ap7am logo

పెళ్లయిన తర్వాత దాంపత్యం ఇలా సాగిపోవాలి...

Sun, May 14, 2017, 11:09 AM
Related Image

ఇప్పటి వరకూ ఏక్ నిరంజన్.. ‘ఎంజాయ్...  మంత్రం‘.. మరిప్పుడో.. జీవితానికో తోడు... అందమైన ఆశల ప్రపంచం వైపు రెండు మనసులు కలసి సాగించే హ్యాపీ జర్నీ.. కొత్తగా పెళ్లి చేసుకుని ప్రారంభించే జీవితం ఎంతో ఆనందంగా, అర్థవంతంగా సాఫీగా సాగిపోవాలంటే కాస్తంత ఆలోచన, శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా దంపతులు ఇద్దరూ ఆర్థిక అవగాహనతో వేసే అడుగులే వారి జీవిత మజిలీని నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు. 

ఆర్థిక ప్రణాళికతో...

ఓ పుస్తకం రాయగల నైపుణ్యం లేకపోయినా పర్లేదు.. కానీ కొత్త జంట తమకంటూ  ఓ ఆర్థిక ప్రణాళిక రచించుకోగల స్పష్టత కలిగి ఉండాలి. వీలైతే సొంతంగా.. లేదంటే ఓ ఆర్థిక నిపుణుడి సాయంతోనైనా దానికి రూపునివ్వాలి. ఆ దిశగా తమ ప్రయాణం సాగిపోవాలి. ఇద్దరూ కలసి తమ భవిష్యత్తు లక్ష్యాలు, కలల గురించి చర్చించుకోవాలి. వాటిని చేరుకునేందుకు అనుసరించాల్సిన ఆర్థిక మంత్రాలను తెలుసుకోవాలి. సంపాదించే వారికి ఆర్థిక విషయాలపై కనీస మాత్రమైనా అవగాహన ఉండాలన్నది తలపండిన నిపుణుల సూచన. జీవిత భాగస్వామితో పొదుపు, మదుపు విషయాలపై చర్చించడం ఎంతో ఉపయుక్తం.

సంపాదన ఎంత?

ముందుగా దంపతుల్లో సంపాదన పరులు.. ఒకరు లేదా ఇద్దరా? మొత్తం ఆదాయం..? నెలవారీ ఖర్చులు.. మిగులు ఎంత..? పొదుపు ఎంత, మదుపు ఎంత? అనే దానిపై స్పష్టత ఉండాలి. ఇక్కడ పొదుపు, మదుపుకు మధ్య స్పష్టమైన తేడా ఉంది. సంపాదనలో మీరు మిగల్చగలిగింది పొదుపు.. దాన్ని పిల్లలు పెట్టేలా పెట్టుబడి పెట్టడం మదుపు. సొంతిల్లు.. అందమైన కారు.. పిల్లల చదువుల అవసరాలు, ఆభరణాలు ఇలా అన్ని అవసరాలను, ఆశలను తీర్చేది తెలివైన మదుపే. 

దుబారాకు కత్తెర వేసి

representational imageపెళ్లయిన కొత్తలో పెద్దగా బరువు బాధ్యతలు ఉండవు. సంపాదనలో మిగులు ఎక్కువగా కనిపించేదీ అప్పుడే.. సరిగ్గా ఈ సమయంలోనే దుబారాకు కొద్దిగా కత్తెర వేసి ఆ మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లించడం వివేకం అనిపిస్తుంది. తొలినాళ్లలో పెట్టుబడులు దీర్ఘకాలంలో అధిక సంపదకు వీలు కల్పిస్తాయి. ఇది ఎలా ఉంటుందో అర్థమయ్యేందుకు ఓ ఉదాహరణ చూద్దాం.. 

శ్రవణ్ 21 ఏళ్ల వయసు నుంచి నెల నెలా రూ.5 వేల చొప్పున ఓ పదేళ్ల పాటు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి ఆపేశాడు. కానీ తన పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా అలానే ఉంచేశాడు. అదే రఘురామ్ మాత్రం 31 ఏళ్ల వయసులో మదుపు ప్రారంభించాడు. నెల నెలా రూ.5 వేల చొప్పున 60 ఏళ్ల వరకూ పెట్టబడి కొనసాగించాడు. సగటున 12 శాతం రాబడి అంచనాతో లెక్కించి చూస్తే... శ్రవణ్ 60 ఏళ్ల వయసు నాటికి అతడి పెట్టుబడుల విలువ 3.45 కోట్ల రూపాయలకు చేరుకుంది. రఘురామ్ సంపద మాత్రం అదే 60 ఏళ్లకు రూ.1.75 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ముందుగా మదుపు ప్రారంభించడంలో ఉన్న మేజిక్ అలా ఉంటుందని ఈ ఉదాహరణ చెబుతోంది.  

representational image

లక్ష్యానికి అనుగుణంగా పెట్టుబడులు

కొత్త ఇల్లూ... కొత్త జీవితం అని అనుకుంటే మాత్రం రుణంతో ఇల్లు ప్లాన్ చేసుకోవడం.. అందుకు తగినట్టుగా నెలవారీ చెల్లింపులు చేసేలా ప్రణాళిక ఉండాలి. ఇలా లక్ష్యానికి అనుగుణంగా పెట్టుబడులు ఉండాలి. మరీ స్వల్ప కాలానికైతే లిక్విడ్ ఫండ్స్. ఇవి ఏడాది కాలానికి 8 శాతం వరకు రాబడినివ్వగలవు. ఐదేళ్ల కాలానికి అయితే, బ్యాలెన్స్ డ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ తగినవి. దీర్ఘకాలంలో అయితే ఈక్విటీ ఫండ్స్ ద్వారా అధిక రాబడి ఆశించవచ్చు. పిల్లలు. వారు ఉన్నత చదువులకు వచ్చే సమయానికి అధిక వ్యయాలను తట్టుకునేలా నెల నెలా కొంత కేటాయించాలి. ఆ కేటాయింపులను అధిక ప్రతిఫలాలను ఇచ్చే ఈక్విటీ ఫండ్స్  వైపు మళ్లించాలి. ఇందుకు సిప్ విధానం అనువైనది. స్టాక్ మార్కెట్లలో ఆటు పోట్లు సహజం. సిప్ విధానంలో అయితే మార్కెట్ పడినప్పుడూ... పెరిగినప్పుడూ నిరంతర పెట్టుబడితో రిస్క్ నామమాత్రం అవుతుంది.  

రిటైర్మెంట్ ప్లాన్

యుక్త వయసులో సంపాదనా శక్తి ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ 60 ఏళ్ల వయసులో ఏంటి పరిస్థితి? అందుకే, ఇప్పటి నుంచే అందుకు తగిన రక్షణ ఏర్పాటు ప్రణాళికలో ఉండాలి. ఓ మంచి పెన్షన్ పాలసీని ఎంచుకుని అందులో పెట్టుబడి పెట్టాలి. అది కూడా నామమాత్రం అయితే మీకు తగిన భరోసా ఉండదు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని అప్పటి అవసరాలను తీర్చేలా ఉండాలి. ఈ రోజు పది రూపాయలు.. 30 ఏళ్ల తర్వాత రెండు రూపాయలతో సమానం. ఈ రోజు మన ఖర్చు 10 రూపాయలు ఉంటే 30 ఏళ్ల తర్వాత ఎంత మేర అవసరం అవుతుందో ఆలోచించండి. 

అత్యవసరంలో ఆదుకునేందుకు..

ఉన్న ఫళంగా ఉద్యోగం పోతే.. లేదా మానేయాల్సిన పరిస్థితే వస్తే.. ఆ సమయంలో ఆదుకునేందుకు కనీసం మూడు నెలల అవసరాలకు తగినంత మొత్తం అత్యవసర నిధిగా బ్యాంకు ఖాతాలో ఉంచాలి. ఉద్యోగం లేకపోయినా ఇంటి ఖర్చు తప్పదు. అలాగే, బ్యాంకు లోన్ వాయిదా కట్టకుంటే బ్యాంకర్లు ఊరుకోరు కదా. అందుకుని అత్యవసర నిధి చాలా అవసరం.  

ఆరోగ్య బీమా

representational imageఊహించని అనారోగ్య సమస్య ఎదురైతే.. ఆ వ్యయం పెద్ద మొత్తంలో ఉంటే ఎంత కష్టమవుతుందో ఆలోచించండి. అందుకే ధీమాగా ఆరోగ్య బీమా ఉండాలి. అది కూడా కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ఉండాలి. భార్యతోపాటు తల్లిదండ్రులు కూడా మనపై ఆధారపడి ఉంటే వారి ఆరోగ్య అవసరాలను కూడా తీర్చేలా ఉండాలి. పిల్లలు ఉంటే ఇంకాస్త మొత్తం అవసరం అవుతుంది. మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా ఉండాలి. రోడ్డు ప్రమాదంలో ఊహించని పరిస్థితులే ఎదురైతే.. ? సంపాదన పరుడికి జరగరానిదే జరిగితే...  కుటుంబం రోడ్డున పడుకుండా ఆదుకునేందుకు ప్రమాద బీమా, జీవిత బీమాలూ తీసుకోవాలి. వాహనం ఉంటే వాహన బీమా తప్పనిసరి. ఇలా అన్ని అవసరాలకు అనుగుణంగా క్రమశిక్షణతో మీరు వేసే అడుగులు... భద్రమైన, భరోసాతో కూడిన సంతోషకరమైన జీవితానికి దారి తీయగలవు. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy