సంతాన భాగ్యానికి ఎన్నో దారులు... ఎంపిక మీదే!... సులభమైన సంతాన నిరోధక పద్ధతి ఏది...?

Fri, Dec 30, 2016, 02:43 PM
Related Image

వివాహమైన దంపతులకు సంతాన భాగ్యం ఓ ఆకాంక్ష.. ఓ ఆశ.. ఓ అవసరం. తమ వారసుల కోసం తహతహలాడని వారుండరు. ప్రతి స్త్రీ కూడా మాతృత్వాన్ని ఆస్వాదించాలని, అనుభవించాలని ఉవ్విళ్లూరుతుంది. ప్రతి స్త్రీ అమ్మా అని... ప్రతి పురుషుడు నాన్నా అని పిలిపించుకునేందుకు ఈ సృష్టిలో ఎన్నో సహజ మార్గాలున్నాయి. ఆ అదృష్ట భాగ్యం మాకు లేదే అని మధనపడిపోతున్న వారి కోసం వైద్య శాస్త్రం ప్రత్యామ్నాయంగా కొన్ని విధానాలను కూడా సృష్టించింది. సృష్టి... ఆ సృస్టికి పున:సృష్టి మార్గాలు, అదే సమయంలో దంపతులు ఎలాంటి మందులు, రక్షణ కవచాలతో పనిలేకుండా సంతానానికి దూరంగా ఉండే విధానం గురించి వైద్య నిపుణులు, వైద్య పరిశోధనల ఫలితాల ఆధారంగా తెలుసుకుందాం. పది మందికి తెలియజెబుదాం....

నోట్: ఒక అంశంపై సమగ్రమైన సమాచారం ఒక్కచోటే ఇచ్చే ప్రయత్నం ఇది. అందుకని ఆర్టికల్ పెద్దగా ఉంటుంది. సమాచారం చాంతాడంత ఉందే అనుకోకుండా సరైన అవగాహన కోసం ఆసాంతం ఓపికతో చదవాలని సూచన. 

శారీరక ఆరోగ్యం ఎంతో అవసరం...

పెళ్లయిన దంపతుల్లో సగం కంటే ఎక్కువ మందే సహజ సిద్ధంగా సంతాన భాగ్యాన్ని పొందుతున్నారు. మిగిలిన వారు వెంటనే ఆ భాగ్యానికి నోచుకోకపోవడం వెనుక ఎన్నోకారణాలు ఉండి ఉండవచ్చు. అసలు ముందుగా గర్భం దాల్చాలన్నా, కడుపులో పడిన కాయ పండు అవ్వాలన్నా శారీరకంగా మంచి ఆరోగ్యం అవసరమని వైద్య శాస్త్రం చెబుతోంది. అధిక బరువు ఉండకూడదు. అలా అని బరువు తక్కువగా ఉండడం కూడా సరికాదు. ఇలా ఉంటే గర్భధారణ, ఆ తర్వాత గర్భం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. representative image

రోజూ వ్యాయం చేయడం శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. లేకుంటే వారంలో మూడు నుంచి నాలుగు సార్లు అయినా వ్యాయామాలు చేయాలని గుర్తు పెట్టుకోండి. ముఖ్యంగా ఏరోబిక్ వ్యాయామాల వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, ఊపిరితిత్తులు బలంగా మారతాయి. అధిక బరువు ఉన్న వారు వ్యాయామం రూపంలో బరువు తగ్గించుకుని ఆరోగ్యంగా మారిపోవచ్చు. యోగా కూడా మంచిదే. వీటి కారణంగా ఆరోగ్యంగా మారితే గర్భధారణకు శరీరంలో అనుకూలత పెరుగుతుంది. అదే సమయంలో ఆరోగ్యానికి హాని కలిగించే పొగతాగడం, మద్యపానం, కొన్ని రకాల ఔషధాల సేవనం, రసాయనాల వినియోగం, కెఫైన్ వంటి వాటికి దూరంగా ఉండాలి. సాధ్యం కాకపోతే కనీసం చాలా వరకు తగ్గించాలి.

అండం ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది?

దంపతులు శారీరకంగా ఎప్పుడు కలిశారన్నది కాదు... స్త్రీలో అండం విడుదల సమయంలో కలవడం వల్లే గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక అండం ఎప్పుడు విడుదల అవుతుందన్న విషయాన్ని దంపతులు తప్పకుండా తెలుసుకోవాలి. అలాగే పురుషుల్లోనూ వీర్య కణాల ఉత్పత్తి సరిపడా ఉండాలి.

స్త్రీలకు ప్రతి 28 నుంచి 32 రోజులకు ఒకమారు రుతుక్రమం వస్తున్నట్టయితే అండం విడుదల సమయాన్ని సులభంగానే తెలుసుకోవచ్చు. ఎలా అంటే... గత నెల రుతుక్రమంలో మొదటి రోజు ఏ తేదీయో చూడాలి. అప్పటి నుంచి ఈ నెల రుతు క్రమంలో మొదటి రోజుకు మధ్య ఎన్ని రోజులు ఉందో చూడాలి. ఇందులో నుంచి 14 రోజులను తీసివేయాలి. ఎంత వచ్చిందో అప్పటి నుంచి రెండు రోజుల్లోపలే అండం విడుదల అవుతుంది. అంటే ఉదాహరణకు, గత నెల 20న రుతుక్రమం మొదలైంది. అలాగే, ఈ నెల 20న తర్వాత రుతుక్రమం వచ్చిందంటే 30రోజులుగా పరిగణించాలి. ఇందులో నుంచి 14 రోజులను తీసివేస్తే 16. గత నెల 20వ తేదీ నుంచి లెక్కిస్తూ 16వ రోజు ఏ తేదీ అవుతుందో చూడాలి. సరిగ్గా ఈ తేదీ నుంచి రెండు రోజుల్లోపల ఎప్పుడైనా అండం విడుదల అవుతుంది.representative image

కొందరికి 20 రోజులకే రుతుచక్రం ప్రారంభం కావచ్చు. కొందరికి నెలన్నరకు ఒకసారి రుతుచక్రం రావచ్చు. మరి ఇలాంటప్పుడు అండం కచ్చితంగా ఎప్పుడు విడుదల అవుతుందన్నది చూద్దాం. ఇలాంటి వారు తమ గత 8-12 నెలల రుతుచక్రాల తేదీలను నోట్ చేసుకోవాలి. తక్కువ వ్యవధిలో వచ్చిన రుతుచక్రం, చాలా ఆలస్యంగా వచ్చిన రుతుచక్రాన్ని గుర్తించాలి. ఇప్పుడు అతి తక్కువ రోజులకే వచ్చిన రుతుచక్రం ఉంటే... అది ఎన్ని రోజులో చూడాలి. ఉదాహరణకు 26 రోజులు అనుకుందాం. అందులో నుంచి 18 రోజులను తీసివేయాలి. అప్పుడు 8 రోజులు ఉంటుంది. సరిగ్గా ఎనిమిదో రోజును ఫలదీకరణ కార్యక్రమం ప్రారంభమయ్యే రోజుగా భావించాలి.

ఇక ఇప్పుడు ఫలదీకరణ ముగిసే రోజు తెలియాలంటే... ఆలస్యంగా వచ్చిన రుతుచక్రం... ఎన్ని రోజులో చూడాలి. అది ఒకవేళ 32 రోజులు అనుకోండి. ఇందులో నుంచి 11 రోజులను తీసివేయాలి. అప్పుడు 21 రోజులు ఉంటుంది. ఫలదీకరణ కార్యక్రమం ముగిసే రోజుగా దీన్ని చూడాలి. అంటే రుతుచక్రం మొదలైన 8వ రోజు నుంచి 21వ రోజు లోపల ఏదో ఒక రోజు అండం విడుదలై ఫలదీకరణ చెందుతుందని అర్థం చేసుకోవాలి. దీన్నే వైద్య పరిభాషలో ఫెర్టిలిటీ విండోగా పేర్కొంటారు. సంతానం కోరుకునే వారు ఈ విండో రోజుల్లో పాల్గొనడం ఎంతో అవసరం. సాధ్యమైనని సార్లు శృంగారంలో పాల్గొనడం ద్వారా అవకాశాలను పెంచుకోవచ్చు. ఈ విధమైన లెక్కలన్నీ చిక్కులుగా అనిపిస్తే... రుతుచక్రం ప్రారంభమైన తర్వాత 8వ రోజు నుంచి 21వ రోజు వరకు ప్రతీ రోజూ మిస్ కాకుండా సృష్టి కార్యక్రమంలో పాల్గొంటే గర్భదారణ అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోవచ్చు.

పిల్లలు వద్దనుకుంటే...

పిల్లలు అప్పుడే వద్దనుకునే వారు ఈ విండో రోజుల్లో శృంగారంలో పాల్గొనకుండా ఉంటే సరిపోతుంది. అయితే, ఇదొక అంచనా మాత్రమే. అండం విడుదల అనేది నెలకు నెలకూ మారిపోతుంది. శరీర, స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ నిర్మాణం, దానిపై హార్మోన్ల ప్రభావం ఇలా ఎన్నో దీనిని నిర్ణయిస్తాయి.

ఇలా చేసినా సరే...

చివరి రుతుచక్రం ప్రారంభమైన మొదటి రోజు నుంచి సరిగ్గా పదో రోజు జీవిత భాగస్వామితో కలవాలి. ఆ తర్వాత రోజు విడిచి రోజు శృంగారంలో పాల్గొనాలి. దీనివల్ల పరిపక్వం చెందిన వీర్యకణాలు విడుదల అవుతాయి. ఒకసారి విడుదలైన వీర్యకణం స్త్రీ పునరుత్పత్తి అవయవంలో ఐదు రోజుల పాటు అండం కోసం వేచి చూస్తుంటుంది. కనుక గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  

కొందరు అండం విడుదల సమయంలో జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొంటారు. ఇది ఫలితాన్నిస్తుంది. స్త్రీలోని పునరుత్పత్తి మార్గంలో పురుషుడు విడిచిన వీర్య కణాలు ఐదు రోజుల పాటు జీవించి ఉంటాయి. పరిమిత సంఖ్యలో ఎక్కువ రోజుల పాటు ఉంటాయని నిపుణులు చెబుతారు. అందుకే గర్భం కోరుకునే వారు అండం విడుదల కావడానికి ఒకటి రెండు రోజుల ముందు నుంచే సాధ్యమైనన్ని సార్లు శృంగారంలో పాల్గొనాలి. దీనివల్ల గర్భధారణకు అవకాశాలు పెరుగుతాయి. గర్భం దాల్చాలంటే కనీసం ఆరోగ్యవంతమైన వీర్య కణం ఒక్కటైనా స్త్రీలలో అండం విడుదలయ్యే సమయానికి ఫాలోపియన్ ట్యూబులో ఉండాలి. ఓవరీ నుంచి విడుదలైన అండం 12 నుంచి 24 గంటల్లో ఫలదీకరణ చెందాలి. 

అండం విడుదలను ఇలా తెలుసుకోవచ్చు...

మరో విధానంలో అండం విడుదలకు ముందు గర్భాశయం వద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. అక్కడ స్రావాలు మరింత పెరుగుతాయి. అలాగే అండం విడుదల ముందు శరీర ఉష్ణోగ్రతలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఉష్ణోగ్రత చెక్ చేసుకోవాలి. అండం విడుదల సమయంలో శరీర ఉష్ణోగ్రత అత్యంత తక్కువ స్థాయికి చేరుతుంది. అండం విడుదల అయిన వెంటనే ఈ ఉష్ణోగ్రత సాధారణం కంటే అర డిగ్రీ మేర పెరిగిపోతుంది. బేసల్ థర్మోమీటర్ ద్వారా దీన్ని పరిశీలించవచ్చు.

అండం విడుదలకు ముందే అందుకు మార్గం సుగమం చేసేందుకు హార్మోన్లలో మార్పులు కూడా జరుగుతాయి. వీటి ఆధారంగా అండం విడుదల సమయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే, పొట్ట కింది భాగంలో ఒకవైపున తిమ్మిరితో కూడిన పోట్లు వస్తుంటాయి. మరికొందరిలో అండం విడుదల ముందు స్వల్పంగా నొప్పి ఉంటుంది. అయితే, అండం విడుదల తెలుసుకోవడం అన్ని వేళలా అంత సులభం కాకపోవచ్చు. అలాంటప్పుడు కొన్ని రకాల కిట్లు, పరీక్షలు కూడా ఉన్నాయి. 

ఓవులేషన్ కిట్స్representative image

ఓవులేషన్ కిట్స్ సాయంతో మూత్రంలో ల్యూటనైజింగ్ హార్మోన్ స్థాయులను తెలుసుకోవచ్చు. చాలా మంది మహిళల్లో అండం విడుదలకు 12 నుంచి 36 గంటల ముందు ల్యూటనైజింగ్ హార్మోన్ పెరిగిపోతుంది. ఇది అండం విడుదల అవుతున్నదానికి సంకేతం. అంటే ఫెర్టిల్ విండోలోకి అడుగుపెట్టినట్టే. 

ఓవులేషన్ మైక్రోస్కోప్

అండం విడుదలకు ముందు ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయులు పెరుగుతాయి. లాలాజలాన్ని మైక్రోస్కోప్ కింద ఉంచడం ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. ల్యూటనైజింగ్ హార్మోన్ పెరగడానికంటే ముందు ఈస్ట్రోజెన్ పెరిగిపోతుంది.

రుతుచక్రంలో ఆలస్యం ఎందుకు...? సమస్యలేంటి..?

స్త్రీలలో రుతుక్రమం అనేది కాల చక్రం వలే నిర్ణీత సమయానికి అనుగుణంగా పనిచేస్తుండాలి. ఈ రుతుక్రమమే ఆమెలోని పునరుత్పత్తి వ్యవస్థ, సంతాన సాఫల్యత, ఆరోగ్యం వంటి అనేక అంశాలను నిర్ణయిస్తుంది. రుతుచక్రం ప్రారంభమైన ప్రతీ వారూ ఈ చక్రం గురించి తెలుసుకోవాలి. సాధారణంగా ఎక్కువ శాతం రుతుచక్రాలనేవి 28 రోజులు, 30 రోజులుకు ఒక మారు ప్రారంభమవుతూ ఉంటాయి. కొందరిలో 21 రోజుల నుంచి 35 రోజుల కాల వ్యవధితో ఉంటాయి. టీనేజ్ లో ఉన్న వారిలో 21 రోజుల నుంచి 45 రోజులుగానూ ఉండవచ్చు. ఒకసారి రుతుచక్రం ప్రారంభమైన తర్వాత మొదటి రోజు నుంచి మరుసటి రుతుచక్రం వరకు ఉన్న కాలాన్ని మెనుస్ట్రువల్ సైకిల్ గా పేర్కొంటారు. హార్మోన్ల స్థాయులు పెరగడం, తరగడం ద్వారా ఈ రుతుచక్రం నియంత్రణ ఉంటుంది. రుతుచక్రం ప్రారంభమైన తర్వాత 2 నుంచి ఏడు రోజుల వరకు రక్తస్రావం ఉండవచ్చు. 

ఈ రుతుచక్రం స్త్రీ శరీర వ్యవస్థలో నెలకోసారి మార్పులు తీసుకొస్తుంది. తద్వారా గర్భధారణకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ప్రతీ నెలా స్త్రీలలో ఓవరీలు అండాన్ని విడుదల చేస్తాయి. అదే సమయలో హార్మోన్లలో మార్పులు జరిగి గర్భాశయాన్ని గర్భధారణకు సిద్ధం చేసేస్తాయి. అండం విడుదల అయి, అది ఫలదీకరణ చెందకపోతే... గర్భాశయంలో రక్తంతో కూడిన పొర స్త్రీ యోనిలోకి వచ్చేస్తుంది. అప్పుడు రక్తస్రావం అవుతుంది. దీంతో పీరియడ్ వచ్చినట్టు భావిస్తారు. తిరిగి మెనోపాజ్ దశ (40 ఏళ్ల తర్వాత)లో రుతుక్రమం క్రమంగా ఆలస్యమవుతూ నిలిచిపోతుంది.  

దీర్ఘకాల చక్రాలు...

35 రోజుల తర్వాత వచ్చే రుతుక్రమాన్ని దీర్ఘకాల రుతుచక్రంగా పేర్కొంటారు. దీన్నే ఒలిగోమెనోరియా అంటారు. దీర్ఘకాలం పాటు రుతుచక్రం ప్రారంభం కాకపోవడానికి ఓవరీలు హార్మోన్లను క్రమప్రకారం ఉత్పత్తి చేయకపోవడమే. దీంతో రుతుచక్రం ఆలస్యం అవుతుంది. ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల అసమతుల్యత రుతుచక్రం ఆలస్యానికి కారణాలు. అతి వ్యాయామం, శారీరక అనారోగ్యాలు ఇందుకు దారితీయవచ్చు.

ఆలస్యంగా అండోత్పత్తి...

రుతుచక్రం సమయం ఎక్కువగా ఉండడం వెనుక అండోత్పత్తిలో ఆలస్యం జరుగుతుందేమో తెలుసుకోవాలి. అందుకోసం ఎప్పుడు అండోత్పత్తి జరుగుతుందన్నది కీలకం. ఉదాహరణకు ఓ స్త్రీలో ప్రతి 39 రోజులకు ఒకసారి రుతుక్రమం ప్రారంభమవుతుంది అనుకుంటే... అండం విడుదల 25వ రోజున జరుగుతుందని తెలుసుకోవాలి. ఎందుకంటే పీరియడ్ మొదలవడానికి రెండు వారాల ముందు అండం విడుదల అవుతుంది. 21 రోజుల తర్వాత అండం విడుదల అయితే... దాన్ని ఆలస్యంగా అండం విడుదల కావడం కింద పరిగణిస్తారు. ఒకవేళ ప్రతి నెలా నిర్ణీత రోజులకు ఒకసారి రుతుక్రమం రావడం లేదంటే అండం విడుదల గురించి తెలుసుకోవాలి. అండం విడుదల ఆలస్యం అన్నది తాత్కాలికంగా ఉండే సమస్య. దీన్ని కొన్ని మందులతో స్వల్ప కాలంలోనే సరిచేయవచ్చు. అయితే, కొందరిలో దీని వెనుక ఏవైనా సమస్యలున్నాయేమో వైద్య పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. 

దీర్ధకాల రుతుచక్రాలకు కారణాలు...

యుక్తవయస్కులో అంటే స్త్రీలు బహిష్టులైన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వారిలో మెనుస్ట్రువల్ సైకిల్ దీర్ఘకాలం పాటు ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత అది క్రమం క్రమంగా తగ్గి సాధారణ స్థితికి వచ్చేస్తుంది. పీరియడ్ ఆలస్యం అయిందంటే అది గర్భధారణకు తొలి సూచన. బ్రెస్ట్ ఫీడింగ్, పిల్లలకు పాలిచ్చే తల్లుల్లోనూ ఇది ఆలస్యంగానే వస్తుంది. అధికంగా వ్యాయామం చేయడం, అధికంగా బరువును కోల్పోవడం, అనోరెక్సియా నెర్వోసా తదితరాల వల్ల పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం పీరియడ్స్ ఆలస్యానికి కారణం కావచ్చు.

పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. దీనిలో చిన్ని తిత్తులు ఓవరీలపై పెరుగుతాయి. దీంతో పీరియడ్స్ క్రమగతి తప్పిపోతుంది. పెల్విక్ ఇన్ఫ్లమ్మేటరీ డిసీజ్ లో స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో ఇన్ ఫెక్షన్ కారణంగా రుతుచక్రం క్రమగతి తప్పుతుంది. 

మహిళలకు 40 ఏళ్ల లోపే ముందుస్తుగా ఓవేరియన్ ఫెయిల్యూర్ కావడం వల్ల కూడా ఈ పరిస్థితి రావచ్చు. యుటెరిన్ ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా ఆలస్యం అవుతుంది. 

పరిశీలించాల్సినవి...

90 రోజులు దాటి పీరియడ్ రాకుండా ఉండి, గర్భం లేకుంటే..., రుతుచక్రంలో ఏడు రోజులు దాటిన తర్వాత కూడా రక్తస్రావం అవుతుంటే, అధిక రక్తస్రావం అవుతుంటే, 21 రోజులకు ముందే పీరియడ్ వచ్చేస్తుంటే, పీరియడ్ నుంచి పీరియడ్ మధ్య కాలంలో రక్తస్రావం అవుతుంటే..., అసాధారణమైన నొప్పితో బాధపడుతుంటే వైద్యుల సలహా అవసరం. సమస్యల్లేకపోయినా... ప్రతి ఏడాదికోసారి స్త్రీ వ్యాధి నిపుణులతో పరీక్ష చేయించుకోవడం సూచనీయం.

పోషకాహారం 

పోషకాహారం శారీరక, మానసిక ఆరోగ్యానికి పోషకాహారం కీలకం అని తెలుసు. కానీ గర్భధారణలోనూ, ఆరోగ్యకరమైన గర్భం విషయంలోనూ ఈ పోషకాహారం పాత్ర ఉంటుందట. అందుకే వైద్యులు సూచించిన మేరకు పోషకాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. అలాగే, ఫోలిక్ యాసిడ్ అనేది గర్భంలో శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడుతుంది. నాడీ సంబంధ ఎదుగుదల లోపాలు రాకుండా చూస్తుంది. గర్భానికి ప్లాన్ చేసుకుంటున్నప్పటి నుంచే దీన్ని రోజూ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. representative image

అవయవాల పనితీరుకు, హార్మోన్ల సమతుల్యతకు, శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపేందుకు వీలుగా తగినంత నీటిని తీసుకోవాలి. ఇది పరోక్షంగా గర్భదారణ అనుకూలతకు దారితీస్తుంది. కార్బోహైడ్రేట్లు కూడా తగినంత అవసరం. ఇందుకోసం కూరగాయలు, తృణ ధాన్యాలు, పండ్లు ఉపయోగపడతాయి. ప్రొటీన్లు హార్మోన్ల ఉత్పత్తికి సాయం చేస్తాయి. ఇవి గర్భధారణకు వీలు కల్పించేవే. అలాగే అనుశాచురేటెడ్ ఫాటీ యాసిడ్స్ కూడా అవసరం. అందుకోసం వాల్ నట్స్ తీసుకోవాలి. ఆలివ్, కనోలా, వెజిటబుల్ ఆయిల్స్ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. బీన్స్, నట్స్ తదితర శాఖాహారం తీసుకుంటూ, మాంసాహారం తగ్గించాలి.  

ఇక పాలు చాలా చాలా అవసరం. ఓ అధ్యయనం ప్రకారం రోజులో మూడు గ్లాసులకు మించి పాలు తాగే మహిళల్లో గర్భం దాల్చకపోవడం అన్నది 70 శాతం తక్కువగా ఉంటుందట. జింక్ కూడా అవసరం. ఇందుకోసం కూరగాయలు, గుడ్లు, తృణ ధాన్యాలు తీసుకోవాలి. విటమిన్ బీ6 ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరోన్ హార్మోన్ల క్రమబద్ధీకరణకు తోడ్పడుతుంది. బీ6 విటమిన్ గుడ్లు, వేరుశనగలు, అరటిపండ్లు, సోయాలో లభిస్తాయి. విటమిన్ సీ అన్నది అండోత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకరమైన వీర్యకణాల సంఖ్యకు, చైతన్యానికి సైతం ఈ విటమిన్ చాలా అవసరం. చాలా పండ్లలో ఈ విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ ఈ పురుషుల్లో వీర్యకణాల నాణ్యతను పెంచుతుంది. 

ఈ ఆహారాన్ని దూరంగా పెట్టాలి...

కెఫైన్ అనేది మన శరీరం క్యాల్షియం గ్రహించడాన్ని తక్కువ చేస్తుంది. రోజుకు ఒక కప్ కంటే ఎక్కువ కాఫీ తీసుకునే వారిలో సంతానోత్పత్తి అవకాశాలు 27 శాతం తగ్గుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్ లో పురుగు మందులు, కృత్రిమ హార్మోన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. పురుషులు సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తాయి. కృత్రిమ తీపి పదార్థాలతో కూడిన వాటిని తినరాదు. ఫాస్ట్ ఫుడ్స్ లో కలిపేవి కూడా గర్భధారణకు ప్రతికూలమైనవే.

గర్భధారణకు మూలికలు...

గర్భధారణకు సహజ మూలికా ఔషధాలు సైతం ఉన్నాయి. చాస్ట్ బెర్రీ అనేది పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపిస్తుంది. ఈ గ్రంధి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరోన్, టెస్టోస్టెరోన్ లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హర్మోన్లను బ్యాలన్స్ చేయడం ద్వారా సంతానోత్పత్తికి తోడ్పడుతుంది. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ లో ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది అవసరమైన ఫ్యాటీ యాసిడ్. రుతుచక్రాలను క్రమబద్ధం చేస్తుంది. దాంతో సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపడతాయి. రెడ్ క్లవర్ లో ఈస్ట్రోజెన్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ తక్కువగా ఉన్న వారు దీన్ని తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి. ఇక డాంగ్ క్వాయ్ అనేది చైనాకు చెందిన సంతానోత్పత్తి మూలిక. ఈస్ట్రోజెన్ స్థాయిలను బ్యాలన్స్ చేేసి గర్భధారణ అవకాశాలను పెంచుతుంది. టెస్టోస్టేరోన్ హార్మోన్ల స్థాయి ఎక్కువగా ఉండి, ఈస్ట్రోజెన్ హార్మోన్ తక్కువగా ఉన్న మహిళలకు లికోరైస్ ఉపయోగపడుతుంది. ఇవి సొంతంగా వాడుకునేందుకు తెలియజేయడం లేదు. సమాచారం కోసం మాత్రమే పేర్కొంటున్నవి. వీటిని వాడే ముందు నిపుణుల సలహా అవసరమని తెలుసుకోవాలి.

సహజంగా గర్భం అందుకోకపోతే...?

సహజ గర్భధారణ విషయంలో కీలకమైన అంశాల గురించి వివరంగా తెలుసుకున్నాం. అయితే, అందరూ అన్నీ పాటించలేరు. కొందరికి పాటించినా ఫలితం కనిపించకపోవచ్చు. ఇటువంటి సమయాల్లో వైద్యులను కలిస్తే కొన్ని పరీక్షలు నిర్వహించడం ద్వారా లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే వైద్యం నేడు ఎంతో అభివృద్ధి చెందింది. అందుకే తమకు పిల్లల్లేరంటూ వైద్యులను ఆశ్రయిస్తున్న వారిలో సగం మంది కేవలం మందులతోనే ఆ భాగ్యానికి నోచుకుంటున్నారు.

ఫెర్టిలిటీ డ్రగ్స్ (సంతానోత్పత్తి ఔషధాలు)representative image

ఇంజెక్షన్, మాత్రల రూపంలో ఈ ఔషధాలను సూచించవచ్చు. ఈ ఔషధాలు అండం విడుదలను పెంచే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. దాంతో గర్భాశయం ఫలదీకరణ చెందిన అండాన్ని స్వీకరించడానికి సిద్ధంగా తయారవుతుంది.

ఎవరికి: క్రమం తప్పకుండా అండం విడుదల జరగని మహిళలు వీటిని వాడాల్సి ఉంటుంది. అలాగే భర్త వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్న మహిళలు కూడా వీటిని వాడుకోవాలి. దెబ్బతిన్న లేదా పూడుకుపోయిన ఫాలోపియన్ ట్యూబులున్నా లేదా కటివలయంలో సమస్యలున్నవారికి ఈ ఔషధాలు తగినవి కావు. ఇటువంటి వారు ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించాల్సి ఉంటుంది.

సక్సెస్ రేటు: 45 నుంచి 50 శాతం మంది మహిళలు వీటిని వాడడం వల్ల గర్భం దాలుస్తారు. ఔషధ చికిత్సల రేటు భరించగలిగే స్థాయిలోనే ఉంటుంది. పైగా వాడడం సులభం కనుక అన్నింటికంటే ముందు వీటిని ప్రయత్నించవచ్చు. అయితే, ఈ ఔషధాలు వాడడం వల్ల తలనొప్పి, తల తిరగడం ఇతరత్రా కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి.

ఇంట్రా యుటరిన్ ఇన్ సెమినేషన్ (ఐయూఐ)

ఈ విధానంలో వీర్య కణాలను మహిళ అండంతో ఫలదీకరణ చెందేందుకు వీలుగా క్యాథటర్ సాయంతో వాటిని తీసుకెళ్లి నేరుగా గర్భాశయంలో ప్రవేశపెడతారు. దీనివల్ల వీర్యకణాల్లో ఎక్కువ శాతం ఫాలోపియన్ ట్యూబుల వరకు వెళ్లడం వల్ల గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయి. ఈ విధానాన్ని ఆశ్రయించినా గర్భధారణ అవకాశాలు పెరగడం కోసం, మరోవైపు ఫెర్టిలిటీ ఔషధాలను వాడాలని వైద్యులు సూచిస్తారు. 

ఎవరికి: పురుషులు తక్కువ వీర్య కణాల సంఖ్యను కలిగి ఉంటే, ఉన్న వాటిలోనూ కదలిక తక్కువగా ఉంటే ఈ విధానం అనువైనది. వీర్య కణాలు తక్కువ సంఖ్యలో ఉన్నా వాటి కదలికలు చురుగ్గా ఉంటే మహిళలోకి చేరిన తర్వాత అవి ఫాలోపియన్ ట్యూబుల వరకు వెళ్లి అండాలతో కలుస్తాయి. దాంతో గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి. అందుకే పురుషుడి వీర్య కణాల్లో కదలిక చాలా కీలకం. అలాగే, తమ జీవిత భాగస్వామి వీర్యకణాలను నిరోధించే యాంటీబాడీలను కలిగి ఉన్న మహిళలు... అలాగే గర్భాయ ముఖద్వారం వద్ద స్రావాలు తక్కువ పరిమాణంలో ఉన్నవారు, అలాగే ఆమ్లతత్వం ఉన్నవారు లేదా వీర్యకణాన్ని అండం వరకు తీసుకెళ్లేందుకు అనువైన స్రావాలు లేని మహిళలు సైతం ఈ విధానాన్ని ఆశ్రయింవచ్చు.

సక్సెస్ రేటు: మహిళ వయసు, పురుషుడి వీర్యకణాల నాణ్యత కీలకం. ఈ విధానంలో ప్రతీ రుతు చక్రంలో గర్భధారణ అవకాశాలు 15 నుంచి 20 శాతం మాత్రమే ఉంటాయి. అయితే, ఇలా ఆరు నెలల పాటు ప్రయత్నిస్తే గర్భధారణ అవకాశాలు 60 నుంచి 70 శాతానికి పెరుగుతాయి. చాలా సులభ ప్రక్రియ. వైద్యులు తమ గదిలోనే తక్కువ సమయంలో చేసే విధానం. ఈ విధానంలో కవలలకు అవకాశాలు ఎక్కువ. 

ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్)

పలు దశల వారీగా జరిగే ప్రక్రియ. ఈ విధానంలో మహిళ నుంచి అండాన్ని సేకరిస్తారు. దాన్ని ల్యాబ్ లో వీర్యకణంతో ఫలదీకరణ చెందిస్తారు. ఆ ఫలదీకరణ చెందిన అండాన్ని తీసుకెళ్లి మహిళ గర్భాశయంలో ప్రవేశపెడతారు. సాధారణంగా ఇటువంటి ప్రక్రియలో ల్యాబ్ లో ఒకటికి మించి అండాలను ఫలదీకరణ చెందించవచ్చు. ఒకదానిని మహిళ గర్భాశయంలో ప్రవేశపెట్టగా... మిగిలిన వాటిని తదుపరి దశ పరీక్ష కోసం ల్యాబ్ లోనే భద్రంగా ఉంచుతారు.

ఎవరికి: కొంచెం వయసు పెరిగిన మహిళలు సంతానం కోరుకుంటే ఇది ఫలితాన్నిస్తుంది. అలాగే, ఫాలోపియన్ ట్యూబులు దెబ్బతిన్న వారికి లేదా ఎండోమెట్రియోసిస్ సమస్యలున్న వారికి, వీర్య కణాల నాణ్యత తక్కువగా ఉన్న పురుషులు, శారీరకంగా కలవలేని స్థితి తదితర కారణాలుంటే ఐవీఎఫ్ విధానాన్ని ఆశ్రయించవచ్చు.

సక్సెస్ రేటు: 35 ఏళ్ల వయసు మహిళల్లో సక్సెస్ రేటు 40 శాతంగా ఉంటుంది. 35 నుంచి 37 ఏళ్ల వయసున్న మహిళల్లో సక్సెస్ రేటు 32 శాతం... 38 - 40 వయసువారిలో ఇది 23 శాతం మాత్రమే ఉంటుంది.  గర్భధారణకు పెద్ద అడ్డంకులు ఉన్న దంపతులకు ఐవీఎఫ్ విధానం ఫలితాలను ఇస్తుంది. అయితే, చాలా ఖరీదైనది. ప్రతీ రుతుచక్రంలోనూ ఔషధాలు వాడుతూ ప్రయత్నించాల్సి ఉంటుంది. 

వీర్యకణాల దానంతో...representative image

తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తి నుంచి కాకుండా బయటి వ్యక్తి దానం చేసిన వీర్య కణాలను ఐయూఐ, ఐవీఎఫ్ విధానంలో తీసుకోవడం ద్వారా సంతానం కోసం ప్రయత్నించవచ్చు.

ఎవరికి: వీర్యకణాల ఉత్పత్తిలేని వారు, నిర్మాణపరమైన లోపాలు, అంగస్తంభన సమస్యలు, ఇమ్యునలాజికల్ డిజార్డర్స్... జన్యు సంబంధిత లోపాలతో ఉన్న పురుషుడు తన పిల్లలకు అవి రాకుండా ఉండాలని కోరుకుంటే, ఒంటరి మహిళ సంతానం కోరుకుంటే, స్వలింగ సంపర్కులైన మహిళలకు ఈ విధానం సూచనీయం.

సక్సెస్ రేటు: ఈ విధానంలో ఒక రుతు చక్రం తర్వాత సక్సెస్ రేటు 15 శాతంగా ఉంటుంది. ఆరు సైకిల్స్ పూర్తయిన తర్వాత గర్భధారణ అవకాశాలు 80 శాతానికి పెరుగుతాయి. 

అండాలను దానం తీసుకునీ...

దంపతుల్లో కాకుండా వేరొక యుక్త వయసులో ఉన్న మహిళ ఓవరీల నుంచి అండాన్ని సేకరిస్తారు. సంతానం కోరుకునే దంపతుల్లో పురుషుడి వీర్య కణంతో ఆ అండాన్ని ఫలదీకరణ చెందిస్తారు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి సంతానం కోరుకునే మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.

ఎవరికి: ఓవరీలు దెబ్బతిన్న మహిళలు, కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీలో ఉండే మహిళలు, అండాల నాణ్యత తక్కువగా ఉండే పెద్ద వయసు మహిళలు, తమ జన్యు సంబంధిత లోపాలు పిల్లలకు రాకూడదని కోరుకునే మహిళలు ఈ విధానాన్ని పరిశీలించవచ్చు.

సక్సెస్ రేటు: అప్పుడే సేకరించిన తాజా అండాలు అయితే సక్సెస్ రేటు 55 శాతం ఉంటుంది. నిల్వ ఉంచిన అండాలు అయితే ఇది 34 శాతంగానే ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియ చాలా ఖరీదైనది. ఈ అండాన్ని స్వీకరించే మహిళ చాలా మందులు వాడాల్సి ఉంటుంది. వీటివల్ల దుష్ప్రభావాలు కనిపించవచ్చు.  

ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ)

వైద్య నిపుణుడు (ఎంబ్రియోలజిస్ట్) పురుషుడీ వీర్యంలోని ఆరోగ్యకరమైన కణాన్ని తీసుకుని దాన్ని మైక్రోస్కోపిక్ సూది సాయంతో నేరుగా మహిళ అండంలోకి ప్రవేశపెడతారు. ఇది ఫలదీకరణ చెందిన తర్వాత దాన్ని ఐవీఎఫ్ విధానంలో మహిళ గర్భాయంలోకి ప్రవేశపెడతారు. 

ఎవరికి: తక్కువ వీర్య కణాలు, ఆరోగ్యకరమైన వీర్య కణాలు తక్కువ ఉన్న వారు సంతానం కోరుకుంటే ఈ విధానం తగినది. సక్సెస్ రేటు 35 శాతం. ఖరీదైన విధానం. ఐవీఎఫ్ కు వాడే ఔషధాలతో దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

సరోగసీ (గర్భాన్ని అద్దెకు తీసుకుని)...representative image

ప్రయోగశాలలో ఫలదీకరణ చెందిన అండాన్ని దంపతులు కాకుండా మరో మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టడం. లేదా దంపతుల్లో పురుషుడి నుంచి సేకరించిన వీర్య కణాన్ని మరో మహిళ గర్భాశయంలోకి జొప్పించడం. తల్లి కాకుండా ఆమె స్థానంలో మరో మహిళ ఆ శిశువును నవమాసాలు మోసి ప్రసవం అనంతరం తిరిగి ఆ దంపతులకు అప్పగించడం. దంపతులకు చెందిన వీర్యకణం, అండాన్ని ఫలదీకరణ చెందించవచ్చు. లేదా దానంగా తీసుకున్న వీర్యకణాలు, అండాలను కూడా ఈ విధానంలో ఉపయోగించవచ్చు.

ఎవరికి: వ్యాధుల కారణంగా తన గర్భంలో శిశువును మోసే అదృష్టం లేని మహిళలు, హిస్టరెక్టమీ, గర్భాశయం లేని వారు లేదా ఏదైనా ఇన్ ఫెక్షన్ కారణంగా తీసివేయించుకున్నవారు, ఇతర గర్భాశయ సమస్యలున్నవారు దీన్ని పరిశీలించవచ్చు. కాకపోతే మన దేశంలో అద్దెగర్భంపై కేంద్రం కఠిన చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం నడుచుకోవాలి.

సక్సెస్ రేటు: ప్రతీ సైకిల్ కు 30 శాతం వరకు ఉంటుంది. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అద్దెకు గర్భం ఇచ్చిన మహిళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమెకు ఏవైనా సమస్యలు వస్తే వాటి ఖర్చు కూడా భరించాల్సి ఉంటుంది.

పిండాన్ని అద్దెకు తీసుకుని...

ఐవీఎఫ్ చికిత్సకు వెళ్లే దంపతులు వీర్యకణాలు, అండాలను దానం చేయడం, వాటిని పరీక్షా కేంద్రంలో ఫలదీకరణ చెందించి... ఒకదాన్ని స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టగా, మిగిలిన వాటిని నిల్వ చేస్తారన్న విషయం తెలుసుకున్నాం. ఇలా నిల్వ చేసినవి ఇక అవసరం లేదనుకుంటే అవి మరొకరికి దానం చేయవచ్చు. ఇది వాటి యజమానుల ఇష్ట ప్రకారం ఆధారపడి ఉంటుంది. దంపతులు ఇద్దరిలో ఎవరికీ సంతాన పరంగా అవకాశాలు లేకపోతే అలాంటి వారు ఇలా నిల్వ చేసి ఉన్న పిండాల(ఫలదీకరణ చెందిన అండం)ను అద్దెకు తీసుకుని సంతాన భాగ్యాన్ని పొందవచ్చు.

సక్సెస్ రేటు: సక్సెస్ రేటు 30 నుంచి 50 శాతం వరకు ఉంటుంది. ఫలదీకరణ చెందించిన అండాలు ఎన్ని గర్భాశయంలో ప్రవేశపెట్టారు, అవి తాజాదనంతో ఉన్నవేనా, చాలా కాలంగా నిల్వ చేసి ఉన్నాయా? అన్న విషయాలు సక్సెస్ రేటును నిర్ణయిస్తాయి.

ప్రతికూలతలు: ఎన్నో వైద్య పరీక్షలు, మందులు అవసరం. దానంగా ఫలదీకరణ చెందిన అండాలు లభించడం కష్టమే. అలాగే, చట్టపరమైన నిబంధనలను పాటించాల్సి ఉండడం కొన్ని ప్రతికూలతలు. ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది.

రీప్రొడక్టివ్ సర్జరీ

సంతాన భాగ్యానికి శారీరకంగా ఉన్న అవరోధాలను తొలగించే సర్జరీ. ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యల్లో గర్భాశయం కణజాలం గర్భాశయం బయట పెరగడం, మచ్చలు, పూడికలు ఇలాంటి వాటిని సరిచేయడం ద్వారా సంతానానికి ఉన్న అడ్డంకులను తొలగించడమే ఈ సర్జరీ ఉద్దేశ్యం. సక్సెస్ రేటు అన్నది వారికున్న సమస్యల తీరు, స్థాయిని బట్టి ఉంటుంది. కానీ, అవకాశాలు మాత్రం మెరుగుపడతాయి. కాకపోతే, ఖర్చు ఎక్కువ, రికవరీకి సమయం తీసుకుంటుంది.

గమెటే ఇంట్రా ఫాలోపియన్ ట్రాన్స్ ఫర్ (జీఐఎఫ్ టీ)

స్త్రీ నుంచి సేకరించిన అండాలను, పురుషుడి వీర్య కణాలతో ఓగాజు పాత్రలో కలుపుతారు. దాన్ని తీసుకెళ్లి స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో ఫలదీకరణ ప్రదేశమైన ఫాలోపియన్ ట్యుూబుల్లో ప్రవేశపెడతారు.

ఎవరికి: దంపతుల్లో స్త్రీలో కనీసం ఒక ఫాలోపియన్ ట్యూబు పనిచేస్తున్నా... లేక పురుషుడిలో వీర్యకణాలు చాలా తక్కువ సంఖ్యలో ఉండడం లేదా వీర్య కణాల కదలిక తగినంత లేకపోవడం వంటి సమస్యలున్న వారికి ఈ విధానం అనువుగా ఉంటుంది. అలాగే, శాస్త్రపరమైన నమ్మకాలతో కృత్రిమ ఫలదీకరణ వద్దని ఐవీఎఫ్ తదితర చికిత్సలకు దూరంగా ఉండే వారికి కూడా ఇది ఉత్తమమైన ప్రత్యామ్నాయం. ఈ విధానంలో కేవలం స్త్రీ అండాలు, పురుషుడి వీర్యకణాలతో బయట కలిపి తీసుకెళ్లి స్త్రీలో ప్రవేశపెట్టడం మాత్రమే జరుగుతుంది.

సక్సెస్ రేటు: ఇలా చేసే ప్రయత్నాల్లో 25 నుంచి 30 శాతం వరకు సక్సెస్ రేటు ఉంటుంది. యుక్త వయస్కులో ఉన్న మహిళల్లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది.

అయితే, ఫలదీకరణ చెందిందా అన్నది తక్షణం తెలుసుకునే అవకాశం ఉండదు. దీన్ని తెలుసుకునేందుకు తదుపరి రుతుచక్ర కాలం వరకు ఆగాల్సిందే. ల్యాప్రోస్కోపిక్ సాయంతో అండం, వీర్యకణాల మిశ్రమాన్ని తీసుకెళ్లి ఫాలోపియన్ ట్యూబులో ప్రవేశపెడతారు కనుక... ఒకటి కంటే ఎక్కువ అండాన్ని ఉపయోగిస్తే కవలలకు అవకాశం ఉంటుంది. దీంతో రిస్క్ పెరుగుతుంది. 

జైగొటే ఇంట్రా ఫోలోపియన్ ట్రాన్స్ ఫర్ (జెడ్ ఐఎఫ్టీ)

ఐవీఎఫ్ వంటిదే. కాకపోతే ఈ విధానంలో ప్రయోగశాలలో ఫలదీకరణ చెందించిన అండాన్ని తీసుకెళ్లి గర్భాశయంలో బదులుగా ఫాలోపియన్ ట్యూబులో ప్రవేశపెడతారు. అండం, వీర్యకణాల ఫలదీకరణను సంయుక్తబీజం(జైగొటే)గా పేర్కొంటారు.

ఎవరికి: అండోత్పత్తి సమస్యలు ఎదుర్కొనేవారు, సంతాన సాఫల్యతకు చెప్పుకోలేని సమస్యలుంటే, పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటే, మహిళలో కనీసం ఒక ట్యూబు సరిగా పనిచేస్తుంటే ఈ విధానం అనువుగా ఉంటుంది. వయసును బట్టి సక్సెస్ రేటు ఉంటుంది. 36 శాతం మంది మొదటి సారే గర్భం దాలుస్తారు. ఫాలోపియన్ ట్యూబుల్లో ప్రవేశపెట్టకముందే ఫలదీకరణను తెలుసుకోవచ్చు. దీంతో ఒకటికి మించిన పిండాలకు అవకాశం ఉండదు. వ్యయం ఇందులోనూ ఎక్కువే. 

పురుషుల్లో సమస్య ఉందా...?

సాధారణంగా సంతానం లేకపోతే స్త్రీలో సమస్య ఉందని అనుమానిస్తుంటారు. కానీ, ఇది పూర్తిగా తప్పుడు ధోరణి. సమస్య ఎవరిలోనయినా ఉండవచ్చు. సంతానం కోసం పురుషుడిలో వీర్య కణాల ఉత్పత్తి తగినంత ఉండాలి. ఆ వీర్య కణాల్లోనూ చురుకుదనం, చలనశక్తి ఉన్నవి ఎక్కువగా ఉండాలి. అప్పుడే గర్భధారణ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

వీర్య కణాలు ఎన్ని ఉండాలి...?

ప్రతి మిల్లీలీటరు పరిమాణంలో ఉన్న వీర్య స్కలనంలో వీర్యకణాల సంఖ్య 0 నుంచి 300 మిలియన్ల వరకు ఉంటాయి. కాకపోతే 15 మిలియన్లకు పైన 150 మిలియన్ల వరకు ఉండడాన్ని సాధారణ స్థితిగానే పేర్కొంటారు. కనీసం ఈ స్థాయిలో ఉంటేనే గర్భధారణకు అవకాశాలు తగినంతగా ఉంటాయి. 15 మిలియన్లు, ఆలోపు ఉంటే తక్కువ ఉన్నట్టు పరిగణిస్తారు. ముఖ్యంగా 50 మిలియన్లు ఉంటే త్వరగా సంతానోత్పత్తికి అవకాశాలు ఉంటాయని తెలుసుకోవాలి.

15 మిలియన్లు కంటే తక్కువ వీర్య కణాలున్నవారూ తండ్రి అవుతారు. కాకపోతే ఇందుకు సమయం తీసుకుంటుంది. అవకాశాలు 100 శాతం అని చెప్పలేం. ప్రతీ మిల్లీలీటర్ వీర్యంలో 10 మిలియన్ల వీర్య కణాలు ఉన్న వారూ సహజంగానే సంతానం పొందుతారని చెప్పలేం. ఇటువంటి వారు వీర్యకణాల కౌంట్ ను పెంచుకునేందుకు వైద్యుల సలహా పొందాల్సి ఉంటుంది. అలాగే ఈ కౌంట్ 1-3 మిలియన్ల మధ్య ఉంటే ఇంట్రా యుటరిన్ ఇన్ సెమినేషన్ విధానంలో సంతానం కోసం ప్రయత్నించడం మంచిది. ఒక మిలియన్ కంటే తక్కువ వీర్య కణాలుంటే వైద్యులు ఐవీఎఫ్ విధానాన్ని సూచిస్తారు. అందులోనూ ఇంట్రా సిస్టో ప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ విధానంలో ప్రయత్నిస్తారు. ఒకవేళ వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ అవి ఆరోగ్యంగా, మంచి కదలికలతో ఉంటే మాత్రం సంతాన అవకాశాలు చక్కగా ఉంటాయి.

వీర్యకణం ఉత్పత్తికి 72 రోజులుrepresentative image

పురుషుడి బీజాల్లో ఉత్పత్తయ్యే బీజ కణం పూర్తి స్థాయి వీర్యకణంగా మారేందుకు 72 రోజుల సమయం తీసుకుంటుంది. ఇందు కోసం ఈ కాలంలో తగినంత పోషకాహారం, సరైన ఉష్ణోగ్రత అవసరం. ఇలా పూర్తి స్థాయి రూపాన్ని సంతరించుకున్న అనంతరం వీర్యకణం పొడవాటి ట్యూబు అయిన ఎపిడిడైమిస్ లో నిల్వ ఉంటుంది. స్కలించడానికి సిద్ధంగా ఉందని అర్థం. ఏడు రోజుల వరకే ఇది జీవించి ఉంటుంది. ఏడు రోజుల్లో స్కలనం లేకపోతే ఆ తర్వాత నుంచి మెచ్యూర్ అయిన వీర్య కణాలు మరణిస్తాయి. 

స్త్రీ ఫెర్టిల్ విండోలో అంటే అండం విడుదల సమయంలో తగినంత స్రావాలు ఉత్పత్తి అవుతాయి. పురుషుడి వీర్య కణాలు ఈ స్రావాల సాయంతోనే ఈదుకుంటూ వెళ్లి అండాన్నికలుస్తాయి. అయితే, ఒక్క వీర్య కణం మాత్రమే విజయవంతంగా అండాన్ని ఫలదీకరణ చెందించగలదు. పురుషుడి వీర్య కణాల్లో చాలా వరకు గర్భాశయ ముఖద్వారం వద్దే ఆగిపోతాయి. ఒకవేళ ఈ వీర్యం గర్భాశయంలోకి వెళితే మాత్రం అక్కడున్న తెల్లరక్త కణాలు వాటిపై దాడి చేస్తాయి. ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు వీర్య కణాలు వేగంగా ఈత కొట్టుకుంటూ గర్భాయం నుంచి బయటపడి ఫాలోపియన్ ట్యూబువైపు పరారవుతాయి. అందుకే పురుషుడిలో వీర్య కణాల సంఖ్య ఒక్కటే కాదు, ఆరోగ్యకరంగా కదులుతూ, వేగంగా ఈదుకుంటూ వెళ్లగలిగే సత్తా ఉన్నవి తగినంత సంఖ్యలో ఉంటే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ వీర్య కణాల సంఖ్య ఉండి, అవి ఆరోగ్యకరమైనవి అయితే గర్భధారణకు అవకాశాలు ఎక్కువ. అదే వీర్య కణాల సంఖ్య బాగా ఉండి, కదలికలు తక్కువగా ఉంటే సంతానోత్పత్తి అవకాశాలు తక్కువగా ఉంటాయి. 

ఏడాదిలోపు...

సాధారణంగా దంపతులు శారీరంకంగా కలవడం ప్రారంభించిన తర్వాత కొన్ని నెలల్లోపేటే స్త్రీ గర్భం దాలుస్తుంది. కొందరిలో ఇది ఏడాది కూడా పట్టవచ్చు. అయితే, సంతానోత్పత్తి అవకాశాలు బలహీనంగా ఉన్నవారిలో ఇది మూడేళ్ల సమయం తీసుకోవచ్చు. మూడేళ్లు దాటినా ఏ విశేషమూ లేకపోతే మాత్రం ఏదైనా సమస్య ఉందేమో తప్పకుండా పరీక్షించుకోవాలి. కొంతమంది వైద్యులు రెండేళ్ల వరకు విశేషం కనిపించకుంటే పరీక్షించుకోవాలని సూచిస్తుంటారు.

భావప్రాప్తి

పురుషులు తమ జీవిత భాగస్వామి అండం విడుదల చేసే సమయానికి తనలో డెడ్ వీర్య కణాలను కలిగి ఉండకుండా చూసుకోవాలి. అందుకని వారంలో పలుసార్లు శారీరకంగా కలవాలని నిపుణులు పేర్కొంటారు. అందుకే ఫెర్టిల్ విండోలో ప్రతి రోజూ,  ఆ తర్వాత వారానికి ఒకసారి అయినా శృంగారంలో పాల్గొంటూ ఉండాలి. గర్భధారణకు భావప్రాప్తి చాలా కీలకం. శృంగారంలో పురుషుడు ఎంత ఎక్కువగా భావప్రాప్తి చెందితే ఆ మేర వీర్యకణాలు ఎక్కువగా విడుదల అవుతాయి.

అలవాట్లు మార్చుకోవాలి... 

పురుషులు పొగతాగడం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. రోజూ రన్నింగ్ చేయాలి. డెస్క్ జాబ్ అయితే ఎక్కువ సమయం పాటు కూర్చోకుండా మధ్య, మధ్యలో లేచి నడవాలి. బిగుతైన అండర్ వేర్ ధరించకూడదు. పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా జింక్,  పెరుగు, ఓట్ మీల్, కార్న్, పంప్ కిన్, గుడ్లు తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ తగినంత లభించే ఆహార పదర్థాలను ఎంచుకోవాలి. వైద్యులను కలిస్తే వీర్య కణాల ఉత్పత్తిని పెంచే మందులను సూచిస్తారు. 

మందులు

పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి తక్కువగా ఉంటే, ఉన్న వాటిలో చురుకైనవి తక్కువ ఉంటే వైద్యులు మందులు సూచిస్తుంటారు. వీటిలో ఎల్ కార్నిటిన్ అనే ఔషధం చాలా పాప్యులర్. ఇది వీర్య కణాల ఆరోగ్యం, కదలికలను పెంచుతుంది. ఇంకా ఇలాంటి ఔషధాలు మరికొన్ని కూడా ఉన్నాయి. వైద్య సలహా మేరకు వీర్య కణాల ఆరోగ్యం, కదలిక, సంఖ్య పెంచుకునేందుకు మందులు వాడుకోవచ్చు. పోషకాహారం గురించి కూడా వైద్యులు తగిన సూచనలు చేస్తారు.

పరిశోధనలు...

పురుషుల్లో వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో వీర్య కణాల సంఖ్య తగ్గుతూ వెళుతుంది. కొన్ని రకాల కూరగాయలు, సలాడ్ల వల్ల వీర్య కణాల నాణ్యత, కదలిక మెరుగుపడుతుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్  నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. క్యారట్లో ఉంటే బీటా కెరోటిన్, పాలకూర, బచ్చలి కూర తీసుకోవడం వల్ల వీర్య కణాల్లో కదలిక 6.5 శాతం పెరుగుతుందని... టమాటాల్లో ఉండే లైకోపీన్ వల్ల కూడా వీర్య కణాల ఆరోగ్యం 2 శాతం వరకు పెరుగుతుందని తేలింది. ఇంకా ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్, విటమిన్ ఈ, జింక్, మెగ్నీషియం సైతం వీర్య కణాలు, కదలికలకు తోడ్పడేవిగా పలు పరిశోధనల్లో వెల్లడైన విషయం.

వృషణాల వద్ద వేడి ఎక్కువ అవకూడదుrepresentative image

పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి కేంద్రమైన వృషణాలు చల్లదనంతో ఉండాలి. ఒక డిగ్రీ సెల్సియస్ ఎక్కువున్నా వీర్య కణాలను దెబ్బతింటాయి. అందుకే సంతానం కోరుకునే పురుషులు వృషణాల వద్ద వేడిని పెంచే చర్యలకు దూరంగా ఉండాలి. అతిగా వ్యాయామం చేయడం, వేడి నీటి స్నానం, బిగుతైన లో దుస్తులు, కూర్చుని కాళ్లపై ల్యాప్ టాప్ పెట్టుకోవడం ఇటువంటి చర్యలకు దూరంగా ఉండాలి.

సమస్యలు

అజూస్పెర్మియా అనే సమస్య ఉంటే వీర్య కణాల ఉత్పత్తిలో సమస్య ఉన్నట్టు. లేదా అడ్డంకులు ఉన్నట్టు భావించాలి. స్కలనం అయినట్టు తెలుస్తుంది. కానీ వీర్య కణాలు ఉండవు. సంతానం లేని పురుషుల్లో సుమారు 5 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. వెరికోసిల్ సమస్యలో వృషణాల్లోని నరాలు పెద్దవవుతాయి. ఈ సమస్య ఉన్నా వీర్య కణాల ఉత్పత్తి, చలనం పడిపోతుంది. ఈ సమస్యను వైద్యులు సులభంగానే సరిచేయగలరు. అలాగే, ఒలిగోస్పెర్మియా అనే సమస్య ఉన్నా తగినంత వీర్య కణాలు ఉండవు. వైద్యులను కలవడం ద్వారా సంతాన భాగ్యం లేకపోవడానికి ఉన్న సమస్యలను గుర్తించడం సాధ్యమవుతుంది. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy