ap7am logo

2017-18 బడ్జెట్ లో ఆదాయపన్నులో కీలక మార్పులు ఇవే...!

Sat, Feb 25, 2017, 10:55 AM
Related Image కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదాయపన్ను పరంగా 2017-18 బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు ప్రతిపాదించారు. వేతన జీవులు, ఆదాయపన్ను పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ వీటిని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

పన్ను రేట్లలో మార్పులు
representative image- రూ.2,50,000 లక్షల ఆదాయం వరకు గతంలో మాదిరిగా ఇకపైనా ఎలాంటి పన్ను ఉండదు.
- రూ.2,50,000 నుంచి రూ.5,00,000 వరకు ఆదాయంపై 5 శాతం పన్ను రేటు చెల్లించాలి. అది ఇప్పటి వరకు 10 శాతంగా ఉంది.
- సీనియర్ సిటిజన్లు అందరికీ రూ.3,00,000 వరకు ఆదాయంపై ఎటువంటి పన్ను లేదు. 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు వారు రూ.3,00,001 నుంచి రూ.5,00,000 వరకు ఆదాయంపై 5 శాతం పన్ను చెల్లించాలి. అదే 80ఏళ్లు దాటితే రూ.5,00,000 వరకు ఎలాంటి పన్ను లేదు.
- రూ.5,00,001 నుంచి రూ.10,00,000 ఆదాయంపై ప్రతీ ఒక్కరూ 20 శాతం పన్ను చెల్లించాలి.
- రూ.10,000,00 దాటిన ఆదాయంపై 30 శాతం పన్ను రేటు వర్తిస్తుంది.
- లోగడ రూ.2,50,000 నుంచి రూ.5,00,000 వరకు ఆదాయంపై 10 శాతం పన్ను రేటు అమలు కాగా దాన్ని 5 శాతం చేశారు. అలాగే, సీనియర్ సిటిజన్లకు లోగడ రూ.3,00,001 నుంచి రూ.5,00,000 వరకు ఆదాయంపై 10 శాతం పన్ను రేటును 5 శాతానికి తగ్గించడం తాజాగా చోటు చేసుకున్న మార్పులు.

సంపన్నులపై సర్ చార్జ్
లోగడ కోటి రూపాయలకుపైగా ఆదాయం గడిస్తున్న సంపన్నులపై సాధారణ పన్నుకు అదనంగా 15 శాతం సర్ చార్జ్ కూడా ఉండేది. తాజా బడ్జెట్ లో రూ.50 లక్షల నుంచి రూ.కోటి రూపాయల వరకు ఆదాయం కలిగిన వారిని కూడా ఆర్థిక మంత్రి ఈ సర్ చార్జ్ పరిధిలోకి తీసుకొచ్చారు. కాకపోతే వీరిపై 10 శాతం మాత్రమే విధించారు.

సెక్షన్ 87ఏ రాయితీ కుదింపుrepresentative image
ఆదాయపన్ను చట్టంలోని ప్రస్తుత నిబంధనల మేరకు ఇప్పటి వరకు రూ.5,00,000 వార్షిక ఆదాయం కలిగిన వ్యక్తులు సెక్షన్ 87ఏ కింద రూ.5,000 రాయితీ పొందేవారు. హిందూ అవిభాజ్య కుటుంబం, ఎన్ఆర్ఐలకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈ అవకాశం లేదు. తాజాగా ఇందులో మార్పు జరిగింది. వార్షిక ఆదాయం రూ.3,50,000లోపు ఉన్న వారు మాత్రమే ఈ సెక్షన్ కింద అదీ రూ.2,500 మాత్రమే రాయితీ పొందేలా నిబంధనలకు సవరణ ప్రతిపాదించారు. అంటే ఉదాహరణకు ఓ వ్యక్తికి వార్షిక ఆదాయం రూ.3,50,000 ఉందనుకుంటే రూ.2,50,000 మినహాయింపు పోను మిగిలిన రూ.లక్ష ఆదాయంపై 5 శాతం పన్ను కింద రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుంది. వీరు రూ.2,500 రాయితీ పోను రూ.2,500 చెల్లిస్తే సరిపోతుంది. రూ.3,00,000 ఆదాయం ఉన్న వారిపై పన్ను రూ.2,500 ఉంటుంది. వీరు సెక్షన్ 87ఏ వెసులుబాటుతో అసలు పన్ను చెల్లించకుండా ఉండొచ్చు. కానీ రిటర్నులు ఫైల్ చేయాలి.

క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లో మార్పులు
స్థిరాస్తుల విషయంలో మూలధన లాభాల పన్నుకు సంబంధించి కూడా మార్పులు జరిగాయి. లోగడ ఓ ఇల్లు కొని దాన్ని మూడేళ్లు అట్టిపెట్టుకుంటే దీర్ఘకాల మూల ధన లాభాల పన్ను ప్రయోజనాలకు అవకాశం ఉండేది. తాజాగా ఈ సమయాన్ని రెండేళ్లకు తగ్గించారు. అంటే ఇకపై ఓ ఇల్లు లేదా స్థలాన్ని కొని దాన్ని రెండేళ్లు అట్టిపెట్టుకున్న తర్వాత విక్రయిస్తే వచ్చిన లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభాల కింద పరిగణిస్తారు. ఇది సానుకూల చర్య. ఎందుకంటే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను తక్కువ.

ద్రవ్యోల్బణం లెక్కించే సంవత్సరంలోనూ మార్పు
దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను విధించే ముందు ఆ లాభం నుంచి ద్రవ్యోల్బణ తరుగుదలను తీసివేయడం అమల్లో ఉంది. ఇందుకు బేస్ సంవత్సరంగా 1981 ఏప్రిల్ ను పరిగణిస్తున్నారు. దీన్ని తాజాగా 2001 ఏప్రిల్ కు మార్చారు. దీనివల్ల చెల్లించే పన్ను భారం తగ్గుతుంది.  

రిటర్నుల వివరాలు ఒక్క పేజీకే పరిమితం
ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాలని ఉన్నా అర్థం కాని దరఖాస్తు గందరగోళాన్ని చూసి కొందరు మిన్నకుండిపోతున్నారు దీన్ని అర్థం చేసుకున్న జైట్లీ ఆదాయపన్ను రిటర్నుల పత్రాన్ని ఒక పేజీకి కుదించారు. ఎక్కువ మంది రిటర్నులు దాఖలు చేసేలా ప్రోత్సహించడమే దీని ఉద్దేశ్యం. వార్షికంగా రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికే ఈ వెసులుబాటు.

నేషనల్ పెన్షన్ స్కీమ్ లో మార్పు
నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్)లో చేరి పదేళ్లు పూర్తయిన వారికి ఉపశమనం కల్పించే చర్యను ప్రభుత్వం తీసుకుంది. వారు తమ చందాల్లోంచి 25 శాతాన్ని ఎటువంటి పన్ను చెల్లించకుండానే వెనక్కి తీసుకోవచ్చు. ఉద్యోగ విరమణ తర్వాత ఎన్ పీఎస్ నిధి మొత్తం నుంచి 40 శాతం వరకు పన్ను లేకుండా ఉపసంహరించుకునే వీలున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అవకాశం ఈ 40 శాతం పరిధికి లోబడే ఉంటుంది.

రూ.3,00,000 లక్షలు దాటి నగదు చెల్లించొద్దుrepresentative image
రూ.10 లక్షలైనా, రూ. 50 లక్షల ఆస్తి అయినా ఇప్పటి వరకు కొనుగోళ్లు అంతా నగదు రూపంలో జరిగేవి. కానీ, ఇకపై ఇలా కుదరదు. రూ.3 లక్షల వరకే నగదు లావాదేవీలకు అవకాశం. అంతకుమించిన లావాదేవీలు నగదు రూపంలో జరిగితే విలువకు సరిసమానంగా అంతే మొత్తం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఆదాయపన్ను చట్టంలో సెక్షన్ 269 ఎస్టీని ప్రభుత్వం చేర్చింది. ఒకే లావాదేవీ విలువ రూ.3 లక్షలకు మించి ఉండరాదు. ఆ లోపు విలువ గల లావాదేవీలు అయితే నగదు రూపంలో చేసుకోవచ్చు. కానీ, దీనికీ పరిమితి ఉంది. ఒక రోజులో నగదు లావాదేవీల మొత్తం రూ.3 లక్షలకు మించరాదు.

ఐఆర్ సీటీసీ సేవా రుసుములకు చెక్
ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటే లోగడ సేవా రుసుములు చెల్లించాల్సి వచ్చేది. స్లీపర్ తరగతిపై ఇది రూ.20, ఏసీ టికెట్ అయితే రూ.40 ఉండేది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం తాత్కాలికంగా ఈ చార్జీలను రద్దు చేసింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో ఈ చార్జీలను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

గ్రాస్ ఆదాయం, మొత్తం ఆదాయం, పన్ను ఆదాయం
చాలా మందిలో స్థూల ఆదాయానికి(గ్రాస్ ఇన్ కమ్), మొత్తం ఆదాయానికి, పన్ను ఆదాయానికి మధ్య తేడాపై గందరగోళం ఉంటుంది. గ్రాస్ ఇన్ కమ్ ఆధారంగా పన్ను లెక్కించడం తప్పు. మొత్తం ఆదాయంపైనే పన్ను వర్తిస్తుందన్న విషయాన్ని తెలుసుకోవాలి.

గ్రాస్ ఇన్ కమ్ అంటే వేతనంతోపాటు, ఇంటిపై వచ్చే ఆదాయం, వ్యాపారాల్లో లాభాలు, క్యాపిటల్ గెయిన్స్ ఇలా అన్నీ కలపాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం పన్ను ఆదాయం అవుతుంది. అంటే గ్రాస్ ఇన్ కమ్ నుంచి సెక్షన్ 80 సీ, యూ మినహాయింపులను తీసివేయగా మిగిలిన మొత్తం అనమాట.

30 శాతం పన్ను రేటులో ఉంటేrepresentative image
అన్ని మినహాయింపులు పోను నికర పన్ను ఆదాయం రూ.15లక్షలు అనుకుంటే, వయసు 60 ఏళ్లలోపు అయతే పన్ను ఎంత చెల్లించాలంటే... రూ.2,50,000 వరకు పన్ను లేదు. 2,50,001 నుంచి రూ.5,00,000 వరకు రూ.2,50,000 లక్షలపై 5 శాతం పన్ను రేటు ప్రకారం 12,500 చెల్లించాలి. రూ.5,00,001 నుంచి రూ.10,00,000 వరకు ఆదాయంపై 20 శాతం పన్ను రేటు ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ.1,00,000. రూ.10,00,001 నుంచి రూ.15,00,000 వరకు ఆదాయంపై 30 శాతం రేటు ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ.1,50,000. మొత్తం పన్ను ఆదాయం రూ.12,500 రూ.1,00,000 రూ.1,50,000= 2,62,500.

20 శాతం పన్ను రేటులో ఉన్నవారయితే...
పన్ను వర్తించే ఆదాయం  రూ.8 లక్షలు ఉందనుకుంటే అప్పుడు చెల్లించాల్సిన పన్ను ఎంత మొత్తం అంటే... రూ.2,50,000 ఆదాయంపై పన్ను లేదు. రూ.2,50,001 నుంచి రూ.5,00,000 వరకు ఆదాయంపై 5 శాతం పన్ను రేటు ప్రకారం చెల్లించాల్సినది రూ.12,500. రూ.5,00,001 నుంచి రూ.8,00,000 ఆదాయంపై పన్ను రేటు 20 శాతం ప్రకారం పన్ను రూ.60,000. ఇప్పుడు చెల్లించాల్సిన మొత్తం పన్ను రూ.12,500 60,000= 72,500.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)