ap7am logo

సంపన్నుల సంపద రహస్యాలు... సక్సెస్ మంత్రాలు ఇవిగో!

Fri, Mar 17, 2017, 08:30 AM
Related Image కష్టపడే వారందరినీ సక్సెస్ వరించదు. కొద్ది మందికే అది దాసోహం అంటుంది. విజయాలతో సంపన్నులుగా ఎదిగేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. కొన్ని విలువలు ఉన్నాయి. కొన్ని విధానాలు ఉన్నాయి. వీటి ఆచరణలోనే అసలు విజయం దాగుంది. సంపన్నులుగా మారిన వారి జీవిత అలవాట్లు, ఆచరణ, వారు సంపద ఆసాములుగా మారేందుకు దారి తీసిన వాటి గురించి తెలుసుకుంటే అవి మనకూ విజయ సూత్రాలు కావచ్చు.

representative imageలక్ష్యాలపై గురి
మనలో చాలా మందికి ఒకటికి మించి లక్ష్యాలు ఉంటాయి. ఉదాహరణకు వంశీకి సినిమా హీరో కావాలన్న ఆశయం ఉంది. అది సాధ్యం కాకపోతే వ్యాపారవేత్త అవతారం, అదీ నెరవేరకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామన్నది అతడి లక్ష్యం. కానీ, సంపన్నులుగా మారిన వారు కేవలం ఒకే ఒక లక్ష్యానికి గురిపెట్టి దాన్ని నెరవేర్చుకున్నవారే. ఎంచుకునే లక్ష్యం గొప్పదై ఉండాలి. దానిపైనే పూర్తి దృష్టి పెట్టాలన్నది విజయ సాధనకు ముఖ్య సూత్రం. 81 శాతం మంది సంపన్నులకు రోజువారీ చేయాల్సిన పనులను ఓ జాబితాగా కచ్చితంగా రాసుకోవడం అలవాటు. మర్చిపోతామని వారు ఆ పనిచేయరు. పదే పదే గుర్తు చేసుకుని పట్టుదలను పెంచుకునేందుకే అలా చేస్తారు. లక్ష్యంపై దృష్టి, పట్టుదల, ఓపిక ఈ మూడింటికీ వీరు కట్టుబడి ఉంటారు. 'ఏం చేస్తాం.. బ్యాడ్ లక్' అనే తరహా ప్రతికూల ఆలోచనలను దగ్గరకు రానీయరు. సానుకూల ఆలోచనలతో ముందడుగు వేయడం వీరి విజయ సూత్రాల్లో ఒకటి. అసలు సంపన్నులు, సామాన్యుల మధ్య స్పష్టమైన తేడా ఏంటంటే... సంపన్నులకు స్పష్టమైన లక్ష్యం, అనుసరణ ఉంటాయి. సామాన్యులకు లక్ష్యంపై స్పష్టత ఉండదు. అది చేయాలి, ఇది చేయాలన్న ఆకాంక్షలు అయితే ఉంటాయి. ఆచరణ ఉండదు.

పుస్తక ప్రియులుrepresentative image
విజయం సాధించాలన్నా, సంపన్నులుగా మారాలన్నా టీవీ ముందు కూర్చుని చేసే కాలక్షేపాన్ని మానుకోవాలి. సంపన్నుల్లో 86 శాతం మంది నిత్యం చదవడాన్ని హాబీగా మార్చుకున్నవారే. తమనుతాము మెరుగుపరుచుకునేందుకు జీవితాంతం విద్య అవసరమని భావిస్తుంటారు. దీని ద్వారా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటుంటారు. అసలు 88 శాతం మంది సంపన్నులు ప్రతి రోజు విద్య లేదా తాము పనిచేస్తున్న రంగానికి సంబంధించిన అంశాలను కనీసం అరగంట అంతకంటే ఎక్కువే అధ్యయనం చేయడం అలవాటు. 55 శాతం మంది మాత్రం వ్యక్తిత్వ వికాస పుస్తకాలను పఠనం చేస్తుంటారు. 58 శాతం మందికి విజేతల జీవితచరిత్ర చదవడం అలవాటు. 94 శాతం మంది వర్తమాన అంశాలను, 51 శాతం మంది చరిత్ర అంశాలను చదువుతుంటారు. కేవలం 11 శాతం మంది వినోదానికి వెచ్చిస్తుంటారు. 63 శాతం మంది తమ కార్యాలయానికి వెళ్లే సమయంలో (ప్రయాణంలో) ఆడియో పుస్తకాలను వింటుంటారు. కేవలం 33 శాతం సంపన్నులే రోజులో ఓ గంట పాటు టీవీ చూస్తుంటారు. ఆరు శాతం మంది టీవీల్లో రియాలిటీ షోలు చూస్తుంటారు. చదవడం వల్ల తమ వ్యాపారం లేదా వృత్తికి సంబంధించి విజ్ఞానం పెరుగుతుంది.  63 శాతం మంది సంపన్నులు రోజులో గంట కంటే తక్కువ సమయమే వెబ్ లో విహరిస్తున్నారు. ఉద్యోగ సంబంధితమైన అవసరం ఉంటే అప్పుడు ఎక్కువ సమయం వెచ్చిస్తుంటారు.

తమపై నమ్మకం
మంచి అలవాట్లు అవకాశాలకు దారితీస్తాయని 84 శాతం మంది సంపన్నులు నమ్ముతున్నారు. చెడ్డ అలవాట్లు అదృష్టాన్ని పాడుచేస్తాయని 76 శాతం మంది విశ్వాసం. ఆరోగ్యంపైనా వీరిది ప్రత్యేక శ్రద్ధే. ఎందుకంటే 76 శాతం మంది సంపన్నులు తక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటారు. రోజులో 300 కేలరీలు మించకుండా చూసుకుంటారు.

representative imageజూదానికి దూరం
సంపన్నుల్లో అధిక శాతం మంది జూదానికి దూరంగా ఉన్నవారే. 23 శాతం మంది మాత్రం జూదరులుగా ఉన్నారు. కృషిని నమ్ముకున్నవారికి జూదంతో పనేంటి? వీరు తమ సానుకూల ఆలోచనలతో అవకాశాలను పట్టుకుని తమను తాము అదృష్టవంతుల్ని చేసుకుంటారు. స్వయం కృషితో తమ అదృష్టానికి తామే బాటలు వేసుకుంటారు.

పొద్దున్నే లేచే అలవాటు
చాలా మంది సంపన్నులకు వేకువజామున లేచే అలవాటు ఉంటుంది. ఇలా ముందుగా నిద్ర లేవడం, రాత్రుళ్లు ముందుగా నిద్రకు ఉపక్రమించడం మానసిక, శారీరక ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. 44 శాతం మంది సంపన్నుల్లో ప్రతీ రోజూ తమ పని ప్రారంభించడానికి మూడు గంటల ముందు లేచే అలవాటు ఉంది.

పిల్లలకు మార్గదర్శకత్వం
74 శాతం మంది సంపన్నులు విజయ సూత్రాల గురించి తమ పిల్లలకు చెబుతుంటారు. తమ పిల్లలతో నెలలో 10 గంటల పాటైనా వలంటీర్లుగా పనిచేయిస్తుంటారు. 80 శాతం మంది సంపదపరులు పుట్టిన రోజు సందర్భంగా విష్ చేస్తుంటారు. 63 శాతం సంపన్నులు తమ పిల్లలతో ఒక నెలలో రెండు నాన్ ఫిక్షన్ పుస్తకాలను చదివించడం అలవాటు.

పొదుపు సూత్రాలు
 • సంపన్నులు అధికంగా ఖర్చు చేయడానికి ఇష్టపడరు. సంపాదించిన మొత్తంలో కనీసం 20 శాతం మేర పొదుపు చేసిన తర్వాతే మిగిలిన మొత్తాన్ని వ్యయం చేస్తారు. అధికంగా ఖర్చు చేస్తూ ఆర్థిక సమస్యలలో మునిగిపోయే వ్యవహారాలు వారికి అసలే నచ్చవు.
 • నెల సంపాదనలో ఇంటి అద్దె కోసం 25 శాతానిక మించి ఖర్చు చేయరు. ఆహారంపై వ్యయం 15 శాతం దాటదు. బార్లు, సినిమాలు, పర్యటనలు, ఇతర వినోద ఖర్చులు 10 శాతం మించకూడదు. సంపన్నులు పాటించే ఈ విజయ సూత్రాలు అందరికీ నప్పుతాయి. 
 • 94 శాతం మంది సంపన్నులు వాహనాన్ని కిరాయికి తీసుకోవడానికి బదులు సొంతంగా సమకూర్చుకుంటారు.  సంపన్నులు, విజేతలైన వారి సక్సెస్ సూత్రాల్లో డబ్బును ఎలా వినియోగించాలో తెలియడం అన్నది ఒకటి. ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత పొదుపు చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అనేవి తెలుసుకోవడం వల్ల సంపాదనాపరులు సంపన్నులుగా మారిపోవచ్చు.
నెట్ వర్క్ విస్తరణ... సామాజిక సేవrepresentative image
విజయవంతమైన వారు తమ ఉచిత సమయాన్ని వ్యక్తిత్వ వికాస వృద్ధికి, సంబంధాల విస్తృతికి, వలంటీర్ (స్వచ్చంద) సేవలకు, తాత్కాలిక ఉద్యోగాలు, వ్యాపారానికి వినియోగిస్తుంటారు. ఇతరులతో సంబంధాలను పెంచుకోవడం కూడా విజయానికి కీలకం. దీని వల్ల మరింత మంది వినియోగదారులు, కస్టమర్లు పెరుగుతుంటారు. మానవ సంబంధాల వల్ల పని సామర్థ్యం పెరుగుతుందట. విస్తృత సంబంధాల వల్ల వినూత్నమైన ఆలోచనలు కూడా వస్తాయని వీరు నమ్ముతారు. ఇక మూడొంతుల మంది సంపన్నులు స్వచ్చంద సేవలో పాల్గొంటుంటారు. నెలలో కనీసం ఐదు గంటల సమయాన్ని ఇందుకోసం కేటాయిస్తారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలన్నది వీరి తత్వం. ఇది కూడా మానవ సంబంధాలను పెంచే కార్యక్రమమే. నిజానికి విజేతల్లో 70 శాతం మంది ఏటా కనీసం ఓ లక్ష్యాన్ని అయినా పూర్తి చేసుకుని ముందుకు వెళుతుంటారు.

representative imageతక్కువ మాట్లాడు... ఎక్కువ విను
విజేతలు పాటించే సూత్రాల్లో ఇదీ ఒకటి. దీని కోసం 5:1 నిష్పత్తి సూత్రం అనువుగా ఉంటుంది. అంటే మీరు ఓ నిమిషం పాటు మాట్లాడితే ఎదుటి వారు చెప్పే మాటలు ఐదు నిమిషాల పాటు వినండి. ఎదుటి వారు చెప్పేది వినడం వల్ల ఎంతో నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని సంపన్నులు వదులుకోరు.

సానుకూల ఆలోచనలతో స్నేహం
మీ స్నేహితుల్లో ఎక్కువ మంది ఏ తరగతికి చెందినవారో పరిశీలించుకోండి. ఎందుకంటే సంపన్నుల్లో ఎక్కువ మంది సంబంధాలు సంపన్నులు, విజేతలతోనే ఉంటాయి. తమ చుట్టూ సానుకూల దృక్పథం కలిగిన వారుండేలా చూసుకుంటారు. ‘జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు’ అనే సామెత వినే ఉంటారు. సంపన్నులు వైఫల్యం ఎదురైతే కుమిలిపోరు. దాన్ని ఒక అనుభవంగా, విజయానికి ఓ మెట్టుగా భావిస్తారు.

మార్గదర్శకుడు కావాలి
సంపన్నుల్లో 93 శాతం మందికి వారి విజయం వెనుక మార్గదర్శకులు ఉన్నారు. ఏం చేయాలి, ఏం చేయరాదో మార్గదర్శకులు మీకు బోధించడం ద్వారా వృద్ధికి తోడ్పడుతుంటారు. లక్ష్యం స్పష్టంగా ఉంటే, అప్పటికే ఆ తరహా లక్ష్యాన్ని పూర్తి చేసిన వారి సాయం పొందాలి. ఓ గొప్ప మార్గదర్శకుడు లభిస్తే.... అది సంపన్నులుగా మారడానికి సులువైన దారి అవుతుంది.

ప్రాణాయామం
representative imageసంపన్నులు అందరూ కాకపోవచ్చు. కానీ వారిలోనూ చెప్పుకోతగ్గ స్థాయిలో మెడిటేషన్ చేసేవారే. నిజానికి మెడిటేషన్ అన్నది మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. శక్తిని పెంచుతుంది. దీనివల్ల లక్ష్య సాధనకు ఎంతో బలం చేకూరుతుంది. ప్రాణాయామం చేయని వారిలోనూ చాలా మంది ఏదో విధమైన శారీరక వ్యాయామం తప్పకుండా చేస్తారు. దీనివల్ల ఒత్తిళ్లు దూరమై మంచి ఆరోగ్యం సాధ్యమవుతుంది. అలాగే మంచి నిద్రకూ దారితీస్తుంది. 76 శాతం మందికి వారంలో కనీసం నాలుగు రోజుల పాటైనా ఏరోబిక్ వ్యాయామాలు చేయడం అలవాటు.

నో చెప్పేయ్!
వారెన్ బఫెట్ ఇలా అంటారు. ‘‘విజేతలు, అసలైన విజేతల మధ్య తేడా ఏమిటంటే... అసలైన విజేతలు దాదాపు చాలా వాటికి నో చెబుతారు’’ అని ఆయన చెబుతారు. ఎందుకంటే ప్రతీ దానికీ యెస్ అంటూ తలూపితే, అది తాను చేయాలనుకున్న పనులను చేయలేని పరిస్థితికి దారి తీయవచ్చు. అందుకే అసలైన విజేతలు, సంపన్నులకు 'నో' ఎప్పుడు చెప్పాలన్నది బాగా తెలుసు.

representative imageకాలం విలువ తెలుసు
విజేతలు, సంపన్నులు ఎప్పుడూ ఖాళీగా ఉండరు. కాలక్షేపం పేరుతో సమయాన్ని వృథా చేయరు. సమయం ఎంత విలువైనదో వీరికి బాగా తెలుసు. వారి జీవితంలో మూడింట ఒక వంతు పనికే కేటాయిస్తారు.

డబ్బు వినియోగం గురించి బాగా తెలుసు
సంపన్నులు, విజేతల సక్సెస్ సూత్రాల్లో డబ్బును ఎలా వినియోగించుకోవాలో తెలియడం. ఎంత మేర ఖర్చు పెట్టాలి, ఎంత పొదుపు చేయాలి, ఎక్కడ చేయాలి తెలుసుకోవడం వల్ల సంపాదనాపరుల నుంచి సంపన్నులుగా మారిపోవచ్చు.  

భావోద్వేగాలు వద్దు
సంపన్నులూ మనుషులే. వారిలోనూ భావోద్వేగాలు ఉంటాయి. కానీ, వీరు వాటిని చెప్పు చేతల్లో ఉంచుకుంటారు. భావోద్వేగాల చట్రంలో చిక్కుకుపోరు. 94 శాతం మంది సంపన్నులు తమ భావోద్వేగాలను నియంత్రించుకుంటారు.

ఇష్టంగా...
సంపన్నులు తమ పనిని చాలా ఇష్టంగా చేస్తారు. వారి ఇష్టంలోనే కష్టం దాగి ఉంటుంది. మొక్కుబడితనం చూపించరు. వేరే వారి దగ్గర ఉద్యోగం చేస్తున్నా... లేక సొంత వ్యాపారమైనా వారిది ఇదే విధానం.

సాగతీత, ఆలస్యానికి విముఖం
సంపన్నులు సాగతీత ధోరణి, చెప్పిన పని చేయడంలో ఆలస్యానికి తావివ్వరు. దీనివల్ల కస్టమర్ల వద్ద విశ్వాసం దెబ్బతింటుందని, ఉద్యోగం అయితే చేస్తున్న సంస్థ వద్ద నమ్మకం పోతుందని వారికి తెలుసు.

సంపన్నులు-సామాన్యుల ఆలోచనల మధ్య తేడా
 • సంపన్నులది ‘నేను నా లైఫ్ ను నిర్ణయించుకుంటాను’ అనే తరహా. సామాన్యులు ‘రాసిపెట్టినట్టు జరుగుతుందిలే’ అనే టైపు.
 • సంపన్నులు సంపద సృష్టికి కష్టపడతారు. సామాన్యులు సంపన్నులు కావాలని ఆశ పడతారు. సంపన్నులు అవకాశాలపై దృష్టి పెడితే, సామాన్యుల దృష్టి అవరోధాలపై ఉంటుంది.
 • సంపన్నులు విజేతలు, సానుకూల ఆలోచన గల వారితో సాన్నిహిత్యంగా ఉంటారు. సామాన్యులు ప్రతికూల ఆలోచనలుగల వారితో సన్నిహితంగా మెలుగుతారు.
 • సంపన్నులు తమ దగ్గరున్న ధనాన్ని చాలా గొప్పగా నిర్వహించగలుగుతారు. సామాన్యులు ఈ విషయంలో వెనుకబడి ఉంటారు.
 • సంపన్నులు విజయం కోసం శ్రమిస్తే... సామాన్యులు డబ్బు కోసం శ్రమిస్తుంటారు.
 • సంపన్నులు తమ సంపద పెంచుకోవడంపై దృష్టి నిలిపితే, సామాన్యుల ఆలోచనలు తమ ఆదాయం పెంచుకోవడానికి పరిమితం అవుతాయి.
 • సంపన్నులు ఎప్పుడూ కొత్తగా నేర్చుకుంటూ మరింత వృద్ధి చెందే వైపు ప్రయాణం చేస్తుంటారు. సామాన్యులు తమకు అన్నీ తెలుసనుకుంటారు.
 • సంపన్నులు దీర్ఘకాల దృష్టితో ఆలోచనలు చేస్తుంటారు. సామాన్యుల ఆలోచనలు తాత్కాలికంగానే ఉంటాయి.
సంపన్నుల సంపద సృష్టి రహస్యాలు
సామాన్యులు తమ అవసరాల కోసం అప్పులు తీసుకుంటారు. కానీ సంపన్నులు సంపద సృష్టికి అప్పులు తీసుకుంటారు. ధనార్జనకు రుణాన్ని అద్భుతమైన సాధనంగా వారు చూస్తారు. ఆర్థిక లాభదాయకతకు రుణాన్ని ఎలా వాడుకోవాలో వారికి బాగా తెలుసు. సంపన్నుల పెట్టుబడులు దీర్ఘకాల దృష్టితో ఉంటాయి. పెట్టుబడి పెట్టి వారు సంవత్సరాల పాటు వేచి ఉంటారు. ఎక్కువగా స్టాక్స్, బాండ్లు, రియల్ ఎస్టేట్ వారి పెట్టుబడి సాధనాలు. తమ తాత్కాలిక సంతోషం కోసం ఖర్చు చేయరు. దీర్ఘకాల లక్ష్యాలతో ఇన్వెస్ట్ చేస్తారు. పెట్టుబడుల ద్వారా సాధ్యమైనంత మేర పన్ను ఆదా చేసుకుంటారు. సంపన్నుల పెట్టుబడులు విలువ పెరిగేవే కాకుండా నిరంతరం ఆదాయాన్నిచ్చేవీ అయి ఉంటాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy