ap7am logo

వడ్డీ రేట్లు క్షీణించాయ్... మరి ఇంకా బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్లేనా?

Thu, Mar 23, 2017, 09:58 AM
Related Image బ్యాంకు వడ్డీ రేట్లు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి చేరాయి. ఐదేళ్ల కాల వ్యవధిగల డిపాజిట్లపై 7 శాతానికి మించి వడ్డీ లభించే పరిస్థితి లేదు. మరి ఇంత తక్కువ వడ్డీ రేటులో ద్రవ్యోల్బణం తరుగుదల పోను మిగిలేది ఎంత...? కనుక ఇప్పటికే బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు మెచ్యూరిటీకి వస్తే, కొత్తగా డిపాజిట్ చేయాలనుకుంటున్నవారు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి.

బ్యాంకు వడ్డీ రేట్ల ప్రతిఫలాన్ని మింగేసేందుకు ఆర్థిక వ్యవస్థలో రెండు బూచీలు ఉన్నాయి. ఒకటి ద్రవ్యోల్బణం, రెండు పన్ను రేటు. సగటున మన దేశంలో ద్రవ్యోల్బణం 4-5 స్థాయిలో ఉంటోంది. ఫిక్స్ డ్ డిపాజిట్ పై 7 శాతం వడ్డీ రేటు లభిస్తుంటే 30 శాతం ఆదాయపన్ను శ్లాబులో ఉన్న వారు కట్టే పన్ను పోగా నికర రాబడి 5 శాతంలోపే ఉంటుంది. ఆ రాబడిని ద్రవ్యోల్బణంతో ముడిపెట్టి చూస్తే చివరకు మిగిలేదేముంటుంది? అందుకే బ్యాంకు వడ్డీకి మించి రాబడినిచ్చే మార్గాల వైపు చూడాల్సి ఉంటుంది.
representative imageప్రభుత్వ బాండ్లు
వీటిని సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేస్తుంటాయి. వీటిపై వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. పైగా వీటిలో భద్రత ఎక్కువ. కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. ఆరేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. వడ్డీపై పన్ను ఉంటుంది. ఇది వారి ఆదాయ పన్ను శ్లాబు రేటును బట్టి ఉంటుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి ఏమీ లేదు. అయితే, అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తే వీటి నుంచి లభించే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే ఇవి స్టాక్ ఎక్సేంజ్ లలో ట్రేడ్ కావు. మరొకరికి బదిలీ చేయడానికి కూడా అవకాశం లేదు. కాల వ్యవధి ముగిసే వరకూ వేచి చూడాల్సిందే.

కార్పొరేట్ ఫిక్స్ డ్ డిపాజిట్లు
కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన నిధులను డిపాజిట్ల రూపంలో సేకరిస్తుంటాయి. నిధుల సమీకరణకు అనుసరించే మార్గాల్లో ఇది కూడా ఒకటి. వీటిలో పెట్టుబడులు ఎంత భద్రమో తెలియజేసేందుకు వీలుగా రేటింగ్ సంస్థలు డిపాజిట్ లకు రేటింగ్ ఇస్తుంటాయి. ఏఏఏ రేటింగ్ ఉన్నవి భద్రతతో కూడినవి. వీటిలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. వీటితో ఉన్న ప్రయోజనం ఏమిటంటే వడ్డీ రేటు మెరుగ్గా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీల ఫిక్స్ డ్ డిపాజిట్లపై  వడ్డీ రేటు బ్యాంకు ఎఫ్ డీల కంటే ఒకటి రెండు శాతం అదనంగా పొందే అవకాశం ఉంది. ఇక సీనియర్ సిటిజన్లు (వృద్ధులకు పావు శాతం అధికంగా వడ్డీ రేటు పొందవచ్చు. ఉదాహరణకు ఐదేళ్ల కాలానికి చేసే డిపాజిట్లపై శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ 8.25 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. బజాజ్ ఫైనాన్స్ 8.05 శాతం. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 7.95 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి.

చిన్న మొత్తాల పొదుపు పథకాలు
పోస్టాఫీసుల్లో ఆఫర్ చేసే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు బ్యాంకు ఎఫ్ డీల కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఐదేళ్ల కోసం డిపాజిట్ చేయాలనుకుంటే అనుకూలం. వీటిపై 8 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. అధిక శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి కూడా పన్ను తర్వాత నికర రాబడి 5.6 శాతంగా ఉంటుంది. కిసాన్ వికాస పత్రాలను దీర్ఘకాల ఇన్వెస్ట్ మెంట్ కోసం పరిశీలించవచ్చు. 9 ఏళ్ల నాలుగు నెలల్లో పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఇక పీపీఎఫ్ పైనా ఆకర్షణీయమైన వడ్డీరేటు లభిస్తోంది. 8 శాతం వడ్డీ రేటు లభించినా దానిపై ఎలాంటి పన్ను లేకపోవడంతో నికర రాబడి ఎక్కువగా ఉంటుంది. పెట్టే పెట్టుబడులకు, దానిపై లభించే వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీకి మూడింటిపై పన్ను మినహాయింపు ఉండడం లాభదాయకం. దీంతో ద్రవ్యోల్బణం 5 శాతం తీసేసినా 3 శాతం వడ్డీ రేటు అందుకోవచ్చు.
representative imageడెట్ ఫండ్స్
బ్యాంకు ఎఫ్ డీల కంటే డెట్ ఫండ్స్ పై రాబడి ఎక్కువగా అందుకోవచ్చు. లిక్విడిటీ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తన నిధులను వెనక్కి తీసుకోగల సౌలభ్యం డెట్ ఫండ్స్ లో ఉంటుంది. కానీ, ఇది కూడా ఫండ్ ను బట్టి మారిపోతుంది. డెట్ ఫండ్స్ పై రాబడులు మార్కెట్ తో ఆధారపడి ఉంటాయి. అంటే కొంచం రిస్క్ ఉంటుంది. అయితే, మంచి పేరున్న ఫండ్ హౌస్, మంచి పనితీరున్న ఫండ్ మేనేజర్ ఆధ్వర్యంలోని డెట్ ఫండ్ ను ఎంచుకోవడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. డెట్ ఫండ్స్ లో ఉన్న ఒక ప్రయోజనం ఏమిటంటే కనీసం మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే అందుకునే ప్రతిఫలానికి ద్రవ్యోల్బణ తరుగుదలను చూపించి పన్ను తగ్గించుకునే వెసులుబాటు ఉంది. దీంతో డెట్ ఫండ్స్ ఆకర్షణీయంగా మారాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు (మార్చి 31) డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే నాలుగు సంవత్సరాల పాటు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు.

డెట్ ఫండ్స్ పెట్టుబడులు ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ డిపాజిట్లు, మనీ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్లలో ఉంటాయి. ఏడాది కాల వ్యవధిగల డిపాజిట్లపై వివిధ రకాల కేటగిరీల్లో 7 శాతం నుంచి 9 శాతం వరకు... మూడేళ్లు, ఐదేళ్ల డిపాజిట్లపైనా 9.50 శాతం వరకు రాబడులకు అవకాశం ఉంది.  ఏడాది కంటే తక్కువ కాలంలో పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటే విలువపై అరశాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలం పాటు ఇన్వెస్ట్ మెంట్ కొనసాగించే వారు వీటిపై ఎక్కువ రాబడులను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్ కు వీలుగా మూడు రకాలున్నాయి.

ఫిక్స్ డ్ మెచ్యూరిటీ ప్లాన్: ఇది ఫిక్స్ డ్ డిపాజిట్ వంటిది. క్లోజ్డ్ ఎండెడ్. నిర్ణీత కాలం వరకూ డబ్బులను వెనక్కి తీసుకునేందుకు వీలుండదు. ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధులతో ఉంటాయి.  
కార్పొరేట్ బాండ్ ఫండ్: కార్పొరేట్ బాండ్ ఫండ్ అన్నది అధిక, అత్యధిక రేటింగ్ గల కంపెనీలు జారీ చేసే బాండ్లు. అధిక భద్రతతో మెరుగైన రాబడులు ఇచ్చేందుకు వీలుంటుంది. ఇవి ఓపెన్ ఎండెడ్. ఎప్పుడైనా పెట్టుబడులకు ద్వారాలు తెరిచి ఉంటాయి.
క్రెడిట్ అపార్చునిటీస్ ఫండ్: కార్పొరేట్ బాండ్ల తరహావే. కాకపోతే అధిక రాబడులను ఇచ్చేందుకు వీలుగా తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న వాటిలో  ఇన్వెస్ట్ చేసే ఫండ్స్.
representative imageబ్యాంకు ఎఫ్ డీలంటేనే ఎందుకంత ఆకర్షణ?
భద్రతకు భరోసా. మెచ్యూరిటీ తేదినాటికి ఎంత మొత్తం వస్తుందన్న స్పష్టత. మధ్యలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లి డిపాజిట్ రద్దు చేసుకుని వెంటనే నగదు తెచ్చుకోగల సౌలభ్యం. ఈ కారణాలే ఎక్కువ మంది బ్యాంకు ఎఫ్ డీలలో ఇన్వెస్ట్ చేయడానికి కారణాలుగా ఉన్నాయి.

వీటిలో ప్రతికూలతలు
ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఫిక్స్ డ్ గా ఉంటాయి. డిపాజిట్ చేసిన రోజు నుంచి నిర్ణీత కాలం వరకూ అదే వడ్డీ రేటు కొనసాగుతుంది. మార్కెట్లో వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ వీటిపై మెచ్యూరిటీ పూర్తయ్యే వరకూ ఒకటే రేటు అమలవుతుంది. అంటే పెరుగుతున్న రేట్ల ప్రయోజనం లభించదు. ద్రవ్యోల్బణం పెరిగిపోతే చివరకు లభించే ప్రయోజనం మరింత తగ్గిపోతుంది. పైగా వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఒకవేళ అవసరం అయినప్పుడు వెంటనే డిపాజిట్ మొత్తాన్ని వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, దానిపై జరిమానా వడ్డిస్తాయి బ్యాంకులు. ఇది మిగిలి ఉన్న కాల వ్యవధి, బ్యాంకులను బట్టి మారుతుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Advertisements