ap7am logo

ఆరోగ్యం కోసం ఈ యాప్స్ స్మార్ట్ ఫోన్లో ఉండాల్సిందే...!

Tue, Apr 04, 2017, 02:59 PM
Related Image నేడు ఐటీ ఉద్యోగాలు కానివ్వండి, హాస్పిటల్లో కానివ్వండి. ఫార్మా కంపెనీల్లో కానివ్వండి... ఎక్కడ చూసినా కూర్చుని చేసే ఉద్యోగాలే. అస్తమానం కంప్యూటర్ల దగ్గరే. కానీ, ఇలా గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాలతో ఆరోగ్యానికి మహా ముప్పుందని ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. ఉద్యోగాన్ని మార్చుకోలేరు గనుక ఆరోగ్యాన్ని కాపాడుకునే చర్యలు తీసుకోవడం తప్పనిసరి. అందుకోసం ఎన్నో యాప్స్ ఉన్నాయి... ఇక రోజులో ఎన్నో గంటలు స్మార్ట్ ఫోన్లపై కాలక్షేపం చేయడం బాగా పెరిగిపోతోంది. దీంతో కంటి చూపుకు పొంచి ఉంది పెద్ద ముప్పు. అలాగే, శారీరక శ్రమ తగ్గిపోయి, సుఖమైన జీవన విధానం కారణంగానూ ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కోసం ఉపయోగపడే యాప్స్ గురించి తెలుసుకుందాం.

స్ట్రెచింగ్ వ్యాయామాలు
representative imageకార్యాలయంలో తమ సీట్లో కూర్చున్న దగ్గరి నుంచి కదలకుండానే చేసుకునేందుకు కొన్ని వ్యాయామాలు చేసుకోవచ్చు. ఒక్క నిమిషం పాటు చేసుకుంటే సరిపోతుంది. అందుకే ఇలా ఒక్కనిమిషంలో చేసుకోగల వ్యాయామాలు 45కు పైగా ఉన్న యాప్ ఒకటుంది. అదే ‘1 మినిట్ డెస్క్ వర్కవుట్’. ఇది ఐవోఎస్ యాప్. ఐఫోన్ యూజర్లకు మాత్రమే. ఈ యాప్ సాయంతో డెస్క్ దగ్గర ఆరోగ్యంగా, చురుగ్గా ఉండొచ్చు. ప్రతీ గంటకు ఓసారి వ్యాయామం చేయాల్సిన విషయాన్ని ఈ యాప్ గుర్తు చేస్తూ ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘ఐమొబైల్ ఐఎన్ సీ’ పేరుతో ఒక యాప్ ఉంది. ఇందులో 40కు పైగా స్ట్రెచింగ్ వ్యాయామాల వివరాలు ఉన్నాయి.

గుర్తు చేస్తాయ్..
ఉద్యోగం చేసే చోట కదలకుండా గంటల తరబడి కూర్చోవడం చాలా ప్రమాదకరం. అందుకే మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. ఒత్తిడి, అలసట కారణంగా అస్వస్థత లేదా వెన్ను నొప్పులకు గురికాకుండా ఉంటారు. అందుకే స్మార్ట్ ఫోన్ గంటకోసారి మిమ్మల్ని అలర్ట్ చేసేలా రిమైండర్ పెట్టుకోవడం మంచిదే. ఇందుకోసం యాప్స్ కూడా ఉన్నాయి. ఆర్ఈమైండ్ అలార్మ్ క్లాక్, బ్రేక్ రిమైండర్ అనే యాప్స్ ను ఆండ్రాయిడ్ యూజర్లు పరిశీలించవచ్చు. అదే ఐవోఎస్ యూజర్లు అయితే ‘ఫ్రీ అలార్మ్ డ్ యాప్’ ను పరిశీలించవచ్చు. ఇవే కాకుండా ఇలా గుర్తు చేసే యాప్స్ ఇంకా చాలానే ఉన్నాయి.

యోగ అవసరం
యోగాను మించింది లేదన్న విషయం తెలిసిందే. అన్ని యోగాసనాలకు ఎక్కువ స్థలం అవసరం లేదు. కొన్ని కూర్చున్న చోటే సులభంగా చేయగలవీ ఉన్నాయి. ఇలాంటి వాటి గురించి తెలుసుకునేందుకు ఐవోఎస్ యూజర్లు ‘ఆఫీస్ యోగా: ఎట్ యువర్ డెస్క్’ అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందులోని 3డీ యోగా ఇన్ స్ట్రక్టర్ వీడియో ఎలా చేయాలన్నదీ వివరిస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు ‘ఫ్రీ డైలీ యోగా’ యాప్ ను పరిశీలించొచ్చు. ఇంకా చాలానే ఉన్నాయి.

representative imageకళ్లకు రక్షణ
ఆఫీసుల్లో ఉద్యోగాలు ఏవైనా కంప్యూటర్ ముందు కూర్చుని చేసేవే ఉంటున్నాయి. స్క్రీన్ నుంచి వెలువడే దృశ్య కాంతి కళ్లపై తప్పక ప్రభావం చూపిస్తుంది. ఇందులో బ్లూ లైట్ మరీ డేంజర్. కళ్లు అలసిపోయేందుకు, ఇన్ సోమ్నియా, తలనొప్పికి కారణమవుతుంది. అందుకే బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాస్, స్క్రీన్స్ విడిగా అందుబాటులో ఉన్నాయి. అలాగే, ‘ఎఫ్ ఫ్లక్స్’ అనే ఉచిత ప్రోగ్రామ్ విండోస్, మ్యాక్, లైనక్స్ కంప్యూటర్లకు అందుబాటులో ఉంది. ఈ ప్రొగ్రామ్ ను డౌన్లోడ్ చేసుకుని, మీ లొకేషన్ తెలియజేస్తే ఆ ప్రాంతంలో కాలమానం ప్రకారం పగలు, రాత్రి సమయాలకు అనుగుణంగా కలర్ టెంపరేచర్ ను మారుస్తుంది. దీంతో కళ్లపై ఒత్తిడి లేకుండా ఉంటుంది. దీనికితోడు కంప్యూటర్లో బ్రైట్ నెస్ లెవల్స్ ను కొంచెం తగ్గించుకోవడం ఓ పరిష్కారం.

స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ల నుంచి కూడా ఇదే విధమైన సమస్య ఉంటుంది. అందుకే బ్లూ లైట్ ఫిల్టర్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ యూజర్లకు... బ్లూలైట్ ఫిల్టర్ ఫర్ ఐకేర్ యాప్, ట్విలైట్, వెలిస్ ఆటో బ్రైట్ నెస్, బ్లూ లైట్ ఫిల్టర్ ఫర్ ఐకేర్, యూజీఐస్ వంటి యాప్స్ ఉన్నాయి. ఇవి స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లోని రంగులను సరి చేయడం ద్వారా బ్లూ లైట్ ను ఫిల్టర్ చేసేస్తాయి. దీంతో కంటికి రక్షణ లభిస్తుంది. ఐవోఎస్ యూజర్లకు... అన్ బ్లూ యాప్, ఐ కేర్ - సేవ్ యువర్ విజన్ అనే యాప్స్ ఉన్నాయి. ఇక యాపిల్ ఐఫోన్లలో ‘లైట్ ఫిల్టర్’ మోడ్ ను ఆన్ చేసుకోవడం వల్ల కూడా కంటికి రక్షణ పొందవచ్చు.

జిమ్ కు వెళ్లి వ్యాయామాలు చేయడం తెలుసు. లేదంటే ఇంట్లోనే పలు రకాల వ్యాయామాలు, యోగా చేసే వారూ ఉన్నారు. కొందరు జాగింగ్ లేదా వాకింగ్ చేస్తుంటారు. ఇవి ఏవైనా శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసేవే. మరి కళ్ల కోసం వ్యాయామాలు కూడా ఉన్నాయన్న విషయం తెలుసా..? రోజులో ఓ ఐదు నిమిషాలు కళ్లకోసం కేటాయించండి. కళ్ల కోసం చేయాల్సిన వ్యాయామాలను తెలియజేసేందుకు ‘ఐ ఎక్సర్ సైజెస్ - ఐ కేర్ ప్లస్’ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది.

representative imageకూర్చునే భంగిమ సరిగ్గా ఉండాలి
పని ప్రదేశంలో కనీసం ఎనిమిది గంటలు గడుపుతారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా చేసే పని ఎక్కువ సేపు కూర్చోవడమే. దీంతో ఇలా కూర్చునే భంగిమ సరైన కోణంలో లేకపోతే నడుము, వెన్ను నొప్పులు, సర్వైకల్ నొప్పులు రావచ్చు. అందుకే సరిగా కూర్చునే భంగిమల గురించి తెలియజేసేందుకు... పోశ్చర్ రిమైండర్, పోశ్చర్ కరెక్ట్, పర్ఫెక్ట్ పోశ్చర్ తదితర యాప్స్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.

ఫిట్ నెస్
బరువు తగ్గాలని అనుకునేవారి కోసం ‘మై ఫిట్ నెస్ పాల్’ అనే యాప్ ఉంది. బరువు తగ్గించుకుని ఫిట్ గా ఉండేందుకు కావాల్సిన సూచనలను ఈ యాప్ అందిస్తుంది. ఆహారానికి సంబంధించి ఎన్నో టిప్స్, సలహాలను ఇస్తుంది. కేలరీ కౌంటర్ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా తాము తీసుకునే ఆహార పదార్థాల కేలరీలను సరిచూసుకుని అదనపు కేలరీలు శరీరంలోకి వెళ్లకుండా నియంత్రించుకోవచ్చు.

representative imageరన్ కీపర్
ఇది జీపీఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ హెల్త్ యాప్. ఫిట్ నెస్ కోసం రోజువారీ చేసే వ్యాయామాలు, కసరత్తుల వల్ల కలిగే ప్రయోజనాన్ని లెక్కవేసి చూపిస్తుంది.

పాక్ట్
ఇదో ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ హెల్త్ యాప్. కేలరీలు తగ్గించుకుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే దిశగా ప్రోత్సహించడం ఈ యాప్ ప్రత్యేకత. అలాగే, రోజూవారీ వ్యాయామాలు చేసేవిధంగానూ మోటివేట్ చేస్తుంది. బరువు తగ్గేందుకు మీరు చేస్తున్న పనుల ఆధారంగా ప్లస్, మైనస్ మార్కులు వేసుకుంటూ వెళుతుంది.

ఫుడుకేట్
ప్రతీ ఆహారంతో వచ్చే కేలరీలు ఎన్నో తెలియేస్తుంది. అలాగే వాటిలో ఉండే పోషకాలను తెలియజేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని, ఫిట్ గా ఉండే దిశగా మార్గదర్శనం చేస్తుంది.

వెయిట్ వాచర్స్ మొబైల్
బరువు తగ్గాలన్న సంకల్పం ఉంటుంది. అయినప్పటికీ సినిమా చూస్తున్నప్పుడో, ఆఫీసులో సీటులో కూర్చున్నప్పుడో తెలియకుండానే ఎక్కువ తినేస్తుంటారు కొందరు. ఇలాంటి వారు ‘వెయిట్ వాచర్స్ మొబైల్’ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే సరి.

ఫిట్ బిట్
వ్యాయామం చేస్తున్నప్పుడు ఎన్ని కేలరీలు ఖర్చవుతున్నాయన్న విషయం తెలియజేసేందుకు ఈ యాప్ ఉపకరిస్తుంది. యాప్ కాకుండా చేతికి ధరించే ఫిట్ బిట్ బ్యాండ్ కూడా ఉంది.

