ap7am logo

దేశవాళీ, జెర్సీ ఆవు పాలల్లో ఏవి ఉత్తమం... వాటి మధ్య తేడాలేంటి?

Fri, Feb 10, 2017, 11:58 AM
Related Image నేడు దేశవ్యాప్తంగా చాలా వరకు డైరీలు జెర్సీ, హెచ్ఎఫ్ (హోల్ స్టీన్ ఫ్రీషియన్) రకం ఆవుల నుంచే పాలను ఉత్పత్తి చేస్తున్నాయి. నిజానికి వీటిని స్వచ్ఛమైన ఆవులుగా పరిగణించరు. అడవి జంతువు ఉరుస్ జాతికి చెందిన సంతానంగా వీటిని పరిగణిస్తారు. జర్మనీలో వీటిని ఆరోచ్ఎస్ గా పిలుస్తారు. నాణ్యమైన, అధిక మొత్తంలో మాంసం కోసం యూరోప్ లో ఈ అడవి జంతువును మొదట్లో వేటాడేవారు. ఆ తర్వాత వేట కష్టంగా మారడంతో ఈ అడవి జంతువును పలు రకాల దేశవాళీ ఆవులతో సంకరీకరణం చెందించి నూతన రకం ఆవులను సృష్టించారు. దీంతో జెర్సీ, హోల్ స్టీన్ తదితర రకాల ఆవులు అవతరించాయి.

పాశ్చాత్య దేశాల్లో మాంసం అవసరాలను తీర్చుకునేందుకే ఈ సంకరీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. షాక్ కు గురి చేసే నిజం ఏంటంటే జెర్సీ, హెచ్ఎఫ్ రకం ఆవు పాలను యూరోప్ లో నేరుగా వినియోగించడం లేదు. ఎందుకంటే వీటి పాలల్లో విషపూరిత రసాయనం కాసోమార్ఫిన్ ఉంటోంది. అందుకే వీటిని అక్కడ తెల్లటి విషంగా పరిగణిస్తారు.

ఏ1-ఏ2 పాలు
దేశీ ఆవు పాలను ఏ2 రకంగా, జెర్సీ వంటి విదేశీ జాతి ఆవు పాలను ఏ1 రకంగా చెబుతారు. మన దేశీ ఆవు పాలలో అధికంగా ప్రొటీన్లు, మినరల్స్ ఉంటాయి. స్వదేశీ జాతి ఆవు పాలలో ప్రొలైన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది మరో అమైనో యాసిడ్ అయిన ఐసోల్యూసిన్  తో కలిసి ఉంటుంది. ఒబెసిటీ, కీళ్ల నొప్పులు, ఉబ్బసం, మానసికపరమైన సమస్యలను నివారించే గుణం ఏ2 రకం పాలకు ఉంది. ఇంకా మన దేశవాళీ పాలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ ను ఇవి తగ్గిస్తాయి. అలాగే, ఈ పాలలో ఉండే సెరెబ్రోసైడ్స్ వల్ల మెదడు శక్తి ఇనుమడిస్తుంది. అంతేకాదు ఈ పాలను తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. హానికారక రేడియేషన్ నుంచి రక్షణ సైతం లభిస్తుంది. విషాన్ని హరించే గుణం దేశీ ఆవులకు ఉందని చెబుతారు. తాను విష పదార్థాలను పొరపాటుగా ఆవు తిన్నా... దాని అవశేషాలు మాత్రం పాలల్లో కలవవట. మేక పాలు, గొర్రె పాలు కూడా ఏ2 రకానికి చెందినవే.  

యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా జాతి ఆవులు ఏ1 ప్రొటీన్ అధికంగా ఉండే పాలను ఉత్పత్తి చేస్తుండగా, అదే ఆసియా, ఆఫ్రికా జాతి ఆవులు ఏ2 ప్రొటీన్ అధికంగా ఉండే పాలను ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే, పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ ప్రభావాలతో ఈ భేదాలు చెరిగిపోతున్నాయి. వివిధ జాతి ఆవుల మధ్య సంకరీకరణ వల్ల ఆసియా, ఆఫ్రికా ఆవు పాలల్లోనూ ఏ1 ప్రొటీన్లు ఉంటున్నాయి. ఇక మన దేశంలో 37 రకాల ఆవులు ఉండగా, వీటిలో 36 రకాల్లో ఏ2 ప్రొటీన్ లభిస్తోంది. మహారాష్ట్రకు చెందిన మాల్వి అనే రకం ఆవు మాత్రం ఏ1ను ఉత్పత్తి చేస్తోంది.

ఏ1తో అనారోగ్యం
న్యూజిలాండ్ లో నిర్వహించిన పలు అధ్యయనాల్లో వెల్లడైన ఫలితాల మేరకు ఏ1 ప్రొటీన్ పాల వల్ల అధిక రక్తపోటు, జీవక్రియలు, కణజాల క్షీణత, చిన్నారుల్లో ఆటిజం, టైప్ 1 మధుమేహం, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్ సమస్యలు, పెద్ద వయసు వారిలో మానసిక పరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఏ1 పాలలో ఉండే ప్రొటీన్లు జీర్ణం అయ్యే ప్రక్రియలో బీసీఎం7 అనే పెప్టైడ్ ను విడుదల చేస్తాయి. దీంతో ఈ పాలల్లోని పోషకాలను శరీరం అంతగా గ్రహించలేదు. దీనివల్ల పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

ఎన్నో భేదాలు
ఆవు మెడ కింద వేలాడే చర్మం, పొడవైన కొమ్ములు, పైన మూపురం ఇవన్నీ దేశవాళీ ఆవుల్లోనే కనిపిస్తాయి. జెర్సీ వంటి రకాలు చూడ్డానికి మాత్రమే ఆవుల మాదిరిగా ఉంటాయి. దేశీయ ఆవులకు స్వేద గ్రంధులు అమెరికా, యూరోప్ ఆవులతో పోలిస్తే పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఈ కారణంగా భారతీయ ఆవుల సమీపంలోకి వెళ్లినప్పుడు వాసన వస్తుంటుంది. ఇలా పెద్ద పరిమాణంలో స్వేద గ్రంధులు ఉండడం వల్ల దేవవాళీ ఆవుల్లో మలినాలు చెమట ద్వారా బయటకు వెళ్లిపోతాయి. పైగా ఎలాంటి హానికారకాలు ఉండవు. అదే అమెరికా, యూరోప్ ఆవుల్లో చెమట గ్రంధులు చాలా తక్కువ పరిమాణాల్లో ఉండడం వల్ల వాటిలో మలినాలు చర్మం ద్వారా పూర్తిగా బయటకు వెళ్లలేవు. దాంతో అవి పాల ద్వారా బయటకు వస్తాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్ కు కారణమవుతాయి. దేశవాళీ ఆవుల పేడ, మూత్రం ద్వారా 85 శాతం సూక్ష్మ క్రిములు బయటకు వచ్చేస్తాయి. అదే విదేశీ ఆవుల్లో మాత్రం ఇలా బయటకు రావడం 54 శాతం లోపే ఉంటాయి.

పాల దిగుబడి పెంచేందుకు చెడ్డదారులు
ఒకప్పుడు మన దేశ జనాభా చాలా తక్కువ. దాంతో అప్పటి పాల అవసరాలను దేశవాళీ ఆవులే తీర్చేవి. అయితే, ఆ తర్వాత కాలంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు దేశీయ పాల ఉత్పత్తి సరిపోలేదు. దీంతో పాల దిగుబడిని పెంచేందుకు క్రాస్ బ్రీడింగ్ మార్గాన్ని అనుసరించారు. ఈ చర్య కారణంగా మన దేశానికి చెందిన ఎన్నో రకాల ఆవులను సంకరీకరణ చేయడం పెరిగిపోయింది. 1970లో నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డు ఆపరేషన్ ఫ్లడ్ పేరుతో ఓ కార్యక్రమాన్నిప్రారంభించింది. ఇదే దేశాన్ని పాల కొరత నుంచి ప్రపంచంలోనే అత్యధికంగా పాలను తయారు చేస్తున్న దేశంగా మార్చింది.

పాల ఉత్పత్తిని పెంచడం, గ్రామీణంగా పాల ఉత్పత్తిని ప్రోత్సహించడం, వినియోగదారులకు అందుబాటు ధరలకు పాలను అందించడం ఈ కార్యక్రమం లక్ష్యాలు. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు యూరోప్ జాతి ఆవులతో దేశవాళీ ఆవులను సంకరీకరణ చెందించడం, విదేశీ జాతి ఆవులను దిగుమతి చేసుకోవడం వంటి చర్యలను అనుసరించారు. దాంతో నేడు దేశీ ఆవులు అంతరించిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇందుకు నిదర్శనం గుజరాతీ సంతతికి చెందిన గిర్ ఆవులను నేడు బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటుండడం, మనదేశానికి చెందిన బ్రాహ్మి ఎద్దులు ఆస్ట్రేలియాలో పాప్యులర్ కావడమే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రెజిల్ మన దేశీ ఆవులను దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశ జాతి ఆవులు ఇస్తున్న స్వచ్ఛమైన పాలను ఆయా దేశ ప్రజలు సేవిస్తుంటే మనం మాత్రం అంతగా పోషకాలు లేని పరదేశీ ఆవు పాలను సేవిస్తుండడం దురదృష్టకరం.

దేశీ ఆవు ప్రత్యేకతలు
దేశ వాళీ ఆవులకు పైన మూపురం ఉంటుంది. ఇందులో సూర్యకేతు నాడి ఉంటుంది. ఇది సూర్య కిరణాలను గ్రహిస్తుంది. అందుకే దేశీ ఆవు పాలు లేత పసుపు రంగులో ఉంటాయి. సూర్యకిరణ శక్తిని గ్రహించిన ఈ పాలను తీసుకోవడం వల్ల మంచి శక్తి లభిస్తుంది. అదే జెర్సీ ఆవు పాలను చూస్తే అవి తెల్ల రంగులోనే ఉంటాయి. గో మూత్రానికీ ఔషధ గుణాలు ఉంటాయని చెప్పగా వినే ఉంటారు. అయితే అది మూపురం ఉన్న దేశవాళీ ఆవుల మూత్రంలోనే. పరదేశీ జాతి ఆవు మూత్రానికి ఈ శక్తి లేదు. ఏ2 పాలలో మైక్రో న్యూట్రియెంట్లు, సైటోకైన్ మినరల్స్ ఉండడం వల్ల రోగనిరోధక శక్తి ఇనుమడిస్తుంది. పుంగనూరు ఆవు కూడా దేశవాళీ విశిష్ట జాతి ఆవుల్లో ఒకటి. ఔషధ గుణాల వల్ల ఆయర్వేద మందుల్లో దేశీ ఆవు నెయ్యిని వినియోగిస్తారు. కానీ ఏ1 పాల నుంచి తీసిన నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు. దేశీ ఆవులు రోజువారీ ఇచ్చే పాలు తక్కువగానే ఉన్నప్పటికీ ఏడాదికి చూసుకుంటే విదేశీ ఆవుల కంటే మూడు రెట్లు అధికంగానే ఇస్తాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy