ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భుజం పట్టేసినట్టు ఉంటోందా... అయితే ఫ్రోజన్ షోల్డర్ కావచ్చు!

Tue, Jan 31, 2017, 08:04 AM
Related Image మీ భుజం పట్టేసినట్టు అనిపిస్తోందా..? నొప్పిగా ఉందా...? కదలికలు భారంగా ఉన్నాయా...? అయితే, అది ఫ్రోజెన్ షోల్డర్ సమస్యమో ఓ సారి పరిశీలించుకోండి. నిర్లక్ష్యం చేస్తే నష్టం మరింత పెరుగుతుంది. వైద్యులను సంప్రదించడం ద్వారా సమస్య నుంచి బయటపడే అవకాశాన్ని కోల్పోవద్దు...

ఈ సమస్యను అడెసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటారు. షోల్డర్ జాయింట్ లో పట్టేసినట్టు ఉండి, నొప్పి రావడం కనిపిస్తుంది. తర్వాత భుజం కదిలించడం చాలా కష్టతరం అవుతుంది. జనాభాలో సుమారు 2 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుంది. ఏటా మన దేశంలో కోటికి పైగా కేసులు నమోదవుతున్నాయంటే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

భుజం నిర్మాణం...representative image

మన షోల్డర్ ఓ బాల్, సాకెట్ జాయింట్, మూడు ఎముకలతో ఉంటుంది. అప్పర్ ఆర్మ్ బోన్ (హ్యుమరస్), షోల్డర్ బ్లేడ్(స్కాపులా), కాలర్ బోన్ (క్లావికల్) ఈ మూడు భుజానికి అనుసంధానమై ఉంటాయి. అప్పర్ ఆర్మ్ బోన్ అంటే మన చేతి మధ్యలో ఉండే పెద్ద బోన్. ఇది షోల్డర్ బ్లేడ్ పైన ఉండే సాకెట్ జాయింట్ కు అనుసంధానమై ఉంటుంది. అనుసంధానించే కండరం షోల్డర్ క్యాప్సుల్ జాయింట్ చుట్టూ ఉంటుంది. భుజాన్ని తేలిగ్గా అటూ ఇటూ కదిలించేందుకు వీలుగా సైనోవియల్ ఫ్ల్యూయిడ్ (ద్రవ పదార్థం) షోల్డర్ క్యాప్సుల్, జాయింట్ లో లూబ్రికేట్ చేస్తుంది.

ఫ్రోజన్ షోల్డర్ సమస్యలో
షోల్డర్ క్యాప్సుల్ దళసరిగా మారి పట్టేసినట్టుగా మారుతుంది. కండరాలు పట్టేస్తాయి. ఈ సమస్య బారిన పడిన చాలా మందిలో భుజం జాయింట్ల వద్ద సైనోవియల్ ఫ్లూయడ్ తగ్గుతుంది. దీంతో భుజాన్ని కదిలించడం కష్టంగా మారుతుంది. సొంతంగా గానీ, ఇతరులు కదిలించినా ఇదే పరిస్థితి. పైగా ఇందులో మూడు స్టేజెస్ ఉంటాయి.

ఫ్రీజింగ్: ఈ దశలో క్రమక్రమంగా నొప్పి ఓ స్థాయిలో వస్తుంది. నొప్పి తారస్థాయికి చేరితే భుజం కదలికలు భారంగా మారతాయి. ఇది ఆరు నుంచి తొమ్మిది వారాల పాటు ఉంటుంది.

ఫ్రోజెన్: ఈ దశలో నొప్పి తీవ్రత మరింత పెరుగుతుంది. గట్టిదనం అలానే ఉంటుంది. నాలుగు నుంచి ఆరు నెలల పాటు కొనసాగే ఈ దశలో రోజువారీ కదలికలు సైతం కష్టంగా అనిపిస్తాయి.

తావింగ్: భుజం కదలిక ఈ దశలో కొద్దిగా మెరుగుపడుతుంది. ఇక ఈ దశ నుంచి తిరిగి భుజాన్ని మామూలుగా కదిలించేందుకు ఆరు నెలల నుంచి రెండేళ్ల కాలం పట్టవచ్చు.  

కారణాలు
ఏదైనా గాయం తర్వాత, మధుమేహం, స్ట్రోక్ వంటి సమస్యల బారిన పడిన వారిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. భుజం జాయింట్ చుట్టూ ఉన్న కణజాలం గట్టిపడిపోతుంది. దీంతో భుజం కదలికలు భారంగా మారతాయి. ఈ సమస్య నిదానంగా రావచ్చు... ఏడాది ఆ తర్వాత కాలంలో తగ్గిపోవచ్చు. సాధారణంగా 40 నుంచి 70 ఏళ్ల వయసువారిలో ఈ సమస్య కనిపిస్తుంది. పురుషుల్లో కంటే ఋతుచక్రం ఆగిపోయిన (మెనోపాజ్ దశలో ఉన్నవారు) మహిళల్లో ఈ సమస్య ఎక్కవగా వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారిలో 10 నుంచి 20 శాతం మందిలో ఈ సమస్య రావచ్చు. అలాగే, భుజాలను కదిలించకుండా అట్టే ఎక్కువ కాలం ఉంచినా దీని బారిన పడవచ్చు.