హెల్తీ ఫుడ్ చార్ట్
ఈ యాప్ ఇంటా, బయట తీసుకునే ప్రతీ ఆహారంలో ఉండే పోషకాలు, కేలరీల గురించి సమగ్రంగా తెలియజేస్తుంది. అలాగే, ఏ ఆహారంలో ఏఏ పోషకాలు, ఎన్ని కేలరీలు ఉంటాయన్నది తెలుసుకోవచ్చు. ఈ సమాచారంతో తగిన పోషకాహారాన్ని తీసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.

లైఫ్ సమ్
ఆహారాన్ని విశ్లేషించడం, కేలరీలను కౌంట్ చేయడం, తీసుకునే ఆహారం సరైనది కాకపోతే ప్రత్యామ్నాయ ఆహారాన్ని సూచించడం, నీరు తాగాలంటూ గుర్తు చేయడం, సరైన వ్యాయామాలు చేసేలా టిప్స్ ఇవ్వడం ఇలా ఎన్నో పనులను ఈ యాప్ చేస్తుంది.

బ్రీత్ ఈటు రిలాక్స్
ఒత్తిళ్ల నుంచి బయటపడేసే వ్యాయామ చిట్కాలను తెలియజేస్తుంది. శరీరంపై ఒత్తిడి ఎక్కువైపోతుంటే తెలియజేసి  తగిన వ్యాయామాలు సూచిస్తుంది. బాధలో ఉన్నా, అప్సెట్ అయినా, ఆ మూడ్ నుంచి బయటపడేసేందుకు ఈ ఆండ్రాయిడ్ యాప్ ఉండాల్సిందే.

ఇన్ స్టంట్ హార్ట్ రేట్
representative imageఏ పని చేస్తున్నా గుండె స్పందనల రేటును తెలియజేస్తుంది. దాంతో గుండె రేటుపై ఓ కన్నేసి తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.

డేసీ నుస్కే
ఈ యాప్ జలుబు, దగ్గు వంటి ఎన్నో సమస్యల నివారణకు ఇంట్లోనే తీసుకోదగ్గ చికిత్సలు, ఔషధాలు, చిట్కాలను తెలియజేసే యాప్ ఇది.

representative imageహోమ్ రెమిడీస్ : నేచురల్ క్యూర్స్
ఇది ఆండ్రాయిడ్ యాప్. ఆరోగ్య సమస్యలను సహజ విధానాలతో నయం చేసుకోవడం ఎలానో తెలియజేస్తుంది. ఒకవేళ ఏదేనీ సమస్యకు సంబంధించి సమాచారం లేకపోతే అక్కడే అడిగి మరీ తెలుసుకోవచ్చు.

క్రెడిట్ హెల్త్
ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే, చికిత్సలు, వైద్యులు, హాస్పిటల్స్ వివరాలు కూడా ఉంటాయి. చికిత్స అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలియజేస్తుంది. ఈ యాప్ ద్వారా డాక్టర్ల అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవడమే కాదు, వివిధ రకాల చికిత్సలకు అయ్యే వ్యయాలను కొటేషన్ రూపంలో తెలుసుకునే సదుపాయం కూడా ఉంది. ఈ యాప్ లో ఉండే బ్లాగ్ లో వివిధ రకాల ఆరోగ్య సమస్యలపై ఆర్టికల్స్ ను కూడా చూసుకోవచ్చు.

representative imageమందులు సమయానికి వేసుకునేందుకు
రోజూ తీసుకోవాల్సిన మందులను గుర్తు పెట్టుకోవడం కొందరికి కష్టం. ఇలాంటి వారి కోసం ‘మైహెల్త్ సేవర్ జెడ్’ అనే యాప్ ఒకటుంది. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్ లేని వారు ఎస్ఎంఎస్ రూపంలో అలర్ట్ పొందవచ్చు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy