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ను పొందాలి. అలాగే, డైరెక్టర్ల గుర్తింపు సంఖ్య (డీఐఎన్) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ విదేశీ వ్యక్తి లేదా ఎన్ఆర్ఐ అయితే సొంతంగా అటెస్ట్ చేసిన పాస్ పోర్ట్ నోటరైజ్డ్ కాపీ, చిరునామా ధ్రువీకరణ (డ్రైవింగ్ లైసెన్స్, యుటిలిటీ బిల్లు)ను ఇవ్వాల్సి ఉంటుంది. సర్వీస్ ట్యాక్స్ వ్యాట్ లేలా సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ representative imageకోసం దరఖాచేస్తు చేసుకోవాలి. టాన్ కోసం కూడా అప్లయ్ చేసుకోవాలి. అన్ని రకాల అనుమతులు, అవసరమైన లెసెన్స్ లను పొందాలి. అన్నీ పూర్తయిన తర్వాత ఉద్యోగులకు భవిష్యనిధి, పెన్షన్ సదుపాయాల కోసం ఈఎస్ఐ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. రిటైల్ బిజినెస్ అయితే షాప్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద లైసెన్స్ తీసుకోవాలి.

ఈ డాక్యుమెంట్లు అవసరం
డైరెక్టర్ల పాన్ కార్డు కాపీ, వీరి ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు కాపీ, రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, బ్యాంకు ఖాతా స్టేట్ మెంటు ఆరు నెలల కాలానికి చెందినది. రిజిస్టర్డ్ ఆఫీస్ కు సంబంధించి విద్యుత్తు లేదా నీటి బిల్లు, అద్దె భవనంలో ఉంటే రెంట్ అగ్రిమెంట్, కేన్సిల్ చెక్ సమకూర్చుకోవాలి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Advertisements