ఇంకా హైపోథైరాయిడిజమ్, హైపర్ థైరాయిడిజమ్, పార్కిన్ సన్స్ వ్యాధులున్న వారిలోనూ ఇది కనిపించవచ్చు. సర్జరీ అనంతరం, ఫ్రాక్చర్ వంటి సమస్యల బారిన పడిన వారిలోనూ ఇది రావచ్చు. ఎందుకంటే వీరు ఎక్కువ రోజుల పాటు భుజాన్ని కదిలించకుండా ఉంటారు. దీని వల్ల వీరిలో ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయి. అందుకే ఫ్రాక్చర్, సర్జరీ ఎదురైన వారిని భుజాన్ని కదిలించే వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తుంటారు.

representative imageగుర్తించడం ఎలా...?
లక్షణాలు, వైద్య చరిత్ర విన్న తర్వాత డాక్టర్ చేతి భుజాన్ని పరిశీలిస్తారు. చేయిని అన్ని దిశలవైపు తిప్పుతూ నొప్పి వస్తుందా, చేయి కదలిక సాధారణంగా ఉందా, అన్న విషయాలను పరిశీలిస్తారు. ఆర్థరైటిస్, లేదా ఇతర సమస్యల వల్ల వచ్చిందేమో అన్న అనుమానం ఉంటే ఎక్స్ రే సూచించవచ్చు. భుజంలో ఇతర సమస్యలు ఏవైనా ఉంటే ఎక్స్ రే తో బయటపడతాయి. ఎంఆర్ఐని కూడా సూచించవచ్చు.

చికిత్స
సాధారణంగా ఏడాది నుంచి మూడేళ్ల కాలంలో ఈ సమస్య దాదాపుగా తగ్గిపోతుంది. నాన్ స్టిరాయిడ్ యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ మందులతో చికిత్స ప్రారంభిస్తారు. నొప్పి ఉన్న ప్రాంతంలో వేడినీటితో కాపడం లేదా ఐస్ తో రుద్దమని చెప్పవచ్చు. ఫిజియోథెరపీతో ఫలితాలు ఉంటాయి. ఈ సమస్యకు చికిత్స చాలా సులభం. నొప్పిని అదుపుచేసి తిరిగి భుజం కదలికలను సాధారణ స్థితికి తీసుకురావడమే చికిత్సలో కీలకం. నొప్పి నివారణ మందులతో పాటు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కూడా సూచించవచ్చు.  ఫిజియోథెరపీ మంచి ఫలితాలనిస్తుంది. నిపుణుల సూచనల మేరకు శారీరక వ్యాయామాలు చేయడం కూడా మంచిదే.

శస్త్రచికిత్సలు
కొందరిలో భుజం జాయింట్ లోకి కార్టికో స్టెరాయిడ్లను ప్రవేశపెడతారు. యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ మందులు, ఫిజియోథెరపీలతో సమస్య తొలగిపోకుంటే వైద్యులను సంప్రదించినట్టయితే... శస్త్రచికిత్స ద్వారా పట్టేసిన భుజం క్యాప్సుల్ ను సరళించేలా చేస్తారు. ఇందులో ఉండే రిస్క్, కోలుకునేందుకు పట్టే సమయం తదితర విషయాల గురించి ముందే తెలుసుకోవాలి.

representative imageషోల్డర్ ఆర్థోస్కోపీతో సమస్యను సరిచేసే ప్రయత్నం చేస్తారు. పెన్సిల్ సైజులో ఉన్న పరికరాలను చిన్న కోతలతో షోల్డర్ క్యాప్సుల్ లో ప్రవేశపెడతారు. షోల్డర్ క్యాప్సుల్ లో గట్టిపడిన భాగాలను డాక్టర్ కత్తిరించడం జరుగుతుంది. మరో విధానంలో వైద్యులు ఈ సమస్య గలవారికి మత్తుమందు ఇచ్చి, పట్టేసిన భుజాన్ని బలంగా కదిలిస్తారు. దీంతో పట్టేసిన భుజ కండరాలు సడలుతాయి. ఇక ఆ తర్వాత ఫిజియో థెరపీతో సమస్య నుంచి బయటపడే సూచనలు చేస్తారు.  

చాలా కేసుల్లో ఈ రెండు విధానాలతో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ చికిత్సల తర్వాత కోలుకోవాలంటే భుజం వ్యాయామాలు చేయాలి. లేదా ఫిజియోథెరపీ తప్పకుండా తీసుకోవాలి. సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఆరు వారాల నుంచి మూడు నెలలు పట్టవచ్చు. కొందరిలో పూర్తి స్థాయి రికవరీ ఉంటుంది. అంటే నొప్పి అస్సలు ఉండదు. కొందరిలో నొప్పి తగ్గుతుంది. కొందరిలో మాత్రం భుజం కదలికలు పూర్తిగా తిరిగి అంతకుముందున్నటువంటి స్థితికి రావు. ఇక మధుమేహంతో బాధపడే వారిలో చికిత్సలతో ఫలితం కనిపించినా సమస్య తిరగబెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నివారణ ఉందా...?

గాయపడిన తర్వాత గానీ, ఏదైనా శస్త్రచికిత్స తర్వాత గానీ భుజాల కదలికలను సాధారణంగా ఉండేలా చూసుకోవాలి. ఈ సమస్య ఎందుకు వచ్చిందో, వస్తుందో కొందరి విషయంలో అర్థం కాదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు శారీరకంగా భుజాల కదలికలు తగ్గకుండా చూసుకుంటే ఈ సమస్య బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. మధుమేహ బాధితుల్లో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా వుంటాయి.

వ్యాయామాలు ఇలా...
representative imageస్ట్రెచ్చింగ్ వ్యాయామాలకు ముందుగా భుజాలను విశ్రాంతిగా ఉంచాలి. ఆ తర్వాత ఓ బల్ల దగ్గరకు వెళ్లి ఫ్రోజన్ షోల్డర్ సమస్య లేని చేతితో దాన్ని పట్టుకుని కొంచెం ముందుకు వంగి.... ఆ తర్వాత సమస్య ఉన్న చేతిని నిటారుగా వేలాడేలా ఉంచాలి. ఆ తర్వాత చేతిని స్వల్ప వృత్తాకారంలో పది చుట్లు తిప్పాలి. ఇలా క్లాక్, యాంటీ క్లాక్ రెండు దిశలలోనూ పదిసార్ల చొప్పున చేయాలి. మెరుగు పడితే వృత్తాకార పరిధి పెంచవచ్చు. ఇంకా మెరుగుపడితే ఆ తర్వాత సమస్య ఉన్న చేతితో రెండు కేజీల వరకు బరువున్న వస్తువును పట్టుకుని చేతిని గుండ్రంగా తిప్పడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఫ్లాట్ గా ఉన్న బల్ల లేదా మంచంపై విశ్రాంతిగా పడుకోవాలి. ఫ్రోజన్ షోల్డర్ ఉన్న చేతిని పైకి ఎత్తాలి. అలా ఎంత వరకు వెనక్కి వెళుతుంతో అంత వరకు తీసుకెళ్లి తిరిగి కిందకు తీసుకురావాలి.

representative imageబల్ల పక్కన స్టూల్ పై కూర్చుని ఒక చేతిని బల్లపై ఉంచాలి. ఫ్రోజన్ షోల్డర్ సమస్య ఉన్న మరో చేతిని పైకి తీసుకెళ్లి మళ్లీ కిందకు డౌన్ చేస్తుండాలి.

representative imageమూడు అడుగుల పొడవున్న టవల్ ను నించుని నడుము భాగంలో వెనక వైపు నుంచి సమస్య లేని చేత్తో పట్టుకోవాలి. టవల్ రెండో అంచును సమస్య ఉన్న చేతిని వెనకవైపు తిప్పి పట్టుకోవాలి. ఇలా రోజుకు 20 సార్ల వరకు చేయవచ్చు.

నించుని లేదా కూర్చుని సమస్య ఉన్న చేతిని చాతికి సమాంతర స్థాయిలో రెండో చేతివైపునకు తీసుకెళ్లాలి. అలా 15 నుంచి 20 సెకండ్ల పాటు ఉంచాలి. రోజులో 15, 20 సార్లు ఇలా చేయవచ్చు.
representative image
గొడ దగ్గరకు వెళ్లి సమస్య ఉన్న చేతి రెండు వేళ్లను గోడపై ఉంచాలి. ఆ రెండు వేళ్లను నడిచినట్టు సాలీడు మాదిరిగా పైకి తీసుకెళ్లాలి. భుజంలో సౌకర్యంగా అనిపించినంత మేర గోడపైకి చేతి వేళ్లను తీసుకెళ్లవచ్చు.

representative imageరబ్బర్ బ్యాండ్ తీసుకుని దాన్ని డోర్ హ్యాండిల్ కు ఒకవైపు తగిలించండి. మరోవైపు బ్యాండ్ ను ఫ్రోజన్ షోల్డర్ సమస్య ఉన్న చేత్తో పట్టుకోవాలి. ఆ బ్యాండ్ ను పొట్టముందు వరకు లాగి ఓ ఐదు సెకన్ల పాటు అలానే ఉంచాలి. ఇలా రోజుకు 15 సార్లు చేయడం ద్వారా పలితం కనిపిస్తుంది. డోర్ హ్యాండిల్ కూడా పొత్తి కడుపుకు సమాంతరంగా ఉంటే మంచిది.
X

Feedback Form

Your IP address: 54.224.117.28
Articles (Education)